🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*కుంతీదేవి*
➖➖➖✍️
```
శూరుడు శ్రీకృష్ణుడికి తాతగారు. ఆ యాదవశ్రేష్ఠుడికి శ్రీకృష్ణుడి తండ్రియైన వసుదేవుడు పుట్టిన తరవాత పృథ అనే అందమైన అమ్మాయి పుట్టింది. మిత్రుడూ మేనత్త కొడుకూ అయిన కుంతిభోజుడికి సంతానం లేకపోతే పృథను అతనికి దత్తతిచ్చాడు. చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడే ఆమె, తన పుట్టింటి చల్లని ఒడిని విడిచి పెట్టి, ఏ పిల్లాజెల్లల సందడీ లేని కుంతిభోజుడి ఖాళీగృహాన్ని ఆనందంతో నింపిందిగనకనే పృథాదేవి మూర్తీ భవించిన వైరాగ్యం అని చెబుతారు. కుంతిభోజుడు ఆమెకు 'కుంతీదేవి' అని పేరుపెట్టుకొన్నాడు.
పెంపుడు నాన్నగారింట్లో అతిథులు తరచుగా వస్తూండే వాళ్ళు. వాళ్ళను సేవించడానికి ఆయన కుంతిని నియోగించేవాడు. ఓసారి కోపానికి మారుపేరైన దూర్వాసుడు అతిథిగా వచ్చాడు. అతను ఉన్నన్నాళ్ళూ కుంతి చాలా ఓర్పుగా, అతనికి ఏరకమైన ఇబ్బందీ లేకుండా, కోపంతో కసిరినా చిరాకు పడకుండా శాయశక్తులా సేవించింది.
దానికి సంతోషిస్తూ, దూర్వాసుడు, 'నీకు నీ జీవితంలో అవసరం అవుతుంది గనక దివ్యశక్తుల్ని వశంలో తెచ్చుకోగలిగే మంత్రం ఒకటి చెబుతాను. నువ్వు కాదనడానికి వీల్లేదు' అంటూ ఆమెకు ఆ ఆచారికమంత్రాన్ని ఉపదేశించాడు.
ఈ కారణంగానే వైరాగ్యం ద్వారా దివ్యత్వాన్ని ఆహ్వానించగలిగే శక్తికి కుంతి ప్రతీక అయింది. 'కుణ' అనే క్రియకు పిలవడం అని అర్థం.
మంత్రాన్ని అందుకోగానే కౌమారచపలత్వంకొద్దీ కుంతి అది నిజమా కాదా అని పరీక్షిద్దామనుకొంది. అప్పుడు ఎదురుగా నింగిలో సూర్యుడు వెలుగుతూ పిలవడానికి నేనున్నానన్నట్టుగా అవుపించాడు. అతన్నే ఆ మంత్రంతో పిలిచింది.
అంతే..!
సూర్యుడు ఒక యోగమూర్తిగా రానే వచ్చాడు. కన్నెపిల్ల కంగారు పడిపోయింది. ‘మంత్రాన్ని పరీక్షించడానికి మాత్రమే నిన్ను పిలిచాను. అంతే. నువ్వు వెళ్ళిపోవచ్చు' అని అన్నా సూర్యుడు ఆమె మాటను కాదంటూ ‘ఈ మంత్ర మహిమను మనం ఆపలేం. నీకు కొడుకు ఒకడు కలుగుతాడు. అయినా నీకన్నెతనానికి ఏమీ ముప్పురాదులే' అని వరమిచ్చి వెళ్ళిపోయాడు.
బంగారుకవచకుండలాల వసువుతో (ధనంతో) ఒక పిల్లాడు పుట్టాడు. కుంతి, సమాజానికి భయపడి, ఆ పసికుర్రాణ్ణి ఒక పెట్టెలో పెట్టి నదీ జలాల్లో విడిచిపెట్టింది.
ఆ పెట్టె నీళ్ళ ప్రవాహంలో సాగుతూ పోయి రాధాభర్త అయిన అధిరథుడికి దొరికింది. అపరంజి కిరణాలసేనతో పుట్టాడు గనక అతన్ని ‘వసుషేణుడు’ అని పిలుచుకున్నారు ఆ దంపతులు. తరవాత అతనే కర్ణుడయ్యాడు. బుద్ధికి ప్రతీక అయిన పాండురాజుతో కుంతికి ఇంకా సంబంధం కుదరనికాలంలో ఈ కర్ణుడు పుట్టాడుగనక, అతను భౌతికమైన ఇంద్రియాల మొగ్గుదలల ప్రభావంలో ఉంటూ అధర్మానికి మరోవేరైన దుర్యోధనుడి వైపే జేరాడు.
