ఆ కాల ధర్మం:
(రచన : మంగు కృష్ణ కుమారి గారు)
రాచవరం జమిందారుకి కళాకారులంటే చాలా గౌరవం.
అతని దివాణంలో చాలామంది పండితులూ, కవులూ ఉండేవారు. తరచూ పండిత చర్చలు జరుగుతూ ఉండేవి. ఒక్కోసారి చుట్టుపక్కల దివాణం నించీ పండితులు వచ్చేవారు. అందరి మధ్యా ఏవో ఒక పోటీలు ఉండేవి.
మరో దివాణం పండితులని తన దివాణం పండితులు ఓడిస్తే, జమిందారు గారు వారికి సన్మానం చేసేవాడు. ఘనంగా బహుమానాలు ఇచ్చీవాడు.
అతని దివాణంలో సుదర్శన శర్మ పెద్ద కవి. అతను తరచూ పండిత చర్చల్లో పైచేయిగా ఉండేవాడు. అతనికి జమిందారు గారు సన్మానాలు చేస్తూనే ఉండేవారు.
సుదర్శన శర్మ భార్య అచ్చమాంబ. ఆమె చాలా విదుషీమణి. భార్యకి దివాణంలో జరిగే విషయాలు చెప్పడం సుదర్శన శర్మకీ, భర్తతో పండిత చర్చలు చేయడం ఆమెకీ అలవాటు.
ఒకరోజు పాలపుంత దివాణంనించీ ఒక పెద్ద కవి వచ్చేడు. పండిత చర్చలో తను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పినవారికి తనే బహుమానం ఇస్తానని, సాయంత్రం లోపల ఎవరూ జవాబు చెప్పలేకపోతే, తనే గెలిచినట్లు జమీందారు గారు తామ్రపత్రం సభలో ఉన్న అందరి కవుల సంతకాలతో, తనకి ఇవ్వాలని అడిగేడు.
జమిందారుకి అంగీకరించక తప్పలేదు. ఆ పండితుడు ఒక చిక్కు ప్రశ్న వేసేడు. సభలో ఎవరూ జవాబు చెప్పలేకపోయేరు. జమిందారు గారు భోజన విరామం ప్రకటించేరు. మళ్ళా మధ్యాహ్నం కూడా సభ ఉన్నది.
జమిందారు గారు, రహస్యంగా సుదర్శన శర్మతో, తన పరువు కాపాడమని అన్నారు.
శర్మ ఇంటికి బయలుదేరేడు. ఇంట్లో అతని మామగారు విశ్వనాథ శర్మ చుట్టపు చూపుగా వచ్చి ఉన్నారు.
భోజనం చేస్తూ కూడా సుదర్శన శర్మ ఆలోచిస్తూ ఉండడం, అతని భార్య అచ్చమాంబ కనిపెట్టి భర్తని విషయం ఏమిటని అడిగింది.
తన మామూలు అలవాటు ప్రకారం సుదర్శనశర్మ … భార్యకి సభలో జరిగినదంతా చెప్పేడు. పక్క ఊరి కవి అడిగిన ప్రశ్నకి జవాబు తెలీటం లేదని కూడా అన్నాడు.
అచ్చమాంబ వింటూనే “అయ్యో. ప్రశ్న కాస్త తికమకగా ఉన్నా జవాబు సులువేనండీ” అంటూ ఆ ప్రశ్నకి జవాబు చెప్పేసింది.
ఎందరో పండితులకి తెలీని జవాబు తన భార్య ఏమీకాకుండా చెప్పీడం సుదర్శన శర్మ ఆశ్చర్య పోయేడు.
ఇదంతా వంటింటి గుమ్మం దగ్గర ఉన్న వంటలక్క బువ్వమ్మ వినేసింది.
శర్మ మధ్యాహ్నం పండిత చర్చలో, తన భార్య చెప్పిన జవాబు చెప్పేడు. పక్కూరి పండితుడు బుర్ర వంచుకొని తన ఓటమిని అంగీకరించి తనే సుదర్శన శర్మ దగ్గర ఓడినట్టు ఒక పత్రం, తన సంతకంతో ఇచ్చేడు.
జమిందారు గారు సుదర్శన శర్మకి ఘనంగా సన్మానం చేసేరు.
వంటలక్క బువ్వమ్మ ఇంకో కవి ఇంట్లో కూడా వంటపని చేస్తుంది.
ఆ ఇంటామెతో, ముందురోజు సుదర్శన శర్మ భార్య అచ్చమాంబ ప్రశ్నకి జవాబు చెప్పిందని చెప్పేసింది.
ఆమె ఈ విషయం తన భర్తకి చెప్పింది. ఆ కవి కసికొద్దీ సాటి కవులందరికీ ఈ విషయం చెప్పేడు.
మరుసటి రోజు దివాణంలో అందరికీ, ప్రశ్నకి జవాబు చెప్పింది సుదర్శన శర్మ భార్య అచ్చమాంబ అని తెలిసిపోయింది. అందరూ తమలో తాము గుసగుసలాడుకోడం మొదలెట్టేరు.
ఆ రోజు సుదర్శన శర్మ మామగారు కూడా సభకి వెళ్ళేరు. అతనికి అక్కడ పరిస్థితి పూర్తిగా బోధపడింది.
అతను, ఇంటికి రాగానే కూతురిని గట్టిగా మందలించేరు. స్త్రీల గౌరవం, భర్త గౌరవంతోనే ఉంటుందని, భర్తకన్నా ఎక్కువ చదివి పాండిత్యం ప్రదర్శించడం భర్తకి అవమానం అని బోధపరిచేడు. అచ్చమాంబ చేత మరెప్పుడూ పండిత చర్చలు భర్త దగ్గర చేయనని, ఎటువంటి కవిత్వం చదవననీ ప్రమాణం చేయించేరు.
అదంతా చూస్తున్నా సుదర్శన శర్మ ఏమీ మాటాడలేదు. అటు పిమ్మట భార్యా భర్తల మధ్య ఎటువంటి కవిత్వపు సంభాషణలు జరగలేదు.
సమాప్తం.
(ఆ రోజుల్లో స్త్రీ తెలివిని సమాజం భరించలేకపోయేది. ఈ కథ నిజంగా జరిగిందే)
🙏🙏🙏🙏🙏
యెనుముల
🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment