Tuesday, 9 September 2025

 *మూషికవాహన... మునిజన భావన*

మూష అంటే దొంగ. ఎలుకది దొంగబుద్ధి. అందుకే మూషికం అన్నారు. మూషికం వినాయకుడి వాహనం. స్తేయం అన్నా దొంగతనమే. దొంగబుద్ధి లేకపోవడం అస్తేయం. బుద్ధుడు చెప్పిన పంచసూత్రాల్లో అస్తేయం ఒకటి. డబ్బూ వస్తువులను తస్కరించాలనుకోవడం ఒక్కటే కాదు... అసలంటూ దొంగబుద్ధి లేకపోవడం అస్తేయం. ‘అహింసా సత్య మస్తేయం శౌచం(పరిశుభ్రత) ఇంద్రియనిగ్రహః’ అనేవి పరమధర్మాలంది మనుధర్మశాస్త్రం. అదే మాటను గీతాచార్యుడూ చెప్పాడు. చాలా మందికి ఆ దురలవాటు ఉంటుంది. బాల్యంలో కాపలా మనిషి కన్నుగప్పి దొంగతనంగా కొట్టుకొచ్చిన జామ, మామిడికాయల రుచి ఇంతా అంతా కాదు మరి! ఆ చిలిపి సరదాలు వయసొచ్చేసరికి సహజంగానే అణగారిపోతాయి. కొందరిలో మాత్రం వ్యసనంగా పరిణమిస్తాయి. వృత్తిరీత్యా భారీ ఆదాయాలను అందుకునే వారు సైతం- దుకాణాల్లో చిన్నచిన్న వస్తువులు దొంగిలిస్తూ ఉంటారు- కొనుక్కోలేక కాదు, దొంగిలించాలన్న బలమైన కోరికను ఆపుకోలేక!

చేతివాటమనేది మానసిక రుగ్మత. ‘తిట్టే నోరూ, తిరిగే కాలూ ఊరికే ఉండవు’ అని సామెత. ఇదీ అంతే! మనస్తత్వశాస్త్రంలో దాన్ని ‘క్లెప్టోమేనియా’ అంటారు. తనమీద తనకు గౌరవం లేకపోవడంలోంచి పుట్టుకొచ్చే దుర్బుద్ధి అది. ‘నాకు ధర్మం ఏమిటో తెలుసు- కానీ అది నా స్వభావం కావడం లేదు, అధర్మం అంటేనూ నాకు తెలుసు- నన్నది విడిచిపెట్టడం లేదు’ అన్నాడు సుయోధనుడు. క్లెప్టోమేనియా బాధితుల పరిస్థితి సరిగ్గా అదే. చేతుల నిండా డబ్బుండీ- చేతివాటుతనం ప్రదర్శిస్తారు. పరువు పోగొట్టుకుంటారు. ‘తుచ్ఛమున హాని వచ్చును, కుచ్చితమే తన్ను చెరచు కోవిదు(పండితుడి)నైనన్‌’ అని వేమన హెచ్చరించాడు. దొంగతనంలోని థ్రిల్లే తప్ప- దొరికిపోతే ఏమిటనేది తెలియదు. ‘పెక్కు భంగుల్‌ వివేకభ్రష్ట సంపాతముల్‌...’ అని భర్తృహరి చెప్పిందదే!

మనిషి బుద్ధిని మన పెద్దలు చాలా లోతుగా వివేచించారు. వక్రబుద్ధులకు సరైన పరిష్కారాలను మన ఆచారాల్లో, సంప్రదాయాల్లో- ముఖ్యంగా వ్రతకథల్లో గొప్ప ప్రతీకలుగా ఇమిడ్చారు. ‘పండితులు సాయంసంధ్యల్లో చోర ప్రసంగాలతో కాలక్షేపం చేయడం సంప్రదాయం’ అన్నారు. సాయంసంధ్య అంటే వృద్ధాప్యం, చోరుడంటే వెన్నదొంగ. మలి వయసులో భాగవతం అధ్యయనం చేయమని సూచన. ‘గుటకపడని అగ్గిఉండ సాగరాలనీదుకుంటు తూరుపింట తేలుతుందిరా’ అన్నట్లు భవసాగరాలను దాటిన పిదప భాగవత తత్త్వం బోధపడుతుంది. అగ్గిఉండ అంటే జ్ఞానానికి సంకేతమైన సూర్యుడు. ఇక, అంత పెద్ద వినాయకుడు బుల్లి ఎలుకపై ఊరేగడం దేనికంటే- మనలోని చోరాది లేకి గుణాలను అణిచిపెట్టమని! దాంతో మంచి బుద్ధి సిద్ధిస్తుంది కాబట్టి బుద్ధినీ, సిద్ధినీ వినాయకుడి భార్యలన్నారు. పురాణ గాథల్లోని ప్రతీకలు, అంతరార్థాలన్నీ ఇంతటి విశిష్టమైనవే!

