Tuesday, 9 September 2025

 *సనాతన ధర్మం అంటే ఏమిటి?*            *మహాభారతం ప్రకారం...*

*అశ్వమేదిక పర్వం అధ్యాయము 18*

15-18)దానం వ్రతం బ్రహ్మచర్యం యథోక్తం బ్రహ్మధారణమ్ |
దమః ప్రశాంతతా చైవ భూతానాం చానుకంపనమ్ ॥ 
సంయమాశ్చానృశంస్యం చ పరస్వాదానవర్జనమ్ |
వ్యలీకానామకరణం భూతానాం మనసా భువి ||
మాతాపిత్రోశ్చ శుశ్రూషా దేవతాతిథిపూజనమ్।
గురుపూజా ఘృణా శౌచం నిత్యమింద్రియసంయమః 
ప్రవర్తనం శుభానాం చ తత్ సతాం వృత్తముచ్యతే |
తతో ధర్మః ప్రభవతి యః ప్రజాః పాతి శాశ్వతీః ॥ 

దానం చేయటం, వ్రతాచరణం, యథావిధిగా వేదాధ్యయనం, ఇంద్రియ నిగ్రహం, శాంతి, సర్వప్రాణులయందు దయ, మనోనిగ్రహం, మృదుస్వభావం, ఇతరుల సొత్తు తీసుకోకపోవటం, లోకంలోని ప్రాణులకు మనస్సుతో గూడా కీడు చేయకుండటం, తల్లిదండ్రుల సేవ, దేవతలను అతిథులను పూజించటం, గురువులను
గౌరవించటం, కనికరం, పవిత్రత, నిత్యమూ ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవటం, మంచి విషయాలను ప్రచారం చేయటం అనేవి సత్పురుషుల ప్రవర్తన అని చెపుతారు. వీటిని అనుష్ఠించటం వల్లనే ధర్మం ఏర్పడుతుంది. అలాంటి ధర్మాత్ముడే చిరకాలం ప్రజలను రక్షిస్తాడు. (15-18)

19) ఏవం సత్సు సదా పశ్యేత్ తత్రాప్యేషా ధ్రువా స్థితిః।
ఆచారో ధర్మమాచష్టే యస్మిన్శాంతా వ్యవస్థితాః ॥ 

సత్పురుషులలో ఇలాంటి ధర్మాచరణం ఎల్లప్పుడు
కన్పిస్తుంది. వారిలోనే ధర్మం నిశ్చలంగా ఉంటుంది. సదాచారమే ధర్మాన్ని తెలుపుతుంది. శాంతచిత్తు అయిన మహాత్ములు ఎల్లవేళలా సదాచారం పాటిస్తుంటారు. 

20) తేషు తత్ కర్మ నిక్షిప్తం యః స ధర్మః సనాతనః।
యస్తం సమభిపద్యేత న స దుర్గతిమాప్నుయాత్ ॥

వారియందే వెనక చెప్పిన ధర్మాదులు ఉన్నాయి. ఆ
కర్మలే సనాతన ధర్మం అనే పేరుతో ప్రసిద్దాలు. ఆ ధర్మాన్ని ఆచరించేవాడు దుర్గతి పాలు కాడు.        

No comments:

Post a Comment