*🧘♂️3-వేమన-పద్యము🧘♀️*
*(నిగూఢ తత్వ వివరణ)*
*ప :- మొదల మాను యగును తుద పక్షియునుగాదు!*
*నోరులేదు పండ్లు యారుగలవు!*
*జీవి యొకటి లేదు జీవులు జంపురా!*
*విశ్వదాభిరామ వినురవేమా!!*
*భావము:- మాను ఎంతో విశాలముగా కొమ్మలు వ్యాపించినదై ఆకులు, పూలు, కాయలు గలదిగా ఉండును.*
*కొమ్మలు,ఆకులు పూలు, కాయలు అన్నియు చెట్టుకు అంటుకొని ఉండునవియే. పక్షి చెట్టు కొమ్మ మీద కూర్చొన్నను చెట్టుకు సంబంధం లేదు. పక్షి చెట్టును వదలి వెళ్ళిపోవును.*
*కర్మ అనునది ఒక వృక్షములాగ ఉన్నది. అందులో ఎన్నియో రకముల పాప పుణ్యములు ఉన్నవి. ఆకులు, కొమ్మలు చెట్టులోని భాగములైనట్లు రక రకాల పాప పుణ్యములు కర్మలోని భాగములు. ఉన్న ప్రతి కర్మను జీవుడు అనుభవించ వలసి వుండును.*
*ఏ ఒక్క కర్మ కూడ అనుభవానికి రాకుండ ఉండదు. అనుభవించకపోవు కర్మలేదు. కావున కర్మను చెట్టుగా పోల్చి ఏ కర్మ అయిన చెట్టులోని భాగమే కాని సంబంధము లేనిది కాదని తుద పక్షియును గాదన్నారు.*
*కర్మ, గుణ చక్రములోని కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యములను ఆరు గుణములను ప్రేరేపించి జీవుని హింసించుచుండును. కర్మ కనిపించునది కాదు.*
*అయినా గుణముల ప్రభావములను మాత్రము అందరూ తెలుసుకోవచ్చును. అందువలన కనిపించని కర్మను నోరుగా పోల్చి, ఆరు గుణములను దంతములుగా పోల్చి నోరు లేదు పండ్లు ఆరు గలవు అన్నారు.*
*కర్మ స్వయం శక్తి కాదు. ఆత్మ చైతన్యము చేతనే పని చేయు చుండును. అన్ని జీవులందున్న కర్మ ఆత్మ చైతన్యము చేతనే పని చేయుచూ సకల జీవుల చావు పుట్టుకలకు కారణమై ఉన్నది.*
*స్వయం శక్తి లేదు కావున జీవమొకటి లేదు అన్నారు. అన్నీ జీవుల చావులకు కారణమైనది కర్మలే. కావున అవి తీరితే జీవుడు దేవుడు అగును అన్నారు.*.
No comments:
Post a Comment