🌸🌹🌸
*తెలివైన కోడలు*-
భారతి రామచంద్రుని
‘‘కాస్త కూడా నమ్రతా మర్యాదా లేదమ్మా... ఎలా పెంచుతారో ఏమో. అడిగిన దానికి పుల్ల విరిచినట్లు సమాధానాలు చెప్తుంటారు ఈ కాలం పిల్లలు. ఏం నేర్చుకుని వస్తారో’’ మూతి మూడు వంకర్లు తిప్పుతూ జనాంతికంగా మాట్లాడుతోంది మహలక్ష్మమ్మ.
‘‘ఎవరినే అమ్మా... శ్లేషార్థాలతో ఆడుకుంటున్నావు?’’ అప్పుడే ఇంట్లోకి వచ్చిన కొడుకును చూసి గతుక్కుమంది మహలక్ష్మమ్మ.
‘‘శృతిని గురించిలేరా... ఏదో గుర్తుకువచ్చి అనుకుంటున్నాను.’’
‘‘సరేలే, ఎవరి గురించి అయితే నాకెందుకుగానీ నా కాఫీ నాకిచ్చెయ్’’ నాటకీయంగా అంటూ తన రూములోకి వెళ్ళాడు.
మంచంమీద కూర్చున్న స్వాతి కళ్ళలో నీళ్ళు ఉబుకుతున్నాయి. సుధీర్‌ను చూసి ముఖం పక్కకు తిప్పుకుంది కన్నీళ్ళు కనిపించకుండా.
సుధీర్ ఫ్రెష్ అయి వచ్చి స్వాతికి ఎదురుగా కూర్చున్నాడు. చుబుకం పట్టి బతిమాలుతూ, ‘‘అమ్మ మాటలు పట్టించుకోకు స్వాతీ. ఆవిడ ఎప్పుడూ ఎదుటివారిని
ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. నిజంగా నీలో తప్పు ఉండికాదు. అనడం ఆమె మానియా... అంతే. అందుకే నువ్వు పట్టించుకోవద్దు అంటాను.’’
తలూపి కళ్ళు తుడుచుకుని లేచింది స్వాతి. స్వాతి పెద్ద కలివిడిగా ఉండదు. అడిగిన వాటికి సమాధానాలు చెబుతుంది. చొచ్చుకుపోయి గలగల మాట్లాడటం చేతకాదు. అన్ని పనులూ వచ్చు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తుంది. ఎవరైనా అనవసరంగా మాట అంటే చాలా రోషపడుతుంది, బాధపడుతుంది. పుట్టింట్లో కూడా అంతే. ఊహ తెలిసినప్పటినుండి అమ్మానాన్నల చేత ఒక్క మాట కూడా అనిపించుకోలేదు. పద్ధతిగా ఉంటుంది. అందరూ ‘స్వాతి బంగారు తల్లి, స్వాతిముత్యమే’ అంటారు. మితభాషి.
తనకు నచ్చితే స్మితభాషి కూడా.
పెళ్ళయి నాలుగు నెలలు అవుతోంది. సుధీర్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తాడు. స్వాతికి బీటెక్ అయిపోగానే మంచి సంబంధం అని పెళ్ళి చేశారు. సుధీర్‌కు
ఒక తమ్ముడు, చెల్లి. ‘ఉద్యోగం ఇష్టముంటే చెయ్యి, లేకపోతే బలవంతం లేదు’ అన్నారు. అత్తారింటికి వచ్చిన రెండు నెలల్లోనే అత్త చుక్కలు చూపిస్తోంది. ఏదో ఒక వంక పెట్టి సూటిపోటి మాటలంటుంది. తనను పరోక్షంగా అంటుంది. కూతురు శృతినైతే డైరెక్టుగానే వాయిస్తుంటుంది. ఆ పిల్ల లెక్క చెయ్యదు. ఎక్కడివక్కడ వదిలేసి పోతుంటుంది. స్వాతి ఇల్లంతా నీట్‌గా సర్ది పెడుతుంటుంది. శృతికి- వదిన స్వాతి అంటే చాలా ఇష్టం. అమ్మ తనను తిట్టినా ఊరుకుంటుందిగానీ స్వాతినేదయినా అంటే అస్సలు ఒప్పుకోదు. మరిది సురేష్ కూడా వదినంటే చాలా గౌరవంగా ఉంటాడు. ముగ్గురూ దగ్గర దగ్గర ఒకే వయసు వాళ్ళవడంతో కబుర్లు చెప్పుకోవడం, ఏవైనా గేమ్స్ ఆడుకోవడం చేస్తుంటారు. స్వాతి పెద్దగా మాట్లాడదు. అన్నాచెల్లెళ్ళ కబుర్లు ఎంజాయ్ చేస్తుంటుంది.
మహలక్ష్మమ్మకు ఇది సుతరామూ ఇష్టముండదు. కోడలు రిజర్వుడుగా ఉంటుందనీ పొగరు అనీ ఆమె భావన. స్వాతిలో ఏదో ఒక లోపం వెతుకుతూనే ఉంటుంది. సరిగ్గా సమాధానం చెప్పదని దెప్పుతుంటుంది. ఆవిడ అలా మాట్లాడుతుంటే స్వాతి భరించలేకపోతోంది. బాధతో కోపంతో ఉక్కిరిబిక్కి
రవుతోంది. ఆ మాట్లాడే ఒక మాట కూడా మానేసి సైలెంటైపోతోంది.
స్వాతికి అత్తగారు పెట్టే నస విసుగొస్తోంది. ఉద్యోగం వెతుక్కుని బయటికెళితే ఈ గొడవ వదులుతుందని జాబ్స్‌కు అప్లై చేయడం మొదలుపెట్టింది.
ఆ రోజు సుధీర్ తోడురాగా ఇంటర్వ్యూకెళ్ళింది స్వాతి. తీరా లోపలికెళ్ళే సమయానికి తల తిరిగి వాంతి చేసుకుంది. సుధీర్ కంగారు పడిపోయి అటునుండటే హాస్పిటల్‌కు తీసుకెళ్ళాడు. లేడీ డాక్టర్ చెక్ చేసి స్వాతి ప్రెగ్నెంట్ అని చెప్పింది.
ఇక ఆరోజు ఇంటిల్లిపాదికీ ఆనందం అవధులు దాటింది. శృతి స్వీట్లు పంచి సెలబ్రేట్ చేసింది.
మహలక్ష్మమ్మ కోడలిని కాలు కదపనీయకుండా టైముకు భోజనం, ఇష్టమైనవన్నీ అడిగి చేసి, తినిపించడం చేస్తోంది. అంతటితో ఊరుకుంటుందా... అన్నీ తను చెప్పినట్లే చెయ్యాలి. తను పెట్టినట్లే తినాలి. కూర్చోకూడదు నిలబడకూడదు. సహించకపోయినా తిని తీరాలి. తినకపోతే బిడ్డ ఎలా ఎదుగుతుంది అంటూ సతాయింపు. ఆమె అతి జాగ్రత్త భరించడం కూడా కష్టమే అయింది స్వాతికి. సురేష్, శృతీ వదినను అపురూపంగా చూస్తున్నారు. స్వాతికి ఇదో సరికొత్త అనుభవంలా ఉంది. ఉద్యోగం సద్యోగం అటకెక్కాయి. మొదటి నుండీ స్వాతికి ఉద్యోగం చెయ్యాలని పెద్ద ఇంట్రెస్టు లేదు.
మూడోనెలలో స్వాతి పుట్టింటికి పోయి వచ్చింది. ఏడో నెలలో సీమంతం చేసి పురిటికి తీసుకెళ్ళారు.
* * * * *
స్వాతికి బాబు పుట్టాడు. అందరూ స్వాతి పుట్టింటికి వెళ్ళి బారసాల చేసుకుని వచ్చారు. బాబు నెత్తుకుని సారెతో వచ్చింది స్వాతి మూడవనెల వెళ్ళేలోపు.
సురేష్‌కు ఈ లోపల కొన్ని సంబంధాలు చూశారు. చివరకు వాళ్ళుండే సిటీలోనే అమ్మాయి కుదిరింది. అంగరంగ వైభవంగా పెళ్ళి జరిగింది. అమ్మాయి తరఫు వారికి ఫ్యాషన్లు బాగా ఎక్కువ. కింద చూపులేదు. హైఫైగా ఉన్నారు. వాళ్ళే నాగరికత తెలిసినవారన్నట్లు పెద్ద బిల్డప్.
ఊర్లోనే కాబట్టి పెళ్ళైన వారం లోపల ఒకరోజు వియ్యాలవారిని భోజనానికి ఆహ్వానించారు. అన్నీ తెప్పించిన బాపతే. వడ్డనకు స్పూన్లు. గిన్నే స్పూనూ పట్టుకుని ‘వెయ్యనా వెయ్యనా’ అంటారు. స్పూనుతో ఎంత కూర పడుతుంది? అందరూ మొహమాటానికిపోయి అర్ధాకలితో తిరిగొచ్చారు.
ఇంటికొచ్చి శృతి, సుధీర్, వాళ్ళ నాన్నగారూ ఒకటే నవ్వుకోవడం. ఆకలి తీరక ఉప్మా చేయించుకుని తిన్నారు. మహలక్ష్మమ్మకు ముఖం చిన్నబోయింది. ‘సురేష్ అక్కడే ఉండిపోయాడు. అది కొంత నయం, వీళ్ళ మాటలు వినలేదు’ అనుకుంది.
కొత్తకోడలు వచ్చింది. వాళ్ళ వదినా అన్నా అక్కలూ తీసుకొచ్చి దింపారు. అందరూ మహలక్ష్మమ్మగారిని ఆకాశానికెత్తి పట్టారు. ఆమె వంటను తెగ మెచ్చుకుంటూ సుష్ఠుగా భోజనాలు చేశారు. ఆమెకూ వాళ్ళ ఫ్యాషన్లూ గొప్పలు చెప్పుకోవడం బాగా నచ్చినట్లుంది. ‘వాళ్ళతో ఎంత ఇష్టంగా మాట్లాడుతారో, అదే మా వాళ్ళతో అంటీ ముట్టనట్లు ఉంటారు’ అనుకుంది స్వాతి.
మరునాడు స్వాతి ఉదయాన్నే లేచి తన రొటీన్ వర్కులోకి దిగింది. సైలెంట్‌గా పని చేసుకుంటూ పోతోంది. కొత్తకోడలు రూప మెల్లగా ఎనిమిదింటికి లేచి తన రూములోనే ఫ్రెష్ అయి మేకప్‌తో బయటికొచ్చింది. అత్తగారు కాఫీ ఇచ్చింది ఆప్యాయంగా.
‘‘అబ్బ, ఎంత బాగుందండీ అత్తయ్యగారూ కాఫీ! ఎలా చేశారు?’’ అనగానే ఇంకో కప్పు అందించింది మహలక్ష్మమ్మ ఉబ్బితబ్బిబ్బవుతూ. ఆ కప్పూ ఖాళీ చేసి అత్తగారికి వాళ్ళ ఇంటి ముచ్చట్లు చెబుతూ కూర్చుంది.
ఊర్లోనే పుట్టిల్లు కావడంతో అటూ ఇటూ తిరుగుతుంటుంది చిన్న కోడలు. వచ్చినప్పుడల్లా అక్క కూతుళ్ళనో అన్న పిల్లలనో తీసుకొస్తుంది.
‘‘అత్తయ్యగారూ, మొన్న మీరు బిర్యానీ చేశారు కదా. మా అక్క పిల్లలు ఎంత బావుందని చెప్పుకున్నారో. హోటల్ స్టైల్లో చేశారట రూప అత్తగారు అని మా ఇంట్లో అందరూ అనుకోవడమే’’ అంటూ అత్తగారిని మునగచెట్టు ఎక్కించేస్తుంది రూప.
‘‘అయ్యో, దానికేం భాగ్యం... సండే రమ్మను, మళ్ళీ చేసి పెడతాను.’’
‘‘మీరు చాలా ఫాస్ట్‌గా కూడా చేస్తారండీ ఏ పనైనా. మా అందరికంటే మీరే యాక్టివ్‌గా ఉంటారు’’ రూప మాటలకు విస్తుపోతోంది స్వాతి. ‘అత్తగారితో ఇలా కూడా మాట్లాడవచ్చా’ అనుకుంది.
అలా అత్తగారిని సమయస్ఫూర్తితో బుట్టలో వేసేసింది. చిన్నకోడలు ఏ పనీ చెయ్యకపోయినా కూర్చుని చేయించుకు తిన్నా అవేవీ మహలక్ష్మమ్మకు ఎక్కడం లేదు. రూప బంధువర్గం వచ్చిపోతుంటే వారికి మర్యాదలు చేస్తున్నా- వెనకటిలా- కోడలు తరఫువారికి చేస్తున్నాననే చిరాకు ఉండటం లేదు. అదే స్వాతి అమ్మా నాన్నా వస్తే వియ్యపురాలి టెక్కు చూపించేది. స్వాతిలో ఏదో ఒక లోపం వెతికి వాళ్ళ అమ్మకే నేరాలు చెప్పేది.
రూప తనను విమర్శించే ఛాన్సే ఇవ్వడంలేదు. ముందుగానే ఊహించి తగినట్లు మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేస్తుంది. ‘అత్తయ్యగారూ’ అంటూ ఆప్యాయత ఉట్టిపడేలా పిలుస్తుంటుంది అస్తమానం.
రూప ఉద్యోగం చేస్తోంది. ఇంటినుండే పని చేస్తోంది. బయట ఉన్న కాసేపూ అత్తగారితో గలగలా మాట్లాడుతూనే ఉంటుంది. మిగిలిన టైమంతా సిస్టమ్ ముందు పెట్టుకుని కూర్చుంటుంది.
స్వాతి కొడుకును బాగా ముద్దు చేస్తుంది రూప. వాడిని తన దగ్గరే కూర్చోబెట్టుకుని ఆడిస్తుంటుంది. స్వాతికి చాలా రిలీఫ్‌గా ఉంటోంది పని చేసుకోవడానికి.
శృతికి చదువులో హెల్ప్ చేస్తుంది. ఫ్యాషన్ డిజైన్స్ గురించి చర్చలు పెడుతుంది. సుధీర్‌తో కూడా చక్కగా కలుపుగోలుగా ఉంటుంది. ‘బావగారూ’ అంటూ కబుర్లు చెబుతుంది. మామగారిపట్ల గౌరవం చూపిస్తుంది. కామ్‌గా ఉంటుందనీ తనపని తాను చేసుకుపోతూ ఏ విషయాలూ పెద్ద పట్టించుకోదనీ స్వాతి అంటే రూపకు ప్రత్యేకమైన అభిమానం. సొంత అక్కలా ప్రేమ చూపిస్తుంది. అత్తగారు వినకుండా స్వాతిని మెచ్చుకుంటుంటుంది.
సంక్రాంతి పండుగ వచ్చింది. కొత్తకోడలు వచ్చిందనీ మనవడు పుట్టాడనీ- పండుగ గ్రాండ్‌గా తమ ఇంట్లోనే చేసుకోవాలని- కోడళ్ళను పుట్టిళ్ళకు పంపించనని కబురు చేసింది వియ్యాలవారికి మహలక్ష్మమ్మ.
‘‘మంచి పని చేశారు అత్తయ్యగారూ. ఇప్పటివరకూ అక్కడేగా ఉన్నాం. ఈ పండుగకు ఇక్కడే ఎంజాయ్ చేద్దాం. షాపింగ్‌కు ఎప్పుడు వెళ్దామండీ?’’ అంది ఉత్సాహంగా రూప.
‘ఈ అమ్మాయికి ఎన్ని కళలు బాబూ! ఎవరికి తగినట్లు వారితో మాట్లాడుతుంది. అత్తగారికి సరైన కోడలు దొరికింది’ అనుకున్నారు శ్రీధరరావుగారు.
‘‘మీరు వెళ్ళి డ్రెస్సులు తెచ్చుకోండి. శృతిని కూడా తీసుకెళ్ళండి’’ అంటూ భర్తనడిగి పదివేలు తెచ్చి ఇవ్వబోయింది మహలక్ష్మమ్మ.
‘‘మీరూ రావలసిందే. మీకూ చీర కొనాలిగా. పైగా మీ సెలెక్షన్ చాలా బావుంటుంది. మీ చీరల కలర్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి’’ అంటూ పొగిడేసరికి మహలక్ష్మమ్మ కాదనలేక తనూ కదిలింది. ఆడవాళ్ళంతా షాపింగ్‌కు బయలుదేరారు.
పండుగ మూడురోజులు ఎంతో సందడిగా జరుపుకున్నారు. రూప వచ్చిన దగ్గరనుండి స్వాతిని ఏమీ అనలేకపోతోంది మహలక్ష్మమ్మ. అసలు తప్పులు వెతికే అవకాశం రావడంలేదు. ఇంట్లో వాతావరణమే మారిపోయింది. తను ఇంతకు ముందులా సాధిస్తే చిన్న కోడలు ఏమనుకుంటుందో అని క్రమేణా తన ధోరణి మార్చుకుంటోంది.
‘‘అత్తయ్యగారూ, వరల్డ్ ఫేమస్ ఇంగ్లిష్ మూవీ వచ్చిందండీ... వెళదామా?’’
అడిగింది రూప.
‘‘నాకంతగా అర్థంకాదులేమ్మా. హిందీ అన్నా అయితే కాస్త చూస్తాను’’ అంది మహలక్ష్మమ్మ.
‘‘నేను పక్కనే ఉంటానుగా. చెప్తుంటాలెండి.’’
‘‘లేదులే, మీరు వెళ్ళి రండి.’’
‘‘బావగారూ, అందరం వెళదామండీ... అక్కా మీరూ శృతీ కూడా.’’
‘‘ఓకే’’ అన్నాడు సుధీర్.
‘‘వీడు చూడనివ్వడు రూపా. నేను రానులే’’ అంది స్వాతి.
‘‘అత్తయ్యగారు ఎలాగూ రానంటున్నారు కదా. బాబు తన దగ్గర ఉంటాడ్లే. ఏమంటారు అత్తయ్యగారూ’’ అనేసింది అత్తగారిని చూస్తూ చొరవగా.
స్వాతికి భయం వేసింది ఆమె ఏమంటుందో అని.
రూప అడిగిన తీరుకు ఏమీ అనలేకపోయింది మహలక్ష్మమ్మ.
సుధీర్ ఆశ్చర్యంగా చూశాడు తల్లివైపు.
‘‘అత్తయ్యగారూ, మీకూ మామయ్యగారికీ టిఫినే కదా, ఆర్డర్ పెడతానండీ. మీరు హాయిగా టీవీ చూస్తూ రిలాక్స్ అవండి. మేము మాల్‌లో తినేసి వస్తాం’’ నార్మల్‌గా చెప్పేసి అందరినీ బయలుదేరదీసింది రూప.
సురేష్‌కు చిత్ర విచిత్రంగా ఉంది. ఇన్నాళ్ళూ వదినను చూశాడు. ఇప్పుడు భార్యను చూస్తున్నాడు. ‘ఎంత వ్యత్యాసం’ అనుకోకుండా ఉండలేకపోయాడు. కాస్త గర్వంగా కూడా అనిపించింది భార్య నేర్పరితనానికి.
‘‘చూసి నేర్చుకో సీతమ్మ తల్లీ’’ అంటూ స్వాతితో పరాచకమాడింది శృతి.
‘‘హ్యాట్సాఫ్ రూపా... నిజంగా నీ సమయస్ఫూర్తీ తెలివీ చక్కని మాటతీరూ అందరికీ రావు. ఎప్పటికెలా మాట్లాడాలో ఎవరితో ఎలా మెలగాలో నీకు బాగా తెలుసు. అత్తగారిని ఎంతలా మార్చేశావు...’’ తోడికోడలి వైపు అభినందనగా చూస్తూ- మనసులో అనుకుంది స్వాతి.
👉 Collected by : @Sairam
🌹🌺🌹
No comments:
Post a Comment