ఆ పైన కుంతిభోజుడు కుంతికి స్వయంవరం చాటించాడు. వచ్చిన రాజుల్లో పాండురాజును ఆవిడ వరించింది. శల్యుడి చెల్లెలు మాద్రి, ఆవిడకు సవితి అయింది. భర్తతో వనవిహారంలో కాలాన్ని సరదాగా గడుపుతూండగా, ఒక రోజున మృగవేషంలో ఉన్న మునిదంపతుల్ని చంపినదోషానికి పాండురాజు స్త్రీ సుఖానికి దూరంగా ఉండవలసి వచ్చింది. వానప్రస్థుడై ఇద్దరుభార్యలతోనూ శతశృంగ పర్వతంమీద, మిగిలిన తాపసులతో సహా తపస్సుచేస్తూ కాలాన్ని వెళ్ళబుచ్చడం ప్రారంభించాడు. బ్రహ్మలోకంలో జరగబోయే ఒక సభను చూద్దామని ఆ తపస్వులతో బయలుదేరిన అతనికి సంతానం లేకపోవడంవల్ల స్వర్గ ద్వారాలు తెరిచి ఉండవని అర్థమయింది. ఆ మహర్షులు 'నువ్వు మరో పద్ధతి ద్వారా పిల్లలను కనడానికి ప్రయత్నం చెయ్యాలి' అని ప్రబోధించారు. తాను ఎలాగైతే తన నాన్న గారి క్షేత్రమైన అంబాలికకు వ్యాసమహర్షివల్ల పుట్టడం జరిగిందో అలాగే తానూ ప్రయత్నం చేయాలని అతను అనుకొన్నాడు. కుంతితో ఆవిషయాన్నే ప్రస్తావించాడు. ఆవిడ తనకు దివ్యశక్తుల్ని పిలిచి వశంలో తెచ్చుకొనే శక్తి ఉందని చెప్పడంతో పాండురాజు ముఖం గంపెడాశతో వెలిగిపోయింది. యమధర్మరాజు ద్వారా యుధిష్ఠిరుడిని, వాయువు ద్వారా భీముణ్ణి, ఇంద్రుడి ద్వారా అర్జునుణ్ణి, కని కుంతి, పాండురాజును సంతానవంతుడిగా చేసింది. అంతేకాదు. మొగుడు కోరినమీదట మాద్రికి కూడా ఆ మంత్రాన్ని చెప్పి నకుల సహదేవులను కలిగేలాగ చేసింది. మాద్రికి మరోమారు పిల్లలను కనే అవకాశాన్ని కలిగించమంటే పాండురాజుతో ఏకాంతంగా కుంతి, 'నేను ఒక పిల్ల వాణ్ణి కనమని మంత్రం చెబితే అది అశ్వినీకుమారులజంటను పిలిచి మొదటిసారే ఇద్దర్ని కన్నది. ఆవిధంగా అది నన్ను మోసంచేసింది. చెడ్డ స్త్రీల ప్రవర్తన ఇలాగే ఉంటుంది. నేను ద్వంద్వదేవతల్ని పిలిస్తే ఇద్దరు ఒకేసారి కలుగుతారన్న తెలివేలేని మూఢురాల్ని. అంచేత దానికి పిల్లలు కలిగేలా మళ్ళీ మంత్రాన్ని చెప్పమని మీరు నన్ను బలవంత పెట్టవద్దు' అని అంది.
మాద్రితో సహా వనంలోకి వెళ్లిన పాండురాజు కామాంధుడై చావును కొని తెచ్చుకోవడంతోనూ మాద్రి, అతనితో సహగమనం చేయడంతోనూ కుంతి ఐదుగురి పిల్లల్నీ వెంట బెట్టుకొని ఋషులసాయంతో హస్తినాపురానికి చేరినదగ్గర్నించీ ఇక కష్టాలే కష్టాలు మొదలయ్యాయి.
ధృతరాష్ట్రుడికి గుడ్డితనంవల్ల రాజ్యం రాకపోయినా పాండురాజు చనిపోవడంతో అతని చేతిలోనే రాజ్యం ఉండిపోయింది. అతని కొడుకుల్లో పెద్ద వాడైన దుర్యోధనుడు మహా అసూయాపరుడు. భీముడి పొడ అసలు గిట్టేదికాదు. అతను తననూ తన తమ్ముళ్ళనూ కుస్తీ పట్ల లోనూ ఇతరమైన ఆటల్లోనూ ఓడిస్తున్నాడని ఒకటే గుర్రు. భీముడికి వాళ్ళు విషం పెట్టారు; గాఢ నిద్రలో ఉన్నప్పుడు అతన్ని గంగలోకి విసిరేశారు. అయితే, భీముడి ప్రాణం చాలా గట్టిది. అతను వాటినన్నిటినీ దాటేశాడు.
