Thursday, 22 January 2026

 @ ప్రొఫెసర్ చివరి పాఠం @

యూనివర్సిటీ నుంచి 
బయటకు వచ్చిన 15 ఏళ్ళకు ...
తనకు ఎంతో ఇష్టమైన ప్రొఫెసర్ 'మోరీ' ని 
టీవీలో చూస్తాడు మిచ్ ఆల్బమ్

ఆయనకు ...
ఏ ఎల్ ఎస్ అనే అరుదైన వ్యాధి సోకిందనీ ఆయనకు డాక్టర్లు రెండేళ్ళే గడువు ఇచ్చారనీ తెలిసి నిర్గ్రాంత పోతాడు

వీలు చూసుకుని 
ఆయనను చూడ్డానికి వెళ్తాడు
ఆరోజు మంగళవారం 

********

తన వయస్సును 
ఎంతమాత్రం లెక్కచేయకుండా 
ఎప్పుడు సరదాగా చురుగ్గా ఉండే ప్రోఫెసర్ మోరీ
ఇప్పుడు చక్రాల కుర్చీ లో
బాధపడతాడు మిచ్...

యూనివర్శిటీలో 
గడిపిన రోజులను గుర్తుచేసుకుని
మనసారా హాయిగా నవ్వుకుంటారు ఇద్దరూ

***********

గురు శిష్యుల ...
సంబంధాన్ని మించి
తండ్రీ కొడుకుల అనుబంధం
వారిద్దరిదీ....

తానింక ...
ఎంతో కాలం ఉండననీ ....
ఇప్పుడు తానే ఒక పాఠ్యపుస్తకాన్ననీ...

జీవితానికీ మరణానికీ 
మధ్య సాగే తన ప్రయాణాన్ని 
అధ్యయనం చేయమనీ...

ఇది నీ ...
చదువులో చివరి ప్రాజెక్టుగా భావించి 
తరుచుగా తనని చూడడానికి రమ్మనీ....

కోరతాడు మోరీ ...

********

గురువుకు 
ఇచ్చిన మాట ప్రకారం...
ప్రతి మంగళవారం వెళతాడు మిచ్ 

అలా... అలా ...
మొత్తంగా మొత్తంగా
పద్నాలుగు వారాల పాటూ ....

ప్రతి వారం 
కొంచెం... కొంచెంగా ...
ఆరోగ్యం దిగజారిపోతున్నా ...

ఏమాత్రం...
తరిగిపోని జీవితేచ్ఛను...
తన చేతులు పట్టుకుని చెప్పిన
జీవిత పాఠాలనూ....

ఒక డైరీలా 
రాసాడు మిచ్ 

ఒక్కో వారం 
ఒక్కో వంశం గురించి మాట్లాడుకున్నా
ఆ చర్చలన్నిటికీ కేంద్ర బిందువు జీవితమే 

********

పేదరికంలో ...
తల్లిని కోల్పోయి.
తండ్రి నిరాదరణలో గడిచిన 
తన బాల్య జీవితంతో మొదలుపెట్టి
ఎన్నో ఎన్నో ఎన్నెన్నో విషయాలు చెబుతాడు మోరి 

స్వార్థం దురాశ 
పైపై మెరమెచ్చుల పాపులర్ కల్చర్ 
లో పడి కొట్టుకుపోవద్దనీ ....

ప్రేమ మానవత్వం 
నైతిక విలువల ఆధారంగా
నీదైన జీవన సంస్కృతిని అలవర్చుకోమనీ
చెబుతాడు మోరీ...

వయస్సు పెరగడమూ
మృత్యువు ఒడిలోకి ఒరగడమూ 
ఎవరికి తప్పదనీ

ఈ ఎరుకతోనే 
ప్రతి క్షణాన్నీ జీవిస్తే...
చివరి రోజుల్లో పశ్చత్తాపాలు ఉండవనీ...

నలుగురి ముందూ నోరారా నవ్వినట్లే....
మనసారా ఏడవడానికి సంకోచించవద్దనీ
అంటాడు మోరీ 

********

క్షీణిస్తున్నారు ఆరోగ్యం 
ముంచుకోస్తున్న మృత్యువు
దాపరికాల్లేకుండా మాట్లాడుకునేలా చేశాయి వారిద్దరిని ....

చావు అంచున నిలబడి 
ఎలా జీవించాలో మోరీ చెబుతుంటే 
తన జీవితంలో అసలు లోపించినదేమటో 
నెమ్మది నెమ్మదిగా అర్థమవుతుంది మిచ్ కి

చివరి క్షణం వరకు 
జీవితాన్ని ఆస్వాదించాలనే మోరీ దృక్పథం 
అందరిలోనూ మంచిని చూసే సహృదయతా 
ఆలోచింపజేస్తాయి 

తను వెళ్ళిపోయాక 
సంతాప సందేశాల్లో ఎవరేం చెప్పేదీ 
తనకు తెలియదు కనుక ...

బతికుండగానే 
అందరినీ తన చెంతకు పిలిచి 
వాళ్లు తన గురించి చెబుతుంటే విని ఆనందిస్తాడు మోరి 

ఆయన ప్రేరణతో ...
చిన్న వయసులోనే తనకు దూరమైన తమ్ముణ్ణి 
హక్కును చేర్చుకుంటాడు మిచ్ 

**********

మోరితో మంగళవారాలు 
మిచ్ ఆల్బమ్ స్వీయ అనుభవాల మాలిక

గురు శిష్యుల కథ నేపథ్యంలో 
సమకాలీన సామాజిక రాజకీయ వ్యాఖ్యానం 

ఇదీ జీవితానికి ఒక క్రాష్ కోర్స్ 

-  మిహిర ( ఈనాడు.నెట్)
 💦 “#అనుభవాలూ – #జ్ఞాపకాలూనూ” 💦
📚 #చదవాలి … #చదవాలి

“మంచినీళ్లు త్రాగుతారా?” అనకూడదు…
👉 “పుచ్చుకుంటారా?” అనాలి —
ఇలాంటి అచ్చతెలుగు సంస్కారం, భాషా సౌందర్యం తెలుసుకోవాలన్నా,
ఓ నిజమైన తెలుగు రచయిత జీవితం చూడాలన్నా,
తెలుగు పదాల మాధుర్యంలో మునిగిపోవాలన్నా
📖 #శ్రీపాద_సుబ్రహ్మణ్యశాస్త్రి గారి
#అనుభవాలూ_జ్ఞాపకాలూనూ చదవాలి.

📖 “త్వరగా చదివితే అయిపోతుందేమో!”
అని భయం కలిగించేంత ఆనందం కావాలంటే
👉 #తిరుమల_రామచంద్ర గారి
#హంపీ_నుంచి_హరప్పాదాకా చదవాలి.

⚖️ కోర్టులో మాట రాక తల దించుకున్న ఒక వకీలు…
ఆ తర్వాత 30 కోట్లమంది మాటను మార్చిన మహానాయకుడు!
ఆయన జీవితంలోని మూడొంతులు తెలుసుకోవాలంటే
👉 #గాంధీ_మహాత్ముని
#సత్యశోధన తప్పక చదవాలి.

🎭
“#తాంబూలాలు_ఇచ్చేశాను_ఇక_తన్నుకు_చావండి”
“#ఎంకి_పెళ్లి_సుబ్బి_చావుకి_వచ్చింది”
“#డామిట్_కథ_అడ్డం_తిరిగింది”

తెలుగువారి నోళ్లలో నానుతున్న నానుడుల వెనుక కథలన్నీ
ఒక్కచోట చూడాలంటే
👉 #కన్యాశుల్కం నాటకం చదవాలి.

⚔️ చిన్న తండా నాయకుని కొడుకు
👉 జగజ్జేతగా ఎదిగిన వైనం తెలుసుకోవాలంటే
#తెన్నేటిసూరి గారి
#చెంఘీజ్ఖాన్ నవల చదవాలి.

📜
తెలుగువారి మహాభారతం…
అరుంధతీ ధర్మారావుల జీవితం చుట్టూ అల్లిన మానవ చరిత్ర…
👉 #కవిసమ్రాట్_విశ్వనాథ వారి
#వేయిపడగలు
తెలుగు తెలిసిన ప్రతివాడూ చదవాలి.

😄 విషాదాన్ని కూడా నవ్వుతో చెప్పగల మేధావి
👉 ముళ్ళపూడి వెంకటరమణ
#కోతికొమ్మచ్చు (మూడు భాగాలూ) చదవాలి.

🕊️
“కుల మతాలు గీచుకున్న గీతలు జొచ్చి…”
అంటూ విశ్వమానవుడిగా నిలిచిన
👉 #జాషువ గారి
సంపూర్ణ కవితా సంకలనం
👉 కళ్ళకద్దుకొని కొనుక్కోవాలి.

🍷
ఉమర్ ఖయ్యాం రుబాయితులను
తెలుగు తేనెలో ముంచిన కవి
👉 #దువ్వూరి_రామిరెడ్డి
#పానశాలలో పద్యాలు తాగాలి.

🔥
#మహాప్రస్థానం, #ఖడ్గసృష్టి
చదవకపోతే…
👉 శ్రీశ్రీని ఇంకా చదవలేదు అనుకోవాలి.
ఇంకా సరదాకు 👉 #సిప్రాలి

🕉️
సనాతన ధర్మంపై సందేహాలన్నీ కరిగిపోవాలంటే
👉 #కంచి_పరమాచార్య
#జగద్గురు_బోధలు (10 పుస్తకాలు)

🧘‍♂️
ఆధ్యాత్మిక సత్యాన్వేషణ అంటే ఏమిటో తెలుసుకోవాలంటే
👉 పాల్ బ్రంటన్
రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ

✒️
సెటైర్ ఎలా ఉండాలో నేర్చుకోవాలంటే
👉 పానుగంటి లక్ష్మీనరసింహరావు
#సాక్షి వ్యాసాలు

📚
ఆశ్చర్యం, ఆసక్తి కలిగించే నిజ జీవిత కథలు కావాలంటే
👉 పి.వి.ఆర్.కె ప్రసాద్
#నాహం_కర్తా_హరిఃకర్తా
#అసలేం_జరిగిందంటే

🧠
భారతీయ & పాశ్చాత్య తత్వవేత్తలు
సులభంగా తెలుసుకోవాలంటే
👉 త్రిపురనేని గోపీచంద్
#తత్వవేత్తలు

🕉️
భగవద్గీతను అమృతంలా ఆస్వాదించాలంటే
👉 #గీతామకరందం

🌊
కృష్ణలో మునకలు వేస్తూ
అమరావతిలో తిరిగిన అనుభూతి కావాలంటే
👉 #అమరావతికథలు

ఆధ్యాత్మిక ఆనందానికి శిఖరం
👉 #ఒకయోగిఆత్మకథ

✍️
కథ రాయాలనుకునేవాళ్లకు బైబిల్
👉 వల్లంపాటి వెంకట సుబ్బయ్య
#కథాశిల్పం

📖
ఇవన్నీ కాక ఇంకా…
రామాయణం, మహాభారతం, భాగవతం, ఉపనిషత్తులు…
తెలుగు గ్రంథాల మహాసముద్రం మీ కోసం ఎదురుచూస్తోంది.

💦💦💦💦💦💦💦💦💦💦

📚 చదవండి… చదివించండి…
తెలుగును ప్రేమించండి.
#తెలుగు_పుస్తకాలు
#చదువే_సంపద
#ReadingIsBliss
#TeluguLiterature
@followers@

Tuesday, 13 January 2026

 🌷🙏తెలుగు వారి 'సీత' శ్రీమతి అంజలీదేవి గారి వర్థంతి  సందర్భంగా....🙏🌷

#తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అంజలీదేవి తన నటనతో చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా సీత పాత్రలో అంజలి నటనకు అప్పట్లో బ్రహ్మరధం పట్టారు.అభినవ సీతమ్మగా పేరొందారు. అచ్చతెలుగు ఆడబడుచు అంజలీదేవి రంగస్థలంతో తన నట జీవితాన్ని ప్రారంభించి అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఒక చిన్న క్యారెక్టర్ తో వెండి తెరపై అడుగు పెట్టిన అంజనీ కుమారి.. అంజలీదేవిగా జానపద, పౌరాణిక, సాంఘిక, సినిమాల్లో నడిచి తనదైన ముద్ర వేశారు.

#ఆమెకు ఆమేసాటి. మరెవ్వరితోనూ పోల్చలేని వ్యక్తిత్వం, నటన, నృత్యం… తెలుగునాట సినీరంగం వేళ్లూనుతున్న తరుణంలో మెరిసిన సువర్ణసుందరి. పదేళ్ల వయసులో తొలిసారి స్టేజిఎక్కి లోహితాస్యుడు పాత్రపోషించారు. ఇలా తలపాగా చుట్టుకుని మగపిల్లాడిపాత్రతో నటనకు శ్రీకారం చుట్టారు. 

#బాల్యం:

అంజలీదేవి 1927, ఆగష్టు 24న తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురంలో జన్మించింది.ఆమె చిన్నప్పటి పేరు అంజనీ కుమారి. సినిమా ప్రస్థానంలో దర్శకుడు సి. పుల్లయ్య ఆమె పేరు అంజలీ దేవిగా మార్చాడు.

#నాటకరంగంలో:

తొలినాళ్లలో కాకినాడ యంగ్ మెన్ హ్యాపీ క్లబ్ లో చేరినతర్వాత అనేక నాటకాల్లో నటించారు. వాటిలో కొన్ని ఆదినారాయణరావు దర్శకత్వం వహించినవి కూడా ఉన్నాయి. – 1941లో మద్రాసులో జరిగిన ఆంధ్రనాటక కళాపరిషత్ లో `ఆంధ్రశ్రీ’ నాటకంలో మాంచాల పాత్రపోషించి ఉత్తమనటి అవార్డు అందుకున్నారు. అప్పటికి ఆమె వయసు 14ఏళ్లు.  విశ్వనాథ సత్యనారాయణగారు రచించిన `వేమరాజు’ నాటకంలో నటించారు.1943లో డిసెంబర్ లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ సర్ ఆర్థర్ హోప్ విశాఖపట్నం వచ్చినప్పుడు అంజలీదేవి నాట్యప్రదర్శన చూసి ఆమె నాట్యతీరుని ప్రశంసించారు.

బొంబాయి అల్లర్లలో ప్రాణభయంతో ఇబ్బందులు పడాల్సివచ్చింది. 40వ దశకంలోనే ఎల్ వి ప్రసాద్ దర్శకత్వంలో టి.సుబ్రహ్మణ్యశాస్త్రి `మేనకోడలు’పేరిట చిత్రం తీయాలనుకున్నారు.ఇందులో నటించాలంటూ అంజలీదేవికి బొంబాయి నుంచి కబురొచ్చింది. తండ్రితో కలిసి బొంబాయి వెళ్లారు. అయితే ఎంతకీ పిలుపురాలేదు. ఇంతలో బొంబాయిలో అల్లర్లు చెలరేగడంతో చేతిలో డబ్బుల్లేక చేతిగాజులు అమ్మేసి టికెట్లు కొనుక్కుని వెనక్కి వచ్చేశారు. ఈ కష్టసమయంలో ఆమె కుటుంబాన్ని ఆదినారాయణరావు ఆదుకున్నారు. కాకినాడలోని తన యంగ్ మెన్ హ్యాపీక్లబ్ లో నెలకు వంద రూపాయల జీతంతో అంజలీదేవిని ఆర్టిస్ట్ గా నియమించారు. – వీధిగాయకులు అనే నాటకం అప్పట్లో సూపర్ హిట్. ఇందులో పాటలకు అంజలీదేవి అద్భుతంగా నృత్యంచేశారు. 
ఆ తర్వాత సంగీత దర్శకుడు  పి. ఆదినారాయణ రావును ఆమె వివాహం చేసుకున్నారు. 

#సీనీరంగం:

చిత్తూరి నాగయ్య పిలుపుతో అంజలీదేవి మద్రాసు వెళ్ళి గొల్లభామ (1947)లో నటించారు. `ఈ పొట్టిపిల్ల ఎక్కడ దొరికిం’దంటూ సినీవర్గాల్లో చాలామంది చెవులు కొరుక్కునేవారట.అయితే అందులో మోహిని పాత్రను పోషించిన తీరుచూసి అంతా ఆశ్చర్యపోయారని చెబుతుండేవారు. – 1948లో బాలరాజు సినిమా సూపర్ హిట్. అందులో ఏఎన్నార్, ఎస్.వరలక్షీ హీరోహీరోయిన్లే అయినా అంజలీదేవికి పాత్ర లభించింది. ఇంద్రసభలో నాట్యంచేసే యక్షిణి పాత్ర అది. ఈ యక్షిణే ఇంద్రుని శాపం కారణంగా మానవకాంతగా (ఎస్. వరలక్ష్మి)గా పుడుతుంది. ఈ సినిమాలో అంజలీదేవి నృత్యం చూసితీరాల్సిందే. వక్కలంక సరళ పాడినపాటకు (ఈ తీయని వెన్నెల రేయి) అంజలీ హోయలుబోతూ చేసిన నాట్యం ప్రేక్షకజనాన్ని ఊర్రూతలూగించింది. – వాహినీవారి కీలుగుర్రంలో కూడా అంజలీదేవిది హీరోయిన్ పాత్రకాదు. రాక్షసి మాయారూపంలో కనిపించే వ్యాంప్ పాత్ర ఇది. అయినా ఆ పాత్రచేయడానికి అంగీకరించి అందరి మన్ననలు అందుకున్నారు. – 1950లో ప్రతిభావారి స్వప్నసుందరి సినిమాలో దేవకన్యలా ప్రత్యక్షమై తెలుగుప్రేక్షకులను మైమరిపించారు. ఈ సుందరి పక్కన అందాల నటుడు అక్కినేని రాకుమారునిగా నటించారు. 

చలాకీగా `పల్లెటూరి’ పిల్లలో నటించి, `పక్కింటమ్మాయి’గా మరింత హుషారు పెంచారు అంజలీదేవి. ఆ తర్వాత హీరోయిన్ గా స్థిరపడ్డాక సొంతంగా సినిమాలు తీయడం ప్రారంభించారు. సొంతబ్యానర్ మీద అక్కినేనితో కలసి `పరదేశి’ సినిమా తీశారు. అటుపైన అనార్కిలి సినిమాతీసి అద్భుతవిజయం సాధించారు. 1957తర్వాత ఆమె చేసిన సినిమాలు ఒక్కొక్కటీ ఒక్కో ఆణిముత్యమే. -`సతీఅనుసూయ’, `చెంచులక్ష్మి’ మరువలేని చిత్రాలు. అంజలీ పిక్చర్స్ నిర్మించిన `సువర్ణసుందరి’ అంజలీదేవి లావణ్యానికీ నటనకు గీటురాయిగా నిలిచింది. – 60వ దశకంవరకు ఆమె హీరోయిన్ గా ఉన్నారు. వయసుపెరగడంతో పాత్రలఎంపిక విషయంలో మెలుకువలు ప్రదర్శించారు. 

ఆ సమయంలోనే ఆమె `#లవకుశ’ సినిమాలో సీతగా ఒదిగిపోయారు. ఆ సినిమా చూసిన తర్వాత #అంజలీదేవి ఎక్కడ కనిపించినా ఆమెను #సీతమ్మతల్లిగానే భావించి దండాలుపెట్టేవారు. `ఎన్నికష్టాలు పడ్డావే నా తల్లీ’ అంటూ పెద్దలు ఓదార్చేవారట.

పెద్దరికంలో `బడిపంతులు’ సినిమాలో అంజలీదేవి ముసలి దంపతుల్లో భార్యగా ఎన్టీఆర్ పక్కన నటించారు. `నీ నగుమోము, నా కనులారా, కడదాకా కననిండూ…’ అన్న పాట ఇప్పుడువిన్నా భావోద్వేగానికి గురికావాల్సిందే. – 240కిపైగా చిత్రాలు నటించారు. 1994లో పోలీస్ అల్లుడు సినిమాలో నటించిన తర్వాత మళ్ళీ ఏ సినిమాలోనూ ఆమె నటించలేదు.

#నిర్మాతగా:

అంజలీ పిక్చర్స్
అనార్కలి (1955) లో అంజలీదేవి నాయికగా అక్కినేని నాగేశ్వరరావు జతన నటించిన సినిమాను నిర్మించింది. ఆ తరువాత భక్త తుకారాం (1973), చండీప్రియ (1980) నిర్మించింది. చండీప్రియలో జయప్రద నాయికగా శోభన్ బాబు, చిరంజీవి లతో నటించింది. మొత్తం ఈ సంస్థ 27 సినిమాలు నిర్మించింది.

*#ఎస్వీఆర్ విషయంలో అంజలీదేవి ఏంచేసిందో తెలుసా…*

ఎస్వీ రంగారావు. నాటకాల్లో వేస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఈయన నటుడవ్వాలని మద్రాసు వెళ్లారు. వెళ్లిన వెంటనే ఛాన్స్ లు రావుకదా.
చేతిలో చిల్లిగవ్వలేక, మంచినీళ్లు తాగి కడుపు నింపుకున్న రోజులెన్నో ఆయన జీవితంలో ఉన్నాయి. పైగా పడుకోడానికి పేపర్లు గతి అయ్యాయి. అలా నిద్రాహారాలు కరువైన పరిస్థితిలో ఇబ్బంది పడుతున్న ఎస్వీ ఆర్ వెనక్కి వెళ్లిపోవాలని అనుకుంటున్న సమయంలో అంజలీదేవి చేయూత నిచ్చింది. అప్పటికే సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తున్న అంజలీదేవి కాకినాడలో నాటకాలు వేసేటప్పుడు ఎస్వీఆర్ తో కల్సి చేసింది. ఎస్వీఆర్ పడుతున్న కష్ఠాలు చూసి, మన ఇంటికి ఎస్వీఆర్ ఎప్పుడొచ్చినా భోజనం పెట్టండి అని వంట మనిషి అయ్యర్ కి చెప్పిందట.
అలా ఆయన ఆకలి తీర్చడమే కాకుండా సినిమాల్లో ఛాన్స్ ఇప్పించింది. అలా 1946లో చేసిన వరూధిని మూవీ ప్లాప్ కావడంతో ఎస్వీఆర్ కి మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి. దీనికి తోడు పెళ్లి కూడా చేసారు. మద్రాసు వదిలి వెళ్ళిపోదామని అనుకుంటున్న సమయంలో ఇలా జరగడంతో డీలా పడ్డాడు. అదే సమయంలో పాతాళభైరవి రూపంలో అదృష్టం తలుపు తట్టింది. ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ఆ సినిమా విజయంతో వరుస పెట్టి ఛాన్స్ లు రావడంతో మహానటుడయ్యారు.

#పురస్కారాలు:

ఫిలింఫేర్ అవార్డ్
*ఉత్తమ నటి - తెలుగు - అనార్కలి (1955)
*ఉత్తమ నటి - తెలుగు - సువర్ణ సుందరి (1957)
*ఉత్తమ నటి - తెలుగు - చెంచు లక్ష్మి (1958)
*ఉత్తమ నటి - తెలుగు - జయభేరి (1959)
*ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్.
*రఘుపతి వెంకయ్య పురస్కారం .
*2005 లో తెలుగు సినీరంగం జీవితకాల సాఫల్యత పురస్కారం.
*రామినేని పురస్కారం - 2006.
*ANR జాతీయ పురస్కారం - 2008.

ఆమె కుమారులిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. అంజలీదేవి 2014 జనవరి 13న కన్నుమూశారు.

#అంజలీదేవికి గుర్తుగా పెద్దాపురంలో విగ్రహం ఏర్పాటు.....

అంజలీదేవిపై ఉన్న అభిమానంతో ఆమె గుర్తుగా పట్టణంలో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆమె అభిమానులు. పైగా ఆమె మరణానంతరం ఆమె పేరుతో ఒక ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తూ ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ప్రతీ సంవత్సరం ఆమె పేరుతో ఫౌండేషన్‌ తరుపున పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

#సాత్విక, కరుణరసాత్మక, పవిత్రమైన పాత్రలతో తెలుగు ప్రేక్షక హృదయాలను మైమరపించిన మహానటి ఆమె. #కలియుగ అభినవ సీతమ్మగా తెలుగు సినీ రంగంలో ఖ్యాతి నార్జించిన అందాల నటి అంజలీదేవి. కేవలం తన నటనతోనే కాకుండా అభినయంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయడం ఆమె ప్రత్యేకత.నటనలో ఆమెకు సాటి మరెవరూ రారు.
వెండితెర అభిమానులకు అజరామర స్మృతులను విడిచి వెళ్లిపోయిన #మహోన్నత వ్యక్తి అంజలీదేవి.
"జీవితమే సఫలము రాగసుధా భరితము…..ప్రేమ కథ. మధురము"
🙏🏵️🌹🌷🌺🌸🙏
Collected by
Dr.A.Srinivasa Reddy
9912731022
Zphs75tyallur,
Pedakurapadu mandal Palanadu district.
 (511) (13.01.2026)

పెళ్ళికి ముందు ఎవరినో కొంగుచాటు మొగుడంటే నవ్వుకుంటువి
నీ పెళ్ళైన తరువాత నిను కొంగుచాటు మొగుడంటే బాధపడితివి //

శ్రీమతి నోటి మాటకి అడ్డు చెప్పకుండా 
శ్రీమతి చేసే పనులకు ఏనాడూ అడ్డు తగలకుండా
ఆ భగవంతుడు ప్రసాదించిన తలను ఊపుతూ
ఆమె అడుగులకు మడుగులు వత్తుతూ 
చిరునవ్వుతో నడుచుకున్నావా జీవితం 3 పువ్వులు-6 కాయలు
కాదు అని ఒక్కసారి తల అడ్డంగా తిప్పినావా ఉండవు మెతుకులు //

పుట్టిన బిడ్డల నుంచి పిల్ల నిచ్చిన అత్త-మామల వరకు
నిను కన్న వారి నుంచి – రాబోయే అల్లుళ్ళు-కోడళ్ళ వరకు
ప్రతి దానికి నీవు సంజాయిషీ ఇచ్చు కోవలసి వస్తుంది
ఆపై ఊపిరి ఉన్నంత వరకు నరకం అనుభవించాల్సి వస్తుంది //

ఈ బాధలు ఎలాగూ అనుభవించక తప్పదు కనుక
శ్రీమతి చెప్పిన ప్రతి దానికి కాదు – లేదు అని అనక
ముందుకు అడుగులు వేసినావా నీవు ధన్యుడివి
కాదని ఎదురు తిరిగినావా అవుతావు  గోడ మీద బొమ్మవి //

ఆ దేవుడు రాసిన రాతను నీవు ఎలాగూ మార్చి రాయలేవు
అలాగని ధైర్యం చేసి నీ శ్రీమతిని నీవు మార్చుకోలేవు //

నీ జీవితమంతా శ్రీమతి కొంగు చాటు మొగుడివే
సమాజంలో నీ బ్రతుకు ఆమెకు తోడు కోసం వచ్చిన వాడివే
అంతకన్నా నీకు ఏమి పెద్ద స్టేటస్ అనేది ఉండదు
ఎదురు తిరిగినంత మాత్రాన నీ స్టేటస్ ఏమి మారదు //

గొడవలు పడి శ్రీమతికి దూరం కావాలని అనుకోకు
కొంగు చాటు మొగుడనే బిరుదు చూచి బాధపడకు
నీ 50 ఏళ్ళ జీవితంలో నీవు ఎందరినో చూచుంటావు
వాళ్ళ సమాజంలో నీవు ఒక కొత్త సభ్యుడిగా చేరుతావు //

శ్రీమతి కొంగు చాటున తిరిగినావా నీకు రక్షణ ఉంటుంది
ఫలానా ఆమె మొగుడు అన్న పేరు వస్తుంది
నలుగురిలో గుర్తింపు కలుగుతుంది
ఏ ఒడిదుడుకులు లేకుండా నీ జీవితం సాఫీగా సాగుతుంది //

లేని పోని ఆలోచనలు ఏవో పెట్టుకుని
ఆపై భుజాలపై శంఖు-చక్రాలు రెండు వేయించుకుని
చిరునవ్వుల జీవితాన్ని చేజేతులా పాడు చేసుకోకు
కొంగు వదిలేసి మందులతో జీవితాన్ని నడిపించబోకు //

కొంగు పట్టనోడు నూటికో-కోటికో ఒక్కడు ఉంటాడు
వాడు ఏనాడో జీవితాన్ని పాడుచేసుకున్నాడు
వాడి జాబితాలో నీవు చేరాలని అనుకోకు
తప్పటడుగులు వేసి దెబ్బలు తగిలించుకోకు //

మూడు ముళ్ళు వేసినాక ఈ బాధలు అనుభవించక తప్పదు
కొంగు పట్టుకు తిరగకున్నా నీకు కొత్తగా గౌరవం ఏమీ రాదు
నీ జీవితంలో  నీ పేరును మటుకు నీవు మరుస్తావు
ఫలానా ఆమె మొగుడు అన్న పేరుతో పిలవబడతావు
పాత పేరు తీసేసి కొత్త పేరు పెట్టారనుకో
సమాజంలో నీకు ఓ కొత్త స్ధానం కల్పించారని తెలుసుకో //

సరదాగా రాసిన కవిత

మధిర వెంకట రమణ, హైదరాబాద్
 సమయం రాత్రి ఎనిమిదైంది..  

సంక్రాంతికి పొద్దున్నే పుట్టింటికి బయల్దేరాలి కాబట్టి ముందురాత్రే ఇంటిముందు ముగ్గులు పెట్టేయడానికి రెడీ అయ్యింది మా ఆవిడ.. చాక్ పీసుతో ముగ్గులు గీసుకుని వాటి మీద బ్రష్ తో పెయింట్ వెయ్యడానికి సరంజామా అంతా సిద్ధం చేసుకుంది.. 

ఈ తతంగమంతా పైన బాల్కనీలో నిలబడి గమనించాను నేను.. 

ఈమధ్య ఆఫీసు బిజీలో పడి అమూల్యమైన మధురానుభూతులెన్నో కోల్పోతున్నాను..

నా చిన్నప్పుడు నెలగంట పట్టాకా వీధంతా ఎంత కోలాహలంగా ఉండేదని.. సాయంత్రాలైతే చాలు.. డ్రైవర్ గారి రేణుకక్క, ఎదురింటి శారదక్క, పక్కవీధి దేవక్కలాంటివాళ్ళు కల్సి ఎడతెగని చర్చలు చేసి వందలాది చుక్కలతో మీటర్ల కొద్దీ ముగ్గులు వీధంతా పరిచేసేవారు.. శ్రేష్టమైన తెల్లటి ముగ్గుపిండితో వేసిన పెద్దపెద్ద ముగ్గులు అందరి గుమ్మాల ముందు కొలువుదీరి ఇంటికొస్తున్నవాళ్లని ఆహ్వానిస్తున్నట్టు ఉండేవి..

ఇప్పుడా కళేదీ.. ఏదేమైనా నాటి నోష్టాల్జియాని తిరిగి పునరావృతం చెయ్యదలిచాను.. 

చైతన్యంగా ముందడుగు వేసి బయటకెళ్ళి "ముగ్గులు పెట్టడంలో నేను కూడా పాలు పంచుకుంటానని" ఇంటావిడకి నా సహాయాన్ని ప్రకటించాను..

"ఏంటి నువ్వా.." ఆశ్చర్యం వ్యక్తం జేసింది..

"పిచ్చిదానా.. ఇంటర్లో ఉండగా బోలెడన్ని తుంటరి కార్టూన్లు గీసిన అనుభవం మనది.. ఈ ముగ్గులెంత..?" అని కరడుగట్టిన ఆత్మవిశ్వాసంతో ఛాలెంజ్ విసిరి అప్పటికప్పుడు రోడ్డుమీదకెళ్లి రామారావుగారి శ్రీరామా ఎంటర్ప్రైజెస్లో ఓ తెల్లపెయింట్ డబ్బా, ఓ పాయింట్ బ్రషు కొనుక్కొచ్చి నా యొక్క అద్భుతమైన ప్రతిభను కనబరచడానికి సిద్ధమయ్యాను..

ముందుగా మా ఇంటి గుమ్మం ముందున్న పిచ్ పరిశీలించాను.. రోడ్డు ఉపరితలం గరుకుగా ఉన్నప్పటికీ పర్లేదు.. ముగ్గుకి పనికొస్తుంది.. అయినా ధోనీ లాంటి బ్యాటర్ కి పిచ్ తో పనేంటి అన్నారు సన్నీలాంటి పెద్దలు.. మా ఆవిడ చాక్ పీసుతో గీసిన ముగ్గుల మీద చేయి తిరిగిన కళాకారుడికి మల్లే అత్యంత శ్రద్ధాసక్తులతో వైట్ పెయింట్ గీయడం మొదలుపెట్టాను..

మా ఆవిడ అవతలపక్క ముగ్గు పెడుతోంది, నేను ఈ పక్కది పెడుతున్నాను..

వీధిలో చెలరేగుతున్న శీతాకాలం దోమలు నా ముగ్గుపోత కార్యక్రమాన్ని త్రికరణశుద్ధిగా అమలు చెయ్యనివ్వట్లేదు.. డిసెంబర్ 31 రాత్రినాటి మందుబాబుల్లా రక్తవిందు చేసుకుంటున్నాయి.. అయినా సరే పట్టించుకోని అకుంఠితదీక్ష నాది.. 

నా చేతిలోంచి నేల మీదకి జాలువారుతోన్న ఈ తెల్లటి పెయింట్ ధార సరికొత్త డిజైన్గా పురుడు పోసుకోవడం ఖాయం.. అత్యంత నైపుణ్యంతో కూడిన ఈ అద్భుతమైన చిత్రీకరణ చూసి రేపొద్దున్న వీధిలో నడిచేవాళ్ళ కళ్ళు అదరడం, గుండెలు చెదరడం డబుల్ ఖాయం.. తద్వారా వాళ్ళు కూడా ఉత్తేజితమయ్యి ఆయా ఇళ్ళముందు ఇలాంటి ముగ్గులు పెట్టుకోవాలన్న కాంక్షని రగిలించగలననడంలో సందేహం లేదు.. 

ఇటుపక్క నా ఊహల్లో నేనున్నాను.. కానీ.. 
మౌనంగా ఉన్న మగాళ్ల మీద ఆడాళ్ళకెప్పుడూ అనుమానమే గనుక నేనేం వెలగబెడుతున్నానాని ఆరాగా తొంగి చూసింది ఇంటావిడ..

"ఆ గీతేంటి అంత లావుంది..??"  నా గీతల వైపు ఆదుర్దాగా చూసి గొణిగింది..

సన్నగా కావాలంట సన్నగా.. నాలాంటి పెద్దచెయ్యి ఉన్న విశాల భావజాల వ్యక్తులకు గీత అలాగే మందంగా వస్తుంది.. అది గర్వించాల్సిన విషయం... పైపెచ్చు సంక్రాంతికి ముగ్గే అందం, సింగరేణికి బొగ్గే ఆధారం అన్నారు నాలాంటి విజ్ఞులు..

అంతటితో ఆగలేదు..

నా ముగ్గు దగ్గరకొచ్చి చూసి కొయ్యబారిపోయింది.. 
"ఛీ.. అంత వంకరగానా.." అని చిరాగ్గా మొఖం పెట్టి ఏదో అనబోయింది..

మా ఆవిడ మీద పరువునష్టం దావా వెయ్యాలనిపించింది. కాకపోతే అది కూడా నాతోనే కట్టిస్తుందని నాకు బాగా తెల్సు కాబట్టి అలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోదల్చుకోలేదు..

"ఎల్లేహే నీకేం తెల్దు.." అని మాత్రం ప్రతిఘటించాను.. 

"అత్తయ్యగారండీ.." గట్టిగా కేకేసింది..

లోపల్నుంచి పరిగెత్తుకొచ్చింది మా అమ్మ..

"చూడండి ఎలా గీసేస్తున్నారో.. అసహ్యంగా ఉన్నాయ్.." రాత్రికి రాత్రి పక్కదేశంవాళ్ళు యుద్ధం ప్రకటించినట్టే ఉంది గొంతులో ఆ ఆందోళన..

నా ముగ్గు చిత్రీకరణవైపు ఎగాదిగా చూసిన మా అమ్మ కూడా విచిత్రంగా మా ఆవిడకే వత్తాసు పలికింది.. 

నేను ముగ్గు మీద గీసిన పెయింటింగు అసహ్యంగా ఉందట.. అది సంక్రాంతి ముగ్గులా కాకుండా చేతబడి ముగ్గులా ఉందని నానా దుర్భాషలాడారు..

ఖిన్నుడ్నయ్యాను.. అమూల్యమైన నా సమయాన్ని వెచ్చించి సహాయం చేయబోతే, కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి బాలేదని పేర్లెడ్తున్నారు.. మనుషుల్లో కృతఘ్నతకి మచ్చుతునక ఇది..

అందంగా వేస్తేనే ముగ్గవుతుందనుకోవడం మీ అవివేకమని వాదించాను.. బాహ్య సౌందర్యారాధనకి అంతగా ప్రాధాన్యత ఇవ్వరాదని కూడా సూచించాను.

వాళ్ళు వినలేదు.. నా చేతిలో పెయింట్ డబ్బా లాక్కుని లోపలకి పంపేశారు తప్ప నాతో ఏకీభవించే ప్రయత్నం చెయ్యలేదు.

సరే ఏం చేస్తాం.. మన ప్రయత్నం మనం చేశాం.. జనాలు దాన్ని హర్షించడం, హర్షించకపోవడం అనేది దైవేచ్ఛ.. ఈర్ష్యాద్వేషాలతో నిండిన ఈ సమాజం నుంచి నేను ఇంతకన్నా ఏం ఆశించట్లేదు..

అయినా లోపం మనది కాదు..

కూరగాయలన్నింట్లోకి దొండకాయ ద్రవ్యరాశి బాగా ఎక్కువ.. ఇందాక పప్పులోకి ఆ దిక్కుమాలిన దొండకాయ వేపుడు తినబట్టే శరీరం కొంచెం బరువు చేసి సరిగ్గా కూర్చోలేకపోయాను.. లేదంటే అలవోకగా పెట్టేద్దును ఈ ముగ్గులు..  ......శ్రీ హరిబాబు మద్దుకూరి వారి రచన.
 'ఆరుద్ర'  ఆరోగ్యాన్ని హరించిన 'సమగ్ర ఆంధ్ర సాహిత్యం'

సమగ్ర ఆంధ్ర సాహిత్యం కోసం 
ఆరుద్ర తన  ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా  శ్రమించారు.
మనకు తెలియని మన తెలుగు సాహిత్య చరిత్రను  ఇదిగో ఇట్లా మన చేతుల్లో  అపురూపంగా పెట్టి తన దారిన తాను వెళ్లి పోయిన  దార్శనికుడు ఆరుద్ర.  
తాను విపరీతంగా సేకరించిన  కట్టల కట్టల,  గుట్టల గుట్టల  పాత పుస్తకాలు, సంచికలు,  రాసుకున్న నోటు పుస్తకాలు, తదితర సరంజామా... అంతా కలిసి  'డస్ట్ ఎలర్జీ 'గా మారి  ఆరుద్ర  ప్రాణానికి ప్రమాదం గా మారాయి. కంటి చూపు కూడా  దాదాపు సన్నగిల్లింది .ఇదే విషయాన్ని వారు సమగ్ర ఆంధ్ర సాహిత్యం మొదటి సంపుటికి రాసిన ముందు  మాట లో స్పష్టంగా   రాశారు.

 '1965 జనవరి నెల నుండి సమగ్ర ఆంధ్ర సాహిత్యం సంపుటాల రచనకు ఉపక్రమించాను. సమగ్రత దెబ్బ తినకూడదని సంపుటాల సంఖ్యను పెంచి అదనపు యుగాలను, ఉపయుగాలను,  చేర్చవలసి వచ్చింది. 1965 ఏప్రిల్ నెల నుండి నవంబర్ నెల దాకా ఎనిమిది నెలలు క్రమం తప్పకుండా ఆసాంతం రచన చేసి  సమగ్ర ఆంధ్ర సాహిత్యం సంపుటాలను అచ్చు ఇవ్వడంతో నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. టెన్షన్ వల్ల రావలసిన రుగ్మతలు వచ్చాయి. గత సంవత్సరం నా రెండు కళ్ళ   ఆపరేషన్  జరగడం వల్ల  గ్రంథరచన కార్యక్రమానికి వీలు కలిగింది' 

నిజానికి,సమగ్ర ఆంధ్ర సాహిత్యం  అనేది  ఏదైనా ఒక పెద్ద యూనివర్సిటీ  పూనుకొని చిత్తశుద్ధితో చేయవలసిన పని. కానీ దాన్ని ఒక వ్యక్తి శక్తిగా మారి  తయారుచేయడం అంటే మాటలు కాదు.సమగ్ర సాహిత్య చరిత్రను ఒక చోటికి చేర్చడానికి పగలూ రాత్రీ కష్టపడ్డారు.ఒక సాహితీ యజ్ఞమ్ చేసారు.ఈ రోజుకు కూడా మనకు  ఎవరో ఒక తెలుగు సాహిత్య కారుడి గురించి తెలుసుకోవాలంటే కూడా మనం ముందు చేతికి 'సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర' అందుకోక తప్పదు.నిజమైన పరిశోధన అంటే అదే.దటీజ్ ఆరుద్ర ! 

తెలుగు  ఒక సబ్జెక్టుగా స్వీకరించి  పోటీ  పరీక్షలు రాసి  ఉద్యోగాలు పొందిన వారు కావచ్చు,  ఇప్పుడు ఇంకా ప్రిపేర్ అవుతున్న వారు కావచ్చు,  తెలుగు అధ్యాపక,  ఉపాధ్యాయ  ఉద్యోగాల్లో ఉన్నవారు కావచ్చు... అందరి మొదటి చూపు 'సమగ్ర ఆంధ్ర సాహిత్యం' పైనే ఉంటుంది. అది ఒక అక్షయ పాత్ర. 

సమగ్ర ఆంధ్ర సాహిత్యం- సంపుటాలు;
పూర్వ యుగము, చాళుక్య చోళ కాలము - (800-1200)
 కాకతీయుల కాలము (1200-1290)
పద్మనాయకుల కాలము (1337-1399)
రెడ్డిరాజుల కాలము (1400 - 1450)
రాయల ప్రాంభ కాలము (1450 - 1500)
రాయల అనంతర కాలము (1500 - 1550)
నవాబుల కాలము (1550 - 1600)
నాయకుల కాలము (1600 - 1670)
అనంతర నాయకుల కాలము (1670 - 1750)
కంపెనీ కాలము (1750-1850)
జమీందారుల కాలము (1850 - 1900)
ఆధునిక కాలము (1900 తరువాత)
#మనమిప్పుడు ఏమి చెయ్యాలి ? మన తెలుగు సాహిత్య చరిత్రను భావితరాల వారికి, మన పిల్లలకు చెప్పడానికి , గుర్తు చెయ్యడానికి తప్పనిసరిగా  'సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర'
ను మీ ఇంట్లో ఉండేలా చూసుకోండి. అది తెలుగు వారి సాహిత్య సంపద. తెలుగు సాహిత్య బంగారు కలశం. మన తెలుగు అక్షర సారధుల సామ్రాజ్యం.
ఈ తెలుగు నేల పైన తెలుగు అక్షరం ప్రసాదించిన వెలుగు.
'సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర'.

ఒక సాహిత్య కారుడు  తన ఆరోగ్యాన్ని అర్పించి ఒక తపస్సులా  తెలుగు సాహిత్య సేకరణ ఎలా చేసాడో ఆ సంపుటాలను చూస్తే మీకు మన 'తెలుగు సాహిత్య వైభవం' కళ్ళముందు కదలాడుతుంది.
ఈ సంపుటాలు ఉన్నంతకాలం తెలుగువారి సాహిత్య విజయ బావుటా లోకానికి చాటి చెప్తూనే ఉంటుంది. మనం  నడిచివచ్చిన కాలాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. మన  తెలుగు మూలాలు,  వేర్లు ఎంత  శక్తివంతమైన, బలమైన ,  దృఢమైన  నేపథ్యాన్ని  పటిష్టంగా కలిగిఉన్నాయో, అట్లా  దేదీప్యమానంగా  గుర్తు చేస్తూనే ఉంటుంది.
ఏమి ఆశించి చేస్తారు  మహానుభావులు ఇంతటి గొప్ప పనులు? అందుకే వారు చరిత్ర పేజీల్లో  నిలిచిపోయిన సాహిత్య నిర్మాతలు!

తెలుగు వారి సాహిత్య చరిత్రను  సమగ్రంగా సేకరించి,  సంస్కరించి,   పరిష్కరించి భద్రపరిచి  ఇలా  మనకు కానుకగా అందించిన మహనీయుడు,  నిజమైన  సాహిత్యకారుడు ఆరుద్ర.  వారికి అక్షర నివాళి.
 గాలిపటం - ఒక ఆత్మగౌరవం .


ఆకాశం ఎవరి అబ్బసొత్తు కాదు..
కానీ, గాలిపటం ఎగరాలంటే మాత్రం
కింద ఎవడో ఒకడు భూమిని నమ్ముకుని నిలబడాలి!
వాడు.. బురదలో కాళ్లున్నా, కళ్లు మాత్రం ఆకాశం మీద ఉన్నవాడు.
 పోరాటం ఒక వెదురు బద్ద.. రెండు కాగితపు ముక్కలు
నలుగురు కలిసి తొక్కేసిన పాత వార్తా పత్రికలు..
అదే దాని శరీరం!
మైదానంలో విలాసవంతంగా ఎగిరే 'డెకార్' పతంగుల మధ్య
ఈ పేదవాడి గాలిపటం..
ఒక తిరుగుబాటులా పైకి లేస్తుంది.
రంగుల హంగులు లేకపోవచ్చు..
కానీ, ఎగరాలనే కసి ఆ కాగితపు నరాల్లో ప్రవహిస్తోంది!
 చేతులు తెగుతున్నా వదలని పట్టు..
అది కేవలం దారం కాదు, ఒక నమ్మకం!
వారసత్వంగా వచ్చిన చిరుగుల బతుకును
ఆకాశానికి అతికించాలనే తాపత్రయం.
క్రింద వాడు 'డీల్' ఇస్తుంటే..
పైన గాలిపటం 'పేచీ' పెడుతుంది.
అధికారపు గాలివాటుకు తలవంచకుండా..
ఎదురుగాలిని గుండెల్లోకి నింపుకుని
ఎత్తుకు ఎగరడమే దానికి తెలిసిన విద్య!
ఆధిపత్యపు కోతలు నగరపు మేడల మీద మాంజాలు మెరుస్తున్నాయి
క్రింద బస్తీ కుర్రాడి చేతిలో దారం తెగుతోంది..
ఒకడికి అది పందెం.. మరొకడికి అది ప్రాణం!
కానీ, తెగిన గాలిపటం ఎప్పుడూ ఓడిపోయినట్టు కాదు..
అది బంధనాల నుంచి విముక్తి పొంది
స్వేచ్ఛా వాయువులను వెతుక్కుంటూ వెళ్తున్న ప్రయాణం.
ముళ్ళకంపలో చిక్కుకున్నా.. అది ఒక గాయం కాదు,
మరో పోరాటానికి సిద్ధమవుతున్న ఒక విరామం!
మట్టి మనుషుల కల ఓ గాలిపటమా!
నువ్వు ఎంత ఎత్తుకు వెళ్లినా..
నీ మూలాలు మాత్రం కింద ఉన్న చేతుల్లోనే ఉన్నాయి.
నువ్వు గాలిని చీల్చుకుంటూ వెళ్తున్నావు అంటే
వెనుక నిన్ను లాగి పడుతున్న 'గతం' ఒకటుందని మర్చిపోకు!
రాజకీయపు గాలివాటుకు రంగులు మార్చేవాళ్లు కొందరు..
తోక ఆడించి యజమానిని మెప్పించేవాళ్లు మరికొందరు..
కానీ, నువ్వు మాత్రం..
ఆకాశపు నీలి రంగులో నీకంటూ ఒక సంతకాన్ని చెక్కు!
 పండుగ ముగుస్తుంది.. సంక్రాంతి వెళ్ళిపోతుంది
కానీ, ఆకాశంలో మిగిలిపోయిన దారపు పోగులు
మనం చేసిన గాయాలకు ఆనవాళ్లు!
ఎగిరే ప్రతి గాలిపటం వెనుక..
ఒక చెమట చుక్క కథ ఉంది
ఒక ఆకలి కేకల నిశ్శబ్దం ఉంది.
అందుకే చెబుతున్నా..
ఎగరడం అంటే పడిపోవడానికి సిద్ధపడటం కాదు,
పడిపోయినా.. మళ్ళీ గాలిని ఒడిసి పట్టుకుని
ఆకాశపు అంచులని తాకడం!
ఇది గాలిపటం కథ కాదు..
అణిచివేయబడిన ప్రతి గుండె ఎగరేస్తున్న ధిక్కారపు జెండా!
Bureddy blooms.