🌹*అమ్మ కోసం*
- హెచ్.విజయలక్ష్మి
*చదివితే ప్రస్తుత వాస్తవ సంఘటనకు చాలా దగ్గర గా ఉంది. అందుకే మీతో పంచుకోవాలనే తలంపు తో*.. ...
‘‘చూడు నీతా, పదే పదే ‘వీలుకాదు’ అనే మాటను నా నోటితో చెప్పించాలని ప్రయత్నించకు. ఇక ఈ విషయంలో వాదనలు అనవసరం. నాకు ఆవిడ రావడం కచ్చితంగా ఇష్టం లేదు. ఇదే నా ఆఖరి మాట. ఆపై నీ ఇష్టం’’ విసుగ్గా అని లేచి బయటకు వెళ్లి పోయారాయన- ‘నీ ఖర్మ నువ్వే అనుభవించు’ అన్న రీతిలో.
నాకు నా మాట కాదన్నారనే ఉక్రోషం ఓ వైపూ అమ్మ అసహాయత ఓ వైపూ గుర్తుకు వస్తుంటే, కోపంతోపాటు ఏడుపు తన్నుకు వచ్చింది. అన్యమనస్కంగానే వంట ముగించి అలా నిస్సహాయంగా కూర్చుండిపోయా. నాలుగు రోజులుగా మా భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవ- మా అమ్మ గురించి. నాకు అమ్మంటే చాలా ఇష్టం. ఆవిడతోటి అనుబంధమూ ఎక్కువే. ఊళ్ళో ఒంటరిగా కాలం గడుపుతున్న అమ్మకు అనారోగ్యంగా ఉండటంతో ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించాలనే నా ప్రయత్నానికి అడ్డుకట్ట వేస్తున్నారాయన. అందుకే నాకు ఈ కోపమూ ఉక్రోషమూ.
అమ్మానాన్నల సంతానం నేను(వినీత), అక్క విమల. నాన్న ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. పూర్వపు చాదస్తాలూ మూఢవిశ్వాసాల వల్ల నైతేనేమి- పుత్రుడు ‘పున్నామ నరకం’ నుంచి తప్పించేవాడనీ వంశాన్ని ఉద్ధరించేవాడనీ నాన్న నమ్మకం. అక్క కడుపులో ఉన్నప్పుడు కొడుకే పుడతాడని ఎంతో ఆశగా ఎదురుచూసిన నాన్న, ఆడపిల్ల పుట్టడంతో కాస్త నిరాశపడ్డా, మొదటి బిడ్డను మహాలక్ష్మిగా భావించి కాస్త సర్దుకున్నాడు. కానీ రెండోసారి మాత్రం- ఎవరో ఒక జ్యోతిష్కుడు ఈసారి పుట్టేది కచ్చితంగా మగపిల్లాడేనని చెప్పడంతో నిశ్చింతగా ఉన్న నాన్నకు- నా పుట్టుక ఓ అశనిపాతం, ఓ విద్యుదాఘాతం. ఈసారి మాత్రం ఓటమిని తట్టుకోలేక పోయాడేమో, బాధను మర్చిపోవడానికి తాగుడు అలవాటు చేసుకున్నాడు.
ఆ తరవాత అది నిత్యకృత్యమై, మద్యానికి పూర్తిగా బానిసైపోయాడు. ఎక్కడ లేని డబ్బూ ఆయన తాగుడుకే ఖర్చైపోయేది. ఇంట్లోని అవసరాలు అసలు పట్టించుకోవడం మానేశాడు.
నాన్న బాధ్యతారహితమైన ప్రవర్తన చూసి అమ్మ ఎంతగానో కుమిలిపోయింది. ఎన్నో మంచి మాటలు చెప్పి ఆయన్ని మార్చాలని చూసింది. కానీ వింటేనా? ఇక విసుగొచ్చి- మమ్మల్ని పోషించడం కోసం- ఎప్పుడో సరదాగా నేర్చుకున్న కుట్టుపనినే జీవనాధారంగా చేసుకుంది. అమ్మ జాకెట్లు కుట్టి సంపాదించిన డబ్బు కూడా నాన్న లాక్కెళ్ళిపోయేవాడు. అమ్మ నిస్సహాయతను చూసి మాకు ఏడుపు వచ్చేది. మా కోసం ఆమె పడే కష్టం చూసి అమ్మంటే మాకు ప్రేమాభిమానాలు రెట్టింపు అయ్యాయి.
ఆ స్థానంలోనే నాన్నంటే ఓ రకమైన జుగుప్సా అసహ్యమూ కలగసాగాయి.
మమ్మల్ని చూస్తూనే నాన్న బండబూతులు తిట్టేవాడు. ‘‘ఛీ ఈ ఆడ... పుట్టి నాకేం ఉపయోగం? పైగా పెళ్ళిళ్ళూ పేరంటాలూ అంటూ ఖర్చొకటి. ఛీ..ఛీ..’’ అంటూ విసుక్కునేవాడు. అందుకే మాకు ఆయనంటే భయం. ఆయన ఇంట్లో ఉంటే, మేం బయట అరుగు మీదనో వరండాలోనో ఉండేవాళ్ళం. ఆయన ఎదురుపడితే ఏ పులో సింహమో ఎదురుపడినట్లు ఉండేది. ఆయనన్నా ఆయన నోరన్నా అంత భయం మాకు.
అమ్మ మాత్రం మా కోసం కుట్టు పనే కాదు, ఆ వీధిలో ఎవరికే సాయం కావాలన్నా చేసేది. తన మంచితనంతో అందరినీ ఆకట్టుకుంది. ఎవరింట్లో ఏ ఫంక్షన్ జరిగినా, సాయానికి వెళ్ళేది. వాళ్ళిచ్చిన తినుబండారాలు తాను తినకుండా మాకే తెచ్చిచ్చేది.
అమ్మకు దైవభక్తి ఎక్కువే. అలాగని గంటలు గంటలు దేవుని ముందు కూర్చునేది కాదు. పక్కవారికీ అసహాయులకూ సాయం చేస్తే చాలు, ఆ దైవకృప మన మీద ఉంటుందనేది. అమ్మ మంచితనమే మమ్మల్ని కాపాడుతూ ఉండేదేమో... మేం మాత్రం హాయిగా చదువుకుంటూ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఆటలు ఆడి అలసిపోయి వస్తే వేడివేడి అన్నంలో పచ్చడి కలిపి పెట్టేది. ఆ చేతిలో ఏం మహత్యం ఉందో- ఆ పచ్చడి మెతుకులే అమృతతుల్యంగా అనిపించేవి.
అలా ఏదోలా రోజులు గడుస్తుండగా, నాన్న తాగి ఓ రోజు రోడ్డుపైన అడ్డంగా నడుస్తుంటే వేగంగా వచ్చిన లారీ గుద్దేయడంతో అక్కడికక్కడే మరణించారు. అమ్మ- నాన్న శవం మీద పడి ఏడుస్తుంటే అమ్మను చూసి మాకు ఏడుపు వచ్చింది కానీ, ఆయన పోయినందుకు మాకేం బాధనిపించలేదు. ఎవరో పరాయివాళ్ళు చనిపోయారన్న ఫీలింగ్ కలిగిందంతే.
నాన్న పోయాక అమ్మ ఇక మా కోసమే బతుకుతున్నట్టు ఇంకా ఎక్కువ కష్టపడేది. నేను టెన్త్‌క్లాస్‌కు వచ్చాను. అక్క ఇంటర్ పూర్తిచేసి అమ్మకు కుట్టుపనిలోనూ ఇంటి పనిలోనూ సాయంగా ఉండిపోయింది.
నేను టెన్త్‌క్లాస్ ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యా.
