Thursday, 26 March 2026

 *సండే స్టోరీ*

*బాబోయ్! బఫే డిన్నర్...*

రచన : రసరాజు 

మా స్నేహితుడికో తాతయ్య వున్నాడు. తాతయ్య వుండటమైతే విశేషం కాదు కాని, తాతయ్య పడిన "బఫేబాధ” గురించే చెప్పుకోవాలిక్కడ.

ఎక్కడో పల్లెటూరు నుంచి ఆయన ఈ నగరానికొచ్చాడు. అక్కడా పల్లెటూళ్ళో వున్నప్పుడైతే తృప్తిగా ఆకుపచ్చని అరిటాకులో ముప్పూటలా కాకపోతే రెండు పూటలా భోజనం చేసి, లంక పుగాకు చుట్ట వెలిగించి కాలక్షేపం చేయడం ఆయన కలవాటు.

మా స్నేహితుడు ఇక్కడో బిజినెస్ ప్రారంభించి అచిర కాలంలోనే అందరి ఆదరాన్ని అందుకున్నాడు. ఆర్థికంగా అంతగానూ బలపడ్డాడు. నగరంలో వున్న రోటరీ క్లబ్ కి ఆ సంవత్సరమే అధ్యక్షుడు కూడా అయ్యాడు.

అతను రోటరీ ప్రెసిడెంట్ అయిన రోజు నుంచి తరచుగా ఏదో సందర్భంగా డిన్నర్ పార్టీలు బ్రహ్మాండంగా జరుగుతూనే వున్నాయి. తాతయ్య కూడా మావాడు ప్రెసిడెంట్ అయిన రోజునుంచి రోటరీ మెంబరయ్యాడు. వారానికోసారి తాతయ్యకి వెరైటీ కాలక్షేపం వుంటుందని మావాడు తాతయ్యని మెంబర్ గా చేసి పడేశాడు.

ఇంతవరకూ బాగానే వుంది.

మీటింగులకు రావడానికి గాని, తోచిన రీతిలో విరాళాలు ఇవ్వడానికి గాని, తాతయ్యకు ఎంత మాత్రం ఇబ్బందిలేదు. అయితే, ఎదురవుతున్న సమస్యల్లా ఒక్కటే! అదే బఫే డిన్నర్.

తాతయ్య మొదటిరోజునే పెదవి విరిచాడు. “డిన్నర్ హోమ్లీగా లేదోయ్" అని. ఎలా వుంటుంది? దేని దారి దానిదే! తాతయ్యకు "బఫే" బొత్తిగా కొత్త అనుభవం. బఫే వుద్దేశం - పదార్థాలను ఎవరికి వారు వడ్డించుకోవడం లో స్వేచ్ఛ - వేస్ట్ కాకపోవడం. ఇవన్నీ మా ఫ్రండ్ ఆ రాత్రి తాతయ్యకు పూసగుచ్చినట్టు గా వివరంగా చెప్పాడు.

మళ్ళీ మరో రోజు -.

ఏదో సందర్భంగా రోటరీలో బఫే సిద్ధమైంది. తాతయ్య వచ్చాడు. సమావేశం అయ్యాక అందరూ బఫేకి రెడీ అయ్యారు. నేను మాత్రం ఆ రోజు “తాతయ్య బఫే”ను పరిశీలించాలనుకొన్నాను.

తాతయ్య వరుసలో నిలబడ్డాడు... మీల్స్ ప్లేట్ చేతిలోకి తీసుకొన్నాడు...

నేప్కిన్ ఎందుకిచ్చారో మొదటైతే అర్థం చేసికోలేదు కాని ఆ తరువాత దాని వుపయోగమేమిటో తెలిసిపోయింది. అన్నం దానితోపాటే అక్కడున్న కూరలూ, చట్నీ ఇవన్నీ క్రమంగా వడ్డించుకున్నాడు. అక్కడ నుంచి కాస్త దూరంగా నడిచాడు.

తాతయ్యను నేను గమనిస్తూనే వున్నాను. నేను కూడా ఆయన దగ్గరకి నడిచాను.

"చూడు బాబూ! ఒక చేతిలో ప్లేటు పట్టుకొని మరో చేత్తో తినడం అంటే ఏవిటో ఇబ్బంది గా అనిపిస్తోంది. ఈ సవ్యసాచిత్వం నావల్ల కాదు. పైగా కూర్చొని తినడం కాదు... నిలువు కాళ్లమీద నిలబడి నీళ్ళు కారుతూ తినాలి ఖర్మ. ఎంత ఆకలేస్తున్నా ఈ ఇబ్బంది వల్ల ఎప్పుడు తిని బైటపడదామా అనిపిస్తుందేగాని, కడుపు నిండడం, నిండక పోవడం ఇదేమీ పట్టించుకోం..." తాతయ్య అలా తన బాధను వెళ్లగక్కాడు.

“అలవాటయ్యేవరకు కొంచెం కష్టమైన పనే తాతయ్యగారూ!" ఆయన అభిప్రాయానికి ఏదో కొంచెం మద్దతుగా నేనూ మాట్లాడాను.

ఇంతలో తాతయ్యకు ముద్ద దిగలేదు. ఉక్కిరిబిక్కిరైనంత పనయింది. నేను  రెండడుగులు వేగంగా వేసి అక్కడున్న మంచినీళ్లగ్లాసు తీసికొచ్చి తాతయ్యకు అందించాను.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
"భోంచేసేటప్పుడు మంచినీళ్లు దగ్గరుండాలి గానీ, ఏవిటి చెప్పు ఈ పాడు పద్ధతులు? చక్కటి దేశీయ సంప్రదాయాన్ని వదులుకో మని ఎవడు చెప్పాడు?... ఏం బఫే డిన్నరో గాని బలవంతం బ్రాహ్మణార్థంలా వుందంటే నమ్ము! శుభ్రంగా ఇంటిపట్టున కూర్చుని ఇన్ని మెతుకులు తింటాగాని ఈ బఫేలోకి, ఈ బాధల్లోకి నేను చస్తే రాలేను బాబూ!" తాతయ్యకు ఒళ్లు మండిపోయి ఆ నాలుగు మాటలూ అనేశాడు. ఒక్క భోజనం మినహా ఇతర పానీయాలేవీ ఆయన ముట్టుకోడు. అందులోను, ఆ భోజనం రుచిగా వుండాలి. ఆసనశుద్ధిగా, విశ్రాంతిగా, కూర్చొని తినాలి. ఇవీ ఆయన అభిమతాలు.

ఈ "బఫే" ఇలా ముగిసిన మరో పదిహేను రోజులకు తాతయ్య మీదికి మరో బఫే వచ్చి పడింది. తాతయ్య రానుగాక రానన్నాడు. మీటింగుకే వస్తానుకాని, మీల్స్ సుతరామూ ముట్టుకోనన్నాడు. అయినా ఆ రోజు కూడా ఆయనకు బఫే తప్పింది కాదు.

ఆ బఫేలో మరో కొత్త అనుభవం ఆయనకు ఎదురయింది. ఏ వరుసలోకి వెళ్ళి వడ్డించు కున్నాడో గాని ఆ రోజంతా నాలుక పీక్కుంటూనే వున్నాడు.

"బంగాళదుంప కుర్మా" అనుకొని ఏదో నోట్లో పెట్టుకొన్నాడు. అంతే! ఆయన అవతారం పూర్తిగా మారిపోయింది. ఆయనకు అలవాటులేని “చికెన్ కర్రీ" ని పొరపాటుగా మరో వరుసలోకెళ్ళి అనుకోకుండా ప్లేట్ లో వడ్డించేసుకున్నాడు.

అంతే! ఆ రోజు మొదలు ఈ రోజువరకు తాతయ్య బఫే ముట్టుకుంటే ఒట్టు. ఆ మాట ఎవరైనా అంటే "బాబోయ్! బఫేనా! దానికో దండం..." అని రెండు చేతులూ ఎత్తేస్తాడు తాతయ్య!

ఆనాటిది కుర్మా కాదు - ఖర్మ అని ఈనాటికీ తాతయ్య వాపోతూనే వుంటాడు.
📖

*అభిరుచులే అశ్వాలైతే...*

రచన : రసరాజు

“సూర్యతేజ కోచింగ్ సెంటర్"లో సుబ్బారావూ, నేనూ పార్ట్టైమ్ ఉద్యోగం చేసుకొంటూ - ఉన్న మెట్టుమీద నుంచి ఆపై మెట్టుమీదకు ఉరికే ప్రయత్నంలో - ఈ విద్యార్థి దశ మళ్ళీ మాకు తప్పింది కాదు.

ఉదయం తొమ్మిదన్నరకి అడుగుపెడితే పదిన్నర వరకు అక్కడే. సరిగా ఈ కోచింగ్ సెంటరు ప్రక్కనే "సరిగమ స్వీట్ స్టాల్” వారి తయారీకేంద్రముంది. పదహారు రకాల స్వీట్స్ ఉంటాయక్కడ. పకోడీ అదనం. ఈ స్వీట్ స్టాల్ ఆ నగరానికే కాదు - ఆ పరగణాలకే "స్వీట్ సిక్స్ టీన్"గా పేరు తెచ్చుకొంది.

మా సుబ్బారావుకి కాస్త జిహ్వచాపల్యం ఎక్కువ. ఇంట్లో కూడా ఏ రోజు ఏ కూర ఎలా వుండాలో అన్నిటికీ వాడే క్లాసు తీసుకుంటాడు. ఓసారి వాళ్ళావిడ ఏదో పనిమీద మా ఇంటికి వచ్చి "అన్నయ్యగారూ ఆయనతో పడలేకపోతున్నాం. రెండు మూడు కూరలైనా లేనిదే రెక్క కంచంలోకి వాలదు. చచ్చిపోతున్నాం. మీరైనా చెప్పండి" అంది కాస్త నవ్వుని మిళితం చేసుకొని. నిజమే! మా సుబ్బారావు ఏ "మేత కంపెనీకో" మేనేజింగ్ డైరెక్టర్ గా వుండవలసినవాడు పాపం.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఇంతకీ చెప్పొచ్చేది - ఏ ఒక్క నిమిషం కూడా చదువుమీద దృష్టి నిలిపేవాడు కాదు మావాడు. ఉన్న గంటసేపూ "సరిగమ" అభిరుచులతోనే సరదాగా కాలక్షేపం చేసేసే వాడు. టీచర్ ఏదో లెక్క ఇచ్చి టీ త్రాగడాని కని లోనికి వెళ్ళినప్పుడల్లా "ఒరేయ్! చూడరా ... ముక్కులదిరిపోతున్నాయి. జీడిపప్పు పకోడీ ... జిహ్వ చిమచిమలాడి పోతుందనుకో" అనేవాడు.

మరోసారి -

"బాదం బర్ఫీ చూడరా! బాదేస్తోంది..." అనేవాడు.

ఆఖరికి ఈ వాసనలు టీచర్ పాఠం చెబుతుండే దశలో దండెత్తినా అప్పుడు కూడా ఊరుకొనేవాడు కాదు. చెవిలో ఊదటం మానేసి చేతిగోళ్లకు పని చెప్పేవాడు.

ఆ ఫలితంగా ఇలా స్వీట్ కేంద్రంలో ఏ సరుకు తయారవుతున్నా దాని తాలూకు వాసన ముందే పసిగట్టి - నా చెవిలో ఊదేయడం వాడికి జన్మహక్కయిపోయింది. వాడి ముక్కుకీ నా చెవికీ విడదీయరాని వియ్యం పెనవేసుకుపోయింది.

దాంతో ఆ సంవత్సరం పరీక్ష కాస్తా అలాగే హిందూ మహాసముద్రంలో హాయిగా కలిసిపోయింది.

వేదాంత ధోరణిలో అప్పుడన్నాడు సుబ్బారావు "ఈ స్వీటాల్ ఇక్కడెంతమాత్రం
వుండకూడ"దని.

ఇది తలచుకొన్నప్పుడల్లా ఇంకో చరిత్ర కూడా గుర్తుకొస్తుండేది.

మా నాన్నగారి ఫ్రెండ్ ఒకాయన మద్రాసు మహానగరం నుంచి మా ఇంటికొచ్చాడు.
సాంబారు లేకపోయినా సర్దుకుపోయేవాడు కాని సంగీతం మాత్రం లేకపోతే సంధ్యా వందనం కూడా చేసేవాడు కాదాయన. సంగీతమంటే అంత అంకితభావం ఆయనకు. తెలుగును “వడ” బోసి “ఇడ్లీ” అంత స్వచ్ఛంగా మాట్లాడేవాడాయన.

"మాండలిన్ శ్రీనివాస్ - ఈ గోదావరి జిల్లా అబ్బాయేనటగా. ఏదీ ఆ క్యాసెట్ వినిపించు బాబూ" అనేవాడోసారి.

"బాలమురళి కూడా గోదావరి జిల్లాల్లోనే ఏదో ఊరటగా. ఏది బాబూ ఆయన కదన కుతూహలం వినిపించు" అనేవాడు మరోసారి.  

" "అన్నట్టు గజల్ శ్రీనివాస్ కూడా ఈ జిల్లా అబ్బాయటగా.."

ఇలా సంగీతం సంగీతం అంటూ సర్కారులో మళ్ళీ మద్రాసు వెళ్ళేవరకు నన్ను వదిలేవాడు కాదాయన.

ఓసారి...

నాకు తెలిసిన సెలూనే అది. తాతయ్య గారిని తీసికెళ్లాను. ఆయన ఆ పనిలో వున్నాడు. నేనేదో పేపరు తిరగేస్తున్నాను ఆ ప్రక్కనే కూర్చొని.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
"తలూపకండి బాబూ..." అన్నాడు తాతయ్యగారిని సెలూన్ వాడు.
తాతయ్యగారు సరే అన్నారు.

కాసేపయింది.

మళ్ళీ అదే పరిస్థితి. తాతయ్యగారు తలూపడం మానలేదు.

అప్పుడు కూడా సెలూన్ వాడు అలాగే చెప్పాడు.

తాతయ్యగారు మళ్ళీ అలాగే అన్నారు.

మరికాసేపయింది...ఇంకేముంది?

తళతళలాడే తమిళ తాతయ్యగారి గడ్డం తెగిపోవడం మిలమిల్లాడే రక్తం కారిపోవడం - ఇదీ సారోఫుల్ సన్నివేశం ఆ క్షణంలో. 

దీనికి కారణం ఆ సెలూన్ ప్రక్కనేవున్న శ్వేతా రికార్డింగ్ సెంటర్.

మోహన్ బాబుగారి చిత్రం "అల్లుడుగారు” తెలుగు చిత్రంలో యేసుదాసు పాడిన త్యాగరాయకృతి "నగుమోము...” ఆ రికార్డింగ్ సెంటర్ లోంచి స్టీరియో సౌండ్ లో అదిరిపోయేలా వినిపిస్తున్నది. అ పాట ప్రభావానికి తట్టుకోలేని తాతగారు ఆ సంగీతానికి తలూపుతూ - రెండుసార్లు సెలూన్ వాడి హెచ్చరికలకు గురికాబడ్డాడు. మూడోసారి హెచ్చరించడానికి ముందే, ఆయన గడ్డం బాల్చీని తన్నేసింది పాపం! సంగీత సుధాబిందువులు ఎర్రగా కనిపించాయి తాతగారికి. ఇక నా పరిస్థితి చూడండి! అక్కడ నుంచి ఆయన్ని అలాగే ఆస్పత్రికి...

తాతయ్య గారప్పుడన్నారు వేదాంత ధోరణి లో ఆ రికార్డింగ్ సెంటర్ అక్కడెంతమాత్రం ఉండకూడదని.

ఇలా వుంటాయి సన్నివేశాలు. ఏ షాపు ప్రక్కన ఏది వుండాలో, ఏది వుండకూడదో ఎవరు చెబుతారు చెప్పండి! ఎవరి బ్రతుకు వాళ్లది ఎవరి వ్యాపారం వాళ్లది. కాస్త మనమే నిగ్రహంతో అడుగులు వేయడం నేర్చుకోవాలి. అభిరుచులుండడం వరకు అభ్యంతరం లేదు! కాని అవే అశ్వాలై - సమయం, సందర్భం లేకుండా శరవేగంతో పరుగెత్తితే...

*సమాప్తం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*1 YEAR SUBSCRIPTION 120/-
phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment