Thursday, 26 March 2026

 *_✨..అప్పగింతలు..✨_* 
_[—-తాళ్ళపాక తిమ్మక్క, "సుభద్రా కళ్యాణము"]_
🪻🪻🪻🪻🪻🪻🪻 
*తెలుగులో తొలి కవయిత్రి ఎవరంటే... మనకు తెలిసినంతలో "తాళ్లపాక తిమ్మక్క" పేరే చెప్పాలి. పదకవితా పితామహుడైన అన్నమాచార్యుల పెద్ద భార్య ఆమె. (అంతకు మునుపు గంగాదేవి అనే కవయిత్రి 'మధురా విజయము' అనే సంస్కృత కావ్యం రచించింది).*

*_'అవనిలో తాళ్లపాకాన్నయ్యగారి_* *_తరుణి తిమ్మక్క చెప్పె - దాను 'సుభద్ర_* *_కల్యాణ'మను పాట - కడు మంచి తేట_* *_పలుకుల, నీ పాట - పాడినా విన్న శ్రీహరి_* *_వారికి - చేరువై యుండు'_*

*అని _“సుభద్రా కల్యాణము”_ అనే ద్విపదకావ్యంలో ఉంది. తాళ్లపాక వంశస్థులెవ్వరూ తిమ్మక్కను కవయిత్రిగా ప్రస్తావించలేదు. వ్రాతప్రతుల్లో పై వాక్యాలకు భిన్నంగా ఉన్న మాటల్ని బట్టి తాపీ ధర్మారావు వంటి వారు ఆమె కర్తృత్వాన్ని సందేహించినా.. వేటూరి ప్రభాకరశాస్త్రి, ఆరుద్ర వంటి పరిశోధకులు తిమ్మక్కనే సమర్థించారు.*

*ఆడపిల్లల అలంకరణలు, బొమ్మల పెళ్లిళ్లు, పెళ్లి వేడుకలు, అప్పగింతలు, మగవారి మనసు తీరుపై విసుర్లు - వీటన్నింటినీ చూస్తే ఇది ఆడవాళ్లు తప్ప మగవాళ్లు వ్రాయలేని పాటగా తేలుతుంది.*

*సాధారణంగా స్త్రీల పాటలు ద్విపద ఛందస్సులోనే సాగటం సహజము. 'ఇది ద్విపద మంజరీ వికార మనదగిన గేయ రచన' అని ఈ పాటను పరిష్కరించి వెలుగులోకి తెచ్చిన శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి పేర్కొన్నారు. రెండు పాదాలలో 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం చొప్పున సాగేది ద్విపద. యతి ప్రాసలుంటాయి. ప్రాసరహితమైంది మంజరీ ద్విపద. అందులో రాసింది తిమ్మక్క బహుశ పాటలోని లయను ముఖ్యంగా పట్టించుకోవటాన గణాల కూర్పులో అక్కడక్కడా భంగం కలిగింది. _'శ్రీరమావల్లభులు-శ్రీకృష్ణులెలమి, ద్వారకా పట్టణము- తమరేలుచుండ'_ అనే తొలి చరణాలలోనే ఈ అతిక్రమం కనిపిస్తుంది. గ్రాంథికవ్యావహారికాలు కలగలిసిన కమ్మని పాట ఇది.*

*సుభద్రార్జునులు పెళ్లాడిన తర్వాత రుక్మిణీ కృష్ణులకు నమస్కరిస్తారు. రుక్మిణి వారి నాశీర్వదించి అప్పగింతలు పెడుతుంది. సుభద్రను అక్కున జేర్చుకొని ఇట్లా బుద్ధులు చెపుతుంది.*

*_చనవిచ్చినాడని - సకియరో నీవు_*
*_పలుమాటలకు నెట్లు - పాలుపడ వద్దు_*
*_పొలతి నమ్మగరాదు - పురుషుల నెపుడు_*
*_పలురీతి కృష్ణ స - ర్పమ్ములై యుండ్రు_*
*_కొంచక కృష్ణకు - కూర్మితో నుండు_*
*_వంచన సేయకు - వనిత యెప్పుడును_*
_(—తాళ్లపాక తిమ్మక్క, "సుభద్రా కల్యాణము")_

*ఈ మాటలు చెప్పి రుక్మిణి 'అనుగు మరదల్ని అర్జును చేతి కొయ్యన నప్పగించింది. ఆడబిడ్డను పంపేటప్పుడు చెప్పే జాగ్రత్తలే ఈ మాటలు. భర్త ఒకోసారి భార్యకు చనువిచ్చినా పెత్తనం మారదు. చనువిచ్చాడు గదా అని పరిపరి విధాల మితిమీరి మాట్లాడవద్దని హితవు. రాసలీలా విలాసుడి భార్యగా తన అనుభవంలోంచి చెపుతున్నదా అన్నట్టు మగవాళ్లను నమ్మరాదని పెనిమిటి పక్కనుండగానే చెపుతున్నది రుక్మిణి. కవయిత్రి అనుభవంలోని వాక్యంగా కూడా అనుకోవచ్చు. మగవాళ్లు పలురకాలుగా నల్లత్రాచులుగా మసలుతారని అంటుంది. పగబట్టటం, కాటు వెయ్యటం సర్పలక్షణం. అంతగా ఆడవాళ్లకి కీడు చేస్తారని భావం.*

*'కృష్ణసర్పం' అనటంలో కృష్ణుడినే స్ఫురింపజేస్తుందా?*

*అత్తవారింటిలో సుభద్రకు ముందుగానే ఒక సవతి ఉంది. ఆమే కృష్ణ, లేదా ద్రౌపది. (నల్లనిది కాబట్టి ఆ పేరు వచ్చింది.) భర్తను ఇంకో స్త్రీతో కలిసి పంచుకోవటంలో ఎన్నో ఇబ్బందులుంటాయి. అవి రుక్మిణికి స్వయంగా తెలుసు. కనుకనే సంకోచించకుండా ద్రౌపదితో చెలిమిగా ఉండమంటుంది.*

*అంతకు పూర్వం కపటముని వేషంలో ఉన్న అర్జునుడు తనతో సరసాలాడితే నివ్వెర పోయింది సుభద్ర. అన్నతో చెప్పుకొని అలిగి కూర్చుంది. అప్పుడు కృష్ణుడు 'శిరసు వంచుకయున్న చెల్లెలి జూచి' ఇట్లా పిలుస్తాడు.*

*_"అమ్మరా ముద్దులగుమ్మ రా వేగ_* 
*_కొమ్మరా నవకంపు బొమ్మ రావమ్మ_* 
*_ముత్యాలసరమ రా ముద్దరాలా రా_* 
*_చిత్తజు బాణమా చెలియ రావమ్మ_* 
*_చిలుకల కొలికి రా శృంగారకన్య_* 
*_తొలకరి మెఱుప రా తోయజగంథి_* 
*_పండువెన్నెల రావె భాగీర్తి రావె_* 
*_గండుగోవిల రావె కమలాక్షి రావె_* 
*_మచ్చెకంటీ రావె మాధవళి రావె_*
*_అమృతంపు తెప్ప రా అరవిరి మొగ్గ_* 
*_బంగారుపెట్టె రా భాగ్యాలబరణి_*

*ముద్దుల చెల్లెల్ని ఇంతకన్నా మురిపెంగా ఎవరు పిలవగలరు? తొలకరిమెరుపు లాగా, పండు వెన్నెలలాగా, అమృతపు తెప్పలాగా ఊహించటం తిమ్మక్కకే సాధ్య మైంది. _"దూరాన పండెరుపు, దొండపం డెరుపు, తొట్టిలో పాపాయి తొలకరి మెరుపు"_ అనే పల్లెటూరి జోలపాటను ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవచ్చు (మా అమ్మనోట నేను విన్న పాట).* 

*తిమ్మక్కగారి సుభద్ర _"ఎగుభుజమ్ముల వాడు-మృగరాజు నడుము, నడచి పుచ్చుకొను నెన్నడుము గలవాడు..."_ అని అర్జునుడిని వర్ణిస్తుంది. విజయవిలాసంలో చేమకూర వేంకటకవి గారి సుభద్ర కూడా... _"ఎగు భుజంబులవాడు మృగరాజు మధ్యంబు, పుడికి పుచ్చుకొను నెన్నడుము వాడు..."_ అంటూ అదే వరసలో అచ్చు గుద్దినట్టు అర్జునుడిని వర్ణిస్తుంది. తాపీ ధర్మారావుగారు తగాదాకి వచ్చినా, చేమకూరవారు తిమ్మక్కను అనుసరించారనుకోవటంలో తప్పేమీ లేదు!*
🌈🌈🌈🌈🌈🌈🌈 
*_--{డాll పాపినేని శివశంకర్ గారి “తల్లీ నిన్ను దలంచి” అనే సంకలన గ్రంథం, 172 నుంచి 175 వ పేజీల లోని అంశం ఇది: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు, ఆత్మకూరు పట్టణం, నెల్లూరు జిల్లా🙏}--_*

No comments:

Post a Comment