*****
*శివయ్యా! కాపాడయ్యా*
=================
(మహా శివరాత్రి జ్ఞాపకాలు)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్.
అవి నేను తూర్పుగోదావరి జిల్లాలోని పుణ్య క్షేత్రం ద్రాక్షారామం దగ్గర ఉన్న మా స్వగ్రామం
జగన్నాధగిరిలో, నేను నాలుగో తరగతి చదువుతున్న 1967 కాలం నాటి రోజులు.
ఆ రోజు సాయంత్రం,
"ఏమర్రోయ్ పిల్లలూ! కబుర్లు చెప్పుకోవడం కాదు. ఆ తొక్కుడు పచ్చడి అన్నం త్వరగా మింగండి, అవతల నాకు చాలా పని ఉంది. రేపు మహాశివరాత్రి, ఇల్లంతా కడుక్కోవాలి" మా ఇంట్లో వెనుక వైపు ఉన్న ఆరుబయట వసారాలో కూర్చుని భోజనాలు చేస్తున్న మమ్మల్ని సున్నితంగా హెచ్చరించింది అమ్మ.
"అమ్మోయ్, మహాశివరాత్రి అంటే జ్ఞాపకం వచ్చింది. రేపు మధ్యాహ్నం నేను, మన బేబి అన్నయ్య, మన పొలం కౌలు చేసే తిరుమలరాజు సూరిబాబు గారి అబ్బాయిలు సుబ్బరాజు, ఫకీరు, రవివర్మతో కలిసి సైకిళ్లు మీద కోటిపల్లి తీర్థానికి వెళ్దాం అనుకుంటున్నాం" కొంచెం భయపడుతూనే మనసులో కోరిక బయటపెట్టాను.
"వెర్రి వేషాలేస్తే వీపు బద్దలౌతుంది డిప్పకాయ్ వెధవా! ఎలాగైనా ఈమధ్య తిరుగుళ్లు ఎక్కువయ్యాయి" నావైపు కోపంగా చూస్తూ, నా అరటి ఆకులో చారు పోస్తూ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది అమ్మ.
"ఏం దేవుణ్ణి చూడడానికి వెళ్లడం కూడా తిరుగుళ్లు కిందికి వస్తుందా ?" చెప్పక పోవడమే ఈసారి కొంచెం గట్టిగానే అడిగాను.
"ఇంకోసారి ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నోరు కుట్టేస్తాను సత్తరకాయి సన్నాసీ" అమ్మ కూడా అంతే గట్టిగా చెప్పింది.
నేను కూడా అమ్మకు కౌంటర్ ఇద్దాం అనుకునే లోపు ఆపద్భాందవుడిలా రంగంలోకి దూకిన నాన్న గారు
"పోనీలేవే కాంతం! పిల్లలు అందరూ కలిసి వెళ్తున్నారు కదా ? ఇద్దరికీ చెరో పావలా ఇచ్చి పంపించు. జీళ్లు, ఖర్జూరప్పళ్లు కొనుక్కుంటారు" అంటూ అమ్మను శాంత పరిచారు.
అంతే..ఆ మాటతో నాకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది. ఆ సంతోషంలో రాత్రి ఎలా గడిచిందో నాకే తెలియదు.
***** ***** ***** *****
ఆ మర్నాడు ఉదయం నేను, మా బేబి అన్నయ్య కొంచెం పెందరాలే లేచిపోయి మా పాత అట్లాస్ సైకిల్ ని కొత్త పెళ్ళికూతురిలా మేకప్ చేసేసాం. ఈలోగా మా అమ్మగారు "ఒరేయ్ పిల్లలూ! కోటిపల్లి వెళ్లేవారు భోజనానికి రండి" అని గట్టిగా కేక వేయడంతో ఇద్దరమూ విస్తర్ల ముందు వాలాము. కుంపటి మీద కాల్చిన మెట్ట వంకాయతో పులుసు పచ్చడి వేసి, "రుచి ఎలా ఉందిరా ?" అని మా అన్నయ్యను అడిగింది అమ్మ.
