Tuesday, 9 September 2025

 *🧘‍♂️4-వేమన-తత్వం 🧘‍♀️*

*బొంది ఎవరి సొమ్ము పోషింప పలుమారు*

*ప్రాణమెవరి సొమ్ము భక్తి సేయ*

*ధనము ఎవరి సొమ్ము ధర్మమే తన సొమ్ము*

*విశ్వదాభిరామ వినురవేమ!!*


*ప్రస్తుతం నీది అనుకుంటున్నదేదీ నీది కాదు. అంటే ఎప్పటికీ నీతో ఉండేది కాదు అని చెప్తున్నారు ఈ పద్యంలో వేమన.*


*శరీరం పట్ల అంత శ్రద్ధ తీసుకుంటున్నా వెందుకు? అది ఎప్పుడూ ఇలాగే ఉంటుందా? జరా దుఃఖం ఉండనే ఉంది కదా! ప్రాణమూ అంతే! ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు.*


*భక్తిని కలిగి ఉండటమే చాలనుకుంటున్నావా? అది కాలయాపన కదా! జ్ఞాన యోగం ముఖ్యం. నువ్వు ఇప్పుడు ఆచరిస్తున్నవేవీ శాశ్వతం కాదు.*


*ధనమూ అంతే! అది స్వార్జితమేనా? అది నీ చేతిలో ఎంత కాలముంటుందంటావు. ధర్మమొక్కటే నువ్వు పోయినా మిగిలిఉండేది తెలుసుకొమ్మంటున్నాడు వేమన.*


*బొంది అంటే దేహం. దీనికి బాల్యం, యౌవనం, వృద్ధాప్యం. చివరికి మరణం అనే పరిణామముంది. కాబట్టి నువ్వు దానికి చేసే పోషణ తాత్కాలికమే. బొందితో కైలాసం వెళ్తారంటారు.*


*అంటే సశరీర ముక్తి. అది నీకు సాధ్యమయ్యే పనేనా? బొంది దేశీయ పదం. కన్నడంలో కూడా బొంది. తమిళంలో పొంది.*


*ప్రాణం అంటే ఆత్మ నుండి ఉద్భవించిన జీవశక్తి. అది మళ్లీ ఆత్మలోకే వెళ్లిపోతుంది. భక్తి సేయ అంటే భక్తిని చూపడం, ఆచరించడం.*


*భక్తి అంటే అంకిత భావం. ధనం కలకాలం ఉంటుందనుకోవడంలోనే నీ అజ్ఞానం ఇమిడి ఉంది. దానిని దానధర్మాలకు వెచ్చించడమే వివేకం.*

No comments:

Post a Comment