Thursday, 26 March 2026

 (ఉషా – పుప్పాల నవరసాల కథల పోటీ-2025లో ఎంపికైన కథ)

*ముసుగు (కథ)*
- దొండపాటి కృష్ణ 

🌿🌿🌿🌿🌿🌿

“నీకోసం ఈ ప్రపంచాన్నే ఎదురిస్తాను...” నివాస్ ప్రతిపాదించాడు.

“రొటీన్ డైలాగులు చెప్పకోయ్...” కిసుక్కున నవ్వింది ఇషిత.

ఆ నవ్వులో తనపై ఉన్న ఇష్టాన్ని గ్రహించాడు. ఒకింత గర్వపడ్డాడు. తను తల్చుకుంటే అతిలోక సుందరి కూడా పడి తీరాల్సిందే! తను వల వేస్తే చేపపిల్లలా చిక్కాల్సిందే! అందానికి అందం, తెగువకు తెగువ అతని సొంతం.

“మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం?” అడిగిందామె. 

“నాకు కావాలనుకున్నవి సాధించుకున్న రోజున...” ఆమె కురుల అలలను సుతారంగా మీటాడు. 

“అదెప్పుడు?” అతని ఛాతీపైన రోమాల్ని మెలిపెట్టి లాగింది.

“ఇవన్నీ నాకెప్పుడు ఇస్తావో అప్పుడు..” కొంటెగా ఆమెను ఆపాదమస్తకం చూశాడు. 

మొదట అర్థం కాకపోయినా క్షణంలో పజిల్ ను కనిపెట్టి, అతని ఉదరాన్ని కొరికింది. నవ్వుతూ వదిలించుకున్నాడు.

“బాగా వేడెక్కిపోయాయ్.. చన్నీళ్ళు పోస్తానుండు..” అంటూ లేవబోతున్న ఇషిత చేతిని పట్టుకుని గట్టిగా నొక్కాడు.

ఆమె చేతుల్ని అతని చేతుల్తో పెనవేశాడు. ఇద్దరి వేళ్ళూ లతల్లా అల్లుకుపోయాయి. కొత్తగా పుట్టుకొచ్చిన కోరికల హార్మోన్లు ఆమెను మాట్లాడనీయకుండా చేశాయి. నిస్సారమైన ఆకాశాన్ని కారుమబ్బులు కమ్ముకున్నట్లు ఆమె శరీరాన్ని మైకం కమ్మేసింది. 
చేతివేళ్లలోని నరాలు పట్టుతప్పి సన్నగా వణికాయి. గుండె చప్పుడు వినిపించేంతగా నిశ్శబ్దం ఆవరించింది. తనువుల దూరం క్రమంగా తగ్గింది. అలజడిని నింపుకున్న పెదవులు అదిరదిరిపడ్డాయి. మల్లెపూవంత తెల్లగా ఉన్న కళ్ళు గులాబి రెమ్మల్లా ఎరుపెక్కాయి. అణువణువులోని వేలకోట్ల నరాలు తీయగా లాగసాగాయి. యంత్రంకన్నా వేగంగా పని చేసిన నాడులు అలసిపోయి స్వేదాన్ని చిందించాయి. ఆ పరిమళం ముక్కుపుటాల్ని తాకగానే ఇషితలో కలవరింత.. అంతలోనే ఎందుకిలా బలహీనపడిపోయానని మథనం.. 

ప్రణయ సాగరాన్ని దాటిన ఆనందంలో నివాస్ నిశ్చింతగా సేద తీరుతున్నాడు. నిశ్చలమైన అతని మొహంలోకి చూసింది. కోరుకున్నవాడికి కానుక.. అంతులేని ప్రేమకు మధురానుభూతి.. రేపు పెళ్ళయ్యాక రోజూ ఇలాంటి మధురిమలను అనుభవాల భరణిలో బంధించుకోవచ్చనుకుందేగానీ దుష్పరిణామాల్ని మాత్రం ఊహించలేకపోయింది. 

నివాస్ స్నేహితుల దగ్గర మాటల చాటింపు వేశాడు. తన విజయగర్వంగా ప్రకటించుకున్నాడు. తనంతటి మగధీరుడు లేడని విర్రవీగిపోయాడు. క్లాసులో వాళ్ళే హాట్ టాపిక్. కాబోయే భార్య గురించి ఎలా నలుగురికి చెప్పాడోనని రగిలిపోయింది ఇషిత.

“ప్రేమించానన్నావ్.. పెళ్లి చేసుకుంటానన్నావ్.. నాకోసం ఏదైనా చేస్తానన్నావ్.. శిఖరాగ్రాన నిలబెడతానన్నావ్.. మరి ఇలా తోసేసావేంటి నివాస్? ఇదేనా మన ప్రేమకు ఫలితం? ఇదేనా నువ్వు చేసిన ప్రామిస్?” గద్దించింది.

“అలా చెప్తేనే కదా మీరు పడేది.. కావాలనుకున్నది మాకు దొరికేది.. నీ విషయంలోనూ అంతే.. ఆశపడింది అందింది. దట్సిట్.. రియల్లీ, వాట్ ఏ టేస్ట్ బేబీ!” నాలుకను కుడినుంచి ఎడమవైపుకు జరుపుతూ పై పెదవికి తాకించాడు.

“యూ స్కౌండ్రల్..” నివాస్ చెంప చెళ్ళుమనిపించింది. ఊహించని పరిణామానికి విభ్రాంతి చెందాడతను. పట్టరాని ఆవేశంతో ఆమె మెడ పట్టుకుని వంచుదామని ప్రయత్నించాడు. అతనికా అవకాశం ఇవ్వకుండా మళ్ళీ చెంప చెళ్ళుమనిపించింది.

“స్టేషన్ ముందు గొడవ చేసైనా నిన్ను పెళ్లి చేసుకోవచ్చు. వాళ్ళ చేత దమ్కీ ఇప్పించి దారిలో పెట్టించుకోవచ్చు. కానీ, నీ నుంచి నేను కోరుకునేది స్వచ్చమైన ప్రేమ మాత్రమే! అది నీ దగ్గర లేనప్పుడు ఎంత చేసినా వేస్ట్..” కన్నెర్ర జేసింది. 

ఇషితను ప్రత్యక్షంగా ఏమీ చేయలేక, పరోక్షంగా ఆమె జీవితంలో మాయని మచ్చలా మారాడు నివాస్. అడిగినవారికి, అడగనివారికీ వాళ్ళిద్దరి మధ్య సంబంధాన్ని ‘టాం - టాం’ వేశాడు. అవి పాదరసంలా జరజరా పాక్కుంటూ వెళ్ళాయి. చాలామంది ఆమెను ఓరగా చూశారు. చాటుగా నవ్వారు. ఘాటుగా గుసగుసలాడారు. ధీటుగా విమర్శించారు.

ఇషిత ఇంట్లో తెలిసింది. అమ్మానాన్నల దగ్గర సిగ్గుతో తల దించుకుంది. వాళ్ళ మొహంలోకి మునుపటిలా ధీమాగా చూడలేకపోయింది. క్రుంగిపోయింది. అవమానంగా అనిపించింది. ఆడదాని మనసును చూడలేనివాడిని తన జీవితంలో దగ్గరకు రానియ్యకూడదని, అసలు పెళ్ళే చేసుకోకూడదని నిశ్చయించుకుంది ఇషిత.

*******

ఫహల్గాం ఉగ్రదాడిమీద ఇషిత రాసిన పాటకు మంచి స్పందనొచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక చిన్న బడ్జెట్ సినిమాలో యుగుళగీతం రాసే అవకాశం అందిపుచ్చుకుంది. 

గలగల పారుతూ సాగిపోయే గోదావరి సెలయేటిని చూస్తుండటమంటే ఇషితకెంతో ఇష్టం. ఆమె మనసు పురివిప్పు నాట్యమాడుతుంది. ఎన్నెన్నో యుగళ గీతాలు పుట్టుకొస్తుంటాయని ఆ ప్రదేశానికెళ్ళింది. 

అక్కడికెళ్ళాక ఒక దృశ్యాన్ని చూసి తేరుకోలేకపోయింది. ఆశ్చర్యంతో ఆమె మెదడు మొద్దుబారిపోయింది. ఎవడినైతే జీవితంలో మళ్ళీ చూడకూడదనుకుందో వాడే ఎనిమిదేళ్ళ తర్వాత కనిపించాడు. నిశ్చలంగా ఉన్న జ్ఞాపకాల్ని రాయితో కొట్టినట్లైంది.

బ్రిడ్జ్ కింద, ఇసుక తిన్నెలపైన నివాస్ మరో అమ్మాయితో కనిపించాడు. అతని ఒడిలో ఆ అమ్మాయి తల పెట్టుకుని పడుకుంది. ఆమె కురుల్ని సరిచేస్తున్నాడతను. ఆమె మనసు కీడును శంకించింది.

అక్రమ సంబంధాలు నెరిపినోడు, మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నోడు, సుఖానుభూతికి పచ్చని తివాచీని పరుచుకున్నోడు, ఎదుటివారి ఈతి బాధలు పట్టని కామాంధుడు, నేడు కూడా అదే దారిలో ప్రయాణిస్తుండటం ఇషితను కలవరానికి గురి చేసింది. అతని గురించి చెప్పి ఆ అమ్మాయికి చెప్పాలనుకుంది. హెచ్చరిద్దామనుకుంది. ఆ ఆలోచన రాగానే ఇషిత అడుగులు వారివైపు వడివడిగా పడ్డాయి. పదడుగుల దూరంలో వాళ్ళున్నారు. ఇంతలో ‘నాన్నా..’ అంటూ మూడేళ్ళ పాప వెనకనుంచి అతన్ని చుట్టేసింది. అతని మెడపైకి ఎక్కింది. ఆ పాప బొద్దుగా, ముద్దుగా ఉంది. నివాస్ ఒడిలో ఉన్న అమ్మాయికి ముద్దు పెట్టింది. 
‘అంటే నివాస్ పెళ్లి చేసుకున్నాడా? వాళ్ళిద్దరూ అతని కుటుంబమా?’ అయోమయంగా చూస్తుండిపోయింది ఇషిత.  

“నిషీ.. దామ్మా.. ఇంటికెళ్ళిపోదాం..” దూరంగా వెళ్తున్న పాపను పిలిచాడు నివాస్. రానని మొండికేస్తోంది పాప. 

“ఏవండీ.. అదలాగే మారాం చేస్తుందిగాని.. వెళ్లి తీసుకురండి..” అందామె. లేచి వెళ్ళాడతను.

ఇషిత ఊహించినట్లుగానే నివాస్ పెళ్లి చేసుకున్నాడు. సుఖ సంతోషాలతో సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. తనలాంటి అమాయకుల జీవితాల్లో చీకటిని నింపినవాడు ఇంత హాయిగా జీవితాన్నెలా ఆస్వాదించగలుగుతున్నాడో ఓ క్షణం అర్థం కాలేదు.
పాపవంక చూసింది. వాళ్లిద్దరికీ ముద్దు పెడుతోంది పాప. తను చిన్నప్పుడు అమ్మానాన్నలకు అలాగే ముద్దు పెట్టేది. కానిప్పుడు, వాళ్ళ వైపే సరిగ్గా చూడలేకపోతోంది. చాలాసార్లు పెళ్లి చేసుకోమని వాళ్ళు బలవంతం చేసినా ఒప్పుకోలేదు. పరిస్థితులు చక్కబడతాయని నచ్చజెప్పినా పట్టించుకోలేదు. బాగా ఆలోచించింది. 

‘చనిపోయినప్పుడే మనిషికి ఎండ్ పాయింట్.. నివాస్ గాని, అతని ప్రేమగాని తనకు ఎండ్ పాయింట్ కాదే..’ అన్నది తట్టింది. ఇషిత ఆలోచనలకు స్పష్టమైన సంకేతం అందింది. మాతృత్వపు మధురిమలను ఆస్వాదించాలనే కోరిక కలిగింది. తనకు తగ్గవాడితోనే బంధం కలుపుకోవాలనుకుంది.

*******

అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి సంబంధం కలుపుకునే పెద్దలు ఆమె సంబంధాన్ని దాటవేస్తున్నారు. ‘అమ్మాయి నచ్చింది. కానీ జాతకాలు కలవట్లేదండీ...’ అన్నవారు కొందరైతే, ‘అమ్మాయికి, అబ్బాయికి వయసులో తేడా లేదు కదండీ...’ అన్నవారు మరికొందరైతే, ‘అమ్మాయి వయసు ముదిరిపోయిందండి. పిల్లలు కలిగే భాగ్యం ఎంతవరకుందో...’ అని తప్పించుకున్నవారు ఇంకొందరు. గ్రహబలం సరిగ్గా లేదని ఇంట్లో పూజలు చేయించారు. ఫలితం లేదు. 

ఎడతెగని ప్రయత్నాల్లో భాగంగా హేమాన్ష్ సంబంధమొచ్చింది. బాధ్యత కలవాడు. నెమ్మదస్తుడు. వ్యక్తిత్వమున్నవాడు. మరీ ముఖ్యంగా ఆడవారి మనసును అర్థం చేసుకునేవాడని తల్లి చెప్పడంతో ఆసక్తి చూపించింది ఇషిత. ఫోన్లో అతనితో మాట్లాడినప్పుడు తమ అభిప్రాయాలు కలిసినట్లనిపించింది. అతని బ్రాడ్ లుక్ ఇషితను ఆకర్షించింది. అతనే సరైనోడనుకుంది. పెళ్లి చూపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెళ్లి చూపులయ్యాయి. తనకు గతంలో జరిగిన విషయాన్ని పెళ్ళికి ముందే కాబోయేవాడితో చెప్పాలనుకుంది. ఇద్దరూ మరో గదిలో కూర్చున్నారు.

“చెప్పండి” అన్నాడు హేమాన్ష్, మూడు నిమిషాల మౌనాన్ని ఛేదిస్తూ..

“అదీ.. అదీ..” ఎలా చెప్పాలో, చెప్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని ఆగిపోయింది. మాట్లాడలేకపోయింది.

“ఏదన్నా ఇబ్బందా?” ఆమె అవస్థను గ్రహించి అడిగాడు హేమాన్ష్.

పెళ్ళయ్యాక వేరే వాళ్ళ ద్వారా తెలియడం కన్నా, తను ఇప్పుడు చెప్పడమే కరెక్ట్ అనుకుంది. నిర్ణయానికొచ్చింది.

“నివాస్ ని ప్రేమించాను. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నాను. ఆ గుడ్డి నమ్మకంతోనే అతనితో కలిశాను. మోసపోయానని తర్వాతే తెలిసింది. బ్రేక్ అప్ అయ్యింది.” అంటూ గతంలో జరిగినదంతా వివరంగా చెప్పింది ఇషిత.

“ఇప్పుడు చెప్పండి. ఈ సంబంధం మీకు ఇష్టమేనా?” సూటిగా అడిగింది. 

సమాధానం చెప్పకుండా బయటకొచ్చేసి, “తెలిసిన వాళ్ళదని, చాలా మంచి సంబంధమని అన్నారు. పోయి పోయి చెడిపోయిన సంబంధమే దొరికిందా మీకు? ముందూ వెనక ఎంక్వయిరీ చేసుకోరా?” తల్లిదండ్రులవైపు గుర్రుగా చూశాడు హేమాన్ష్.

“ఇలాంటి పిచ్చి కూతలు కూసిందెవరురా?” అడిగారు అతని తల్లిదండ్రులు.

“ఆ బంగారమే..” ఇషిత వంక చూడడానికి కూడా హేమాన్ష్ కు మనస్కరించలేదు. 

“బావగారూ! నిజమేనా?” అడిగాడు హేమాన్ష్ తండ్రి. నిందితుడిలా తల దించుకున్నాడు ఇషిత తండ్రి.

“ఆ అమ్మాయే నా శీలం పోయిందని పెళ్ళికిముందే చెప్తే మళ్ళా ఆయన్ని అడుగుతారేం.. పదండి..” అన్నాడు హేమాన్ష్.

“చూడు హేమాన్ష్, శీలం పోవడం వేరు! మనిషి మోసపోవడం వేరు! నోరు జారకండి..” హెచ్చరించింది ఇషిత.
ఆమె ప్రవర్తన హేమాన్ష్ తల్లికి నచ్చలేదు. కాబోయే కోడలి గురించి ఏదేదో ఊహించుకుంది. కానిప్పుడు..

“వదినగారూ.. మీరు ఎలాంటివారో నాకు తెలిసే ఈ సంబంధం కలుపుకుందామని వచ్చాం.. కానీ మీ అంత పవిత్రంగా మీ కూతురు లేదని తెలిసిపోయింది. ఆ విషయాన్ని అడుగుతుంటే ఎలా మాట్లాడుతుందో చూడండి.. ఇంతదూరం వచ్చింది అవమానం పడటానికా?” ఈ సంబంధం వద్దని పరోక్షంగా చెప్పేసింది హేమాన్ష్ తల్లి.

“ఆంటీ, నేనిప్పటికీ పవిత్రమే.. సాటి ఆడవారు, మీరే అర్థం చేసుకోకపోతే ఎలా?” అర్థం చేసుకోమన్నట్లు అంది ఇషిత.

“ఆడదాని శరీరంపై కాబోయేవాడికే హక్కుండాలి. అలాంటి హక్కు హేమాన్ష్ కి లేదని తెలిసి కూడా అభ్యుదయమనే ముసుగును తగిలించుకోవాలా?” ఆశ్చర్యపోయింది హేమాన్ష్ తల్లి.

“అందరూ ఆ ‘ముసుగు’ తగిలించుకునే ఉన్నారు. చేసుకోవడం, చేసుకోకపోవడం మీ ఇష్టం. కాదనను! కానీ, ‘ఒక్కసారి కలిస్తేనే’ ఆ హక్కును కోల్పోయినట్లంటే నేనొప్పుకోను. పవిత్రురాలిని కాదంటే అంగీకరించను.” అంది ఇషిత.

“ఒక్కసారైనా, పదిసార్లైనా ఎంగిలి ఎంగిలే కదా.. ఒప్పుకోవడానికి ఇగో ఎందుకో..” వెటకారంగా అన్నాడు హేమాన్ష్.

“ఇగో కాదు. ఆత్మాభిమానం! నేనతన్ని ప్రేమించాను. భర్త అవుతాడనుకున్నాను. ఆ మైకంలోనే ఉన్నాను. అతని దుర్బుద్ధి కనిపెట్టలేకపోయాను. అతనివల్ల మోసపోయానేగానీ పదే పదే ‘ఆ పని’ చేయలేదే.. తెలియక ఒకసారి జరిగింది.” అంది ఇషిత.

“అంటే పెళ్లికిముందు సెక్స్ తప్పు కాదంటున్నావా? మనం ఉన్నది సనాతన హిందూ సంప్రదాయంలోనని మర్చిపోయావా?” సూటిగా అడిగింది హేమాన్ష్ తల్లి.

“సో.. నా క్యారెక్టర్ మంచిది కాదంటారు.. అంతేనా?” వాదించి ఉపయోగం లేదని ఓ నిశ్చయానికి వచ్చింది ఇషిత.

“ఒక మెతుకు పట్టుకుంటేనే తెలిసిపోయింది కదా.. ఇంకెందుకు అడగటం..” తెల్చేసింది హేమాన్ష్ తల్లి.

“మీ ఫ్యామిలీ గురించి అమ్మ చెప్పినప్పుడు, హేమాన్ష్ తో ఫోన్లో మాట్లాడినప్పుడు మీది చాలా బ్రాడ్ లుక్ ఉన్న ఫ్యామిలీ అనుకున్నాను. చెప్తే అర్థం చేసుకుంటారనుకున్నాను. మీలో కలుపుకుంటారని నమ్మాను. అందుకే, పెళ్ళయ్యాక ఎవరి ద్వారానో తెలియడం కన్నా, ముందే చెప్పడం కరెక్ట్ అని నేనే చెప్పాను. కానీ మీరు కూడా అందరిలాగానే ముసుగును తగిలించుకుని తిరుగుతున్నారు.” అంది ఇషిత.

“ప్రతివాడూ కన్యనే భార్యగా రావాలనుకుంటాడు. అయితే, వచ్చినామె కన్యో కాదో ఎలా చెప్పగలరు? ఎవరికీ తెలీకుండా చాటుమాటు వ్యవహారం నడిపితే ఏం చేయగలరు? నేను వాదించట్లేదు.. అందర్నీ ఒకేతాటికిందకు లెక్కగట్టొద్దూ అంటున్నా.. మీ దృష్టికోణాన్ని మార్చుకోమనే చెప్తున్నా..” చెప్పింది ఇషిత. అర్థం కానట్లు చూశాడు హేమాన్ష్.

“అంటే..” అడిగాడు హేమాన్ష్ తండ్రి.

“నన్నిప్పుడు దోషిగా చూస్తున్నారే, మరి మీ అబ్బాయి ఈ క్షణం వరకూ బ్రహ్మచారిగానే ఉన్నాడని మీ అమ్మమీద ప్రమాణం చేసి చెప్పగలరా అంకుల్?” సూటిగా గురి చూసి బాణం వదిలింది ఇషిత.

తండ్రి ఏం చెప్తాడోనని బిత్తరపోయి చూస్తుండిపోయాడు హేమాన్ష్. వాళ్ళ మౌనాన్ని చూసి ఇషితనే అందుకుంది.

“పొరబాటున ఒకసారి జరిగితేనే ‘శీలం పోయింది’ అంటున్నారు. మేం మరో జీవికి ప్రాణం పోస్తాం కాబట్టే మీరింతగా పట్టించుకుంటున్నారు. మీరు ఏ జీవికీ ప్రాణం పోయలేరు కాబట్టే పట్టింపు లేదు. ఒక విషయం చెప్పనా అంకుల్, ఆడవారిలో ఒక ప్రాణం పురుడుపోసుకునేది మగవాడి వలనే.. ఆడవాళ్ళు సృష్టిస్తున్నారు కాబట్టే నింద పడుతున్నారు. అంకుల్, టీనేజ్ లో సెక్స్ అనేది ఓ బలహీనత. దాన్ని నిగ్రహించుకోకుండా నలుగురితో తిరిగితేనే శీలాన్ని కోల్పోయినట్లు.. మన కేరక్టర్ ని కోల్పోతేనే శీలాన్ని కోల్పోయినట్లు..” నిఖార్సుగా చెప్పింది ఇషిత.

“మావాడు ఎలాంటివాడో నువ్వు నాకు చెప్పాల్సిన పని లేదమ్మా.. మీ పేరెంట్స్ మీదున్న గౌరవంతో ఇంతసేపూ మాట్లాడాం. ఇంకా ఇక్కడుండి నీతో మాటలు పడాల్సిన అవసరం మాకు లేదు.” సమర్ధించుకున్నాడు హేమాన్ష్ తండ్రి.

ఆయనలో ఉద్భవించిన ఆవేశాన్ని  గమనించిన ఇషిత తండ్రి, వాళ్లకు చేతులెత్తి దణ్ణం పెట్టాడు, ఇక వెళ్లమన్నట్లు.. గొణుక్కుంటూ వెళ్తోన్న వాళ్ళను చూస్తోంటే ఇషిత మనసు కకావికలం అయ్యింది.

‘శీలం ముఖ్యమా? 
మనఃస్థితి ముఖ్యమా? 
చాలామంది రెండూ ముఖ్యమే అంటారు. రెండూ అవసరమే అంటారు. ఏది లేకపోయినా విలువ లేదంటారు. అవి రెండూ ఉన్నాయో లేదో నిర్థారించడానికి ప్రామాణికాలేమిటో ఎవరూ చెప్పరు.
సాటి మనిషిని మనిషిలా చూడటం మానేశారు. నేనెటువైపు కాదంటూనే ఏదోవైపు స్టాండ్ తీసుకుంటున్నారు. తను చేసిన దాంట్లో తప్పు కనిపించదు. వెతకడు కూడా.. ఎవరైనా చెప్తే ఒప్పుకోడు. అదే ఎదుటివారు చేసిన దాంట్లో తప్పుందని నిరూపించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాడు.

వయసు వేడిలో పొరపాటు జరిగితే శీలం పోయినట్లేనా? జీవితానికి మాలిన్యం అంటుకున్నట్లేనా? అటువంటివారి జీవితానికి వెలుగే ఉండదా? ఒకరి జీవితాన్ని అంధకారం చేసే హక్కు మిగతావాళ్ళకెవరిచ్చారు? ధర్మబద్దంగా తప్పొప్పులెవరూ చూడట్లేదు. బలవంతుడెటువైపుంటే అదే ఒప్పయిపోతుంది. ఒకరి భవిష్యత్ మరొకరి చేతుల్లో ఉండటం ఎంత శోచనీయం!’

ఇషిత మనసు తన ఆధీనంలో లేదు. ఆలోచనలతో కూడిన జ్ఞాపకాలు సమాధానం చెప్పలేని ప్రశ్నలను సంధిస్తూ, ముళ్ళ కిరీటంలా అతుక్కుపోతున్నాయి. *

(10-02-2026 ఉషా వారపత్రికలో ప్రచురణ)

No comments:

Post a Comment