ఎర్రాప్రగడ రామకృష్ణ

*అపార్థాలే అవరోధాలు* 

ఒక్కోసారి కళ్లు మోసం చేస్తాయి. మరోసారి చెవులున్నూ. కన్నదీ విన్నదీ నిజమవ్వాలని లేదు. మనసు స్థిమితంగా లేనప్పుడు కనబడే దృశ్యాలు, జరిగే సంఘటనలు భయాందోళనలను పెంచుతాయి. కల్లోలమైన సరస్సులో ప్రతిబింబం స్పష్టంగా కనిపించదు. కలవరపాటుకు గురయ్యే మదిలో జరిగే నిర్ణయమేదీ సరిగ్గా ఉండదు. తేట నీటిలో స్పష్టమైన రూపం కనబడినట్టు ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే అపోహల పొరలు కరిగి, అవగాహన పరిధి పెరుగుతుంది.

ఎంతటి వారైనా తామున్న పరిస్థితిని బట్టే ఆలోచిస్తారు. మంచిలో చెడును చూడటం, సత్యంలో అసత్యాన్ని వెతకడం ఒక్కోసారి జరగవచ్చు. కొత్త ప్రమాదాలు ముంచుకొస్తాయన్న మనసు చేసే ముందస్తు హెచ్చరికలే అందుకు కారణం. అలాంటి అభద్రతాభావ పరిస్థితి ఎంతటి వారికైనా సహజమే. ఆందోళనకర, అనిశ్చిత వాతావరణంలో ఒక్కోసారి మహాత్ములైనా, నిజమేదో గ్రహించలేని డోలాయమాన పరిస్థితి ఎదుర్కొంటారనేందుకు దృష్టాంతాలు రామాయణంలో కనబడతాయి. సీతమ్మను వెతుకుతూ రుష్యమూక పర్వతం వైపు వెళ్లిన రామలక్ష్మణులను చూసిన సుగ్రీవుడు, వాలి పంపిన గూఢచారులనుకుని తొలుత భయపడ్డాడు. శత్రువర్గం వాళ్లే అయితే ఏం చేయాలో తోచక ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకు దూకుతూ బెంబేలెత్తిపోయాడు. అది చూసిన హనుమ- మలయ పర్వతానికి వాలి రాలేడని గుర్తు చెయ్యడమే కాకుండా వచ్చిందెవరో తెలుసుకోవడానికి సన్యాసి రూపంలో వెళ్లాడు. ఇద్దరూ దశరథ పుత్రులని రూఢి చేసుకుని, సుగ్రీవుడితో మైత్రికి ఒప్పించాడు. వానరరాజు భయాలను పారదోలాడు. దూరాన్నుంచి చూసి ఆందోళన చెందేకన్నా దగ్గరికెళ్లి సత్యమేదో తెలుసుకోవాలని నిరూపించాడు.

అరణ్యవాసం చేస్తున్న అన్నావదినలను రాజ్యానికి తీసుకుపోవడానికి సైన్య సమేతంగా వెళ్లిన భరతుణ్ని దూరాన్నుంచే చూశాడు లక్ష్మణుడు. శాశ్వతంగా తమ అడ్డు తొలగించుకోవడానికే వస్తున్నాడని సందేహించాడు. అస్త్రాలు ప్రయోగించి భరతుణ్ని చంపేస్తానన్నాడు.లోతైన దృష్టితో ఆలోచించిన శ్రీరాముడు- తమ క్షేమ సమాచారం తెలుసుకోవడానికి వస్తున్నాడే కానీ మరో ఉద్దేశం ఉండదని వారించడంతో ముప్పు తప్పింది. మనసులో విచారం కమ్ముకున్నప్పుడు కళ్ల ముందున్నవి నమ్మబుద్ధి కాదనే సంగతి అశోకవనంలో ఉన్న సీత విషయంలోనూ జరిగింది. తాను రాముడి దూతనని హనుమ చెప్పినప్పటికీ నమ్మలేకపోయింది సీతమ్మ తల్లి. రావణుడు పంపిన మరొక మాయావి అనుకుంది. వినయంతో, నిజమైన రామభక్తితో జానకిని నమ్మించి రామకార్యాన్ని సఫలం చేశాడు హనుమ. తగిన పరిశీలనతోనే నిర్ణయం తీసుకోవాలి తప్ప తొందరపడకూడదని లోకానికి వెల్లడించిన ఘటనలివి.

బుద్ధి వెలుగులో లేకపోతే, మనసు మాయలోపడి చుక్కాని లేని నావలా కొట్టుకుపోతుంది. జరుగుతున్నది తప్పుగా అనిపిస్తుంది. జరగబోయేది ముప్పుగా కనిపిస్తుంది. మంచి మాటల్లోనూ అపార్థాలు ధ్వనిస్తాయి. యోగ, ధ్యానాల ద్వారా మనసును శాంతంగా ఉంచుకోవడమే దీనికి పరిష్కారం. హృదయంతో ఆలోచిస్తూ బుద్ధికి పదును పెట్టడమే అభద్రతలోంచి బయటపడే మార్గం. అప్పుడే అపార్థాల తెరలు తొలగుతాయి. అనుబంధాలు నిలబడతాయి.

నారంశెట్టి ఉమామాహేశ్వరరావు.       

No comments:

Post a Comment