వాడు సమాధానం చెప్పే లోపు నేను "బాగానే ఉంది కానీ, ఇందులో నీరుళ్లిపాయ వేసి ఉంటే ఇంకా అదిరిపోయేది" అన్నా, వేళ్లకు అంటిన పులుసు పచ్చడి నాకుతూ! అంతే సర్రుమని లేచిన అమ్మ, "ఒరే అప్రాచ్యుడా! ఈరోజు మహా శివరాత్రి. ఉల్లిపాయ తినకూడదు. ఆ కోటిపల్లి తీర్థంలో ఉల్లి పకోడీల్లాంటివి తిన్నట్లు తెలిసిందంటే, వచ్చిన తరువాత వీపు విమానం మోతే!" చేతులు ఊపుకుంటూ చెప్పింది. తరువాత నోరు మూసుకుని తినడం నా వంతైంది.
***** ***** ***** *****
మేం భోంచేసి బయటకు వచ్చేటప్పటికి మా యువరాజులు ముగ్గురూ వాళ్ళ నాన్నగారి హంబర్ సైకిల్ మీద కూర్చుని రెడీగా ఉన్నారు. సరే ఇంకెందుకు ఆలస్యం అనుకుని జై శివయ్యా అంటూ మా కోటిపల్లి యాత్ర మొదలెట్టాం.
మా ఇంటి నుంచి బయలుదేరి బూడిద తాతబ్బాయి కొట్టు మీదుగా దవులూరి దాసు కోట్టు దాటుకుని ఎక్కల వీర్రాజు ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుని కటకం నాగ మల్లేశ్వరరావు ఇంటి వద్ద ఉన్న దేవాంగుల శివాలయంలో ఉన్న శివునికి, "క్షేమంగా వెళ్లి లాభంగా వచ్చేలాగా, అలాగే మేము అక్కడికి వెళ్ళేటప్పటికి జీళ్లు అయిపోకుండా ఉండేలా చూడు శివయ్యా!" అని మనసులో దండం పెట్టుకున్నాను.
ఆ తర్వాత ర్యాలి సూర్యావు కొట్టు మీదుగా మెయిన్ రోడ్డు ఎక్కి మా ఊరు పోలిమేరలో ఉన్నటువంటి పనుగుదాలమ్మ అమ్మవారికి దండం పెట్టుకుని మా యాత్రని కొనసాగించాము. ఓ 20 నిమిషాల తర్వాత మా యాత్ర ఉండూరు వంతెన మీదుగా హాసన్ బాదా దాటుకుని, ద్రాక్షారామం పొలిమేరకు వచ్చింది.
పర్వాలేదు ఇంకొక గంటలో సునాయాసంగా కోటిపల్లి వెళ్ళిపోతాం, అక్కడ జీళ్లు ఇంకా ఉంటాయిని నేను అనుకునేటప్పటికీ అనుకోని అవాంతరం ఎదురైంది .అది ఏమిటంటే ,మా అన్నయ్య సడన్ గా "ఇంతవరకు వచ్చాము కదా? దాక్షారామం ముందు నుంచి ఇలా ఈ సందులో వెళ్తే ఆదివారపుపేట ఉంటుంది. అక్కడ శివబాలయోగి గారు ఉన్నారు. ఆయన దర్శనం చేసుకుని వెళ్దాం" అని చెప్పి ఓ ప్రపోజల్ పెట్టాడు.
అప్పుడ నేను "ఇప్పుడు ఎందుకురా బాబూ ? కావాలంటే వచ్చేటప్పుడు చూద్దాం!" అనగానే మా సూరిబాబు గారి అబ్బాయి సుబ్బరాజు "అవును నిజమే మా బావాజీ కూడా చెప్పారు ఆయనను చూసి రండి చాలా పుణ్యమని" అని చెప్పగానే నా జీళ్ల మీద ఇంక ఆశలు వదులుకున్నాను.
***** ***** ***** *****
ఓ పదినిమిషాల తర్వాత మేము ఆదివారపుపేట స్వామివారి ఆశ్రమానికి చేరుకున్నాం. అక్కడ చాలా కోలాహలంగా ఉంది. వేలాది మంది జనం ఉన్నారు. పెద్ద పెద్ద పందిర్లు వేసారు. అక్కడ కూర్చుని కొంత మంది భజన చేస్తున్నారు. కొంత మందేమో పూనకాల వచ్చి ఊగిపోతున్నారు.
అందులో భజన చేసే వాళ్లు మంచి మనసులు సినిమాలోని "మామా మామా ఏమే ఏమే భామా" పాట వరుసలో "స్వామి స్వామి శివయోగి, స్వామి స్వామి శివయోగి.... ఆదివారపు పేటలోన అవతరించినావయా, బెంగుళూరు పట్నాన రంగు తెచ్చినావయా మా పురములోన ఆశ్రమాన్ని నిలిపినావయా... స్వామి స్వామి...." అని పాడుతున్నారు.
నాకు ఇది చూసిన తర్వాత ఇంత మంది జనాల్లో మనం ఈ స్వామి వారిని ఎప్పుడు చూస్తామూ ? ఆ కోటిపల్లి ఎప్పుడు వెళ్తాము అని మనసులో అనుకుని "శివయ్యా! నీదే భారం నాయనా! మమ్మల్ని నీ దగ్గరకు రప్పించుకో. నాచేత ఆ జీళ్లు కొనిపించుకో" అని ఆ పరమేశ్వరునికి దండం పెట్టేను. వెంటనే ఓ అద్భుతం జరిగింది.
తెల్లగా మిలామిలా మెరిసిపోతున్నటువంటి లాల్చీ షరాయి వేసుకున్న ఓ 40 ఏళ్ల వ్యక్తి మా వద్దకు వచ్చి "ఎవరు బాబు మీరు ? ఎందుకు ఇక్కడ నిలబడ్డారు? ఏమిటి సంగతి" అని అడగ్గానే మా సుబ్బరాజు జరిగిన విషయం అంతా చెప్పాడు.
ఆయన ఎంతో నొచ్చుకుని "బాబూ ! ఈరోజు మహాశివరాత్రి. బాలయోగి వారి దర్శనం అర్థరాత్రి 12 తర్వాతే ఉంటుంది. ఓ పని చేయండి మీరు ఇంకా కోటిపల్లి వరకు వెళ్లాలి అంటున్నారు కాబట్టి ఓ పని చేద్దాం. నేను మిమ్మల్ని వెనకనుంచి తీసుకెళ్లి కిటికీ ద్వారా స్వామివారి దర్శనం చేయిస్తాను అప్పుడు మీరు బయట నుంచి చూసి వెళ్ళిపోదురు గాని" అని అనడంతో,
"శివయ్యా! మిమ్మల్ని కాపాడడానికి ఈ రూపంలో వచ్చావా తండ్రి ?" అని మనసులో అనుకుని వెంటనే సంతోషంతో ఆయన వెనకాల వెళ్లిపోయి కిటికీలోంచి ఆదివారం పేటలో ఉన్నటువంటి శివ బాలయోగి వారి దర్శనం చేసుకుని ఆయనకి నమస్కారం చేసి మా యాత్రని మళ్ళీ ప్రారంభించాము.
***** ***** ***** *****
ఎలాగైతేనేం మొత్తం మీద ఒక గంట తర్వాత కోరుమిల్లి, గంగవరం మీదుగా కోటిపల్లి రేవు చేరుకున్నాం. రేవు చేరుకోగానే మా అన్నయ్య
"ముందు సోమేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాం" అన్నాడు. నేను వెంటనే "ఈరోజు గుడి రాత్రి వరకూ తెరిచే ఉంటుందిటరా బాబూ! అందుకే ముందు మనం జీళ్లు కొనుక్కుదాం. లేకపోతే సాయంత్రానికి ఆ జీళ్లు సాగకుండా, మెత్తగా అయిపోయి పొడిపొడి అయిపోతాయి" అని చెప్పగానే ఇంక చేసేదేమీలేక వాళ్ళు నన్ను తిట్టుకుంటూ సైకిళ్లకు స్టాండ్ చేసి మొత్తం మీద నాతో పాటు రేవులోకి దిగారు.
అక్కడ పెద్ద పెద్ద నులకమంచాల మీద న్యూస్ పేపర్లు వేసి వాటి మీద జీళ్లు, ఖర్జూరాలు, పోకుండలు, బెల్లపచ్చులు, జంతికలు, చెగోడిలూ గుట్టలుగా వేసి అమ్ముతున్నారు. అవి చూసిన మా పకీరు ఓ కొట్టు వద్దకు వెళ్ళి, "జీళ్లు ఎంతమ్మా ?" అని అడగ్గానే ఆవిడ "సానా సవక బాబూ! అద్దణాకి రెండు అణాకి నాలుగు" అని చెప్పగానే "ఒక నాలుగు జీళ్లు ఇయ్యమ్మా" అని డబ్బులు ఇవ్వపోతుంటే నేను "ఉండవయ్యా మగడా ! ఇది పొద్దున్న సరుకు అయి ఉంటుంది. ఈ జీళ్లు సాగవు. అక్కడ చూడు. ఒకావిడ మేకుకు జీళ్ల పాకం పెట్టి, బాగా సాగదీస్తోంది చూడు, అక్కడికి వెళ్లి కొనుక్కుందాం" అని చెప్పగానే
"ఛీ ఎదవ గొల్లిగా! నీలాటోడు ఒకడు సాలు బేరాలు సెడగొట్టడానికి" అని ఆ కొట్టావిడ పెట్టిన తిట్లు తింటూ ఆ సాగే జీళ్లావిడ దగ్గరకు మా వాళ్లను తోలుకు పోయాను. అక్కడ "బాబూ! పది నిమిషాలు ఉంటారా అని ఆవిడ అడగ్గానే, మేము అలాగేనమ్మా అని, ఓ పది నిముషాలు పోయిన తర్వాత అందరం కూడా తలో నాలుగేసి జీల్లు తీసుకుని రెండు బుగ్గల్లోకి, రెండు జేబుల్లోకి తోసి అక్కడ నుంచి మా సైకిళ్లు వద్దకు బయలుదేరాం.
అక్కడే మేము ఎవ్వరూ ఊహించినటువంటి ఓ సంఘటన జరిగింది.
అక్కడ మా సైకిల్ ఉంది కానీ, మా సుబ్బరాజూ వాళ్ళ సైకిల్ కనపడలేదు. అంతా వెతికి చూసాం. కనపడిని వాళ్ళందరినీ కూడా అడిగాం. ఎవ్వరు కూడా చూడలేదన్నారు.
అప్పుడు సుబ్బరాజు "ఇదిగో కామయ్యా! ఇదంతా నీ వల్లే జరిగింది" అన్నాడు నా వైపు తిరిగి కోపంగా. అప్పుడు మా బేబీ అన్నయ్య "వాడేం చేసాడు ?" అన్నాడు అంతే సీరియస్గా, నన్ను వెనకేసుకొస్తూ. .
"ఏం చేసాడా ? బయలుదేరి నప్పటినుచి ఒకటే గొడవ. జీళ్లు జీళ్లు అని. ఎవరైనా ముందు దేవుని చూస్తారు కానీ ఇలా దిక్కు మాలిన జీళ్లు కొనుక్కోవడానికి వెళ్తారా ? ఈ సైకిల్ మా బావాజీ గారికి బాగా అచ్చు వచ్చిన సైకిల్. మా పెద బావాజీ ఈయనకు ఇచ్చారుట. ఇప్పుడు ఈ సైకిల్ పోయిందని తెలిస్తే మా బావాజీ గారు మా ముగ్గురిని కూడా ఒకే తాడుతో ఉరి వేసేస్తారు" అంటూ చాలా బాధతో వచ్చిన కోపంతో గట్టిగా చెప్పాడు.
అప్పుడు నేను, "శివయ్యా! ఇంక నన్ను నువ్వే కాపాడయ్యా. ఇదంతా నావల్లే జరిగింది. నిజమే నిన్ను చూడకుండా ఈ జీళ్లు కోసం వెళ్లడం నాదే తప్పు. ఇంక నువ్వే ఈ గండం నుంచి గట్టెక్కించు స్వామీ" అని మనసులో దండం పెట్టుకున్నా.
అప్పుడే ఓ అద్భుతమైన సంఘటన జరిగింది. ఒక పంతులుగారు సైకిల్ వేగంగా తొక్కుకుంటూ వచ్చి మా వద్ద ఆగి, సైకిల్ స్టాండ్ వేసి, "ఒరేయ్ అబ్బాయిలూ! ఈ సైకిల్ మీదేనా ? కొంచెం కడుపు ఉబ్బరంగా ఉండి, అర్జంటుగా ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. తాళం వేసి ఉండకపోవడంతో ఈ సైకిల్ తీసుకుని వెళ్లాను. ఏమీ అనుకోకుండర్రా! ఔనూ, ఇంతకీ మీరు స్వామి దర్శనం చేసుకున్నారా ? లేదా ??" అని ప్రశ్నల వర్షం కురిపించారు.
మేము,"లేదు గురువుగారూ!" అని జరిగిన సంగతులన్నీ చెప్పగానే "భలే వాళ్ళురా మీరు" అంటూ మాకు దగ్గర ఉండి ఐదు నిమిషాల్లో శివయ్య దర్శనం చేయించారు.
