Wednesday, 10 September 2025

 #సమ్మర్_హిల్ 
(ప్రతీ టీచర్ & పేరెంట్ చదవాల్సిన పుస్తకం)

ఏ.ఎస్. నీల్ అనే టీచర్ 40 సంవత్సరాలలో ఒక్కసారి కూడా పిల్లల్ని కొట్టకుండా,తిట్టకుండా నడిపిన స్కూల్ పేరే సమ్మర్ హిల్.  అలాగని అక్కడికొచ్చే పిల్లలందరూ బుద్దిమంతులు, నెమ్మదస్తులు అనుకుంటే పొరపాటే. “బాబోయ్! మీ అబ్బాయి అల్లరిని మేము బరించలేకుండా ఉన్నాం తీసుకుపొండి” అని పంపించేయబడ్డ పిల్లలు, వేరే ఎక్కడా అడ్మిషన్ దొరకక జాయిన్ అయిన పిల్లలే ఆ స్కూల్లో ఎక్కువ. అక్కడ పిల్లల్ని కొట్టరు, తిట్టరు, కనీసం క్లాసుకు కంపల్సరీ వెళ్ళాలి అనే నిబందన కూడా లేదు. అయినా అక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్  క్లాసులు మిస్ అవడం ఒక పనిష్మెంట్ గా భావిస్తారు.  

ఇలా అయితే స్కూల్ నుండి బయటకు వచ్చాక సమాజంలో ఎలా బ్రతుకుతారు? అన్న సందేహం రావొచ్చు. నిజానికి మిగిలిన పిల్లల కంటే ఆ స్కూల్ పిల్లలు సోషల్ ఇష్యూస్ ని బాగా డీల్ చేయగలిగేవారు.  ఎందుకంటే అక్కడి పిల్లలు అందరూ కలపి మీటింగులు పెట్టుకొని,  తమలో తమకు వచ్చిన సమస్యలకు పరిష్కారాలను కనుక్కొంటారు. మైకులు విసురుకోవడం, గూండాయిజం లాంటివి లేకుండా సక్రమంగా జరిగితే అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలు ఎలా ఉంటాయో అలాగన్నమాట. వ్యక్తిగతంగా తన స్వేచ్చ ఎంత వరకూ?, ఇతరులతో కలసి బ్రతికేటప్పుడు తన ఫ్రీడంని కాపాడుకుంటూ వాళ్ళతో ఎలా నడుచుకోవాలి? అన్న విషయాలు ప్రాక్టికల్ గా పాఠశాలలోనే నేర్చుకుంటారు.

అక్కడ జరిగిన బోలెడన్ని అచ్చెరువొందించే సంఘటనలతో కూడిన మంచి పుస్తకం సమ్మర్ హిల్. హేరీపోట్టర్ లా ఊహాత్మకంకాని నిజమయిన అద్బుతలోకం-సమ్మర్ హిల్.అంత మంచి పుస్తకం అందుబాటులో ఉండగా నాకు ఎక్కువ చెప్పడం ఇష్టం లేక సింపుల్ గా ముగిస్తాను. అటువంటి స్కూల్ నుండి బయటకు వచ్చిన పిల్లలు సమస్యలను తప్పించుకుపారిపోరు. దేనినయినా ఎదుర్కొంటారు. ఆత్మ హత్యలు కాదు కదా కనీసం mild depression లాంటివి కూడా లేకుండా అందమయిన జీవితాన్ని గడుపుతారు. స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. ఫార్మల్గా కాకుండా జీవితాన్ని పండగలా గడుపుతారు. ఇంతకంటే ఏం కావాలి??

సమ్మర్ హిల్ బుక్ చదివినప్పుడు “A.S నీల్ అనే వ్యక్తిలో అంత ప్రేమ ఎలా సాద్యం అయింది?” అనే ప్రశ్న ఉదయిస్తుంది. అది మీలో మీరు తొంగిచూసుకొనేలా చేస్తుంది.  ప్రభావితం చేస్తుంది. ప్రతీ టీచర్ & పేరెంట్ తప్పకుండా చదవాల్సిన పుస్తకం. 

PS : “సమ్మర్ హిల్” పుస్తకం లోని కొన్ని విషయాలు మీకు ఆచరణ సాధ్యం కాదు అనిపించవచ్చు. కానీ పిల్లలను అర్ధం చేసుకోవడానికి ప్రతీ లైనూ ఉపయోగకరమే అని మాత్రం అర్దం అవుతుంది. ఇంత గొప్ప పుస్తకం నుండి ఎంత వీలైతే అంత తీసుకోండి.

No comments:

Post a Comment