వాక్యం రాసాత్మకం కోసం శ్రీమతి మంగు కృష్ణకుమారి గారు ఇచ్చిన
*నాకు అంతా మంచే జరుగుతుందని నమ్మకం వుంది.*
*కోరి కష్టాలు తెచ్చుకోవద్దు.*
వాక్యాలు తో నా రచన .
*ఈ రోజుల్లో పెళ్ళివారు ..*
"అమ్మాయి చూస్తే తెల్లగా బావుంది. మనవాణ్ణి పెళ్లి చేసుకుంటుందా? ఎందుకో ఈ సంబంధం మన రేంజ్ కాదని అనిపిస్తోంది బావా!" అన్నాడు రామనాథం.
"శుభం పలకరా బాబూ అంటే ఏదో అన్నాడట నీలాంటి వాడే! ముందు చూస్తాము, అన్నీ నచ్చితే ఓకే చేస్తాం. ఇప్పుడు జరిగేవి చూపులే, పెళ్లి కాదు. “ *ఎందుకో నాకు అంతా మంచే జరుగుతుందని నమ్మకం ఉంది"* అన్నాడు రంగనాథం తన బావమరిది రామనాథంతో.
"అవునవును.. ఆపై మన అవతారం అదృష్టం!" అన్నాడు రామనాథం.
అవతారానికి ఇది పదో పెళ్లి చూపులు. అన్నీ బాగానే ఉన్నా, మాటల తర్వాత సంబంధాలు క్యాన్సిల్ అవుతున్నాయి. పాపం రంగనాథం కోరికలేమీ కోరకుండా, కట్నం లేకుండా ఒప్పుకుందామన్నా కుదిరి చావడం లేదు. ఒకప్పుడు ఆడపిల్ల భారం అనేవారు, ఇప్పుడు మగాడు బరువైపోయాడు. ఎవరో ఒకరు దొరుకుతారనుకున్నా, ఆ ఒక్కరూ ఒప్పుకోవడం లేదు.
పెళ్లివారి ఇల్లు రాగానే మెలికలు తిరుగుతున్న అవతారాన్ని జల్లకొట్టి, "ఈ మెలికలే నీ పెళ్లికి తడికల్లా అడ్డొస్తున్నాయని నా అనుమానం. తిన్నగా ఉండు, జాగ్రత్తగా మాట్లాడు. ఇది పదో సంబంధం, అది గుర్తుపెట్టుకో!" అని హెచ్చరించాడు రంగనాథం.
వీళ్లు కారు దిగినా ఎవరూ ఎదురు వచ్చి పిలవలేదు. "పోనీలే" అనుకుంటూ లోపలికి నడిచాడు రంగనాథం. అనుసరించారు రామనాథం, అవతారం.
"రండి.. ఇక్కడి దాకా వచ్చిన వాళ్లు లోపలికి రాకపోతారా అని మా ఆవిడ అంటే, అంతే కదా అని లోపలే ఉండిపోయాం. రండి రండి!" అన్నాడు పిల్ల తండ్రి.
"రోజులు అలా ఉన్నాయి" అనుకుంటూ ముగ్గురూ కూర్చున్నారు. "అదే.. మీ ఆవిడ రాలేదా?" అని అడిగాడు పిల్ల తండ్రి.
"లేదండి, మా అమ్మకు కొంచెం ఒంట్లో బాగుండలేదు" అన్నాడు అవతారం.
"అమ్మాయిని చూపించండి, మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది" అని గాభరా పెట్టాడు మధ్యవర్తి.
"బయటకి వెళ్ళింది, ఇప్పుడే వచ్చేస్తుంది. ఫోన్ చేస్తా" అంటూ అమ్మాయికి ఫోన్ చేశాడు పెళ్లికూతురు కాంతం తండ్రి. అప్పుడే గుమ్మంలో అడుగు పెట్టింది కాంతం. పొట్టి నిక్కరు, టైట్ టీ షర్ట్, చేతిలో టెన్నిస్ రాకెట్!
"అబ్బో!" అని రంగనాథం, "అమ్మో!" అని అవతారం అనుకున్నారు. పాపం రామనాథం మాత్రం "అయ్యో!" అనుకున్నాడు.
"హాయ్!" అంటూ వాళ్ళ ఎదురుగా కూర్చుంది కాంతం. అవతారం వంక చూస్తూ, "హాయ్.. మీకు టెన్నిస్ వచ్చా?" అంది. బుర్ర అడ్డంగా ఊపాడు అవతారం. "పోనీ షటిల్? పోనీ క్రికెట్? పోనీ క్యారమ్స్?" అని అమ్మాయి అడుగుతూనే ఉంది. అవతారం బుర్ర ఊపుతూనే ఉన్నాడు.
"ఇక్కడిదాకా వచ్చారుగా, టిఫిన్ తిని టీ తాగి వెళ్ళండి" అంటూ బ్యాట్ ఊపుకుంటూ లోపలికి పోయింది కాంతం.
"అమ్మాయి చెప్పిందిగా.." అన్నాడు పిల్ల తండ్రి. ‘మీరు వెళ్తే మేము సర్దుకుంటాం’ అన్నట్టు చూసింది పిల్ల తల్లి.
"బావా.. ఈ సంబంధం మాట్లాడి *కొరి కష్టాలు తెచ్చుకోవద్దు .* అసలే అవతారం అమాయకుడు" అంటూ లేచాడు రంగనాథం. పాపం పదో సంబంధం కూడా 'హుష్ కాకి' అనుకుంటూ బయటకు నడిచారు రామనాథం, అవతారం.
"మరీ ఇలా ఉన్నారేంటి నాన్న?" అన్న అవతారం మాటలకి, "భూమి గుండ్రంగా తిరుగుతుంది.. ఇది అంతే!" అని తన పెళ్లి చూపులప్పుడు తన ప్రవర్తన తలచుకుంటూ నడిచాడు రంగనాథం.
శుభం
No comments:
Post a Comment