Tuesday, 9 September 2025

 *ద్విజులు అనగా ఎవరు?*

కామాన్మాతా పితా చైనం యదుత్పాదయతో మిథః |  సంభూతిం తస్య తాం విద్యాద్యద్యోనావభిజాయతే ॥ మనుస్మృతి 2:96 (2:147)

ఏ శిశువుకి తల్లి-తండ్రి కలిసి సంతానప్రాప్తిని కోరి జన్మనిస్తారో, అలాంటి శిశువు తల్లి గర్భం నుండి జన్మిస్తారు, అది ఆ శిశువు సాధారణ రూపంలో ఈ ప్రపంచానికి వచ్చిన జన్మ. (ఇది మానవుని యొక్క మొదటి జన్మ సూచిస్తుంది)

ఆచార్యస్త్వస్య యాం జాతిం విధివద్వేదపారగః | ఉత్పాదయతి సావిత్ర్యా సా సత్యా సా జరామరా ॥ మనుస్మృతి 2:97 (2:148)

వేదాలలో పారంగతుడైన ఆచార్యుడు వేదోక్తంగా గాయత్రీ మంత్రపూర్వకంగా ఉపనయనం చేసి ఆ విద్యార్థికి అజరామరమైన, శాశ్వతమైన జన్మనిస్తున్నందు వల్ల తండ్రికంటే అతడు పరమపూజ్యుడు.(ఇది మానవుని యొక్క విద్యారూపమైన రెండో జన్మను చూపిస్తుంది. ఇక్కడ నుండే ఆ మనిషి ద్విజుడు అనబడును)

ఉపనీయ తు యశ్శిష్యం వేదమధ్యాపయేద్ద్విజః |
సకల్పం సరహస్యం చ తమాచార్యం ప్రచక్షతే ॥ మనుస్మృతి 2:90 (2:140)

బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలలో ఎవరు తన శిష్యుడికి యజ్ఞోపవీత సంస్కారం చేయించి యజ్ఞ విధితోపాటుగా వేదాంతమును మరియు అర్థవంతంగా వేదాన్ని చదివిస్తారో  అతడిని ఆచార్యుడు అంటారు.(ఒక మనిషి ద్విజుడు అనిపించుకోవడానికి గల కారణాలు ఇక్కడ వివరించబడ్డాయి, ఉపనయనం ధరించుట వేదాది సత్య శాస్త్రాలు అధ్యయనం)

అకారం చాప్యుకారం చ మకారం చ ప్రజాపతిః | వేదత్రయాన్నిరదుహద్భూర్భువస్స్వరితీతి చ ॥ మనుస్మృతి 2:44(2:76)

ఋగ్యజుస్సామములనే మూడు వేదాల నుంచి ప్రజాపతియైన పరమాత్మ వరుసగా అకార, ఉకార, మకారాలను (ఓ3మ్); 'భూః, భువః, స్వః'(వ్యాహృతులను) అనే ఈ మూడింటిని క్రమంగా మనకందించాడు.

త్రిభ్యః ఏవతు వేదేభ్యః పాదం పాదమదూదుహత్ ।  తదిత్యృచో స్యాస్సావిత్ర్యాః పరమేష్ఠీ ప్రజాపతిః || మనుస్మృతి 2:45(2:77)

పరమేష్ఠీ ప్రజాపతి  'తత్' పదంతో ప్రారంభమవునట్టి సావిత్రీ ఋక్, గాయత్రీ (మంత్రం) ఋక్కు యొక్క ఒక్కొక్క పాదాన్ని ఋగ్యజుస్సామములనే మూడు వేదాల నుంచి పిండెను. (ప్రకటించెను)

ఋగ్వేదము - 3:62:10 నుండి |తత్ సవితుర్వరేణ్యం
యజుర్వేదము - 3:35, 22:9, 30:2, 36:3 నుండి భర్గో దేవస్య ధీమహి |
సామవేదము - ఉత్తరార్చిక 13 వ అధ్యాయం 6 వ ప్రపాటకం , 3 లో అర్థం, 10 వ సూక్తం, 1 వ మంత్రం.(1462) నుండి ధియో యో నః ప్రచోదయాత్ ॥

మంత్రానికి ఋషి పరమేష్ఠీ ప్రజాపతిః

ఏతదక్షరమేతాం చ జపన్ వ్యాహృతిపూర్వికామ్ ।
సంధ్యయోర్వేదవిద్విప్రో వేదపుణ్యేన యుజ్యతే ॥ మనుస్మృతి 2:46(2:78)

ఈ ఓ3మ్ అక్షరాన్ని ; 'భూః, భువః, స్వః వ్యాహృతితో   కలిపి ఈ గాయత్రి మంత్రాన్ని వేదపాఠియైన ద్విజులు పూర్వ సంధ్య, సాయం సంధ్యల యందు నిత్యము జపిస్తే వేదాధ్యయన పుణ్యాన్ని పొందుతారు.

మనిషి శిశువుగా పుట్టుట మొదటి జన్మగాను మరియు వేద విద్య తెలిసినా ఆచార్యుని సంప్రదించి శిష్యరికం చేసి ఉపనయనం ధరించి విధిగా ప్రతిరోజు వేదాధ్యయనం, సంధ్యాకాలమున గాయత్రీ మంత్రమును జపించుట ద్విజులు అనుసరించే  పద్ధతి వీరినే ద్విజులు అని చెప్పవలెను.

(ద్విజ స్థానానికి చేరుకుని కూడా ఈ పైన చెప్పిన పద్ధతిని అనుసరించని వారిని ద్విజస్థానం నుండి బహిష్కరించుట కూడా కలదు.).              

No comments:

Post a Comment