Tuesday, 9 September 2025

 విద్యాపతి  ( మైథిలీ కవికోకిల ) 

* * *
‘ విద్యాపతి ‘ అనే భక్తిపరాయణుడు, కవిపుంగవుడు, 1352  – 1448 మధ్యకాలంలో, ఇండియా నేపాల్ రాజ్య సరిహద్దుల లో వున్న మిథిలాప్రాంత మధుబనిజిల్లాలో, బిసఫి గ్రామంలో జీవించాడు.  

విద్యాపతిగారి తండ్రిపేరు గణపతి.  విద్యాపతి మైథిలీ లిపిలో, సంస్కృతభాషలలో ప్రావీణ్యమున్నవాడు.   పేరుకు తగినట్లుగానే విద్యాపతి  విజ్ఞానఖనిగా వుండేవాడు.  శతాబ్దాలకు సరిపడా ఆయన రచనలు, హిందుస్తానీ, బెంగాలీ, ఒరియా మొదలైన అనేక యితరభాషలలో కూడా వ్యాప్తిపొంది అనేకమందికి భక్తిసాధనలో మార్గదర్శకo   అయినాయి.  

* * *
విద్యాపతి రచనలలో శివభక్తితత్వం ఎక్కువగా  గోచరించేది.  అంతేకాకుండా, వైష్ణవ సంప్రదాయంలో రాధాకృష్ణుల రాసలీలలను కడురమ్యంగా వర్ణించేవాడు.  పదకొండవ శతాబ్దిలో రామానుజుల  వైష్ణవ  ధర్మాన్ని అనుసరించి, పన్నెండవ శతాబ్దంలోని భక్త జయదేవుని గీతగోవిందాన్ని అనుకరిస్తూ, పండిత పామరులు భక్తితో,  భగవంతునికి దగ్గరయ్యే తత్వాన్ని ప్రతిపాదించాడు, విద్యాపతి కవీంద్రులు.  ఆబాలగోపాలం ఈయన కీర్తనలకు ముగ్ధులై భక్తిబాట పట్టేవారు.  అమలిన శృంగారాన్ని అద్భుతంగా వర్ణించినకవి విద్యాపతి.  

విద్యాపతి వ్రాసిన శివభక్తి పూరితమైన పాటలు ఇప్పటికీ మిథిలానగరంలో, ఆ చుట్టుప్రక్కల, జానపద బాణీలలో, దేవాలయాలలో పాడుకుంటారు.   విద్యాపతి శివభక్తి తార్కాణంగా, ఆయన తనపైచేసిన ఆరాధనా స్తోత్రాలు మెచ్చి, విద్యాపతి అడగకుండానే, సదాశివుడే, విద్యాపతి యింటికి ఆయన పశువుల కాపరిగావచ్చి చేరాడు.   తాను అనాధపిల్లవాడిననీ, ఆశ్రయం యివ్వమనీ బ్రతిమిలాడాడు.
‘ ఉజ్ఞ ‘ అనేనామంతో మెసలసాగాడు.  కాదనలేక, అతనిని తన పశువులశాల చూస్తుండమని చెప్పి, విద్యాపతి, అతి తక్కువకాలంలో, తనకు తెలియకుండానే, ఉజ్ఞని అభిమానించడం మొదలుపెట్టాడు. 

* * *
ఒకసారి,  మిథిలాదేశ రాజైన శివసింహ, విద్యాపతిని రాజాస్థానానికి రమ్మని కబురుపెట్టాడు.   విద్యాపతి ఉజ్ఞను వెంటబెట్టుకుని బయలుదేరి, దారిలో ఎడారిమార్గంలో దప్పికతో కళ్ళుతిరిగి పడిపోయాడు.  అప్పుడు సేవకుని రూపంలోవున్న శివుడు తనజటలో నుండి జలదానం చేసి విద్యాపతిని బ్రతికించాడు.  

ఆ నీటిరుచి గంగాజలాన్ని పోలి వుండడంతో,  అంత రుచికరమైన జలం యీ ఎడారిలో యెక్కడనుంచి తీసుకు రాగలిగేవని, ప్రశ్నించాడు, విద్యాపతి, తన సేవకుని.   

కొద్దిసేపు శివుడు చెప్పకుండా వున్నా, విద్యాపతి ఆతృతను గమనించి, తన నిజస్వరూపం చూపించాడు, జటాజూటంలో నుండి గంగ ప్రవహిస్తుండగా.   అదిచూసి విద్యాపతి విభ్రమంగా, ఆశువుగా శివునిపై ఆ ఎడారిలో స్తోత్రాలు చదువుతూ, ఆయనకు పాదాభివందనం చేసి,  ఆపాదాలు తాకిన ఇసుక రేణువులను తలపై దాల్చాడు. 

కొద్దిసేపటికి శివుడు తన సేవకరూపంలోకి వచ్చి, ఈ రహశ్యం యెక్కడా చెప్పవద్దని చెబితే తాను నిష్క్రమిస్తాననీ చెప్పాడు.  ‘ సరే ‘ అన్నాడు విద్యాపతి.

* * *
ఆ విధంగా పరమేశ్వరుడు విద్యాపతితో చాలా సంవత్సరాలు వున్నాడు, అతని సేవకుడిగా.   అనేక సమయాలలో  ఆశ్చర్యకరమైన రీతిలో చాలాసంక్లిష్టమైన పరిస్థితులలో విద్యాపతిని కాపాడాడు కూడా !   

ఉదాహరణకు, ఒకసారి, వారి మహారాజు శివసింహ, ఢిల్లీని పాలించే  అల్లావుద్దీన్ ఖిల్జీ చేతిలో బందీ అయినప్పుడు,  విద్యాపతి తన సేవకుడిగావున్న ఉజ్ఞ  తోడురాగా,  మహారాజు ను విడిపించడానికి ఢిల్లీ బయలుదేరాడు.  విద్యాపతి వచ్చిన విషయం తెలుసుకుని,  తమ ఆస్థాన విద్వాంసుడిని  పర్షియన్ భాషలోకానీ లేక యేదైనా మిశ్రమ భాషలోగానీ కవిత్వంలో ఓడిస్తే, వారి రాజును విడుదల చేస్తానని  ఖిల్జీ చక్రవర్తి చెప్పాడు. 
 
మన విద్యాపతి గారికి ఆభాషలేవీ తెలియవు.   అయినా సంకల్పబలంతో, తనతో సేవకుని రూపంలో వున్న పరమేశ్వరుని ధ్యానించి, ఆయన ఆశీర్వాదంతో,  అనర్గళంగా ఆ రాజ్య ఆస్థానవిద్వాంసుడితో వారి భాషలోనే వాదించి, ఓడించి మహారాజును విడిపించాడు విద్యాపతి.  

అదే కాకుండా,  తిరిగి తమరాజ్యానికి వచ్చేలోపు,  అల్లావుద్దీన్ చక్రవర్తి యేర్పరచిన అనేక ఆటంకాలని, ఉజ్ఞ  అండదండలతో యెదుర్కొని, అందరూ క్షేమంగా బయటబడి, వారి స్వస్థలానికి చేరుకున్నారు.  

 రోజులు ఆ విధంగా, ఉజ్ఞ  అండదండలతో దిగ్విజయంగా గడిచిపోతున్నాయి, విద్యాపతికి.   స్వతహాగా సాధుస్వభావి అయిన విద్యాపతి తనలో యెక్కడా అహంకారం పొడచూపకుండా జాగ్రత్తపడుతూ,  వినయంతో అందరి మన్ననలనూ పొందుతున్నాడు.  అయితే, ఆయన భార్యలో, కొద్ది అహంకారపు ఛాయలు కనబడసాగాయి.  ఉజ్ఞ   యిది గమనిస్తూ వున్నాడు.  

* * *
ఒకసారి ఆమె చెప్పినపనిచేయడంలో, కొంతతేడా రావడంతో,  ఆమె సహనం కోల్పోయి,  సేవకుని రూపంలోవున్న పరమశివుని, కోపంగా తిడుతూ, ప్రక్కనే వున్న చీపురుకట్టతో కొట్టసాగింది.

అప్పుడే లోపలికి వస్తూ, యిది గమనించిన విద్యాపతి, జరుగుతున్న ఘోర తప్పిదాన్ని చూసి తట్టుకోలేక, ' నువ్వు ఏం చేస్తున్నావో నీకుతెలుసా ?  నీవు ఎవరిని బాధిస్తున్నావో నీకుతెలుసా ?  '   అంటూ భార్యతో ‘ ఉజ్ఞ , సేవకుని రూపంలో వున్న పరమశివుడు ‘ అన్న నిజం చెప్పేసాడు.  మరుక్షణం ఉజ్ఞ రూపంలోవున్న పరమశివుడు అంతర్ధాన మయ్యాడు.

తాను క్షణికావేశంలో చేసిన తప్పు విద్యాపతికి అర్ధమైంది.  ఉజ్ఞ  లేనిజీవితం నిరర్ధకమనీ, యెంతో రోదించి, యిల్లు వదిలి, గుళ్ళు గోపురాలు తిరుగుతూ,  అడవుల వెంట పరమశివుని గురించి వెదుకసాగాడు.  చిట్టచివరకు విద్యాపతి నందనవనంలో ఉజ్ఞ ని చూడగలిగాడు. 

 అయితే శివుడు మాత్రం, తనుమళ్ళీ విద్యాపతి యింటికి రాననీ,  విద్యాపతిని మాత్రం యెప్పుడూ వెన్నంటివుండి సహాయం చేస్తాననీ మాట ఇచ్చాడు.  విద్యాపతికి ఉజ్ఞగా దర్శనమిచ్చిన  ఆప్రదేశం ఉత్తరోత్తరా ఉజ్ఞస్థాన్ గా పేరు గాంచింది.   అక్కడే లింగాకారంలో శివునిరూపం ప్రతిష్టించు కుని, ఆ గ్రామప్రజలు పూజలు నిర్వహించ సాగారు.  విద్యాపతి రచించిన స్తోత్రాలను, ప్రార్థనలను అక్కడ నిత్యం గానంచేస్తూ వుంటారు. 

విద్యాపతి పొందిన శివ అనుభూతులు బెంగాలు, ఒరిస్సా రాష్టాలలో బాగా ప్రాచుర్యం పొందాయి.   విద్యాపతి వంటి మహా శివభక్తుని కవిత్వం,  తరువాత కాలంలో ఎందరో అనుసరించి శివకృపకు పాత్రులయ్యారు.  

స్వస్తి.
ప్రేమతో,
గండవరపు  ప్రభాకర్.

No comments:

Post a Comment