Thursday, 26 March 2026

 వధువు ఎన్నిక: 
(రచన : మంగు కృష్ణ కుమారి)

మంగళాపురంకి చెందిన విశ్వపతీ అఖిలాండేశ్వరి దంపతులకి మొదట ముగ్గురు కూతుళ్ళు. ఆఖరున కొడుకు శివుడు పుట్టేరు. శివుడంటే అక్కలకి ప్రాణం.

శివుడు చదువు ఇంకా మొదట్లో ఉండగానే మొదట పెద్దక్కకీ, తరవాత సంవత్సరం చిన్నక్కకీ, తరువాతి సంవత్సరం ఆఖరక్కకీ కూడా పెళ్ళిళ్ళు అయిపోయేయి. ముగ్గురికీ మొదట ఆడపిల్లలే. పిల్లలకి పెద్దగా వయసు తేడా లేదు.

ప్రేమలూ అభిమానాలూ ఎక్కువగా ఉండే కుటుంబం కాబట్టి అక్కలూ పిల్లలూ తరచూ పుట్టింటికి వచ్చేవారు. వాళ్ళు ఉన్నన్నాళ్ళూ శివుడు అక్కల కొంగు పట్టుకొని, వాళ్ళ పిల్లలని ఆడిపిస్తూ తిరిగేవాడు.

చూస్తూ ఉండగానే శివుడు కళాశాల చదువూ పూర్తి చేసేడు. వాడికి చదువుతూ ఉండగానే మంచి ఉద్యోగం కూడా వచ్చింది. చేరిపోయి ఏడాది దాటింది.

అఖిలాండేశ్వరి కోడలు రావాలని గోల మొదలెట్టింది‌. దానికి తగ్గట్టు ఆమె కూతుళ్ళు ముగ్గురూ తల్లి తండ్రుల దగ్గర తమ కూతురిని తమ్ముడికి ఇచ్చి పెళ్ళి చేయాలని ఉందని అడిగేరు.

అఖిలాండేశ్వరికి కూతుళ్ళంటే ఇష్టం కాబట్టి, మనవరాలు కోడలు అవుతుందంటే ఇష్టమే. ఎవరి పిల్లా అన్నది భర్తని అడిగింది‌. అతను ఎటూ చెప్పలేక, శివుడు ఎవరిని ఎంచుకుంటే ఆ అమ్మాయే అని చెప్పేడు. దంపతులు ముగ్గురు కూతుళ్ళకీ అదే జవాబు చెప్పేరు.

అందరూ శివుడి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆఖరికి శివుడు రానే వచ్చేడు. అతనొచ్చిన రోజు రాత్రే తల్లి, తండ్రులు అంతా చెప్పేరు.

తల్లి ఆత్రం పట్టలేక “ఏమంటావురా? పెద్దక్క కూతురు చాలా పనిమంతురాలు, చిన్నక్క కూతురు చక్కటి చుక్క, ఆఖరక్క కూతురు బాగా చదువుకున్నది. ఎవరిని ఎంచుకుంటావో” అంది.

శివుడు నవ్వి ఊరుకున్నాడు.

మర్నాడు ముగ్గురు అక్కలూ, బావలూ వచ్చేరు. భోజనాలు అవగానే అందరూ కబుర్లు చెప్పుకునే సమయానికి అక్కలు ముగ్గురూ తమ కోరిక చెప్పి తమ్ముడిని జవాబు చెప్పమన్నాడు.

శివుడు అందరిని ఉద్దేశించి అన్నాడు. “అందరూ వినండి. మీ అందరి మనసూ, ఆశా నాకు బోధపడ్డాయి‌. నాకు అక్కలంటే చాలా ఇష్టం. బావలంటే గౌరవం. మీరందరూ నా వాళ్ళు. మిమ్మల్ని బాధ పెడితే నన్ను నేను బాధ పెట్టుకున్నట్టే. అయినా, ఇది పెళ్ళి కాబట్టి అసలు మనసే చెప్పాలి. అవునా?”

అందరూ అవును అన్నట్టే బుర్ర ఊపేరు.

శివుడు మళ్ళా అన్నాడు.  “పెద్దక్కా! నాకు చిన్నప్పుడు ఒక కోరిక ఉండేది. ‘ముగ్గురూ అక్కలే. ఒక చెల్లి ఉంటే బాగుండును అని  అనుకునేవాడిని. అలాంటప్పుడు నీ పెద్దకూతురు పుట్టింది. దాన్ని చిన్నప్పటినించీ నా చెల్లిలాగే చూసేను‌. ఇప్పుడు అభిప్రాయం మారదు“

పెద్దక్క కళ్ళు ఒత్తుకుంది.

“చిన్నక్కా! నీ కూతురు అతిలోక సౌందర్యవతి. దాన్ని చంద్రుడు అంత అందగాడికి ఇస్తే జోడు బాగుంటుంది. నాలాటి సాదా రూపం వాడికి దేనికి? నా స్నేహితుడు నాగదేవుడు చాలా అందగాడు. అతను ఎంతో ధనవంతుడూ మంచివాడు కూడా. అతనికి మీ అమ్మాయిని అడుగుదాం” అన్నాడు.

చిన్నక్క మొహం వికసించింది.

మూడో అక్క దగ్గర ఆగేడు. “బుచ్చెక్కా! మీ అమ్మాయి చదువులో సరస్వతీ దేవి. అంత తెలివైనదాన్ని చదువు మాన్పించి పెళ్ళి దేనికి ఇప్పుడు? దాని చదువు అవనీ, దానికన్నా పెద్ద చదువు చదివిన వాడినీ, మీ అంత ధనవంతుడినీ చూద్దాం. తొందర పడకు” అన్నాడు.

అక్కలు ముగ్గురూ “ఒరే! మరి నీ పెళ్ళి మాటేమిటిరా?” అన్నారు.

శివుడు కొద్దిగా సిగ్గుపడుతూ “నేను పనిచేసే ఊరి కరణం గారింట్లోనే నేను అద్దెకి ఉంటున్నాను. ఆయనకి మొదట కూతురు ఉమాదేవి. తరవాత కొడుకులు. ఉమ ఎంతో అణకువగల పిల్ల. చాలా మంచి పెంపకం. మనమ్మకీ, నాన్నకీ, వాళ్ళకీ అభ్యంతరం లేకపోతే ఉమని నేను పెళ్ళి చేసుకుంటాను” అన్నాడు.

అక్కలు ముగ్గురూ సంతోషపడ్డారు. వాళ్ళు ముగ్గురూ కలిసి కరణం గారింటికి వెళ్ళి తమ తమ్ముడి గురించీ చెప్పేరు. కరణం గారు ఎంతో సంతోషంగా ఒప్పుకున్నారు. ఉమాదేవి మొహం వికసించింది.

కరణంగారు స్వయంగా శివుడింటికి వెళ్ళి, శివుడి తల్లి తండ్రులతో మాటాడి సంబంధం కుదుర్చుకున్నారు.

శివుడికీ ఉమాదేవికి పెళ్ళి వైభవంగా జరిగిపోయింది.

కల్పితం
🙏🙏🙏🙏🙏🙏🙏
యెనుముల 
🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment