Tuesday, 9 September 2025

 తాళ్లపాక అన్నమాచార్య అధ్యాత్మ సంకీర్తన

గానం. M. S. సుబ్బలక్ష్మి అమ్మ
రాగం. శుద్ధ ధన్యాసి 
స్వర రచన. శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు 

రేకు: 297-2
సంపుటము: 3-561
రేకు రాగము: దేసాక్షి

భావములోన బాహ్యమునందును
గోవింద గోవిందయని కొలువవో మనసా

హరియవతారములే అఖిల దేవతలు
హరిలోనివే బ్రహ్మాండంబులు
హరి నామములే అన్ని మంత్రములు
హరి హరి హరి హరి హరి యనవో మనసా

విష్ణుని మహిమలే విహిత కర్మములు
విష్ణుని పొగడెడి వేదంబులు
విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు
విష్ణువు విష్ణువని వెదకవో మనసా

అచ్యుతడితడే ఆదియు నంత్యము
అచ్యుతుడే అసురాంతకుడు
అచ్యుతుడు శ్రీ వేంకటాద్రి మీద నిదె
అచ్యుత అచ్యుత శరణనవో మనసా

భావములోన  బాహ్యమునందును
గోవింద గోవిందయని కొలువవో మనసా..

విశ్లేషణ:

త్రికరణ శుద్ధితో వేంకటేశుని సేవించమని మనస్సునకు, తద్వారా సమస్త మానవలోకానికి అన్నమయ్య ప్రబోధిస్తున్నారు.

      ఓ మనసా! హృదయములోపల, చేష్టలలోపల బయట కూడా గోవిందా, గోవిందా అంటూ మొక్కుము. సేవ చేయుము. 

1. దోషములను హరించువాడగు హరి యొక్క అవతారములే సమస్తమైన దేవతలు. హరి లోపల ఉన్నవే ఈ భువనగోళములు. హరి యొక్క పేర్లే అన్ని మంత్రములు. ఓ మనసా! హరి హరి హరి హరి అని ఎల్లప్పుడు పలుకుము.

2. సమస్తము తానై వ్యాపించిన విష్ణు దేవుని గొప్పతనములే లోకములో విధించబడిన అన్ని పనులు. విష్ణుని పొగడునవియే సమస్త వేదములు.విష్ణుడొక్కడే ఈవిశ్వము రూపముగా కలిగినవాడు. ఓ మనసా! విష్ణువు విష్ణువు అని అన్నిచోట్లా ఆయనను వెదకుచుండుము.

3. తన చోటునుంచి భ్రంశము పొందని ఆ అచ్యుతుడు శ్రీ వేంకటాద్రి పర్వతముపై వేంచేసియున్నాడు. ఈ అచ్యుతుడే మొదలు, తుది. ఈ అచ్యుతుడు రాక్షసాంతకుడు. ఓమనసా! అచ్యుత, అచ్యుత నమస్కారము, (రక్షణ) అని చెప్పుము.

ఆంతర్యము:

అన్నమయ్య ఈ కీర్తనలో ప్రయోగించిన విష్ణు వాచకములలో అచ్యుత, హరి శబ్దములు అత్యంత ప్రాముఖ్యము కలవి. వాటిని గురించి కొంత విశ్లేషిద్దాం:

అచ్యుత శబ్ద విశిష్టత:

"పతిమ్ విశ్వస్యాత్మేశ్వరగ్ం శాశ్వతగ్ం శివమచ్యుతమ్" (విశ్వానికి నాథుడు, జీవులకు ఈశ్వరుడు, శాశ్వతుడు, వినాశనము లేనివాడు, మంగళ స్వరూపుడు) _ ఈ నారాయణ సూక్తములో అచ్యుతుడు శివస్వరూపునిగా వర్ణించబడుట గమనార్హము.

"అచ్యుతః ప్రథః ప్రాణః ప్రాణదోవాసవానుజః / అపాం నిధిరధిష్ఠానం అప్రమత్తః ప్రతిష్ఠితః"  అని విష్ణు సహస్రనామాలలో అచ్యుత శబ్దము పేర్కొనబడింది.

హరి శబ్ద ప్రాముఖ్యము:

"1. అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః”

“2.కాలనేమినిహా వీరః శౌరిః శూరజనేశ్వర:త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః”

ఈ రెండు సందర్భాలలో విష్ణు సహస్ర నామాలలో హరి శబ్దము చెప్పబడింది.

“హరేరామ హరే రామ ..." అను సుప్రసిద్ధమైన 16 నామాల ఈ మంత్రంలో హరి శబ్దము ఎంత ప్రఖ్యాతమో వేరే చెప్పనవసరం లేదు. "హరి హరి హరి హరి సుమిరన్ కరో, హరి చరణారవింద్ ఉర్ ధరో” అని తులసీదాస్ తన సూర్ సాగర్ లో ప్రతి అధ్యాయం మొదటిలో పై విధంగా హరిస్మరణచేసాడు. ఇక మన పోతన్న భాగవతములో -హరి ముద్రాంకితములు కాని పద్యాలు చాలా తక్కువ.

విష్ణుని మహిమలే-విహిత కర్మములు:

కర్మములు చాలా ఉన్నాయి. కాని సాంప్రదాయికుల దైనందిన జీవితములో అన్నమయ్య చెప్పిన విహితకర్మములు ఇవి:

 షట్కర్మములు:

1. యజనము
2. యాజనము 
3. అధ్యయనము 
4. అధ్యాపనము 
5. దానము
6. ప్రతిగ్రహము

షోడశ కర్మములు:

1. గర్భాధానము
2. పుంసవనము 
3. సీమంతము 
4. జాత కర్మము
5. నామకరణము
6. అన్నప్రాశనము 
7. చౌలము
8. ఉపనయనము
9. ప్రాజాపత్యము
10. సౌమ్యము
11. అగ్నేయము
12. వైశ్వదేవము
13. గోదానము
14. సమావర్తనము
15. వివాహము 
16. అంత్యకర్మము

నిష్కాముడై విహిత కర్మలను ఆచరించుట కర్మయోగము (ఇది మోక్షసాధనములలో ఒకటి.)

"భిద్యతే హృదయగ్రంథి ఛిద్యంతే సర్వసంశయాః / క్షీయన్తే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే (ముండకోపనిషత్తు2/2/8)” 

ఆ పరమాత్మ సాక్షాత్కారమయిన వెంటనే జ్ఞాని హృదయగ్రంధి వికసించును. సందేహాలన్ని తొలగిపోతాయి. అన్ని కర్మలు నశిస్తాయని ఉపనిషద్వాక్యము.

"విష్ణుని మహిమలే విహిత కర్మములు" అంటూ భావములోన, బాహ్యములోన విష్ణురూపాన్ని ధ్యానిస్తూ, విహిత కర్మములు చేయుచున్నప్పటికీ మోక్షప్రాప్తి తథ్యమని అన్నమయ్య ప్రబోధము.
 అచ్యుతుఁడితడే-ఆదియునంత్యము:

“యదోర్ణ నాభిర్హృదయా దూర్ణం సంతత్య వక్త్రతః తయా విహృత్య భూయస్తాం గ్రసత్యేవం మహేశ్వరః"

సాలె పురుగు తన ఎదలోనుండి నోటి ద్వారా ఊర్ణను (ఉన్నివంటి దారము) వడకుతూ దానిని విస్తరింపజేస్తుంది. ఆ వ్యాపించిన సాలె గూటితో కొద్దిసేపు ఆడుకొని తిరిగి ఆ ఊర్ణను మింగుతుంది. పరమాత్ముడైన మహేశ్వరుడు కూడా ఈ విధంగానే విశ్వాన్ని సృష్టిస్తాడు. తిరిగి ప్రపంచాన్ని తనలో విలీనం చేసుకొంటాడు. అన్నమయ్య చెప్పిన ఆదియునంత్యము వెనుక ఆంతర్యము ఇదే.

భావములోన

1. భవతీతి భావః (పుట్టునది)
2. భావయతీతి భావః (భావింపబడునది) - అనురెండు రకములైన వ్యుత్పత్తులు భావ శబ్దమునకున్నవి. మనస్సులో జనించు భావములలో రాకూడని ఆలోచనలు విస్తరించకుండా, హరినే స్మరించినచో -తరించెదమని అన్నమయ్య ప్రబోధము. 🙏🏻.     

No comments:

Post a Comment