Thursday, 26 March 2026

 కథలు రాయడం ఎలా?!ఎవరు నేర్పిస్తారు?!ఎవరికి ఎవరూ నేర్పించరు. రాసిన కథల రూపంలో దారి చూపిస్తారంతే..చలం గారు కావొచ్చు,రావిశాస్త్రి గారు కావొచ్చు ఇంకెవరైనా కావొచ్చు!! కథ రాయాలని మనకి అనిపిస్తే ముందు చదవడం చేయాలి. మనం కూడా కథ రాయాలి అనిపించేటట్టు ప్రేరేపించిన కథని మరొక్కసారి చదవుకోవాలి. స్టెప్ బై స్టెప్ కథలోని సంఘటనలని ఎలా అమర్చారో ఒక సారి చెక్ చేసుకోవాలి. దానిలోని సోల్ ని మనం పట్టుకోగలగాలి. అప్పుడు మనకీ ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడైతే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది కాబట్టి,ఒక్క బటన్ దూరంలో కథ ఉంటుంది. ఈజీగా సెర్చ్ చేసి కావాల్సినన్ని కథల్ని ఈజీగా చదువుకోవొచ్చు. ఒకప్పుడు న్యూస్ పేపర్ కూడా రాని మా ఊళ్ళో నేను కథలు రాయాలని ప్రేరేపించిన విషయాలు రెండే రెండు. ఒకటి సినిమా థియేటర్ లో పనిజేసిన నాన్న చెప్పే జానపద సినిమా కథలు, ఇంకోటి కోమటోళ్ల కొట్లోనుండి ఉప్పు,పప్పు పొట్లం కట్టిచ్చే పేపరు ముక్క!1996లో నేను పదో తరగతి చదివేటప్పుడు పాఠ్యపుస్తకంలోని కొలకలూరి ఇనాక్ గారి కథ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. ఆ కథలోని వర్ణనలు ఇప్పటికీ నా కళ్ళ ముందు కదులుతున్నాయ్.అదీ కథ అంటే..కానీ కథ పేరు గుర్తు లేదు.ఆరోజు నుండి మెల్లగా మా ఊళ్ళో ఉదయం, సాయంత్రాలని  అక్షరాల్లోకి వొంపటం పనిగా పెట్టుకున్నాను. ఒక్కోరోజు ఒక్కోలాగా. వాటికి కొన్ని సంఘటనల్ని యాడ్ చేసి రాశాను. ఏదో వచ్చింది. కానీ కథ మాత్రం రాలేదు. పదోతరగతి అయ్యి బయటకొచ్చాక వార పత్రికలు,మాసపత్రికలు అక్కడా ఇక్కడా దొరకబుచ్చుకుని ఇష్టంగా చదవడం మొదలెట్టాను. అనుకోకుండా ఇంటర్మీడియట్ మధ్యలోనే చదువు ఆగిపోయింది. ఈ పుస్తకాల వల్లే నేను చదువు మానేసానని గొడవ చేశారు ఇంట్లో పెద్దోళ్ళు. దానికి కారణం వేరే ఉంది లెండీ.చిన్నాచితక ఉద్యోగాలు. మధ్యలో సాహిత్య పఠనం. నాన్న పీచుమిఠాయి అమ్ముతూ తెచ్చిన కొన్ని పుస్తకాలు కూడా నాలో రాయాలన్న తపనని మరింత పెంచాయి. రాస్తూ రాస్తూ పోయాను.పోస్టల్ లో పత్రికలకి పంపించాను. తీసుకున్నారో లేదో సమాధానం లేదు. తిరుగు టపా లేదు. భుజం తట్టే గురువు లేరూ.. బుజ్జగించే సాహిత్య మిత్రుడూ లేడు.అదిగో అప్పుడు జరిగింది ఒక మిరాకిల్. 2016 సాక్షి ఉగాది కథల పోటీలో నేను పంపిన "దాగుడు మూతలు"టాప్ 20 లో సెలెక్ట్ అయ్యింది. అంతే నాకూ కథ రాయడం వచ్చేసింది..అన్న ఆలోచన కొండంత భరోసాని ఇచ్చింది. ఆ తర్వాత్తర్వాత కొందరి సాహిత్య మిత్రుల ప్రోత్సాహం నన్ను ముందుకి నడిపింది.ఈ రోజు "ఆయ్.. గోదారోళ్లమండి!!" పుస్తకమై మీ ముందు నిలబడ్డాను. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే.. కథలు రాయాలంటే మనం ఓ పెద్ద జర్నలిస్టులమో,ప్రొఫెసర్లమో,గండపెండేరం తొడుక్కున్న పండిత పుత్రులామో కానవసరం లేదు.కాస్త అక్షరజ్ఞానం జ్ఞానం తెలిసి, చుట్టూ ఉన్న పరిస్థితుల్ని కొంచెం అబ్జర్వ్ చేయగలిగితే చాలు. కాకపోతే మహా అయితే ఒక ఒత్తో, దీర్ఘమో మిస్ అవ్వొచ్చేమో. ఆ మాత్రం దానికే "తెలుగు తల్లి"పెద్దగా ఏమీ బెంగ పెట్టుకోదు.నెక్స్ట్ టైమ్ సరిదిద్దుకోవొచ్చు. రాయండి.. రాస్తూనే ఉండండి.. రాయడం రాకున్నా మీ ఆలోచల్ని రికార్డ్ చేయండి. మీలోనూ ఒక వంగపండో,అందే శ్రీ నో, రావూరి భరద్వాజనో ఉండి ఉండొచ్చు.మన దిగువతరగతి కథల్ని సానుభూతితోనో,సహానుభూతితో ఎవరో రాయడంలో మజా ఏముంది..మనమే రాసుకుంటే ఆ లెఖ్ఖనే వేరు కదా!😊 

నోట్ : నేనేమీ సలహాలు ఇచ్చేటంతటి పెద్ద కథకుణ్ణి కాదు.. నాకు తోచింది చెప్పాలనిపించి మాత్రమే చెప్పాను.అర్థం చేసుకోగలరు.🙏🙏

No comments:

Post a Comment