Tuesday, 9 September 2025

 🌹
*గరుడగమన గరుడధ్వజ..*

తాళ్లపాక అన్నమాచార్య అధ్యాత్మ సంకీర్తన

గానం. శ్రీ శ్రీవల్సన్ J. మెనాన్ గారు
రాగం. మాల్కౌన్స్

రేకు: 178-6
సంపుటము: 2-391
రేకు రాగము: బౌళి

గరుడగమన గరుడధ్వజ |
నరహరి నమోనమో నమో ||

కమలాపతి కమలనాభా |
కమలజ జన్మకారణిక |
కమలనయన కమలాప్తకుల |
నమోనమో హరి నమో నమో ||

జలధి బంధన జలధిశయన |
జలనిధి మధ్య జంతుకల |
జలధిజామాత జలధిగంభీర |
హలధర నమో హరి నమో ||

ఘనదివ్యరూప ఘనమహిమాంక |
ఘనఘనా ఘనకాయ వర్ణ |
అనఘ శ్రీవేంకటాధిపతేహం |
నమో నమోహరి నమో నమో ||

*గరుడగమన గరుడధ్వజ..*

భావము :



వేంకటేశుని వివిధ విశేషణాలతో కీరిస్తూ అన్నమయ్య రచించిన కీర్తన.

     గరుడుని వాహనముగా గలవాడా! గరుడ చిహ్నము ధ్వజమున కలవాడా! నరసింహావతారా! నీకు నమస్కారము. నమస్కారము.

1. కమలము చేతియందు కలిగినది కమల. ఆమెకు నాథుడా! పద్మము నాభియందు కలవాడా! పద్మమునుంచి పుట్టిన బ్రహ్మ జన్మకు కారణమయినవాడా! పద్మములవంటి కనులు కలవాడా! కమలమునకు ఇష్టమయిన సూర్య వంశములో రామునిగా పుట్టినవాడా! పాపాలను హరించేవాడా! హరీ! నీకు నమస్కారము. నమస్కారము. నమస్కారము.

2. రామునిగా సముద్రాన్ని బంధించిన వాడా! సముద్రములో శయనించేవాడా! పాల సముద్రపు మధ్యలో శేషునితో కూడినవాడా!
సముద్రములో పుట్టిన లక్ష్మిని పెళ్లిచేసుకుని, సముద్రానికి అల్లుడయినవాడా! ( జామాత ). సముద్రములా తెలిసికొనుటకు వీలుకానివాడా! ( గంభీర-తెలుసుకొనుటకు వీలుకానిది గంభీరము ). నాగలిని ఆయుధముగా ధరించినవాడా! హరీ! నమస్కారము. నమస్కారము.

3. గొప్పదయిన దివ్యస్వరూపము కలవాడా! గొప్పవైన మహిమలే గుర్తుగా కలిగినవాడా! వర్షాకాలంలో ఉండే దట్టమైన నల్లని మేఘమువంటి శరీరకాంతి కలిగినవాడా! పరిశుద్ధుడా! శ్రీవేంకట పర్వతానికి అధిపతీ! నీకు నమస్కారము.      

No comments:

Post a Comment