ఆ రోజుల్లో టెన్త్ పాసవ్వడం అంటేనే గొప్ప. ఇక ఫస్ట్‌క్లాస్ వస్తే ఎంతో అపురూపంగా చూసేవారు. అమ్మకైతే ఆనందంతో కళ్ళనీళ్ళు వచ్చేశాయి. ఇంతలో నా క్లాస్మేట్ వచ్చి మిగతా ఫ్రెండ్స్ రిజల్ట్్స కనుక్కుందాం రమ్మని పిలుచుకెళ్ళింది. సాయంత్రానికి ఇంటికొచ్చా.
ఉన్నట్టుండి మబ్బులు కమ్ముకున్నాయి. చల్లటి గాలికి తోడు వర్షం ప్రారంభమైంది కుండపోతగా. నాకు వానంటే భలే సరదా. అరుగు మీద కూర్చుని నేనూ అక్కా వర్షం చూస్తున్నాం. అమ్మ వరండాలో కుట్టు పని చేసుకుంటోంది. పొద్దున ఎప్పుడో తిన్న తిండి. బాగా ఆకలిగా అనిపిస్తోంది.
‘‘అక్కా, ఆకలిగా ఉందే... ఏదైనా వేడి వేడిగా తింటే బాగుంటుంది కదూ’’ అన్నా.
‘‘కొద్దిసేపాగు నీతా, అన్నం వండేస్తాను. తిందువుగానీ’’ అంది అక్క.
లోపల ఉన్న అమ్మకెలా వినిపించాయో మా మాటలు. బయటకొచ్చి తల మీదుగా కొంగు కప్పుకుంటూ, ‘‘లోపల కూర్చోండి, ఇప్పుడే వస్తా’’ అని వెళ్ళిపోయింది.
‘‘అమ్మా, ఇప్పుడెక్కడికి? ఈ వర్షంలో’’ అంటూనే ఉన్నా, అమ్మ వెళ్ళిపోయింది.
ఓ పదిహేను నిమిషాల తర్వాత తడిసి ముద్దయి వచ్చి నా చేతిలో ఓ కవరు పెట్టింది. ‘‘తీసుకో నీతా, ఆకలవుతుందన్నావుగా! తిను నేను చీర మార్చుకుని వస్తా’’ అని లోపలికెళ్ళింది.
కవరులో పొట్లం తెరిచి చూస్తే- వేడివేడి మిరపకాయ బజ్జీలూ వడలూ నోరూరిస్తూ. నాకైతే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నా ఆకలి తీర్చడం కోసం అంత వర్షంలో వెళ్ళి రావడం తలుచుకుంటే నిజంగా అమ్మకు సాటి మరెవరూ లేరనిపించింది.
అమ్మ పొడి చీర మార్చుకుని రాగానే అమ్మ ఒళ్ళో పడుకుండి పోయా. మెత్తని కాటన్ చీర వెచ్చగా మొహానికి తగులుతూ ఉంటే ‘అబ్బ! స్వర్గం ఇంకెక్కడో లేదు. అమ్మ ఒడిలో తప్ప’ అనిపించింది.
ఇలా నా హృదయంలో చెరగని ముద్ర వేసిన మరో సంఘటన... ఉగాది పండుగ దగ్గర పడుతోంది. ఎండలు ఎక్కువ కావడంతో మేం బయట అరుగు మీద పడుకునే వాళ్ళం. అప్పట్లో దొంగల భయం అంతగా ఉండేది కాదు. చల్లగాలికి మంచి నిద్ర పట్టింది. హఠాత్తుగా తెల్లారి మూడు గంటలకు మెలకువ వచ్చింది. పక్కకు తిరిగి చూస్తే అమ్మ లేదు. కుట్టు మిషను శబ్దం వినిపించింది. వరండాలో లైట్ వేసుకుని, కొంగుతో చెమట తుడుచుకుంటూ అమ్మ మిషన్ కుడుతూ ఉంటే చాలా జాలేసింది. ‘‘అమ్మా, ఏంటి ఈ టైమ్‌లో, పొద్దున్నే కుట్టుకోవచ్చుగా. ఇంకా పండుగ చాలా రోజులు ఉంది కదమ్మా’’ అన్నా.
‘‘లేదు నీతూ! అందరూ ఇచ్చినవి బోలెడు ఉన్నాయి. త్వరగా కుట్టి ఇచ్చేస్తే వాళ్ళు డబ్బులిస్తారు. ఆ డబ్బులతో మీకు బట్టలు కొనొచ్చు. అందుకే ఈ తొందర. అయినా నాకూ నిద్ర రాలేదులే, ఊరికే పడుకునే బదులు ఈ పనైనా అవుతుంది కదా అని లేచా. నువ్వు పడుకో. నేను వస్తా కాసేపాగి’’ అంది. అమ్మ మాటలు విని నా గుండె కరిగి నీరయింది. మంచినీళ్ళు తాగి వచ్చి అమ్మనే చూస్తూ అలా పడుకుండి పోయా. ‘భగవాన్, అమ్మ కష్టాలు ఎప్పుడయ్యా తీరేది?’ అని కనపడని ఆ దేవుణ్ణి అడిగా. మనసుని కదిలించే ఇలాంటి సంఘటనలు ఎన్నో. కానీ పై రెండు సంఘటనలు మాత్రం జీవితంలో నేను మర్చిపోలేనివి.
‘నేను మంచి ఉద్యోగం చేసి అమ్మను సుఖపెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మ చేతిని వదలకూడదు’ అని మనసులో శపథం చేసుకున్నా. కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవని నాకా నిమిషంలో తెలియలేదు.
విమలక్క ఓసారి ఫ్రెండ్ పెళ్ళికి వెడితే, అక్కడ ఒకామె అక్క అందం, ఒద్దికా చూసి తన కోడలిగా చేసుకోవాలని ముచ్చట పడింది. ఆమె కొడుకు కూడా ఒప్పుకోవడంతో సంబంధం కుదిరిపోయింది. కట్నంగా పదివేలిస్తే చాలన్నారు. అమ్మ ఉన్న పరిస్థితుల్లో అదే ఎక్కువ. ఇరుగు పొరుగు తలో రకంగా సాయం చేసి ఎలాగోలా అక్క పెళ్ళి జరిపించారు. అమ్మ మంచితనం అలాంటిది.
అక్క పెళ్ళి అయిన తరవాత నేనూ అమ్మా మిగిలాం. నేను డిగ్రీతోపాటు టైపూ, షార్ట్‌హాండ్ పాసై, ఉద్యోగాల వేటలో పడ్డాను. ఓసారి ఓ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులో పిలుపు రావడంతో వెళ్ళాను. రిటెన్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ పాసైన తర్వాత ఇంటర్వ్యూకు ఐదుగురం మిగిలాం. మధ్యాహ్నం ఇంటర్వ్వూ కూడా ముగిసింది. రిజల్ట్్స అప్పుడే చెప్తారంటే అక్కడే వెయిట్ చేస్తున్నాం. ఓ పది నిమిషాల్లో ప్యూన్ వచ్చి నోటీసు బోర్డులో లిస్ట్ అంటించడం చూసి గబగబా వెళ్ళాం ఆ వైపు. ఇద్దరబ్బాయిల పేర్లతోపాటు నా పేరూ కనిపించడంతో నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను.
ఇంటర్వ్యూ అధికారులు మమ్మల్ని గ్రీట్ చేసి, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇంటికి పంపిస్తామని చెప్పడంతో థ్యాంక్స్ చెప్పి ఇంటికి బయలుదేరాం.
ఆఫీస్ నుంచి ఇంటికి నడవగలిగే దూరమైనా, అమ్మకు ఈ సంతోష వార్త తొందరగా చెప్పాలని రిక్షా ఎక్కాను. అనుకున్న లక్ష్యం నెరవేరడంతో ఏనుగెక్కినంత సంబరం కలిగింది నాలో. నేనెక్కిన రిక్షా ఓ పూలతేరులా అనిపించి, నాకు నేనే మహారాణిలా ఫీలయ్యా.
ఇంట్లో అడుగు పెట్టగానే అమ్మను చుట్టేశా ఆనందంతో. అప్పుడు చూడాలి అమ్మ మొహం- వేయి చందమామల కాంతితో వెలిగిపోయింది.
నాకు ఉద్యోగం రాగానే నేను చేసిన మొదటి పని- అమ్మను కుట్టు పని మాన్పించడం. కొన్ని నెలల తర్వాత అమ్మ నా పెళ్ళి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ‘‘అమ్మో, నాకు పెళ్ళా! నేను పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే, నువ్వు ఒంటరిగా ఎలా ఉంటావమ్మా. నాకసలు పెళ్ళీ గిళ్ళీ ఏం వద్దు. హాయిగా మనమిద్దరం ఉండిపోదాం’’ అన్నా.
‘‘అలా అనకు నీతా. ఆడపిల్లలను కన్న తర్వాత వాళ్ళను ఓ ఇంటి వాళ్ళను చేయడం తల్లిదండ్రుల బాధ్యత. నీ పెళ్ళి అయితే, నా ఒక్కదానికేం, ఎలాగో గడిచిపోతుంది’’ అనేది అమ్మ.
‘‘అలా ఐతే, పెళ్ళయాక నిన్ను కూడా నాతోపాటే ఉంచుకునేందుకు ఎవరొప్పుకుంటారో వారినే పెళ్ళి చేసుకుంటా’’ అన్నా.
‘‘అది అంత సులభం కాదులే నీతూ. నువ్వు నా గురించి ఆలోచించడం మానేసి, ముందు పెళ్ళి చేసుకో. తరవాత నీ మంచితనంతో మీ ఆయన్ని ఒప్పించి నన్ను నీ దగ్గరకు తీసుకెళ్దువుగాని’’ అంది అమ్మ.
సరేననక తప్పలేదు నాకు. అలా పెళ్ళయిపోయింది.
మా ఆయన ప్రవర్తన చూస్తుంటే అమ్మను తీసుకురావడం చాలా కష్టమేననిపించింది. ఎందుకంటే ఆయనకు స్వార్థం పాలు ఎక్కువే. ‘నేనూ నా కుటుంబం బావుంటే చాలు. ఎవరెలా పోయినా ఫరవాలేదు’ అనుకునే మనిషి. ఇల్లు శుభ్రంగా ఉండాలి, కానీ అలా ఉండడానికి ఆయనేం హెల్ప్ చేయడు. మనిషిలో దురాశ కూడా ఎక్కువే. తనది పైసా ఖర్చు కాకూడదు. చాలా పొదుపరి అనేకంటే పీనాసి అంటే కరెక్ట్‌గా ఉంటుంది. ఇలాంటి మనస్తత్వం ఉన్న మనిషితో వేగుతూ ఓ బాబుకు తల్లినయ్యాను.
బాబు పుట్టాక మెటర్నిటీ లీవ్ పూర్తి చేసుకుని, బాబుని చూసుకోవడానికి జీతం నష్టం మీద సెలవు పెడతానంటే ఒప్పుకోలేదు. ‘జీతం పోతుంది కదా’ అని బాధ. మా అమ్మను రప్పించుకుందాం అంటే వినకుండా వాళ్ళమ్మను- అంటే, మా అత్తగారిని వెంటపెట్టుకుని వచ్చారు. ఆమెకు గంటకోసారి చిరుతిండీ కాఫీలూ కావాలి. అన్నీ అమర్చినా బాబుని చూసుకోవడానికి ఓపిక లేదనేది. ఆ నెల ఇంటిఖర్చు నాలుగు రెట్లు పెరగడంతో భయపడిపోయిన మా ఆయన మెల్లిగా ఆమెను తిరిగి పల్లెకే పంపించేశారు.
