పక్షులు
పి.వి.ఆర్. శివకుమార్
బీసెంట్ రోడ్డుమీద నడుస్తున్నాడు కపర్ది. రోడ్డు కనపడనంతగా దుకాణాలు. చిన్నవీ, అతి చిన్నవీ, రోడ్డువారన పేవ్మెంట్ మీదా, రోడ్డుపై చక్రాల బళ్ళమీదా, రకరకాల వస్తువులు అమ్ము కుంటూ... మనుషులు నడవటానికి దారి దొరకనంత ఇరుకుగా! “తన చిన్నప్పుడు ఈ రోడ్డు ఇలా లేదు . అనుకున్నాడు. అరవైలలో బీసెంట్రోడ్డు విజయ వాడలో ఒక డీసెంట్ రోడ్డు. పట్నంలోకెల్లా పెద్ద బిజినెస్ సెంటర్. ఇప్పుడానాటి హోదా, హుందాతనం లేవు. అంతకు వందలరెట్లు పోష్ బిజినెస్ కాంప్లెక్సులు, మాల్స్ నగరంలో అవ తరించాయి. బీసెంట్రోడ్డును చిన్న, అతిచిన్న వ్యాపా రులకు వదిలివేశాయి.
నెమ్మదిగా నడుస్తూ, రోడ్డు చివరదాకా వచ్చి, రాఘవయ్య పార్క్ దగ్గర బందర్ రోడ్డు చేరుకున్నాడు కపర్ది. రోడ్డుదాటి, పేవ్మెంట్ మీద నడుస్తూ కో ఆపరేటివ్ బ్యాంక్ చేరుకున్నాడు. దారి పొడుగునా కాలవగట్టు కనబడకుండా, అంగు ళం జాగా వదలకుండా ఏవో కట్టడాలు. కపర్దికి తన బాల్యం కళ్ళముందు కట్టింది. బ్యాంక్ కట్టినంతమేరా వదిలేసి, మిగతా ఖాళీలోనుంచి కన బడుతూ అప్పటి బందరు కాలువ గట్టు. నీళ్ళులేని కాలువలో నిండుగా ఇసక. కపర్ది కళ్ళముందు తెర కప్పిన స్మృతుల మసక..
ఆ కాలంలో రాఘవయ్యపార్కు దగ్గరనుంచీ, కో ఆపరేటివ్ బ్యాంక్ దాకా, మళ్ళీ బ్యాంక్ నుంచి రామమోహన లైబ్రరీ బిల్డింగ్ కా మధ్యభాగం అంతా ఖాళీగా, బందరు కాలవగట్టు కనబడుతూ వుండేది. వేసవికాలంలో బందరు కాలువ ఎండిపోయేది. ఆ ఇసుకలోనుంచి నడుచుకుంటూ, వారాల వారిళ్ళలో భోజనాల కోసం కృష్ణలంక వెళ్ళేవాడు కపర్ది. వారంలో నాలుగురోజుల భోజన సదుపాయం కృష్ణ లంకలోనే నలుగురి ఇళ్ళలో ఉండేది. మరొకరోజు చుట్టుగుంటలో ఒక లెక్చరరుగారి ఇంటికి వెళ్ళేవాడు. శనివారం ఉపవాసం. ఆదివారం ఎక్కడ దొరకలేదు. అతడి మేనమామ భాస్కర శాస్త్రి యాయవారంచేసి, దానాలు పట్టి తెచ్చిందేదో ఉడకేసి, ఆదివారాలు తమతోపాటు పెట్టేది అతడి అత్త సుందరమ్మ. చెట్ల బజారులో ఒక చిన్న ఇంట్లో అద్దెకి ఉండే వాడు భాస్కర శాస్త్రి.
తన ఆరవ ఏటనుండీ కపర్ది మేనమామ దగ్గరే పెరిగాడు. కపర్ది తండ్రి పవనశాస్త్రి. కైకలూరు దగ్గర ఒక పల్లెటూరు. కొద్దిపాటి పొలం ఉంది ఆయనకి. వృత్తిగా పౌరోహిత్యంతో చేస్తున్నాడు. అయినా, పెద్ద కుటుంబం తల్లిదండ్రులు, భార్య, నలుగురు సంతానంతో ఆయన పడుతున్న అవస్థలు చూసి, పెద్దవాడైన కపర్దిని తమ దగ్గరే పంపమని అడిగాడు బావమరిది భాస్కర శాస్త్రి. "నాకు ఎటూ పిల్లలు లేరుకదా. వీడిని తీసుకువెళ్ళి, నా దగ్గరే పెంచుతాను. మెళ్ళో ఓ జందెం పోగువేసి , నాతో తిప్పుకున్నా, క్రమం తప్పకుండా నోట్లోకి నాలుగుమెతుకులు వెళతాయి. మాకు ఒకతోడు గానూ ఉంటాడు. ఇక్కడ నీకు ఆ మాత్రం భారమైనా తగ్గుతుంది" దత్తత అనేమాట ఎత్తకుండా తెలివిగా చెప్పాడు భాస్కర శాస్త్రి. "వాడికి నా దగ్గర బాగా మాలిమి. నన్ను విడిచి ఉండలేడేమో!" రాముడిని కోరిన విశ్వామిత్రుడినా దశరథుడు చూసిన చూపు చూస్తూ, పెద్ద కొడుకును విడిచి, తను వుండలేడన్న విషయం నేరుగా చెప్ప కుండా, నెపం కొడుకుమీద పెట్టేస్తూ అన్నాడు పవన శాస్త్రి.
"నేను ఉంటాను" అనేశాడు కపర్ది, ఉలిక్కిపడ్డ తండ్రినీ గుడ్లనీరు కుక్కుకుంటున్న తల్లినీ పట్టించు కోకుండా! లేమిని మించిన దురదృష్టం భూమ్మీదలేదు. రెండుపూటలా అన్నం దొరుకుతుందన్న ఆశ, పట్న జీవితం మీది వ్యామోహం ఆ చిన్నారి మనసులో తండ్రి మీది ఇష్టాన్ని, అమ్మనీ, తమ్ముళ్ళనీ వదిలి వెళ్ళాలన్న బెంగనీ మింగివేశాయి.
నిమిదేళ్ళ వయసులో విజయవాడ చేరాడు కపర్ది. అతడిని తనతోపాటు తిప్పుతూ, బ్రహ్మచారి అవసరం ఉండే వ్రతాలకీ, దానాలు పట్టే క్రతువులకీ తీసుకువెళ్ళేవాడు భాస్కర శాస్త్రి. అలాగే, పదిమందితో మాట్లాడి, అయిదిళ్ళలో వారాలు కుది ర్చాడు. ఇదంతా కొన్నినెలలే సాగింది. ఈరకమైన జీవితం కపర్దికి రుచించలేదు. వారా లకివెళ్ళే ఇళ్ళలోని పిల్లలని చూస్తుంటే, అతడికి తను కూడా చదువుకోవాలన్న కోరిక మొలకెత్తింది. చదువు కుంటేనే ఎప్పటికయినా జీవితం దశ మారుతుంది. లేకుంటే, తను తండ్రిలాగే, మేనమామలాగే పౌరోహి త్యమో, యాయవారాలో చేసుకుబతకాల్సిందే! అనుకున్నాడు. వారంలో ఒకరోజు భోజనానికివెళ్ళే లెక్చరర్ గారి ఇంటి వాతావరణం, ఆ ఇంట వీచే విద్యాగంధం, అతడి మీద మరింత బలమైనప్రభావం చూపాయి."నేను బళ్ళో చేరుతాను. చదువుకుం టాను" అన్నాడు ఒకరోజు మేనమామతో.
"మంచి ఆలోచనే. వేదం నేర్పే పాఠశాల దగ్గరలో ఉందేమో కనుక్కుంటాను" అన్నాడు భాస్కర శాస్త్రి.
"నేను మామూలుచదువులు చదువుకుంటాను. మన వీధి చివరే వున్న అరండల్ సత్రం బళ్ళో చేరతాను " అన్నాడు కపర్ది. భాస్కర శాస్త్రి విస్తుపోయాడు. "ఈ కొద్ది నెలలలోనే వీడు, స్వంత నిర్ణయాలు తీసుకునేటంతగా తెలివిమీరిపోయాడా!"
సుందరమ్మ కపర్దిని బలపరిచింది. “వీడు చదువుకొని, ఉద్యోగం చేస్తేనే, రేపు మనకి ఆసరాఅవుతాడు. లేదంటే, ఎప్ప టికీ మనకీ అత్తెసరు బతుకే మిగులుతుంది. చదు వులో ఉత్సాహం చూపిస్తున్నాడు గనుక మనంవాడిని ఆ దిశలోనే ప్రోత్సహిద్దాం" అని భర్తకినచ్చచెప్పింది.
బళ్ళో చేరిపోయాడు కపర్ది. వారాలుచేసుకుంటూనే చదువు సాగించాడు. ఇంటర్లో యూనివర్సిటీలోనే మొదటిర్యాంక్తో పాసైన కపర్దికి పిలానీలోని బిర్లా ఇన్సిట్యూట్లో తేలి కగా ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. విజయవాడ వదిలి, రాజస్థాన్ వెళ్ళవలసి వచ్చింది. "నాకు గడపక, మీ మామయ్య దగ్గరకు నిన్ను వలస పంపేశాను! ఇప్పుడు చదువుకోసం నువ్వు మామయ్యను వదిలి వెళ్ళిపోతున్నావు. విజయవాడలో ఉంటే, నేనన్నా వచ్చి చూసిపోతూ వుండేవాడిని. ఎప్ప టికీ కనబడతావో, ఏమో" అంటూ కళ్ళనీళ్ళు పెట్టు కున్నాడు పవనశాస్త్రి. భాస్కరశాస్త్రికి మాత్రం అతడు దూరంగా వెళ్తున్నాడనే బాధతోపాటు, మంచి చదువు కోసం వెళ్తున్నాడనే సంతోషం కూడా ఉంది. "నాలుగేళ్ళు ఎంతలో తిరిగి వస్తాయిలే. ఆ తరు వాత వాడికి ఎక్కడ ఉద్యోగం వస్తే, అక్కడే తనూ, భార్యా కూడా!" అనుకున్నాడు. కపర్దికి వచ్చిన మార్కులని బట్టి, బిర్లా ఇన్స్టిట్యూ ట్లో ఫీజులు లేని ఫ్రీ సీట్ వచ్చింది. హాస్టల్ వసతి, ఇతర ఖర్చులకి, వారాలు ఇచ్చిన లెక్చరర్గారు కొంత సహాయం చేశారు. చేరిపోయాడు కపర్ది. నాలు గేళ్ళలో రెండుసార్లు మాత్రం సెలవల్లో వచ్చి, తల్లిదం డ్రులతో, అత్త మేనమామలతో గడిపి వెళ్ళాడు.
ఫైనల్ ఎగ్జామ్స్ రాసి వస్తూనే. తనకి క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం వచ్చిందన్న శుభవార్త తీసుకువచ్చాడు కపర్ది. ఇక తమ కష్టాలు తీరిపోయా యని అటు అతడి తల్లిదండ్రులూ, ఇటు మేనమామ దంపతులూ కూడా మురిసిపోయారు. ఆరంకెల జీతం సంఖ్య విని వాళ్ళకి కళ్ళు తిరిగి నంత పనైంది. “మీరు కూడా విజయవాడ వచ్చెయ్యండి. బావా,అందరం కలిసేఉందాం" అన్నాడు భాస్కర. "నాకెక్కడ కుదురుతుందిలేవయ్యా, పొలాన్ని, పౌరోహిత్యాన్నీ వదిలి రాలేను. ఐనా, ఆ పట్నంవాసపు బిజీ జీవితం నాకు సరిపడదు. మీరు మాత్రం వారం వారం మావూరు వస్తూ ఉండండి. కపర్ది కారుకూడా కొంటాడేమో, ఆదివారాలు మీరు ముగ్గురూ వచ్చేస్తూ హాయిగా ఉండచ్చు" ఉత్సాహంగా చెప్పాడు పవన శాస్త్రి.
వాళ్ళ ఉత్సాహాలు, ఉద్యోగంతాలూకు పూర్తి వివరాలు వినినంతసేపే నిలిచాయి. వివరాలు విన్నాక నిరాశ, నీరసం ఆవహించుకు న్నాయి. ఉద్యోగం ఇచ్చింది ఒక విదేశీ కంపెనీ. ఉద్యోగం చేయవలసినది యుఎస్. అంటే, కపర్ది అమెరికా వెళ్ళిపోతాడు.
"పర్మినెంట్ గా మనతో ఉండిపోతాడని కలలు కంటుంటే, ఇదేమిటి ఇలా చేశాడు?" అన్నాడు పవన శాస్త్రి బేలగా. రెండు కుటుంబాలూ దిగులు పడిపో యాయి. భాస్కర శాస్త్రి ముందుగా సర్దుకున్నాడు.
"కానియ్బావా! మనం వాడికి కావలసినవి సమకూర్చ లేకపోయాం. కనీసం వాడైనా సమకూర్చుకుంటు న్నాడు. పసితనంలో తిండికే కటకటగా ఉంటే,మారు మాటలేకుండా. నా దగ్గరకు వలస వచ్చేశాడు. తన కోరిక ప్రకారం చక్కగా చదువుకుని, మనం కలలో కూడా ఊహించనంత వృద్ధిలోకి వచ్చాడు. ఇప్పుడు, స్వయంప్రతిభతో ఇంత పెద్ద ఉద్యోగం సంపాదించుకున్నాడు. ప్రతిభకు తగిన గుర్తింపు కోసం విదేశానికి వలస వెళతాడు. ఇక్కడే ఉండిపొ వంతు జీతానికైనా ఉద్యోగం ఇప్పించటం మనవల్ల అవుతుందా? వాడు ఏదో అత్తెసరు చదువు చదివి, ఉద్యోగం దొరక లేదంటూ కూర్చుంటే, మనకి ఎంత భారంగాఉండేది? వీడి తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు? నీ దగ్గరే ఉన్నారని తప్ప, చాలీచాలని సంపాదన లతో, రేపు వాళ్ళకంటూ సంసారాలు ఏర్పడితే ఎలా బతుకుతారో అన్నబాధ నీకు ఉందికదా! వీడు అమె రికా వెళితే, మన అందరికీ అక్కడినుంచే సహాయం చేయగలదు. అందుకోసం మనం మన ప్రేమలని త్యాగంచేయక తప్పదు. రెక్కలొచ్చిన పక్షులు గూడు వదిలి ఎగిరిపోవటం ప్రకృతి సహజం" బావగారికి నచ్చచెప్పాడు.
కపర్ది విమానమెక్కి, మేనమామ చెప్పిన పక్షిలాగే అమెరికా ఎగిరిపోయాడు. యుయస్ వెళ్ళిన కపర్ది మొదట్లో రెండేళ్ళకి ఒకసారి వచ్చి అందరినీ చూసి వెళ్ళేవాడు. ఆరేళ్ళు గడిచాక అమెరికాలో స్థిరపడిన తెలుగు వాళ్ళ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. నెమ్మదిగా ఇద్దరు పిల్లలు పుట్టారు. కుటుంబం పెరిగింది. దశా బ్దాలు తిరిగాయి. ఇండియారావటం తగ్గింది. అయితే తండ్రికీ, మేనమామకీ అవసరమైన ఆర్థిక సహాయం మాత్రం తప్పనిసరిగా చేస్తూనే వున్నాడు. పది, పదిహేను రోజులకి ఒకసారి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఫోన్ చేసినప్పుడల్లా, సుందరమ్మ చేసే సాధింపు అతడికి కంటకం అవు తోంది.
“పెద్దవాళ్ళం అయిపోయామురా, ఒంటరిగా ఉండలేకపోతున్నాం. ఇంకా ఎప్పుడు తిరిగివస్తావురా? మీ మామయ్య బయటకు చెప్పరు గానీ, ఆయనకి నువ్వు తిరిగిరావాలనీ, మాతో కలిసి వుండాలని గట్టిగా ఉంటుంది. బెంగతో కృంగిపోతున్నారు"
"ఆశించటానికైనా అర్థం ఉండాలి. ఇన్నేళ్ళుగా ఇక్కడ ఉండి, సంసారం, పిల్లలు ఏర్పడ్డాక, వెనక్కి తిరిగి వెళ్ళటం ఎలా కుదురుతుంది" అని మనసు లోనే విసుక్కునేవాడు.
అకస్మాత్తుగా సుందరమ్మకి ఆరోగ్యంచెడింది. ఆ ఊళ్ళోనే బస్సు దిగుతుండగా ఒళ్ళు తూలి క్రింద పడటంతో, తలకు దెబ్బతగిలింది. పక్షవాతం వచ్చింది. వార్త విన్న కపర్ది వెంటనే ఆమెను చూడటా నికివచ్చాడు. ఆస్పత్రిలో వున్న సుందరమ్మ కపర్దిని చూసి కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
“నిన్ను చూస్తాననుకోలేదు" అంటూ గొణిగినట్టు గానే చెప్పింది.
అతడు డాక్టర్ను కలిశాడు, "ప్రాణ ప్రమాదం ఏమీలేదు. కోలుకోవటానికి కొంత సమ యం పడుతుంది" అని చెప్పాడు ఆయన.
“నీకు నయమౌతుంది. నేను డాక్టర్తో మాట్లా డాను” అని ధైర్యం చెప్పాడు కపర్ది.
“నయమయ్యేదాకా ఉంటావా?" ఆశగా అడిగింది సుందరమ్మ. ఇబ్బందిగా తల ఊపాడు కపర్ది. అప్ప టికి రెండురోజులుగా ఆమెని కనిపెట్టుకుని ఉన్న పవనశాస్త్రి దంపతులు ఆ సాయంత్రం తమఊరు వెళ్ళిపోయారు.
"అత్తయ్య హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక, మన ఊరు వస్తాను" అన్నాడు తల్లితో కపర్ది. ఆ సాయంత్రం హాస్పిటల్ నుంచి బయటపడి, బీసెంట్ రోడ్డు మీదకు వచ్చాడు. అంతా కొత్తగా, అస్తవ్యస్తంగా అనిపించింది. ఆలోచనల్లోంచి బయటపడి, మళ్ళీ హాస్పిటల్ వైపునడిచాడు కపర్ది.
సుందరమ్మని నాలుగు రోజుల తరువాత డిశ్చార్జ్ చేశారు. మందులతోపాటు, ఫిజియోథెరపీ ఇప్పించమని చెప్పారు. భాస్కరశాస్త్రి బాగా డీలా పడిపోయాడు. "భయ పడకు మామయ్యా, మంచి ఫిజియోథెరపిస్ట్ని మాట్లా డుతాను. రోజుకి వెయ్యిరూపాయలైనా సరే, ఇంటికి వచ్చి, అత్తయ్యకి పూర్తిగా నయం అయ్యేదాకా ట్రీట్ చేయిద్దాం” అని చెప్పాడు. కళ్ళనీళ్ళు కార్చాడు భాస్కరశాస్త్రి. "డబ్బు నువ్వు ఇస్తావురా, కానీ తోడు ఎవరు ఇస్తారు? ఒంటరి జీవి తాలు అయిపోయాయి మావి. మీ అత్తయ్యకు కావల సింది వైద్యంకాదు. మనోబలం. అదివ్వటం నావల్ల కావటంలేదు” అంటూ.
ఆ మర్నాడు తమ ఊరు వెళ్ళాడు కపర్ది. తమ్ముళ్ళు, మరదళ్ళు ఆప్యాయంగా పలకరించారు. తల్లిదండ్రి మాత్రం ఎప్పటంత ఆప్యా యంగా మాట్లాడలేదనిపించిందతనికి. వాళ్ళ ధోరణి ముక్తసరిగా ఉన్నట్లు తోచింది. రెండవరోజు కొల్లేరు సరస్సుకి పిక్నిక్ వేశారు తమ్ముళ్ళు. కుటుంబం అంతా కలిసి వెళ్ళారు. దాదాపు మూడొందల కిలోమీటర్ల విస్తీర్ణంలో వున్న కొల్లేరు సరస్సు పేరుకు సరస్సుగానీ, సముద్రమంత విశాలంగా ఉంటుంది. సీజన్ కావటం వల్ల వలస వచ్చిన లక్షలాది పక్షులతో కళకళలాడిపోతోంది. రక రకాల అరుదైన పక్షులు శీతాకాలం విడిది కోసం సైబీరియా నైజీరియా, యూరప్, టర్కీ, రష్యాల నుంచి విదేశీ అతిథుల్లా వచ్చాయి. పిల్లలు బర్డ్స్ శాంక్చుయరీ చూడటానికి వెళ్ళారు. తల్లి, తండ్రి ఒకపక్కన గట్టుమీద కూర్చున్నారు. కపర్ది తండ్రి పక్కనే చతికిలబడ్డాడు.
ఆలోచించి, ఆలోచించి మాట కదిపాడు పవనశాస్త్రి. "ఈ పక్షులు చూశావురా! వలస పక్షులు..." నవ్వుతూ అన్నాడు. ఆ నవ్వు కొంత కృతకంగావుంది. "ఎందుకు వస్తాయి ఇలా?" కొడుకుని ప్రశ్నించాడు. తెలియదన్నట్టు చూశాడు కపర్ది.
"తమ ప్రాంతాలలో ఉండని చిత్తడి నేలకోసం, ప్రతి సంవత్సరం శీతా కాలంలో వేలమైళ్ళ దూరం ఎగిరి వస్తాయి. ఇక్కడ దొరికే చేపలని తింటూ, ఇక్కడే గూళ్ళు కట్టుకుని, గుడ్లు పెడతాయి. అవసరాల కోసం, అవ కాశాలు వెతుక్కుంటూ మనుషులు వెళ్ళినట్లే ఇవీ వస్తాయి" అర్ధోక్తిలో ఆగాడు పవనశాస్త్రి.
“తండ్రితనని ఎత్తి పొడుస్తున్నాడా?" కలిగిన సందేహాన్ని ముఖంలో కనబడనీయకుండా జాగ్రత్తపడ్డాడు కపర్ది.
ఓరగా కొడుకు ముఖంలోకి చూసిన పవనశాస్త్రి కొనసాగించాడు. “నీకు అమెరికాలో ఉద్యోగం వస్తే, అప్పుడు నిన్ను రెక్కలొచ్చిన పక్షితో పోల్చాడు మీ మామయ్య. అది సరికాదేమో అనిపిస్తోంది నాకిప్పుడు! ఈ పక్షులనే చూడు, అవసరంకోసం వేళ కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తున్నాయి. ఏ విమానాలూ లేవు వాటికి. రెక్కల కష్టంతో వస్తున్నాయి. తమ అవసరాలను, ఆకాంక్షలను తీర్చు కుంటున్నాయి. కానీ తాము వచ్చిన పని పూర్తికాగానే, వచ్చిన దారినే పిల్లలతో కలిసి, తమ స్వంత గూళ్ళను వెతుక్కుంటూ, తమ దేశాలకు తిరిగి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ బాగుందికదా అని శాశ్వత నివాసాలు ఏర్పరు చుకునే ఆలోచనకూడా వాటికి ఉండదు! అదీ మనకీ, మనం తేలిగ్గా చూసే పక్షులకీ ఉన్న వ్యత్యాసం"
మౌనంగా ఉండిపోయాడు కపర్ది.
“అత్తా, నేను వెళ్ళి వస్తాను. అక్కడి పనులన్నీ చక్కబెట్టుకుని, మొత్తం కుటుంబం అంతా పిల్లలతో సహా నాలుగైదు నెలల్లో ఇక్కడికి వచ్చేస్తాం. ఈలోగా నువ్వు పూర్తిగా ఆరోగ్యం పుంజుకుని లేచి తిరగాలి. మామయ్య మనందరికీ సరిపడే నాలుగు గదుల అపార్ట్మెంట్ చూసి వుంచాలి" అంటూ చెప్తున్నకపర్ది మాటలకి విస్తుపోయిచూసింది సుందరమ్మ. సంతోషంగా నవ్వుకున్నాడు విషయం ముందే తెలుసుకున్న భాస్కర శాస్త్రి. అంతకుముందు వారం రోజులుగా భార్యతో ఫోన్లోనే, చర్చలు జరిపాడు కపర్ది. ఇక్కడి పరిస్థితులు, తనపై ఉన్న నైతిక బాధ్యత ఆమెకి కన్విన్సింగ్గా వివరించాడు. ఆమె సందేహాలు తీర్చి, తమ పిల్లల భవిష్యత్తు గురించీ చర్చించి, వాళ్ళని అంగీకరింపజేశాడేజ ఒక నిర్ణయం తీసుకున్న సంతృ ప్తితో తిరుగుప్రయాణం అయ్యాడు.
No comments:
Post a Comment