"శివయ్యా! ఈ రూపంలో వచ్చి నన్ను కాపాడావా ? తండ్రీ" అంటూ ఆయనకు మనసులో కృతజ్ఞతలు తెలియజేశాను.
అప్పటికే చీకటి పడడం ప్రారంభం కావడంతో మేము ఆదరాబాదరాగా తిరుగు ప్రయాణం ప్రారంభించాము.
***** ***** ***** *****
ఓ నలభై నిమిషాల సైకిల్ ప్రయాణం తర్వాత మేము ద్రాక్షారామం బోసు బొమ్మ సెంటరుకు చేరుకున్నాము. అప్పటికే బాగా చీకటి పడింది. అక్కడ ఖాకీ నిక్కరు వేసుకుని హడావుడి చేస్తున్న ఓ పోలీసును చూసి, "ఒరేయ్. అక్కడ ఎర్ర అగ్గిపెట్టి ఉందిరోయ్" అన్నాను బిగ్గరగా. అంతే అది విన్నాడో లేదో తెలియదు కానీ, ఆ పోలీసు మా సైకిల్ ఆపి,
"ఏరా! లైటు లేకుండా సైకిల్ తొక్కుతున్నావ్ ?" అడిగాడు మా అన్నయ్యను. వాడు "అంటే ఇంకా పూర్తిగా చీకటి పడలేదు కదాండీ ?" అన్నాడు జవాబుగా. అప్పుడు మా సైకిల్ నఖశిఖ పర్యంతం చూసి, "ఏరా, అసలు ఈ సైకిల్ కు డైనమో కానీ, లైటు కానీ లేవు కదరా ?
ఏం అబద్ధాలు కూడా నేర్చుకున్నారా ? పదండి స్టేషన్ కి" అంటూ మా సైకిల్ కి తాళం వేసి ఆ తాళంచెవి జేబులో వేసుకున్నాడు, మేం తెల్లబోయి వెర్రి పీనుగుల్లా చూస్తుండగా!
ఆ తరువాత మా వెనకాలే వచ్చిన సుబ్బరాజు సైకిల్ ఆపి "ఏరా! నిండా పదిహేను ఏళ్ళు లేవు. నువ్వు ఏకంగా ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నావు ? నీ పేరేమిటి ?" అడిగాడు పోలీసాయన. నా పేరు తిరుమలరాజు వెంకట సుబ్బరాజు. వీళ్లిద్దరూ మా తమ్ముళ్లు. మేము ఐదుగురూ కోటిపల్లి వెళ్లి వస్తున్నాం" చెప్పాడు రాచఠీవితో. "సరే, ఇవన్నీ ఎస్సై గారికి చెబుదురు గాని. నడవండి స్టేషన్ కు" అంటూ అక్కడే వున్న ఓ రిక్షా అతనితో "ఒరేయ్ భీముడూ! ఈ రెండు సైకిళ్లు స్టేషన్ వద్దకు తీసుకుని రా. వీళ్ళని నేను తోలుకొని వస్తా" అని మమ్మల్ని తీసుకుని పోలీసు స్టేషన్ వద్దకు నడక ప్రారంభించాడు.
మార్గం మధ్యలో మా సుబ్బరాజు తిన్నగా ఉండకుండా "ఇదిగో యాండీ! మేము ఎవరో తెలుసా ? ఎమ్మెల్యే బిరుదా పకీర్రావు గారి బంధువులం" చెప్పాడు గొప్పగా. వెంటనే ఆ పోలీసాయన "మరి చెప్పవేరా ? ఇప్పుడు ఆయన మన స్టేషన్ లోనే ఉన్నారు. రండి అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం" అని కొంచెం వెటకారంగా అనేటప్పటికి ఇంక ఏమీ మాట్లాడకుండా మా సుబ్బరాజు మౌనంగా ఉండి పోయాడు. అప్పుడు నేను సుబ్బరాజు వంక కోపంగా చూసి,
"యాండీ పోలీసు గారూ! పోనీ ఆ ఎమ్మెల్యే గారి గురించి వదిలేయండి. మేము కోటిపల్లి తీర్థం నుంచి వస్తున్నాం. కావాలంటే ఇవిగో జీళ్లు, ఇవి తీసుకుని మమ్మల్ని వదిలేయండి" అంటూ జేబులో జీళ్లు ఆయనకు చూపించాను.
