*🧘♂️5-వేమన-తత్వం*
*ఆశ:చేత మనుజులాయువు గలనాళ్ళు!*
*తిరుగుచుందురు భ్రమ తిప్పుదాక!*
*మురికి భాండమందు ముసురు నీగల భంగి!*
*విశ్వదాభిరామ వినురవేమ!!*
*మురికి కుండపైన ఈగలు ముసురునట్లుగా మనిషి భౌతిక సుఖాల చుట్టూ జీవితాంతం తిరుగుతూనే ఉంటాడు. ఎన్నాళ్లు తిరుగుతాడు? ఎన్నాళ్లంటే భ్రమ తొలిగేదాక. భ్రమ తొలిగేది లేదు ఆశ చచ్చేది లేదు అని సారాంశం.*
*బతకడానికి ఆశ అవసరమే కాని ఇది నిరంతర అత్యాశ. అందుకే ఆశాపాశం, ఆశాబంధం అనే మాటలు పుట్టాయి.*
*ఆశలో చిక్కుబడిపోతే అంతే సంగతులు అంటున్నాడు వేమన. ఆశను వదులుకుందాము అన్నా భ్రమ వదలనివ్వదు.*
*ఆశ అంటే కోరికే. తెలియని సుఖాలపైన ఆసక్తే ఆశ. భ్రమ అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా తోపింపజేసేది.*
*‘ఆయువు గలనాళ్లు’ అంటే బతికి ఉన్నంతవరకు. ఆయువు అంటే వయస్సు, జీవితాన్ని పెంచేదని కూడ. ఆయుష్యం అంటే సుదీర్ఘ జీవితం.*
*భ్రమ పరిభ్రమానికి హేతువు. భ్రమ వల్లనే ఆశకు అంతటి ఆరాటం. ఉన్నదాన్ని స్పష్టంగా చూడగలిగితే తప్ప భ్రమ తొలగదు.*
*భ్రమను తొలగించు కోవాలనేది సందేశం. మురికి భాండమంటే మురికి కుండ. శుభ్రపరచని వంటపాత్ర కావొచ్చు. వ్యవసాయ కుటుంబాల్లోనైతే కుడితి పాత్ర కావొచ్చు. వాటికి అంటుకొని ఉన్న మురికి పదార్థం కోసం ఈగలు ముసురుకుంటాయి. భాండం అంటే కుండ, మురికి అంటే మాలిన్యం.*
No comments:
Post a Comment