Thursday, 26 March 2026

 (558) (01.03.2026)

కన్న వాళ్ళు ఉన్నంత వరకు మా మధ్య బంధం బాగానే ఉంది
కన్న వాళ్ళు కను మూసినాక బంధం నెమ్మదిగా బీటలు వారింది
పెళ్ళిళ్ళు కాక ముందు మా అన్నదమ్ముల మంతా కలిసే ఉంటిమి
ఇంటికి కోడళ్ళు వచ్చినాక గొడవలు పడుతుంటిమి //

ఉమ్మడి కుటుంబంలో ముందుగా ఇంటి మధ్య గోడలు వెలిశాయి
ఆపై పొయ్యిలు వేరు అయినాయి 
ఎవరి వంట వాళ్ళు చేసుకుంటూ
ఎవరి ఖర్చులు వాళ్ళే పెట్టుకుంటూ //

నెమ్మదిగా జీవితాన్ని నెట్టుకొచ్చినాము
ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతున్నాము
కన్న వాళ్ళు చెప్పిన మాటలు పెడచెవిన పెడితిమి
ఎవరి కుటుంబాలు వాళ్ళవి అంటూ ఆనందంగా ఉంటిమి //

ఇది వరకులా మాటలు లేకున్నాయి
అవసరానికే మాటలు నడుస్తున్నాయి
ఊపిరి ఉన్నంత వరకు కట్టిన గోడలు కూలవు
ఈ ఉమ్మడి కుటుంబంలో గొడవలు ఆగవు  //

వంటింటి దగ్గర మొదలైన గొడవ ఖర్చుల వరకు వెళ్లింది
ఇంటికి పెద్ద దాన్ని అంటూ ఆరంభించి పెత్తనం ఎవరిదో తేలకుంది
ఒక్క చేయి కాస్తా నాలుగు చేతులుగా మారింది
అయినా ఈ రోజుకి రావణకాష్టం ఆరకుంది //

ఉమ్మడి ఆస్తి కాస్తా DEVELOPMENTకి వెళ్ళింది
నలుగురికి నాలుగు వాటాలుగా విడిపోయింది
ఎదురెదురుగా ఉన్నా ఒకరి ముఖం ఇంకొకరం చూచుకోము
ఏనాడైనా ఎదురు పడినా ఒకరిని ఒకరం పలకరించుకోము //

నాడు కన్న వాళ్ళు వాళ్ళు ఉన్నా లేకున్నా కలిసి ఉండమన్నారు
నేడు ఇంటికి వచ్చిన కోడళ్ళు ససేమిరా అని అన్నారు
అందరూ పెత్తనం కావాలని కోరుకున్నారు
ఎవరిని అడిగినా సర్దుకోమని చెప్పినారు //

కన్న వాళ్ళు కనుమూసిన ఏడాది లోపునే ఈ ఇంట గోడ వెలిసింది
అన్నదమ్ముల మధ్య మాటలున్నా తోడికోడళ్ళ సంబంధం తెగింది
కోడళ్ళ మూలంగా అన్నదమ్ముల మధ్య మాటలు లేకున్నాయి
ఒకరి కొకరు ఎదురుపడితే పలకరింపులు కూడా కరువయినాయి //

ఏ శుభకార్యమైనా ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకుంటాము
మాట వరసకైనా ఇతరులను పిలువకున్నాము
ఈ రోజుకి ఆ ఇంటి మీది కాకి ఈ ఇంటి మీద వాలదు
మాట వరసకైనా ఇంకొకరి గురించి చర్చ  కూడా జరగదు //

పెద్దల గొడవల మూలంగా పిల్లలు మాట్లాడుకోకున్నారు
చిన్ననాటి నుంచే పెద్దలు బంధాలను తెంచేసినారు
ఈ రోజున పిల్లలకు వారి కుటుంబ సభ్యులు తప్ప వేరెవరు తెల్వదు
ఈ బాధ అన్నది ఒంటరి జీవితంలో ఎప్పటికైనా తెలియక పోదు //

మధిర వెంకట రమణ, హైదరాబాద్

No comments:

Post a Comment