*(త్రిశంకు స్వర్గం)*
గురువులను నిర్లక్ష్యం చేస్తే ....
ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే రాజు పరిపాలన చేసేవాడు.
ఆయనకి శరీరం మీద ఉన్న వ్యామోహం వలన స్వర్గానికి శరీరముతో వెళ్ళాలన్న కోరిక పుట్టింది.
వెంటనే కులగురువైన వశిష్ఠుడికి తన కోరిక చెప్పాడు.
నువ్వు ఎంత గొప్ప రాజువైనా కాని, ఎంత గొప్ప యాగాలన్నా చెయ్యి, కాని శరీరముతో స్వర్గానికి వెళ్ళడమనేది ధర్మశాస్త్రంలో లేదు. ఎవరి శరీరమైన కొంత కాలానికి పడిపోవాల్సిందే, అది పడిపోయిన తరవాతే స్వర్గలోక ప్రవేశం. కాబట్టి శరీరముతో స్వర్గానికి వెళ్ళడం అనేది జరగదు అన్నాడు వశిష్ఠుడు.
అప్పుడా త్రిశంకుడు వశిష్ఠుడి నూరుగురు కొడుకుల దగ్గరికి వెళ్ళి జరిగినది చెప్పాడు. మా తండ్రిగారు కుదరదన్నారు. ఆయనకి అన్నీ తెలుసు, అయినా స్వర్గానికి శరీరముతో ఎవరూ వెళ్ళలేరు, అది జరిగేపనికాదన్నారు ఆ నూరుగురు కొడుకులు.
అయితే నేను వేరొక గురువుని వెతుక్కుంటాను అన్నాడు ఆ త్రిశంకుడు.
నువ్వు గురువు మాట వినలేదు. ఆయన పుత్రులమైన మా మాట వినలేదు, ఇప్పుడు వేరొక గురువుని వెతుకుతాను అంటున్నావు. నీకు ఇలాంటి దుర్బుద్ధి పుట్టింది కనుక నువ్వు ఛండాలుడివి అవుతావని శపించారు.
మరుసటి రోజు ఆ త్రిశంకుడు నిద్రలేవగానే ఆయన ముఖంలోని కాంతి పోయి నల్లగా అయ్యాడు, ఆయన వేసుకొన్న బంగారు ఆభరణాలన్ని ఇనుము ఆభరణాలయ్యాయి, జుట్టు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆయనని చూసిన ఆ మందిరంలోని వారు, ఇతర మంత్రులు అందరూ పారిపోయారు.
ఆ రూపంతో అలా తిరుగుతూ చివరికి విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు.
విశ్వామిత్రుడు త్రిసంకు మహారాజు కోరిక మన్నించి యాగములు చేసి స్వర్గానికి బొందితో పంపాడు.
కాని దేవతలు తిరిగి భూలోకానికి పంపుతున్నప్పుడు విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో భూమికి స్వర్గానికి మధ్యలో ఆపి ఆయనకు అక్కడ స్వర్గం ఏర్పాటు చేసాడు.
నీతి ఏమిటంటే గురువును నిర్లక్ష్యం చేస్తే గురువు వద్ద నేర్చుకున్న విద్య నిరర్ధకమై త్రిసంఖు స్వర్గం లాగే వుంటుంది.
No comments:
Post a Comment