*సరస్వతీ ప్రసాదం*
మధుర సంభాషణే అసలైన అలంకారం. కఠినమైన మాటతీరు అనర్థదాయకం. మన్ననగా మాట్లాడమన్నారు పెద్దలు. మధుర వాక్కులకు ఉదాహరణ హనుమ. సీతమ్మను అన్వేషిస్తూ వెళ్లిన సందర్భంలో తమతో హనుమ మాట్లాడిన తీరును రాముడు ఎంతో మెచ్చుకున్నాడు. 'ఒక్క అపశబ్దం లేకుండా, వ్యాకరణ శాస్త్ర ప్రావీణ్యం కలిగినట్లుగా వినసొంపుగా సంభాషించాడు. ఇతడి వాక్చాతుర్యాన్ని గమనిస్తే క్రూరులు సైతం శాంతించి, ఎత్తిన కత్తిని దించి తీరాల్సిందే' అన్నాడు. జీవితం సజావుగా సాగాలంటే.. మాటతీరు మన్ననగా ఉండాలి. సమయోచితంగా మాట్లాడాలి. 'మాట' సరస్వతీమాత ప్రసాదించిన వరం. 'వాగ్భూషణం భూషణం' అన్నది భర్తృహరి సుభాషితం. అంటే వాక్కే అసలైన ఆభరణం అని భావం. మాటలే మన వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి.
జిహ్వాగ్రే వర్తతే లక్ష్మిః
జిహ్వాగ్రే మిత్రబాంధవాః
జిహ్వాగ్రే బంధన ప్రాప్తిః
జిహ్వాగ్రే మరణ ధృవం
మాట వైఖరి బాగుంటే బంధుమిత్రులు లభిస్తారు. సంపదలు ప్రాప్తిస్తాయి. జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. లేదంటే చిక్కుల్లో పడొచ్చు, సంపదలు కోల్పోవచ్చు, ప్రాణహాని కూడా సంభవించవచ్చు. కనుక మధురభాషణ అలవరుచుకోవాలి.
No comments:
Post a Comment