"అలాగే తీసుకుంటాలేరా పండు కోతీ!" అంటూ
అంటూ నా డిప్పమీద రెండు పీకి, ఆ తరువాత స్టేషన్ లో ఎస్సై ముందు మమ్మల్ని హాజరు పరిచాడు.
ఆ తర్వాత ఆ నిక్కరు పోలీసాయన చెప్పిందంతా విన్న ఎస్ఐ గారు, సుబ్బరాజు వైపు తిరిగి,
"ఏరా! మీరేమో రాజులు. ఆ ఫకీర్ రావు గారు ఏమో కాపులు. నీకు ఆయన బంధువులు ఎలా అవుతార్రా ?" అని తర్వాత నా వైపు తిరిగి "ఒరే నా ఫాంట్ అంత లేవు మా పోలీసు కే లంచం ఇస్తా అంటావా ?" అని "ఏయ్ శివా! వీళ్ళని తీసుకెళ్లి ఆ పిక్ పాకెట్ పాపారావు గాడు ఉన్నాడు కదా ? వాడి సెల్ లో పడేయండి" అంటూ ఆ సెల్ వైపు చూపించాడు. అక్కడ నీలం రంగు బొందులాగు, ఎర్రటి బనీను వేసుకుని నల్లగా ఉన్న ఓ వ్యక్తి లోపలి నుంచి "తమ్ముళ్లూ! లోపలికి రండి, ఇక్కడ బాగానే ఉంటుంది రాత్రి అంతా మనం జాగారం చేద్దాం!" అంటే మమ్మల్ని రెచ్చగొట్టాడు. నాకు వెంటనే భయమేసి,
"వద్దు, మేము ఆ గదిలో ఉండం. మాది చాలా పెద్ద కుటుంబం. మా నాన్నగారు డాక్టర్ గారు ఆయనకి విషయం తెలిస్తే మిమ్మల్ని కోప్పడుతారు" అని సీరియస్ గా చెప్పగానే ఆ ఎస్ఐ గారు "అవునా ? వాడేమో ఎమ్మెల్యే గారు చుట్టం. నువ్వేమో డాక్టర్ గారి చుట్టం. మీరు చెప్పింది భలే బాగుందిరా. ఇదిగో వీళ్లందర్నీ తీసుకెళ్లి తాళ్లపొలంలో మూడు మర్డర్లు చేసాడు చూడు, వాడి రూమ్ లో పడేయ్ తీసుకెళ్లి" అనగానే నాకు ఇంకా భయం వేసేసి అప్పుడు దేవుని తలుచుకున్నాను "శివయ్యా ఇంక నువ్వే కాపాడయ్యా" అని! అప్పుడు నాకు ఆ మహా శివుడు ఒక సీసా రూపంలో ప్రత్యక్షమయ్యాడు.
అప్పుడు నేను ఎస్ఐ గారి టేబుల్ మీద ఉన్నటువంటి ఒక సీసాను చూపిస్తూ,
"ఇది మా నాన్నగారు తయారు చేసినటువంటి చ్యవన ప్రాశ్య లేహ్యం. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది ?" అని అడిగాను. అప్పుడు ఎస్ఐ గారు నా వైపు చూస్తూ "ఇంతకీ మీరు ఎవరురా ? మీ నాన్నగారు ఏం చేస్తుంటారు ?" అని అడగగానే నేను "మా నాన్నగారి పేరు డాక్టర్ బుద్ధవరపు సూర్యనారాయణ రావు గారు. మాది జగన్నాధగిరి" అని చెప్పగానే "ఒహో అలాగా! అదీ తేలుస్తా!" అని కానిస్టేబుల్ ను పిలిచి అతని చెవిలో ఏదో చెప్పాడు. అప్పుడు ఆ కానిస్టేబుల్ "రండి. బయటకు వెళ్దాం. అక్కడ తేలుద్దాం" అని చెప్పి మమ్మల్ని తీసుకొని ఆ స్టేషన్ నుంచి బయటకు వచ్చాడు.
అక్కడి నుంచి మా ప్రయాణం మొదలైంది కానీ మా గుండెల్లో గుబులు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు ? ఒకవేళ మా ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో వాళ్ళకి జరిగిన విషయం చెప్పేస్తారని భయంతోనే వాళ్ళ వెనకాల సైకిల్ తొక్కుకుంటూ బయలుదేరాం. అయితే వాళ్ళు మమ్మల్ని మా జగన్నాధగిరి వైపు తీసుకుని వెళ్లడంతో కొంచెం ఊపిరి పీల్చుకున్నాం.
ఇంక వేరే దారి లేక ఆ పోలీసులను మా ఇంటి వరకూ తీసుకుని వచ్చాము. అప్పటికే మా అమ్మగారు మా గురించి అరుగు మీద నిలబడి పడిగాపులు కాస్తున్నారు. మమ్మల్ని చూసి,
"మీ మొహాలు మండా! ఇంతవరకూ ఎక్కడ తగలడ్డారు ? ఇక్కడ భయపడి చస్తున్నాం" అంటూ అష్టోత్తరం లాంటి తిట్టోత్తరం మొదలు పెట్టి, మా వెనకాలే ఉన్న పోలీసులను చూసి,
"ఏమండోయ్! వీళ్ళు ఏదో కొంపలు మునిగే వ్యవహారం చేసి వచ్చినట్లున్నారు. పోలీసులను కూడా వెంట బెట్టుకుని మరీ వచ్చారు" అంటూ మా నాన్నగారి గదిలోకి వెళ్లి మరీ చెప్పింది.
ఈలోగా ఆ ఇద్దరు నిక్కరు పోలీసులు మా వైపు ఓసారి చూసి, మా నాన్నగారి గదిలోకి వెళ్లారు.
మేము బిక్కు బిక్కు మంటూ అరుగు మీద నిలబడి పోయాము. నేను మాత్రం "శివయ్యా కాపాడయ్యా. నువ్వే మమ్మల్ని గట్టున పడేయవయ్యా" అని మనసులో అనుకున్నా.
ఓ ఐదు నిమిషాలు తరువాత ఆ పోలీసులు బయటకు వెళ్తూ "ఈసారి ఇలాంటి పిచ్చి వేషాలు, అబద్ధాలు ఆడితే మటుకు జైల్లో పెట్టేస్తాం. అర్థం అయిందా ?" అడిగారు నవ్వుతూ. "అర్థం అయిందండీ. ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయమండి" అంటూ బుద్ధిగా చేతులు కట్టుకుని మరీ చెప్పాము. "అదీ గుడ్ బాయ్స్ అంటే అలా ఉండాలి" అని చెప్పి వాళ్ళిద్దరూ తిరిగి వెళ్ళి పోయారు.
ఈలోగా "ఒరే కాముడూ!" అంటూ నాన్నగారి పిలుపు వినబడింది. నేను భయపడుతోంటే
"వెళ్ళు. ఏమీ పరవాలేదు. ఒకవేళ ఏదైనా అడిగితే మొత్తం జరిగింది అంతా చెప్పేయ్. దెబ్బలు కొడితే నీకు తోడుగా మేము ఉంటాం" అంటూ ధైర్యం చెప్పి, మిగతా నలుగురు నన్ను బలవంతంగా లోపలికి తోసారు. భయపడుతూ లోపలికి అడుగు పెట్టిన నేను
"చెప్పండి నాన్నా! ఎందుకు నన్ను పిలిచారు ?" గూటిలో మందులు సర్దుతున్న నాన్న గారిని అడిగాను. వెంటనే ఆయన తల తిప్పి నా వైపు చూసి,
"మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడి పరిసరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. అది చాలా మంచి పద్ధతి. ఎస్సై గారి టేబుల్ మీద ఉన్న ఆ లేహ్యం సీసా చూసి, అది నేను తయారు చేసానని ఎస్సై గారికి నువ్వు చెప్పావుట కదా ? ఆ మందు ఆయనకు ఎవరో ఇచ్చారుట. అది బాగా పని చేసిందిట. నువ్వు చెప్పిన తరువాత, నన్ను అడిగి ఇంకో సీసా తెమ్మని, అలాగే చీకటి పడింది కాబట్టి మిమ్మల్ని మన ఇంటి దగ్గర జాగ్రత్తగా దింపి రమ్మని ఆ పోలీసులను ఎస్సై గారు పంపారుట..."
నాన్న గారు చెప్పింది విన్నాక "శివయ్యా నువ్వు ఉన్నావయ్యా" అంటూ ఆ శివయ్యకు
మనసులో దణ్ణం పెట్టుకున్నా, బయట నిలబడి నాన్నగారు చెప్పింది విన్న ఆ నలుగురు ఆనందంగా గంతులు వేస్తుండగా!
***** **శివార్పణం** *****
No comments:
Post a Comment