1. *కర్మ సిద్ధాంతం పై చాలా మందికి నమ్మకం కలుగక పోవడానికి కారణం?*
లోకంలో చెడు పనులు చేస్తూ సుఖపడే వారు కన్పిస్తారు, మంచి పనులు చేస్తూ దుఃఖ పడే వారు కన్పిస్తారు కాబట్టి కర్మ సిద్ధాంతం నమ్మరు.
2. అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి?
మంచి కర్మలు చేస్తే సుఖం లభిస్తుందని, చెడు కర్మలు చేస్తే దుఃఖం లభిస్తుందని చెప్పేదే కర్మ సిద్ధాంతం .
3. మంచి చెడు కర్మలు అంటే ఏమిటి?
శాస్త్రీయ మైన కర్మలను మంచి కర్మలు అని, అశాస్త్రీయ మైన కర్మలను చెడు కర్మలు అంటారు.
4. శాస్త్రం అని దేనిని నమ్మాలి?
ఆప్తుల గ్రంథాలను శాస్త్రంగా స్వీకరించాలి. ఈ శాస్త్రమే శబ్ద ప్రమాణం.
5. ఆప్తులు అంటే ఎవరు?
సంపూర్ణ జ్ఞానం కలవారు మరియు నిస్వార్థ పరులను ఆప్తులు అంటారు. ఉదాహరణకు ఈశ్వరుడు, ఋషులు. ఈశ్వరుడు ప్రకటించిన వేదం, ఋషులు రచించిన స్మృతి గ్రంథాలు మరియు వేదనుకూల గ్రంథాలు అన్నియు శాస్త్రాలుగా అంటే ప్రమాణంగా తీసుకోవచ్చు.
6. శాస్త్రీయంగా మంచి చెడు సంక్షిప్తార్థం?
సమాజానికి కాని ప్రకృతికి కాని లాభం చేస్తే మంచి అవుతుంది, నష్టం చేస్తే చెడు అవుతుంది.
7. సుఖం దుఃఖం ఎలా లభిస్తాయి?
ఈశ్వరుడు న్యాయకారి కావున మంచి చేస్తే సుఖం, చెడు చేస్తే దుఃఖ భోగాలను ఇస్తాడు.
8. మనం భోగిస్తున్న సుఖ దుఃఖాలకు కారణం మన పూర్వ కర్మలే కారణమా?
కేవలం మన పూర్వ కర్మలు మాత్రమే కారణం కాదు, ఇప్పుడు మనం చేస్తున్న కర్మలు కూడా కారణం కావచ్చు లేదా ఇతరుల కూడా కారణం కావచ్చు.
9. మన కర్మల ద్వారా కాకుండా ఇతరుల ద్వారా మనం సుఖ దుఃఖ భోగాలు అనుభవించ వలసి వస్తే ఈశ్వరుడి న్యాయం ఏమవుతుంది?
ఈశ్వరుడు న్యాయకారి అన్యాయం ఎప్పుడు చేయడు, ఇతరుల ద్వారా మనం భోగించ వలసి వస్తే క్షత పూర్తి చేస్తాడు.
10. క్షత పూర్తి అంటే?
మనం కర్మ ఫలంగా కాకుండా ఇతరుల వల్ల సుఖాన్ని భోగిస్తే దానికి సమానమైన మన పుణ్యం నశిస్తుంది, దీనికి కారకులైన వారికి పుణ్య కర్మాశయం పెరుగుతుంది,అదేవిధంగా ఇతరుల ద్వారా దుఃఖాన్ని భోగించ వలసి వస్తే మన పాపం నశిస్తుంది, దీని కారకులైన వారికి పాప కర్మాశయం పెరుగుతుంది.
11. కర్మలు ముఖ్యంగా ఎన్ని రకాలు అవి ఎలా నశిస్తాయి?
కర్మలు ముఖ్యంగా మూడు రకాలు
సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, క్రియమాన కర్మలు (ఇప్పుడు మనం చేస్తున్న కర్మలు)
ప్రారబ్ధ కర్మలు భోగిస్తేనే నశిస్తాయి , సంచిత కర్మలు వివేక జ్ఞానం ద్వారా నశింప చేయవచ్చు.
12. ప్రారబ్ధ కర్మలు అంటే ఏమిటి?
పక్వ కర్మలను ప్రారబ్ధ కర్మలు అంటారు, ఇవి జాతి ఆయువు భోగం అనే ఫలాలను ఇస్తాయి, ఇవియే ఇప్పుడు మనం ఉన్న జన్మకు కారణం.
13. ప్రారబ్ధ కర్మల ఫలాలైన జాతి ఆయువు భోగాలను మార్చుకోలేమా?
జాతిని మార్చుకోలేం కాని ఆయువు భోగాలను మన పురుషార్థం ద్వారా మార్చుకోవచ్చు మరియు మోక్షాన్ని కూడా పొందవచ్చు, ఇందుకోసమే శృతులు స్మృతులు.
No comments:
Post a Comment