Thursday, 26 March 2026

 కథ 
*తల్లి* 
- కర్లపాలెం హనుమంతరావు 

సీత ఎల్ఐసి లో అసిస్టెంట్. రామం ఈ సి ఐ ఎల్ లో సైంటిఫిక్ అసిస్టెంట్. ఇద్దరికీ రెండేళ్ళ  కిందట పెళ్ళయింది. ఏడాది పాప . 

ఇద్దరిదీ ప్రేమ వివాహం కావటంతో పెద్దల వైపు  నుంచి  సహకారం లేదు. పాపను చూసుకుంటూ జాబ్ కు వెళ్ళటం కష్టంగా ఉంది సీతకు. 
రామానికి ఇంటి పని చేసే అలవాటు లేదు. చేసిపెట్టమనే చొరవ సీతకు ఇంకా రాలేదు. 

సీత పడే అవస్థ చూసి పాపను చూసుకొనేది పక్క ఫ్లాట్ రమ్య వాళ్ళ అత్తగారు రాజమ్మగారు. సీత ఆఫీసుకు వెళ్ళోచ్చేదాకా. పెద్దావిడ కష్టానికి అంతో ఇంతో ముట్ట చెప్పేది సీత కూడా! కానీ, ఎంత కాలం ఇలా ? రాజమ్మగారు వంట్లో బాగా లేక పెద్దకొడుకు దగ్గరకు  వెళ్ళిపోయింది. 

సీతకు మొదట్లో దిక్కు తోచలేదు. రెండు వీధుల అవతల క్రెచ్ ఉంటే అందులో చేర్చింది. రెండు వారాలు గడిచేసరికి పాప వడలిపోయింది. అక్కడ వేళకు పసిపిల్లల అవసరాలు శ్రద్ధగా పట్టించుకోరు అని తెలిసి పాపను ఇంటికి తెచ్చి తనే చూసుకొంటోంది.. ఆఫీసుకు నెల రోజులు సెలవు పెట్టి. ఇకపై సెలవులు కూడా లేవు. వదులుకుంటే ఉద్యోగమే వదులుకోవాలి. బంగారం లాంటి జాబ్. ఎంతో కష్టపడితే గాని వచ్చింది కాదు. చూస్తూ చూస్తూ వదులుకోటం ఎలా? 

పాపది టెంపరరీ ప్రాబ్లమ్. ఇంట్లో ఉండి చూసుకునే పిల్లలు దొరుకుతారులే! ఆఫీసులో నేనూ  కనుక్కుంటా. నువ్వూ ఎన్క్వయిరీ చేస్తుండు! అన్నాడు రామం. 

మాట వరసకు ఏదో అన్నాడు గానీ, రామమేమీ అంత సీరియస్ గా ట్రై చెయ్యటంలా! మొగుడు సంగతి తెలుసు కనక, తన ప్రయత్నాలేవో తనే  చేస్తూ ఉంది సీత. 

ఆరోజు పార్వతి అంది. పార్వతి అంటే వాడుకగా పాలు పోసే ఆవిడ. సీత అంతకు ముందే తన ప్రాబ్లమ్ చెప్పింది కనక "సీతమ్మ గారూ! పాపను చూసుకోడానికి ఎవరైనా  కావాలన్నారుగా ? పదేళ్ళ పిల్ల ఉంది. చూస్తారా ?" అంది. 

"మరీ పదేళ్ళ పిల్లా ? పొద్దుట్నుంచీ సాయంత్రందాకా పసిదాన్ని చూసుకోగలదా ?" సందేహంగా అడిగింది సీత. 

"తెస్తాను. ఒక రోజు  చేయించి చూసుకోండి! నచ్చితేనే ఉంచుకోవచ్చు! పాబందీ ఏం లేదుగా !? "అంది పార్వతి పోతూ పోతూ. 

ఆ రాత్రి మొగుణ్ణి కదలేసి చూసింది సీత. ఎప్పట్లానే తలూపాడు రామం. "చేయించుకో సీతా! మరో ఆప్షన్ లేనప్పుడు మనం మాత్రం చేసేదేముంది ? వేరే కూడా చూద్దాంలే! కాస్త పెద్దవాళ్ళు   దొరికేదాకా ఈ పిల్లతోనే సర్దుకుపో!" 

సీతకూ అదే మంచిదనిపించింది. మర్నాడు పార్వతిని అడిగితే ఆమె చెప్పింది వివరాలన్నీ. "చురుకైన పిల్లే తల్లీ! అంతవరకు చెప్పగలను. మీ కాడ కాకపోతే ఇంకెక్కడైనా చేసుకు బతకాల్సిందే! లేకపోతే ఇల్లు గడవదు. ఉళ్ళోని మా ఈపరాలు ఇంట్లో ఈ పిల్ల తల్లి పని చేస్తుంది. ఐదుగురు సంతానం. అంతా ఆడ సంచే. ఆ పిల్ల  మొగుడు తాగి తాగి లివరు పాడై చచ్చాడు పోయినేడాది. ఈ పిల్లకు ముందు ఇంకోటి  ఉందిగాని .. ఈడేరిన బిడ్డను బైటూళ్ళకు పంపించదు ఆ యమ్మి. తెమ్మంటే రేపు తెచ్చి చూపిస్తా ఈ పిల్లను! నాకాడే దింపిపోయింది జయమ్మ.. అదే ఈ బిడ్డ తల్లి. " 

మర్నాడు పార్వతి వెంటేసుకు తెచ్చిన పిల్ల.. పదేళ్ళే అయినా పదమూడు ఏళ్ల పిల్లలా ఉంది. తిండి, బట్ట సరిగ్గా లేక అట్లా ఉంది గాని, మనిషి నవకంగానే ఉంది. 
పనిపిల్ల అందచందాలతో   పనేంటి గానీ, పసిదాన్ని చూస్తే ఎందుకో ముచ్చటేసింది సీతకు. 

"నీ పేరేంటీ ?" అడిగింది సీత. 

పార్వతి చాటున నిలబడ్డ ఆ అమ్మాయి ఏం మాట్లాడలేదు. 

"మొద్దు రాచిప్పల్లాగా అట్లా నిలబడ్డావేంటే ? అమ్మగారు అడుగుతున్నారు .. పేరు చెప్పూ! " 

నెమ్మదిగా గొణిగిందా అమ్మాయి "సీలచ్చిమి"

"పేరు బాగుంది .. నీకు లాగానే. నేను లక్ష్మి అని  పిలుస్తా.. సరేనా ?" 

తలాడించింది శ్రీలక్ష్మి. 

"లక్ష్మీ! మరి మా ఇంట్లో ఉంటావా ?" 

మాట్లాడకుండా నిలబడింది లక్ష్మి. 

పార్వతి కలగజేసుకొని అంది "ఇంటికాడ అంతా వివరంగా చెప్పానులే తల్లీ! కొత్త కదా! చిన్న పిల్ల.. బెరుగ్గానే ఉంటుంది మొదట్లో. బేబీని చూపించండి! దీనికే  హుషారొస్తుంది" 

పాపను చూసి  నిజంగానే లక్ష్మి కళ్ళలో వెలుగొచ్చింది. బిడ్డను ముట్టుకోబోతే పార్వతి గట్టిగా మందలించింది. "అమ్మగారు చెప్తారు! అప్పుడు అంటుకో!" అంటూ. సీత వైపు తిరిగి "పల్లెటూరిది. మీ పద్ధతులేవీ తెలీవమ్మా! నెమ్మది మీద మీరే నచ్చ చెప్పుకోవాల" అంది పోతూపోతూ. 

"పార్వతీ! మరి ఏమివ్వమంటావో చెప్పు! " అడిగింది  సీత. 

"జయమ్మను అడుగుతానమ్మా! మీకైతే సరేగదా ? " 

సీత ఒక మూడు వేలు  పార్వతి చేతిలో పెట్టి  "లక్ష్మికి రెండు డ్రెస్సులు మంచివి కొనిపెట్టు పార్వతీ! మిగిలిందేమన్నా ఉంటే నువ్వుంచుకో ! ఆయనగారికీ చెప్పాలిగా! ఎల్లుండి   శుక్రవారం మంచి రోజు. అప్పుడు తీసుకురా!" అంది సీత. 

లక్ష్మి అనుకున్న దానికన్నా ఎక్కువ చురుకుగా ఉంది. కొత్తదనం పోయి ఇంట్లో కలివిడిగా తిరుగుతోందిప్పుడు. బేబీ మీద నుంచి దృష్టి మరల్చటమే లేదు. చెప్పిన టైం ప్రకారం అన్నీ వేళకు చేయటం.. అదీ తీరుగా చేయటం బాగా నచ్చింది సీతకు. పిల్ల ఇంతలేదు.. ఒకసారి చూపించగానే బేబీకి డైఫర్లు మార్చడం కూడా ఇట్టే పట్టేసింది. 

ఆ రాత్రి సీత రామంతో అంది బెడ్రూంలో ఉల్లాసంగా "మా అమ్మ లేని లోటు తీరుస్తుందండీ లక్ష్మి. బేబీని గురించి చింత లేదు నాకింక " 

"అమ్మ అంటున్నావు. మరి నువ్వూ ఆ పిల్లను అమ్మలా  చూసుకోవాలి!" అన్నాడు ముసిముసిగా  నవ్వుతూ.. 

బేబీని అస్తమానం ఒళ్ళోనే పెట్టుకొని ఆడించటం .. టీవీలో సినిమా చూస్తూకూడా బిడ్డ మీద నుంచి ధ్యాస మళ్ళించకపోవటం.. అదీ చూసి సీత ఆనందంతో తబ్బుబయిపోయింది. సెలవులు పూర్తయి ఆఫీసుకు వెళ్ళేనాటికి సీత బేబీని గురించి బెంగెట్టుకోవటం మానేసింది. ఆఫీసులో మధ్య మధ్య ఫోన్ చేసి వాకబు చేయటం కేవలం విధాయకంగానే. 

విషయం విని అసూయపడింది కొలీగ్ అనసూయ. "పెట్టి పుట్టావే తల్లీ! మా అమ్మనూ తెచ్చుకొన్నాను పింకీని చూసుకోడానికి. మీ ‘అమ్మ’తో మాత్రం పోటీ పడలేకుండా ఉంది! " 

తల్లి మనసులో మెదిలే సరికి సీత కళ్ళు తడయ్యాయి. అనసూయ అన్న మాట నిజమే! 'అమ్మే లక్ష్మి రూపంలో తనింటికి వచ్చిందేమో !' అనిపించింది సీతకు. 

ఉదయం ఆఫీసుకు పోతూ బేబీకి కావల్సినవన్నీ సర్ది ఉంచడం, సాయంత్రం ఆఫీసు నుంచి రాగానే కూతుర్ని కాస్సేపు ఆడుకోవటం తప్పించి సీతకు మరో పని లేకుండా పోయింది. రాత్రి పక్కలో పడుకో బెట్టుకునే వరకూ బేబీకి ఇప్పుడు లక్ష్మీనే అన్నీ! బేబీ కూడా లక్ష్మికి బాగా దగ్గరయి పోయింది. 

రోజులు గడిచిపోతున్నాయి కుదుపులేవీ లేకుండా! ఆరోజు ఆఫీసులో ఉండగా ఇంటి నుంచి ఫోన్.. నాన్నగారి గొంతు అంత గద్గదంగా వినిపించటం అదే మొదటి సారి! "నీతా! అమ్మ నిన్ను చూడాలని కలవరిస్తోంది. బేబీ, అల్లుడితో కలిసి ఉన్న పళంగా బైల్దేరు తల్లీ.. ఆట్టే టైం లేదు!" 

విషయం అర్థమైంది. కుప్పకూలిపోయింది సీత. మనిషి మనిషిలో లేదు. ఆఫీసు కొలీగ్సే పూనుకొని రామాన్ని పిలిపించి కారులో ఎక్కించారు ఇద్దర్నీ. అనసూయ ఇంటికి వెళ్ళి బేబీని తెచ్చి రామాని కిచ్చింది. 

కారులో ఉన్నంత సేపూ సీత ఏడుస్తూనే ఉంది. బేబీ సంగతి కూడా పట్టలేదామెకు. ఇల్లు చేరేసరికే తల్లి లోకం విడిచి వెళ్ళిపోయింది. చాలా కాలానికి సీతను చూసిన సంతోషం కూడా లేదు ఇంటి కొచ్చిన బంధువులకు. 

ఈ గోలలో ఎందుకని బేబీని పక్కనున్న  పిన్నిగారింట్లో పెట్టాడు రామం. తల్లి తరలి వెళ్ళిపోయిన తరువాత గానీ సీత ఈ లోకంలోకి రాలేకపోయింది. 

ఆ పూట కక్కటిల్లే బేబీని తెచ్చి ఆమె ఒడిలో ఉంచారు  బంధువులెవరో. అయినా బేబీ ఏడుపు ఆపనే లేదు. ఎవరెంత సముదాయించినా లాభం లేకపోయింది. 

బిడ్డ ఆకలికి తాళలేక పోతుందేమోనని ఎవరో పాల సీసా తెచ్చారు. సీసా నోట్లో పెట్టనీయలేదు. బలవంతంగా పట్టించిన పాలు కూడా బైటికి కక్కేసింది. అప్పుడు గాని గుర్తుకు రాలేదు  సీతకు లక్ష్మి సంగతి. 

సీత వళ్ళు ఒక్కసారి జలదరించింది.

"అయాం సారీ! హడావుడిలో ఆ పిల్ల సంగతి పట్టనే లేదు. మా బాస్ కి ఇన్ఫాం చేసి పర్మిషన్ తీసుకొనే వత్తిడిలో ఉండిపోయా ? పక్కింటి వాళ్ళకు చెప్పి వచ్చాలే!" అనేసాడు రామం లైట్ తీసుకొని. 

'ఈ గోలలో లక్ష్మి సంగతి  తనకే పట్టలేదు. బైటవాళ్ళకేం పడుతుంది ? 
'పిచ్చి పిల్ల... ఏమయిందో ? తన  ఇల్లు తప్ప బైటి ప్రపంచం బొత్తిగా తెలీదు ఆ అమాయకురాలికి. తనది తప్ప ఎవరి ఫోన్  నెంబర్లూ తెలీవు."  సీతకు ఏడుపు ఆగలేదు.

పక్కింటి ఆంటీకి కాల్ చేసింది సీత. ఫోన్ నెంబరు  మారినట్లుంది .. ఎన్ని కాల్స్ కీ రెస్పాన్స్ లేదు. పార్వతికైనా కబురు అందిద్దామనుకొంది.  కుంభమేళా యాత్ర మధ్యలో ఉన్నానని చెప్పిందామె. "అక్కడికి  మనిషిని పంపిస్తాలే తల్లీ! దాన్ని వాళ్ళ ఊరికి చేరేసే పూచీ నాదీ. తల్లికి దూరంగా ఉండటం అట్లాంటి వాళ్ళకు కొత్త కాదులే! కంగారు పడమాకండి'' అంది పార్వతి. 

పార్వతి మాటలతో సీత మనసు కాస్త  కుదుట పడింది. పనులన్నీ పూర్తయినా నాన్నగారి బలవంతం మీద మరో వారం ఉండిపోయింది సీత. రామం సెలవు లేదంటూ ముందే వెళ్ళిపోయాడు! 

*స్త్రీ ధనం* కింద భార్యకు    సంక్రమించిన బంగారం  యావత్తూ ముగ్గురు కూతుళ్ళకూ ముట్ట జెప్పి తన బాధ్యత తీర్చుకున్నాడు సీత తండ్రి. సీత తన వంతుగా వచ్చిన రెండు గాజులూ, రెండు కాసుల చైను తీసుకొని మరో వారం ఉండి హైదరాబాదు బయలుదేరి వచ్చేసింది. 

లక్ష్మి లేని ఈ రెండు వారాల్లో బేబీ చాలా డల్ గా తయారైంది. మరీ మొదట్లోలా కాకపోయినా ఇప్పటికీ పాప పాలకూ, నిద్రకూ  సరిగ్గా  సర్దుకోలేక పోతోంది. 

సీత వచ్చీరాగానే మొదట చేసిన పని... లక్ష్మిని గురించి పార్వతిని వాకబు చేయటం. "ఇంటికి పంపించాన్లే తల్లీ! జయమ్మ దాన్ని ఇంకో షావుకారు దగ్గర పనికి కుదిర్చింది." అంది నింపాదిగా. బిత్తరపోయింది సీత! 

"అదేంటీ ? ఈ రెండు వారాలకే ఇల్లు మార్పించేశారా ?'' సీత గొంతులో ఉక్రోషం. 

''ఏదోలే తల్లీ! పేదోళ్ళు! రెండు రూపాయలు అదనంగా వస్తుంటే కాదనుకుంటారా ! ఇల్లంతా ఆడసంచు! పేగు బంధం కన్నా పేదరికానికే బలం ఎక్కువ దిక్కు లేనోళ్ళకు" అంటూ సమర్ధించింది పార్వతి కూడా! 

సీతకు దిడి తప్పినట్లయింది. ఇంటి పరిస్థితి మళ్ళీ  మొదటికొచ్చింది. బేబీ కూడా లక్ష్మికి లాగా తనకు మాలిమి కావటం లేదు! రోజురోజుకూ చిక్కిపోతున్న కూతుర్ని చూసి కళ్ళ నీళ్ళొక్కటే తక్కువ సీతకు. 

భార్య బాధ చూడలేక పోయాడు రామం. ఎంత మొగవాడైనా  రోజంతా ఇంట్లో ఆడవాళ్ళు దిగాలుగా ఉంటే తట్టుకోలేడు. 

తనే పూనుకుని పార్వతి ద్వారా లక్ష్మి పని చేసే ఇంటి నెంబరు సంపాదించి కాల్ చేశాడు రామం. లక్ష్మిని తిరిగి ఇంటికి తీసుకురావాలని అతగాడి ప్రయత్నం. 

"ఆ పిల్ల అప్పుడే పని మానేసింది. చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి పారిపోయింది." అని జవాబొచ్చింది! 

మర్నాడు పార్వతి వచ్చినప్పుడు అడిగితే మరీ చిత్రమైన సంగతి బైటపడ్డది! 'షావుకార్లు బానే చూసుకొన్నారు. దీనికే ఏ తీపర మొచ్చిందో.. వారం తిరక్కుండానే  పారిపోయింది. ఈడేరే వయసు. ఇంటిక్కూడా చేరలేదు. ఏమయిందోనని జయమ్మ ఒకటే ఏడుపు. ఆపతరం కాకుండా ఉంది దాని గోడు" అని కన్నీళ్ళు పెట్టుకుంది పార్వతి. 

సీత దిగ్గుండె పడిపోయింది. వింటున్నదల్లా గోడకు అల్లాగే చేరగిల పడిపోయింది. పసిపిల్ల ఏడుపు కూడా పట్టించుకొనే లోకంలో లేదు.

సీతను చూసి ఆశ్చర్యమేసింది రామానికి. భార్యకు పని పిల్లతో ఇంత అనుబంధమా ?! చాలా గిల్టీగా అనిపించి చల్లగా అక్కణ్ణుంచి  తప్పుకొన్నాడు.. నెమ్మది మీద తనే సర్దుకుంటుంది లెమ్మని. 

పాపకు మరీ బాగా లేకపోతే ఆసుపత్రిలో చూపించుకొచ్చి  అప్పుడే ఇంటికొచ్చింది  సీత. ఇంటి ముందు పోలీసు కారు! కంగారు పడింది. లోపల ఖాకీ యూనిఫాం వ్యక్తి పోలీసు ఆఫీసరు కాబోలు.. 
రామంతో ఏదో మాట్లాడుతున్నాడు సోఫాలో కూర్చుని. 

భుజం మీది బేబీతో  లోపలికొచ్చిన సీతకు ఓ మూల లక్ష్మి కనిపించింది ముంగాళ్ల మీద తల వాల్చుకుని! ఆశ్చర్యం.. ఆ వెంటనే ఆనందం! ఉద్వేగం తట్టుకోలేక బిగ్గరగా అరిచేసింది, "లక్ష్మీ! లక్ష్మీ!..  ఎక్కడున్నావే ఇన్నాళ్ళూ" 

కూర్చున్నదల్లా గభాలున లేచింది   లక్ష్మి. ఒక్క ఉదుటన పరుగెత్తుకుంటూ వచ్చి సీత ముందు నిలబడ్డది. అప్పటికే ఏడ్చి ఏడ్చి ఆ పిల్ల కళ్ళు ఉబ్బున్నాయి. చింపిరి జుత్తు.. మాసిన బట్టలు.. చిక్కి శల్యమైన లక్ష్మి అవతారం చూసి సీతకు దుఃఖం ఆగలేదు. అమాంతం కుడి చేత్తో ఆ పిల్లను దగ్గరకు లాక్కుని  గుండెకు అదుముకుంది. లక్ష్మి కూడా సీత నడుమును గట్టిగా చుట్టేసుకొని బిగ్గరగా ఏడవటం  మొదలుపెట్టింది. ఆ అలికిడికి తల్లి భజం మీద నిస్త్రాణగా పడుకొన్న బేబీ తలతిప్పి చూసింది. 

ఎదురుగా లక్ష్మి! ఒక్కసారిగా ఆపాప ముఖం వెలిగిపోయింది! రెండు చేతులు జాపి లక్ష్మి మీదకు దూకపోయింది. చెయ్యి చాచిందల్లా ఠక్కున ఆగిపోయి "ఆగాగు.. ముందు చేతులు కడుక్కురానీ బేబీ !" అంటూ వెనక్కు  తగ్గింది లక్ష్మి. 

లక్ష్మి ముందుకు లాగి  ఆమె చేతుల్లో  బేబీని పెట్టేసింది సీత. బేబీ కిలకలలతో నట్టింటి గంభీర వాతావరణం ఒక్కసారి తేలిక పడింది. 

"సో..ఈ అమ్మాయి వెతికే ‘తల్లి’ మళ్ళీ  దొరికింది. అవర్ టాస్క్ ఈజ్ ఫుల్ ఫిల్డ్ సక్సెస్ ఫుల్లీ" అంటూ లేచాడు పోలీసాఫీసరు. 

"ఇక ఈ 'బేబీ తల్లి' ఇల్లు వదిలి పారిపోకుండా మెడకు వేసే బెల్టు" అంటూ  పుట్టింటి నుంచి తెచ్చుకొన్న తల్లి  కాసుల పేరు లక్ష్మి మెడలో వేసింది సీత. 

లక్ష్మి తల్లికి కబురు చేరవేసే పనిలో ఉన్న *రామం కళ్ళకి లక్ష్మి సీతక్కూడా తల్లి* లా అనిపించింది. 
***

No comments:

Post a Comment