పూర్వం మరీచి, ఊర్ణాదేవి అని యిద్దరు ఉండేవారు. వాళ్ళిద్దరికీ ఆరుగురు పిల్లలు పుట్టారు. వాళ్ళు పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు. వీళ్ళు ఆరుగురు ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారి సభకు వెళ్ళారు. వాళ్ళు నిష్కారణంగా బ్రహ్మగారు కూర్చుని ఉండగా ఒక నవ్వు నవ్వారు. అపుడు బ్రహ్మగారు ‘మీరు రాక్షసుని కడుపునా పుట్టండి’ అని శపించారు. అందువలన వారు ఆరుగురు క్రిందటి జన్మలో ‘కాలనేమి’కి కుమారులుగా జన్మించారు. అలా కాలనేమి పుత్రులుగా కొంతకాలం బ్రతికి తదనంతరం హిరణ్యకశిపుని కడుపునా పుట్టారు. అప్పటికి వాళ్ళకి వున్న రజోగుణ తమోగుణ సంస్కారం తగ్గింది. మరల బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. బ్రహ్మగారు వారికి దీర్ఘాయుర్దాయమును ప్రసాదించారు. ఈవిషయమును వారు , అప్పటి తండ్రి అయిన హిరణ్యకశిపునకు చెప్పారు. అపుడు హిరణ్యకశిపునికి కోపం వచ్చింది. ‘నేను యింకా తపస్సు చేసి దీర్ఘాయుర్దాయమును పొందలేదు. మీరు అప్పుడే పొందేశారా?కాబట్టి మిమ్మల్ని శపిస్తున్నాను. మీరు దీర్ఘనిద్రలో ఉండి మరణించండి. అంతేకాకుండా వచ్చే జన్మలో పుట్టినప్పుడు గతజన్మలో తండ్రి ఆ జన్మలో మిమ్మల్ని చంపుతాడు’ అన్నాడు. వాళ్ళు దీర్ఘ నిద్రలో ఉండి చచ్చిపోయారు. మరుజన్మలో మరీచి ఊర్ణల కొడుకులు ఇప్పుడు దేవకీదేవి కడుపునా పుట్టారు. వాళ్ళ శాపం ఈజన్మతో ఆఖరయిపోతుంది. వీళ్ళు యిప్పుడు గతజన్మలోని తండ్రి చేతిలో చచ్చిపోవాలి. గతజన్మలో వీరి తండ్రి కాలనేమి. కాలనేమి యిపుడు కంసుడిగా ఉన్నాడు. కాబట్టి వేరు కంసుడి చేతిలో మరణించాలి. వారికి ఆ శాప విమోచనం అయిపోయి వారు మరల బ్రహ్మజ్ఞానులు అయిపోవాలి. అందుకని నారదుడు వచ్చి వాళ్ళు శాప విమోచనం పొందేలా చేశాడు. అదీ నారదుని రాకలో గల కారణం. ఇది దేవీ భాగవతాంర్గతం.
కుండలోపల వెలుగుతున్న దీపంలా లోకములనన్నింటినీ తన కడుపులో పెట్టుకున్న శ్రీమహావిష్ణువుని తనకడుపులో మోయవలసినటువంటి దేవకి కంసుని కారాగారమునందు మగ్గుతున్నది.
No comments:
Post a Comment