ఇప్పుడైనా అమ్మను తీసుకువద్దాం అన్నా. గత్యంతరం లేక సరేనన్నారు... లేకపోతే జీతం నష్టం కదా. అమ్మ వచ్చాక- బాబు మా ఇద్దరినీ మరిచిపోయి అమ్మమ్మకు చేరికైపోయాడు. అమ్మ ఓపికగా వాడికి చెట్లూ చేమా చూపిస్తూ అన్నం తినిపించేది. ప్రతి పూటా పళ్ళు తినిపించేది. అమ్మ సంరక్షణలో బాబు ఆరోగ్యంగా పెరగసాగాడు. అమ్మతో మా ఆయన ప్రవర్తన అంటీ ముట్టనట్లు ఉండేది. బాబును స్కూల్లో వేశాక అమ్మ వెళ్ళిపోయింది. నాకేమో ఆమె మాతోనే ఉండాలని ఉండేది. కానీ ఆయన సంగతి తెలిసి ఆవిడ ఉండలేకపోయింది.
నాలుగు రోజుల క్రితం ఊరి నుంచి పక్కింటి పిన్నిగారు ఫోన్ చేశారు. ‘అమ్మకేమాత్రం బాగులేదమ్మా నీతా. బాగా నీరసంగా ఉన్నారు. బాగా వీక్‌గా ఉన్నారనీ బలమైన ఆహారం ఇవ్వడంతోపాటు ఎవరైనా దగ్గరుండి చూసుకుంటేనే ఆమె కోలుకుంటారనీ డాక్టరు గారు చెప్పారు.
అమ్మ ఒంటరిగా ఉండి బాగా ఫీలవుతున్నారు. నువ్వు ఎలాగైనా ఆమెను నీ దగ్గరే ఉంచుకో తల్లీ! అక్కకెలాగూ పెద్ద సంసారం. పైగా ఆర్థిక స్వాతంత్య్రం లేదు. నువ్వయితే సంపాదిస్తున్నావు. కాబట్టి నీకు ఫోన్ చేస్తున్నా’ అంది.
అప్పట్నుంచీ ఆయనతో గొడవ.
అమ్మ వస్తే- ఆమె తినేది కొంచెమే ఆయినా, బలం కోసం పళ్ళూ అవీ తేవాల్సివస్తే- అదంతా అనవసరపు ఖర్చు అని ఆయన అభిప్రాయం.
ఇంకో దురాలోచన ఏమిటంటే- అమ్మకేం జబ్బు వచ్చిందో, ఆమెను తీసుకువస్తే, ఆ జబ్బు తమకెక్కడ అంటుకుంటుందోనని భయం. అంతేకాక నీట్‌గా ఉన్న తన ఇల్లు జబ్బు మనిషితో అపరిశుభ్రమై పోతుందేమోనని మరో భయం. కానీ, నాకేమో నా అవసరం కోసం, బాబు సంరక్షణ కోసం ఆమెను పిలిపించుకుని, ఇప్పుడు పట్టించుకోకపోవడం అమానుషం అనిపించింది. ఆమెనలా కరివేపాకులా తీసిపారేయడం నాకు నచ్చలేదు.
‘‘పాపం, అమ్మ మన కోసం ఎంతో చేసింది కదండీ. మనకు కావాల్సినప్పుడు ఆమెతో చాకిరీ చేయించుకుని ఇప్పుడు ఆమె అసహాయ స్థితిలో ఉంటే, ఒంటరిగా వదిలేయడం, మనకేం పట్టనట్టుగా ఉండటం మానవత్వమనిపించుకోదు. మగపిల్లాడని మీ అమ్మ మిమ్మల్ని ఎలా కని పెంచిందో, ఆడపిల్లనైనా మా అమ్మా అలాగే కని పెంచింది. నేను ఇప్పుడిలా ఆర్థికంగా ఇంత మంచి పొజిషన్లో ఉన్నానంటే, దానికి కారణం కచ్చితంగా మా అమ్మే. ఆమె పడ్డ కష్టానికి ఫలితమే ఇది. మీకైనా పొలాలు అవీ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని పెంచడానికి మీ అమ్మ అంత కష్టపడలేదు. కానీ, మా ఫీజులు సర్దడానికి మా అమ్మ ఎంత కష్టపడిందో మీకేం తెలుసు? అలాంటి అమ్మకు చేయూత అందిస్తానంటే, వద్దు అనడానికి మీ మనసెలా ఒప్పింది? అయినా, నేనేమీ మీ జీతం అడగడం లేదు. నా సంపాదనలోనే అమ్మకు ఖర్చు పెడతాను’’ అన్నా.
‘‘అందుకే ఈ ఉద్యోగస్తులను చేసుకోకూడదు. ‘నా డబ్బు, నా ఇష్టం’ అంటూ మాట్లాడతారు. కట్టుకున్న భర్తను లెక్కే చేయరు. అమ్మట... అమ్మ.
లోకంలో ఈవిడ కొక్కర్తికే ఉంది అమ్మ. ముసలిదాన్ని తెచ్చి ఇంట్లో పెడితే, లేనిపోని రోగాలు అంటుకుంటే, హాస్పిటల్ చుట్టూ ఎవరు తిరిగి చచ్చేది?’’ ఆయనలా దారుణంగా మాట్లాడుతూ ఉంటే సహించలేకపోయాను.
‘‘అవున్లెండి, బాబు చిన్నగా ఉన్నప్పుడు ఆమెతో మీకు అవసరం పడింది.
ఇప్పుడు అవసరం తీరింది కనుక ఆమెను వదిలేయాలి. దీనినే ‘ఏరు దాటాక తెప్ప తగలేసే రకం’ అంటారు. అదే ఆమె వెనుక లక్షల ఆస్తి ఉంటే, మీరా మాట అని ఉండేవారా? మీ అంత నిర్దయగా నేనుండలేను. పాతికేళ్ళు పెంచి పెద్ద చేసిన అమ్మ కష్టం ఏనాటికీ మర్చిపోను నేను. అమ్మ నెప్పటికీ వదలను. నేనీ రోజే అమ్మ దగ్గరకు వెళుతున్నా. వీలైతే అక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తా, లేదా ఇక్కడ సిటీలో చూపించుకోమంటే వేరే ఇల్లు తీసుకుని మా అమ్మతోపాటే ఉండి, ఆమెను జాగ్రత్తగా చూసుకుంటా. మనుషుల విలువ వాళ్ళు లేనప్పుడే తెలిసేది. మీ అంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడానికి నేను రాక్షసిని కాను, మానవత్వం ఉన్న మనిషిని.
ఆడపిల్ల ‘అమ్మను చూసుకోకూడదు’ అనే రూల్ ఏం లేదు కదా! తల్లి కోసం కాపురం కూల్చేసుకుందని, లోకం అనుకున్నా లెక్క చేయను నేను. నాకు అమ్మ ముఖ్యం, అంతే. మీ మనసు మారి మీరు నా దారిలోకి వస్తే, సంతోషంగా ఆహ్వానిస్తాను, బై’’ కచ్చితంగా, బల్లగుద్దినట్లుగా చెప్పి, ఆత్మవిశ్వాసంతోనూ ఆయన ఏనాటికైనా మారతాడనే ఆశావహ దృక్పథంతోనూ ముందుకడుగేశాను నేను.
మనసంతా అమ్మ రూపం నిండగా, అమ్మను చూడాలనే ఆత్రుతతో, ఆమెను రక్షించుకోవాలనే ధృఢ సంకల్పంతో, బాబు నెత్తుకుని వడివడిగా నడిచాను బస్టాండ్ వైపు.
Collected by : @Sairam
🌹🌹🌹
No comments:
Post a Comment