యుధిష్టిరుడు పెద్దాడు గనక ధృతరాష్ట్రుడు అతన్ని యువరాజుగా చేయడమైతే చేశాడుగానీ, దుర్యోధనుడి పోరు మాత్రం ఇంతింత గాదు. కొడుకుమాటను నెగ్గించడానికి కుంతితోసహా పాండవుల్ని వారణావతానికి పంపించి లక్క ఇంట్లో సజీవదహనం చేద్దామన్న కుటిల ప్రయత్నం చేశాడు ధృతరాష్ట్రుడు. విదురుడి ఆలోచనవల్ల ఆ కష్టం నుంచి బయట పడి, ఐదుగురి పిల్లల్నీ పెట్టుకొని అజ్ఞాతంగా కొన్నాళ్ళు బతకవలసివచ్చింది కుంతి.
ఏకచక్రపురంలో తమకు నివాసాన్ని కల్పించిన బ్రాహ్మణుడికి వచ్చిన కష్టాన్ని తీర్చడానికి భీముణ్ణి బకాసురుడి దగ్గరికి పంపడానికి ముందుకొచ్చింది ఆవిడ. దీనికి కారణాలు రెండు అవుపిస్తాయి: తన కొడుకు బలం మీద అవిడకున్న నమ్మకం మొదటిది; తామెంత కష్టాల్లో ఉన్నాసరే, ఇతరుల కష్టాన్ని తీర్చడానికి తమను తాము సమర్పించు కోవాలన్న సేవాభావాన్ని పిల్లలకు నేర్పడం రెండోది. లేకపోతే, ఏ తల్లైనా తన కన్నపేగులాటి పిల్లవాణ్ణి వధ్యశిలకు పంపించడం జరుగుతుందా? శివుడు హాలాహలవిషాన్ని తాగడానికి పార్వతి ఒప్పుకోవడంలో శివుడి శక్తి మీద ఆవిడకున్న నమ్మకంలాటి నమ్మకమే ఇక్కడ కుంతిలో ప్రస్ఫుటించింది.
అక్కణ్ణించి దక్షిణపాంచాలదేశానికి బ్రాహ్మణులతో సహా వెళ్ళి, ఒక కుమ్మరి వాడి ఇంట్లో బస చేశారు. స్వయంవర మంటపానికి వెళ్ళి, మత్స్యయంత్రాన్ని ఛేదించి బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు ద్రౌపదిని గెలుచుకొన్నాడు. కోలాహలం అవుతూంటే, ధర్మరాజు నకులసహదేవులు ఇద్దరితోనూ బసకు వచ్చేశాడు. అక్కడ రాజులందరూ భీమార్జునులను బాహ్మణులనే తలపుతోనే అడ్డుకొన్నారు. భీమార్జునులు వాళ్ళనందర్నీ ఓడించి ద్రౌపదితో సహా బసకు వచ్చి, 'భిక్షను తెచ్చామమ్మా!' అని సరదాగానే అన్నారు. లోపలి గదిలో ఉన్న కుంతి వాళ్ళను చూడకుండానే, రోజూ సాధారణంగా బిచ్చం తెచ్చుకొన్నప్పుడు ఏమంటుందో అదే తరహాలో 'మీ అందరూ కలిసి దాన్ని పంచుకోండి' అని యాథాలాపంగా అంది.
ఇంతలో ఇవతలకు వచ్చి, ద్రౌపదిని చూసి నాలిక్కరుచుకొంది. 'ఛ ఛ ఎంత అనుచితమైన మాటను అన్నాను' అని చాలా నొచ్చుకొంది.
చాలామందికి ఒకత్తే భార్యగా ఉండడం అధర్మమనిపిస్తుంది. అయితే, గురువు చెప్పినమాటనే ధర్మమని అంటారు. తల్లేమో గురువుల్లో కెల్లా మహాగురువు. అంచేత, ఆవిడన్నమాటనే ధర్మంగా తీసుకోవాలని యుధిష్టిరుడు నిర్ణయించాడు. ద్రౌపది పూర్వ జన్మలో పెళ్ళికాక, శివుణ్ణి గురించి తపస్సు చేసి అతను ప్రత్యక్షమైనప్పుడు 'నాకు పతి చేకూరేలాగ చెయ్యి' అని ఐదుసార్లు అంది అని చెబుతూ, వ్యాసుడు కూడా దాన్ని సమర్థించాడు. అలా, కుంతి వాక్శుద్ధి కొద్దీ పాండవులైదుగురికీ ద్రౌపది భార్య అయింది.
దుర్యోధనుడి తరఫున శకుని ఆడిన మోసపు జూదంలో ఓడిపోయి, పన్నెండేళ్ళ వనవాసమూ, ఒక ఏడాది అజ్ఞాతవాసమూ చేయడానికి పాండవులు వెళ్ళినప్పుడు, కుంతి ధృతరాష్ట్రుడి పంచనే ఉండి కష్టపడింది. ద్రౌపది పాండవులతో కలిసి వనవాసకష్టాలూ అజ్ఞాతవాసకష్టాలూ పడి బయటపడ్డ తరవాత, తమ రాజ్యాన్ని తిరిగి ఇమ్మనమంటే, దుర్యోధనుడు ససేమిరా అన్నాడు. ఇక పోరు తప్పనిసరి అయింది. అప్పుడు తన మొట్ట మొదటి కొడుకు కర్ణుడు అటు వైపు ఉండడం కుంతికి మింగుడు పడ లేదు. ఏకాంతంగా అతన్ని కలిసి, జరిగిన సంగతి చెప్పింది: 'నువ్వు సూతకులంలో పుట్టినవాడివి కావు, నా కొడుకువి. క్షత్రియకులంలో పుట్టినవాడివి. నువ్వు పాండవుల వైపుకు వచ్చి, యుధిష్ఠిరుడికి అన్నగారివై రాజ్యాన్ని పాలించు. కర్ణార్జునులకు బలరామకృష్ణులకు మల్లే అసాధ్యమేమీ ఉండదు' అని.
కుంతి మాటను సూర్యుడు బలపరుస్తున్నట్టుగా బిట్టుగా ప్రకాశించాడు. అయినా సరే, కర్ణుడు దానికి ఒప్పుకోలేదు. 'నన్ను అన్నివిధాలా సత్కరిస్తూన్న దుర్యోధనుణ్ణి వదిలిపెట్టలేను. అందులోనూ యుద్ధకాలంలో ఆ పని నేను చేయను. అతనికోసం నీకొడుకులతో యుద్ధంచేస్తాను. అయితే, ఒక్క అర్జునుణ్ణి తప్ప, మిగతా నలుగుర్నీ నేను చంపను' అని కర్ణుడన్న మాటను విని నిరాశగా కుంతి వెనుదిరిగి వచ్చింది. కానీ ఆ పెద్ద కొడుకు గురించి ఆమె చివరిదాకా లోలోపల కుమిలిపోతూనే ఉంది.
ఇలా.. కుంతి జీవితం పొడుగునా కష్టాలు అనుభవిస్తూనే ఉంది. కానీ ఆవిడ వైరాగ్యానికి మరో పేరుగనక వాటినన్నిటినీ చాలా ఓర్పుగా శ్రీకృష్ణుడి మీద భక్తితో సహిస్తూ వచ్చింది. ఆవిడ భక్తి చాలా గొప్పది. ఆమెకు శ్రీకృష్ణుడు మేనల్లుడే; కలిసినప్పుడల్లా అతను ఆవిడ పాదాలకు మొక్కేవాడు. అయినా ఆవిడ అతన్ని దేవుడిగా ఎరిగి శరణాగతిని పొందింది. పాండురాజు పోయిన దగ్గర్నుంచీ ఆవిడకు అన్నీ కష్టాలే. అన్ని ఆపదల్లోనూ శ్రీకృష్ణుడు కాపాడుతూనే వచ్చాడు. అతని మహాదయను తలుచుకొంటూ కుంతి చేసిన ప్రార్థన మన అందరికీ కనువిప్పు కావాలి:
```
*విపదస్సన్తు నః శశ్వత్తత్ర తత్ర జగద్గురో |*
*భవతో దర్శనం యత్ స్యాద పునర్భవదర్శనమ్ ||*```
'ప్రభూ! మా జీవితంలో ఎప్పుడూ విపత్తులే వస్తూ ఉండనీ! ఎందుకంటే, విపత్తుల్లోనే కచ్చితంగా నీ గుర్తు వస్తుంది, నీ రూపం ఆ కన్నీళ్ళలో ప్రతిబింబించి అవుపిస్తుంది. లోపల నీ దర్శనమైతే ఇంకేముంది? చావుపుట్టుకలచక్రం నుంచి బయట పడిపోవడం ఖాయమవుతుంది. యోగేశ్వరుడా! యాదవులమీదా పాండవుల మీదా నాకున్న అతి మక్కువ అనే పాశాన్ని తెగ్గోసి, నిన్నే నేనెప్పుడూ తలుచుకొంటూ ఉండేలాగ దీవించు!' అనే ఆవిడ మాటలు మనమెప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి.✍️```
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment