Thursday, 26 March 2026

 ఈ నెల (ఫిబ్రవరి 26) "రెడ్డినాడు" మాస పత్రిక లో ప్రచురితమైన నా కథ "తరలిరాదా.. తనే వసంతం".. కథ కి చిత్రాన్ని కూడా నాచేతే గీయించిన ఎడిటర్ గారికి ధన్యవాదాలతో....



కథ:  *తరలిరాదా? తనే వసంతం..!!*

అర్ధరాత్రి దాటింది.

కాలేజీ సెంటర్ వద్ద వచ్చి ఆగింది బస్సు. అందులోంచి ఒక నడివయస్కుడు రెండు చేతుల్లో సంచులతో దిగాడు. చలిని తట్టుకునేందుకు పెట్టుకున్న మంకీ క్యాప్ అతడి వాలకాన్ని ఇంకా అమాయకంగా చూపుతోంది.

అతడి బస్సు వద్దకు వచ్చి చుట్టుముట్టిన ఆటో వాళ్ళు అడుగుతున్నారు.. “ఆటో కావాలా?” అంటూ.  అతడికి ఆటో అవసరమన్న విషయం అతడికంటే వారికే ఎక్కువ తెలుసు. తల అడ్డంగా ఊపుతూ రెండు సంచులతో ముందుకు వెళ్లసాగాడు ఆ ప్రయాణీకుడు.

ఆ అర్థరాత్రి సమయంలో తమని కాదని ఎలాగూ అతను వెళ్లలేడని ధీమా ఆ ఐదుగురు ఆటోవాళ్ళది. కాస్త ముందుకెళ్లి వాచీ వంక చూసుకున్నాడతను. ఈ ఆటో వాళ్లలోనుండి ఒకతను వెళ్లి "చెప్పండి సార్! ఎక్కడికెళ్లాలి? .. ఇంకేముండవిప్పుడు !! ఎక్కడికో చెప్పండి?" అంటూ అడిగేసరికి, విధిలేక "గాంధీ కాలనీ. వందిస్తాను!!" అన్నాడతను.

"ఈ టయంలో వందకెవరొస్తారు సార్! -  రెండువందలా యాభై మినిమం అడుగుతాం…చాలా దూరం ఉంది. తెలుసు కదా!  రిటర్న్ లో ఖాళీగా రావాలి " తేల్చి చెప్పాడు ఆటోఅబ్బాయి.

"యాప్ లో వందే చూపుతోందయ్యా! మరీ అంత ఎలా ఇస్తామసలు? పగలయితే సర్వీస్ ఆటోలే ఉంటయి. రాత్రి కాబట్టే వందిస్తానంటున్నా!" ఫోన్ చూపుతూ అన్నాడాయన.

"సరే. ఆ యాప్ లోనే బుక్ చేసుకోండి" అని నవ్వుతూ వెళ్ళాడు ఆటోఅబ్బాయి. అతడి ధైర్యం అతడిది.

ఆ ప్రయాణీకుడు కాసేపు ఆప్ తో కుస్తీపడ్డాడు. ప్రయోజనం లేనట్టుంది.

ఇంతలో ఇంకో బస్సు రావడంతో ఆటోవాళ్ళందరూ దాని చుట్టూ ముగారు. ఎప్పటినుంచో ఈ పరిస్థితిని గమనిస్తున్న అదే ఆటోస్టాండ్ లో చివరనున్న ఒకతను ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు.

“సరే, వందే ఇస్తానంటున్నారు కదా! రండి, కూర్చోండి వెళ్దాం" అంటూ ఆటో స్టార్ట్ చేశాడు. అతనలా అనగానే.. ఆ పెద్దాయన సంతోషంగా ఆటోఎక్కి కూర్చున్నాడు.

ఆటో కదలబోతుందనగా.. మిగతా ఆటోవాళ్ళు వచ్చారు. 

 “ఏరా శివా! ఆటో తీసావా? అరే ఆ బేరం గిట్టుబాటు అయ్యేది కాదురా! వందకు మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వనంటున్నాడు. మేం రామని చెప్పాం కదా? " ప్రశ్నించాడు వాళ్ళలో ఎత్తుగా బలిష్టంగా ఉన్నవాడు ఆటోకు చేయి అడ్డుపెడుతూ.

“సరేలే అన్నా! ఏదో పెద్దాయన.. మనం కూడా అవకాశం ఉందికదాని డిమాండ్ చేస్తే ఎట్లా?” అంటూ వాళ్ల మాటలు ఖాతరు చేయకుండా ఆటో ముందుకు పోనిచ్చాడు.

ఆటో వెనుక నుంచి కేకలు వినపడుతూనే ఉన్నాయి. 

"అరేయ్..  రోజురోజుకీ నువ్వు యూనియన్ రూల్స్ వినడం లేదు. మన యూనియన్ నాయకులకు నీ మీద కంప్లైంట్ చేసి నిన్ను రోడ్డెక్కనివ్వం.. జాగ్రత్త!!" 

వాళ్ళ మాటలకేమాత్రం బెదరకుండా, దాటి వెళ్ళిపోతూ ఆటోలో నుంచే సరే అన్నట్టుగా చెయ్యి ఊపాడు శివ. 

*****

ఆటోలో కూర్చుని ఇదంతా గమనించిన ఆ ప్రయాణీకుడు మాత్రం ఆ విషయాన్ని అక్కడితో వదిలేయలేదు. అలా వదిలేయడానికి ఆయన మామూలు మనిషి కాదు. ఆయనో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. వివిధ పత్రికల్లో కాలమిస్ట్.
లాభాపేక్షలేని స్వచ్ఛందసంస్థ నిర్వాహకుడు కూడా!.. పేరు దేవేంద్ర రెడ్డి.

తర్వాతి రోజు ఉదయమే దేవేంద్ర రెడ్డి అదే కాలేజీ సెంటర్ ఆటోస్టాండ్ కి వెళ్ళాడు. ఆటో డ్రైవర్స్ ని శివ గురించి వాకబు చేశాడు. శివ గురించిన వివరాలు విని విస్తుపోయాడు.

అందరిలా చదువును నిర్లక్ష్యంచేసి, ఏదోక బ్రతుకుతెరువు కోసం ఆటోడ్రైవర్ అయినవాడుకాదు శివ. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, ప్రభుత్వ ఉద్యోగం కోసం గ్రూప్స్ కి శిక్షణ పొందివాడు.

చిల్లరకొట్టు నడుపుకునే తండ్రి హఠాన్మరణంతో కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకున్న పెద్దకొడుకు శివ. చెల్లెళ్ళ పెళ్లిళ్ల కోసం తండ్రి చేసిన అప్పులు తీర్చడం కోసం చిల్లర కొట్టుతో సహా స్వంత ఇంటిని కోల్పోయి అద్దెయింటిని అశ్రయించాడు.

తాను తీసుకుంటున్న పోటీపరీక్షల శిక్షణకి ముగింపు పలికి, ఆదాయంకోసం ఉపాధి ప్రయత్నాలు చేశాడు. రెండు-మూడు ప్రయత్నాలు విఫలం అవడంతో, సన్నిహితుల ప్రోత్సాహంతో ఆటోడ్రైవర్ గా మారాల్సి వచ్చింది.

తొలుత దినవారి కిరాయితో ప్రారంభించి, తర్వాత ప్రైవేట్ ఫైనాన్స్ లో అప్పుచేసి స్వంత ఆటో తీసుకోగలిగాడు. తోటి ఆటోడ్రైవర్లు మొదట్లో ఇతడిని అంగీకరించక అవమానపరచినా…క్రమంగా ఇతడి వినయాన్ని, హుందాతనాన్ని చూసి గౌరవించడం మొదలుపెట్టారు.

రోడ్డుపై వ్యవహరించే తీరు, పోలీసులతో మెలిగే విధానమూ, మిగతా అందరికంటే భిన్నంగా ఉండడం…వారు గమనించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఉన్నత విద్యావంతుడు కావడంవల్ల వయసులో పెద్దవారైన కొందరు ఆటోడ్రైవర్లు, తమ యూనియన్ సంఘ నాయకుడిగా శివని ప్రతిపాదించారు. నాయకుడిగా కూడా సమర్థవంతంగానే పని నిర్వహించేవాడు. క్రమశిక్షణగా ఉండి, ఆటోడ్రైవర్ల నందరినీ ఒకతాటిపై నడిపి, ఒకే మాటగా నిలిపాడు.

ప్రభుత్వాలు మారినప్పుడల్లా సంఘాలు మారడం, అధికారం మారడం, విధి విధానాలు మారడం… వాటికోసం అనవసర రచ్చలు.. పంచాయితీలు…మొదలైన రాజకీయాలు నచ్చక, అన్ని పదవుల నుండి తప్పుకున్నాడు. మరోవైవు పెళ్లయి పిల్లలు పుట్టడం, వారు చదువుకుంటూ ఉండడంతో, మిగతా విషయాలు అన్నీ పక్కనపెట్టి, చాలా రోజుల పాటు కేవలం బడిపిల్లలను దింపడానికి మాత్రమే వెళ్ళేవాడు. 

తన ఇద్దరు కూతుర్లని బడిలో దింపే క్రమంలో, శివకి వారితో పాటు ఒక టీచర్ని కూడా స్కూల్ లో దింపే అవకాశం వచ్చింది.  ఆమె ద్వారా తగిన అవకాశాలు వెతుక్కుని తనకిష్టమైన రాజనీతి శాస్త్రంలో పిహెచ్ డి కూడా పూర్తి చేశాడు శివ. పిల్లలు బడిపూర్తయి కాలేజీలకు వెళ్లే సమయానికి డాక్టరేట్ కూడా సంపాదించాడు.

కోరికయితే తీరింది కానీ, డాక్టరేట్ పట్టా జీవితానికి ఏమాత్రం ఉపయోగపడలేదు.

పిల్లలు పై చదువులకోసం పొరుగూరి హాస్టల్స్ లో ఉండడంతో, మళ్లీ స్టాండ్ లో ఆటో పెట్టే అలవాటులోనికి వచ్చాడు శివ. యూనియన్ నాయకులు మాత్రం ఇతడి గురించి తెలుసినవారు కావడం వల్ల శివని ఎప్పుడూ ఇబ్బంది పెట్టేవారు కాదు. కొంతమంది దుడుకు స్వభావం ఉన్న అసూయాపరులైన అవివేక డ్రైవర్లు మాత్రం శివని కావాలని అడ్డుకుంటూ ఉంటారు. కానీ తను పట్టించుకోడు.

ఈ వివరాలు అన్నీ సేకరించి ఆశ్చర్యపోయిన దేవేంద్ర రెడ్డి  శివ జీవితాన్ని ఎందరికో  ప్రేరణాత్మకంగా  చేయాలనుకున్నాడు. వృత్తి నైపుణ్యాలు లేక ఈనాటి విద్యార్థి తరం కేవలం చదువులంటూ.. సోమరులై పోతున్న ఈ యంత్రయుగంలో, చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగ అవకాశాలు పొందలేక నిర్వేదంలో పడే ఎందరో యువకులకి శివ జీవితం ఒక ఆదర్శ పాఠం కావాలని, శివని గురించిన కథనాలు తనకు బాగా పరిచయమున్న ఒక అభ్యుదయ భావాలు గల పత్రికలో ప్రత్యేకంగా ప్రచురించేలా చేశాడు. అంతేకాక ఆ యేడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సేవా పురస్కారం శివకు అందే విధంగా ప్రయత్నాలు చేసి కలెక్టర్ నుండి అవార్డును పొందేలా చేశాడు.

అంతేకాదు…

శివ తన పరిశోధన కోసం తెలుసుకున్న విషయాలన్నీ అభ్యుదయ పత్రికలో వరుసగా వ్యాసాలుగా ప్రచురించడం పెద్ద సంచలనం అయింది.

శివకి,  శివ భావజాలానికి రాజకీయ రంగంలో మంచి ప్రాచుర్యం లభించింది. శివ రాజకీయ వైదుష్యాన్ని గమనించిన ఆ అభ్యుదయ పత్రిక, శివ ను ఉపసంపాదకుడిగా నియమించి తన ఉదాత్తతను చాటుకుంది.

ప్రతికూల పరిస్థితుల్లో ఉండి కూడా తన నిబద్దతని కోల్పోకుండా, కష్టాల్లో రాజీపడి వ్యసనాల బారినపడి చెడిపోకుండా, ఎంతో క్రమశిక్షణగా మెలిగి, అన్ని పరిస్థితులను అనుకూలంగా మలుచుకోగలిగిన శివ కోసం కాలం అనుకూలమై కలిసి వచ్చింది… తన దరికిరాని వనాల కోసం తానే తరలివచ్చే వసంతంలా..!!


XxxxX

No comments:

Post a Comment