మనసే కోవెల
పారాడే పసిపాపకు తల్లి ఒడే గర్భగుడి. అమ్మే దేవత. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ బిడ్డే వివేకవంతుడై తల్లితో పాటు తండ్రి కష్టాన్నీ గుర్తిస్తాడు. తన భవితకు దారి చూపే చుక్కానిగా గురువును నమ్మి జీవిత పరమార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. తన వికాసానికీ, పెరుగుదలకూ తోడ్పడిన పంచభూతాత్మకమైన ప్రకృతిని ఆరాధిస్తాడు. ఆ ప్రకృతికి సాకార రూపమైన భగవంతుడు అతడికి అక్కడ చేరువవుతాడు.
విగ్రహారాధనతో ఆ వ్యక్తి తన ఆధ్యాత్మిక ఉన్నతికి ఓనమాలు దిద్దుతాడు. మనసుకు నచ్చినట్లుగా ఆ చిదానంద రూపాన్ని కొలుస్తూ తాపత్రయాల నుంచి విముక్తుడవటానికి ప్రయత్నిస్తాడు. అధిభౌతిక, అధిదైవిక, ఆధ్యాత్మికంగా కనపడే ఈ తాపత్రయాల్లో భౌతిక ప్రపంచం వల్లనో, ప్రకృతి వైపరీత్యాల వల్లనో సగటు మనిషికి ఏర్పడే ఇబ్బందులు మొదటి రెండు. అరిషడ్వర్గాల వల్ల తనకు తాను ఏర్పరచుకున్న ఈతి బాధలు ఆధ్యా త్మిక తాపం కోవకు చెందుతాయి. ఈ తాపమే మనిషిని తన బాధల నుంచి బయట పడే దారులకోసం దేవుణ్ని పూజించటానికి ఉత్ప్రే రకంగా పనిచేస్తుంది. అందుకేనేమో.. కుంతి, నిరంతరం కష్టాలలో మునిగిపోయే వరమివ్వ మంటూ అలా కృష్ణ స్వామిని నిరంతరం తలచు కునే భాగ్యశాలిని అవుతానని తలపోసింది.
కలియుగంలో నామస్మరణను మించిన ధన్యో పాయం లేదంటారు. ఆ దేవదేవుణ్ని కృతజ్ఞతా పూర్వకంగా తలచుకుంటే చాలు, వెన్నంటి ఉంటాడని చెబుతున్నాయి పురాణాలు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి- అనే అష్టాంగ మార్గం ఆ భగవంతుణ్ని చేరే సోపానక్రమం. వీటిలో కను లారా చూసుకున్న భగవద్రూపాన్ని మనసారా నింపుకోవడం ధ్యానానికి సంబంధించిందైతే, ఆ భగవానుడికి తమ స్థాయిభేదాలతో సంబంధం లేకుండా హృదయంలో అర్చన చేసుకోగలగడం ధారణకు చెందుతుంది. మనసును పరమాత్మపై లగ్నం చేసి, మనసులోనే కొండంత మూర్తికి చేసుకోగలిగే పూజే మానసిక పూజ.
బంగారు బిందెలతో ఆకాశగంగను తెచ్చి అభిషేకించినా, గంగలోని చేపకప్పాల్/ఎంగిలంటున్నాయంటూ వెతలు వెళ్లబోసుకున్నా అది మానసిక పూజకే చెల్లుతుంది. ఈ విధానం మన మనసును ఆ నిరాకారునికి నిజంగా చేరువ చేయగలదు. సర్వ కాలాల్లో సంతోష చిత్తంతో, ఏకాగ్రతతో భగవదర్పితమైన మనసు కలిగినవాడు తనకు అత్యంత ప్రియమైన భక్తుడన్నది సాక్షాత్తు శ్రీకృష్ణుడి వచనం. అందుకే బాహ్యాడంబ లేని ప్రశాంత చిత్తంతో భగవద్రూపాన్ని ధారణ చేయడానికి సాధన చేయాలన్నది శంకరుల ఉద్బోధ. రాలు
తత్వమసి, సోహం, అహం బ్రహ్మాస్మి వంటి అద్భుత ఉపనిషద్ వాక్యాలను పరిచయం చేసే మార్గమే మానసిక పూజ. జీవాత్మ పరమాత్మల నడుమ గల అద్వైత భావనలకు బలం చేకూరుస్తుందిది. 'ఆత్మవత్ సర్వభూతాని' అంటూ తన లోపల గల దైవాన్ని సమస్త ప్రపంచంలో చూస్తూ ఆధ్యాత్మిక శాంతిని పొందడంలో చేయూతనివ్వగలదు. ఆధ్యాత్మిక చింతన అనేది ఎవరికి వారే ఎన్నుకుని ఆ మార్గంలో పయనించే ప్రక్రియ. నదీనాం సాగరో గతిః అన్న చందాన, మార్గం ఏదైనా భగవానుడిపై సంపూర్ణ విశ్వాసంతో చేసే ఏ సత్కార్యమైనా పూజే కాగలదు కదా!
పార్ణంది అపర్ణ
No comments:
Post a Comment