Tuesday, 9 September 2025

 *శ్రీ రాధాకృష్ణతత్త్వం* 

🍁 *రాధాకృష్ణులని వేరుగా ఎవరు భావిస్తారో వారు నిరయగాములు అవుతారని అధర్వణవేదంలో రాధికోపనిషత్తులో చెప్పబడింది.* 

*రాధాకృష్ణతత్త్వం అవిభాజ్యమైనది.  చంద్రచంద్రికయోరివ -  చంద్రుడు - వెన్నెలవలె వారి తత్త్వం విడదీయలేనిది అని శాస్త్రం వర్ణించింది.*

 *పరమాత్ముని ఆనందం,  కృప ఒక రూపం ధరిస్తే  అది రాధాదేవి.* 

రాధ అనుగ్రహం లేకపోతే కృష్ణానుగ్రహం లేదు అంటే ఆయన అనుగ్రహం లేనిదే ఆయన దొరకడని చెప్పడం.

🍁స్వామి వివేకానంద ఒక భక్తుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ "భగవంతుడిని మనం చేసే జపాలు, పూజలు వల్ల మాత్రమే పొందలేం. ఆయన అనుగ్రహం, కృప ఉంటేనే పొందగలం. మన ప్రయత్నం చేత భగవంతుడిని పొందుతానని ఎప్పుడు అనుకోరాదు. ఆయన అనుగ్రహం ఉంటేనే దొరుకుతాడు తప్పా మనం ఆయనని దొరకబుచ్చుకోలేం." అని చెప్పారు.  

పరమాత్ముడి కృప పేరే రాధ. ఆ కృప ఆయన నుంచి ప్రసరిస్తూ ఉంటుంది. కృపకే మరొక పేరు ప్రేమ. రాధ అంటే పరమేశ్వరుని ప్రేమశక్తి. 

🍁పరమాత్మకి సందినీ, హ్లాదినీ, సంవిత్ అని మూడు శక్తులు ఉంటాయి.
 సందినీశక్తి అంటే ఏ కర్మకి అనుగుణంగా ఏ జీవుడిని ఏ ఫలంతో అనుసంధానించాలో తెల్సి ప్రపంచాన్ని నడుపుతున్న పరమాత్మ మాయాశక్తి విశేషం.

 జ్ఞానప్రదానం చేసే శక్తి పేరు సంవిత్. 
 మూడవది హ్లాదినీశక్తి. 

 ఇందులోంచే ప్ర-హ్లాదం, ఆ-హ్లాదం ఇత్యాది శబ్దాలు వచ్చాయి.

 హ్లాదినీశక్తి కేవల ఆనందాత్మిక. కేవల ప్రేమాత్మిక. ఆనందం, ప్రేమ రెండూ పర్యాయపదాలు.

 అస్తి-భాతి-ప్రియం సత్-చిత్-ఆనందం. ప్రేమయే ఆనందం. ప్రేమయే కృప.  కాబట్టి కృపయే ఆనందం - ఆనందరూపిణి హ్లాదినిశక్తి అయిన రాధాదేవి.

 మధుసూదనసరస్వతి ఆవిడని వర్ణిస్తూ హర్షానందాకృతి అన్నారు. లోపల అనుభూతిగా ఉంటే ఆనందం. వ్యక్తమైతే హర్షం. అలాంటి ఆనందరూపిణి రాధాదేవి.
🌹🌹🌹🌹🌹🌹🌹
🙏జై శ్రీ రాధేకృష్ణ🙏.  

No comments:

Post a Comment