*_ధర్మదేవుడు - రాజ్య రక్షకుడు :_*
===•===•===•===•===
*రాజభాండాగారంలో వార్షిక లెక్కల పరిశీలన జరుగుతోంది. భాండాగారం అధికారి ఖజానా పెట్టెలు తెరిపించాడు. అన్నీ సక్రమంగానే కనిపించాయి. కానీ ఒక మూలన ఉన్న చిన్న వెండి పెట్టెలో తేడా ఉంది.*
*ఆ పెట్టెలో దేవాలయ నూతన గోపుర నిర్మాణానికి ప్రజలు సమర్పించిన ప్రత్యేక నిధి ఉంది. అది తెరిచినప్పుడు బంగారు నాణేలు కొంత తగ్గినట్లు కనిపించింది.*
*సభలో ఒక్కసారిగా చర్చలు మొదలయ్యాయి.*
*_“ఈ గది తాళం ఎవరి వద్ద ఉంటుంది?”_ అని రాజు ప్రశ్నించాడు.*
*భాండాగారం అధికారి వినమ్రంగా _“మహారాజా, ప్రధాన తాళం నా వద్ద ఉంటుంది. కానీ గోపుర నిధి లెక్కలు చూసేది ధర్మదేవుడే”_ అని అన్నాడు.*
*అంతే అందరి చూపు ఒక్కసారిగా ధర్మదేవుడి వైపు తిరిగింది.*
*ఇంకో విషయం మూడు రోజుల క్రితం రాత్రి ఆలస్యంగా ధర్మదేవుడు భండార ప్రాంగణంలో కనిపించినట్టు గస్తీ సైనికుడు చెప్పాడు.*
*_“ఎందుకు వచ్చారు?”_ అని అడిగితే, _“పత్రాలు సరిచూడటానికి,”_ అని చెప్పి వెళ్లిపోయాడట.*
*ఇది విన్న వెంటనే అనుమానం గట్టిపడింది.*
*ధర్మదేవుడు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అతని ముఖంలో భయం లేదు… కానీ బాధ ఉంది. ఉద్దేశపూర్వకంగా నిధిలోని బంగారు నాణేలని ఎవరో తీసుకున్నారు.*
*సభలో కొందరు మంత్రులు _“అధికారం దగ్గర ఉన్నవారే అవకాశం ఉపయోగించుకుంటారు”_ అన్నారు.*
*రాజు ధర్మదేవుడిని చూశాడు. _“నీవు చెప్పేది ఏమిటి?”_*
*ధర్మదేవుడు తలవంచి ఒక్క మాట అన్నాడు: _“నిజం ఎప్పుడూ మౌనంగా ఉండదు మహారాజా. అది బయటకు వస్తుంది.”_*
*ఆ క్షణం నుంచి అతనిపై ఆంక్షలు మొదలయ్యాయి.*
*సభ ముగిసింది. ధర్మదేవుడు నిశ్శబ్దంగా తన గృహానికి చేరుకున్నాడు.*
*ఆ రాత్రి అతడు విశ్రాంతి తీసుకోలేదు. గస్తీ సైనికుడు చెప్పిన మాటలు, భాండాగారం అధికారి సమాధానాలు అన్నీ గుర్తు చేసుకున్నాడు.*
*ఒక చిన్న విషయం అతనికి గుచ్చుకుంది. గోపుర నిధి పెట్టెపై ఉన్న ముద్ర. అది కొద్దిగా పక్కకు జరగినట్లు కనిపించింది. సాధారణంగా తాళం తెరిచినప్పుడు ముద్ర చీలిపోతుంది. కానీ ఇది చీలలేదు… కేవలం మళ్లీ అతికించినట్టు ఉంది.*
*మరుసటి రోజు ఉదయం తీర్పు ప్రకటించే సమయానికి ముందు, ధర్మదేవుడు భండారానికి వెళ్లాడు. అక్కడ నేలపై చిన్నగా పడిన ఎరుపు రంగు మైనపు చుక్క కనిపించింది. అదే రంగు మైనం భండాగారం అధికారి కార్యాలయంలో ఉండేది.*
*అతడు మౌనంగా ఆ చుక్కను రుమాలులో దాచుకున్నాడు.*
*సభ ప్రారంభమైంది. రాజు గంభీరంగా _“ధర్మదేవుడా, నీపై అనుమానం గట్టిగా ఉంది. చివరి అవకాశంగా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా?”_*
*అందరి చూపులు అతడిపైనే.*
*ధర్మదేవుడు ముందుకు వచ్చి నమస్కరించాడు. _“మహారాజా, నిధి మాయం కాలేదు."_ సభలో గుసగుసలు.*
*_“అయితే ఎక్కడ ఉంది?”_ అని రాజు.*
*ధర్మదేవుడు నెమ్మదిగా రుమాలు తెరిచాడు. అందులో ఎరుపు మైనపు చుక్క.*
*_“ఈ ముద్ర తాళంతో కాదు, వేడి మైనంతో మళ్లీ అతికించారు. ఈమైనం కూడా భండారం అధికారి గదిలోనే ఉంటుంది.”_*
*సభ ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. భాండాగారం అధికారి ముఖం మారింది.*
*_“అది యాదృచ్ఛికం!”_ అని అతడు అరవగా....*
*అప్పుడే గస్తీ సైనికుడు ముందుకు వచ్చి తలవంచి _“మహారాజా, నేను నిజం చెప్పాలి. నాకు ఆజ్ఞ ఇచ్చింది భాండాగారం అధికారి గారే. ధర్మదేవుడు రాత్రి వచ్చినది నిజమే కానీ అతడు నిధి కాపాడటానికే వచ్చాడు.”_*
*భండాగారాధికారికి తగిన శిక్ష వేసి కారాగారానికి పంపించేశారు. గస్తీ సైనికుడు క్షమాపణతో తప్పించుకున్నాడు.*
*ధర్మదేవుడిని రాజు ప్రశంసించాడు. సభ ముగిసింది.*
🌑🌑🌑🌑🌑🌑
*ఆ రాత్రి రాజు అంతఃపురానికి సమీపంలోని చిన్న మండపంలోకి ధర్మదేవుడిని పిలిచారు.*
*అతడు లోపలికి వచ్చి నిలబడ్డాడు. రాజు ఆసనంపై కూర్చున్నాడు. కొద్దిసేపు మౌనం తర్వాత రాజు నెమ్మదిగా అన్నాడు:*
*_“నిన్ను నేను పరీక్షించలేదు ధర్మదేవుడా..! కాలమే పరీక్షించింది. నీవు నిలిచావు.”_*
*ధర్మదేవుడు తలవంచి మౌనంగా ఉన్నాడు.*
*_“రాజ్యంలో భండారం కాపాడేవారు చాలామంది ఉంటారు. కానీ, ధర్మాన్ని కాపాడేవారు కొద్దిమంది మాత్రమే ఉంటారు.”_*
*అంటూ రాజు తన పక్కన ఉన్న చిన్న వెండి ముద్రను తీసుకున్నాడు. ఆ ముద్రపై రాజ్య చిహ్నం ఉంది.*
*_“ఇప్పటి నుంచి నీవు కేవలం లెక్కలాధికారివే కాదు. రాజ్యంలో ధర్మపరిశీలకుడివి కూడా.. ప్రతి శాఖను, ప్రతి అధికారిని గోప్యంగా పరిశీలించే బాధ్యత నీదే.”_*
*_“ఈ విషయం మనిద్దరికే తెలుసు”_ అన్నాడు రాజు గంభీరంగా.*
*ధర్మదేవుడి కళ్లలో కృతజ్ఞత _“మహారాజా, ధర్మం నిలబడితే చాలు.”_*
*రాజు తల ఊపాడు.*
*ఆ రాత్రి నుంచి రాజ్యంలో ఒక మార్పు మొదలైంది.. అధికారులు బాధ్యతతో పనిచేయడం ప్రారంభించారు.*
*కొన్ని నెలలు గడిచాయి. రాజ్యంలో అధికారుల పని తీరు మారింది. క్రమశిక్షణ పెరిగింది.*
*ఒక ఉదయం రాజుగారి అంతఃపురం నుండి _“ధర్మదేవుడు వెంటనే రావాలి.”_ అని పిలుపొచ్చింది.*
*అతడు వచ్చి నమస్కరించి నిలబడ్డాడు.*
*రాజు పక్కన ఒక యువకుడు నిలబడి ఉన్నాడు.. అతడు రాజకుమారుడు. వయసు తక్కువే. అప్పుడు రాజు గంభీరంగా అన్నాడు:*
*_“రాజ్యాన్ని కత్తితో గెలవవచ్చు. కానీ రాజ్యం నిలవడానికి ధర్మం కావాలి. నా కుమారుడు యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నాడు. కానీ ధర్మ విద్య నేర్పగలవాడివి నీవే.”_*
*ధర్మదేవుడు ఒక్కసారిగా తలెత్తి చూశాడు.*
*_“మహారాజా..! నేను సాధారణ సేవకుడిని.”_*
*రాజు స్వల్పంగా చిరునవ్వు చిందించాడు. _“అందుకే నిన్ను ఎన్నుకున్నాను.”_*
*రాజకుమారుడు ముందుకు వచ్చి వినయంగా నమస్కరించాడు. _“గురుదేవా, నన్ను స్వీకరించండి.”_*
*ఆ రోజు నుంచి రాజకుమారుడి విద్య ప్రారంభమైంది.*
*ధర్మదేవుడు అతనికి కేవలం శాస్త్రాలు మాత్రమే కాకుండా, నిర్ణయం తీసుకునే ముందు మౌనం విలువ, అధికారానికి ముందు బాధ్యత, శిక్షించడానికి ముందు పరిశీలన, అనుమానించడానికి ముందు విశ్వాసం మొదలయినవి కూడా నేర్పాడు.*
*రాజకుమారుడు ఒకసారి _“గురుదేవా, మీపై అనుమానం వచ్చినప్పుడు మీరు కోపం తెచ్చుకోలేదేంటి?”_*
*ధర్మదేవుడు ప్రశాంతంగా సమాధానమిచ్చాడు, _“నిజం ఉన్నవాడికి కోపం అవసరం లేదు. అతనికి కాలమే సాక్ష్యం.”_*
*ఆ మాట రాజకుమారుడి హృదయంలో నిలబడిపోయింది.*
*కొన్నేళ్ల తర్వాత రాజకుమారుడు యువరాజుగా సింహాసనం అధిరోహించిన తరువాత, ప్రజలు యుద్ధంలో ధైర్యవంతుడుని రాజ్యరక్షకుడిని, నిష్పక్షపాతిగా న్యాయనిర్ణయంలో ధర్మరక్షకుడిని చూశారు.*
🛕🛕🛕🛕🛕🛕🛕
*_:-:{ఇది సేకరణే.. దీనికి ఆధారం.. "చిట్టిపొట్టి కథలు" అనే ఫేస్బుక్ వాల్..: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు🙏}:-:_*
No comments:
Post a Comment