పూర్వం ధర్మధ్వజుడనే రాజుకు మితధ్వజుడు, కృతధ్వజుడు అనే పుత్రులిద్దరు ధ్యానతత్పరులై చరించేవారుండేవారు. వీరిలో మితధ్వజుని పుత్రుడే ఖాండిక్యుడు. కృతధ్వజుని తనయుడు కేశిధ్వజుడు బంధుత్వరీత్యా సోదరులు. వీరిలో కేశిధ్వజుడు ఆత్మవిద్యావిశారదుడు. ఖాండిక్యుడు కర్మాచారపరాయణుడు. ఇద్దరూ ఒకర్నొకరు గెలవాలనుకున్నారు. జ్ఞాతివైరం కారణంగా, యుద్ధం జరిగి అందులో ఖాండిక్యుడు ఓడాడు. కేశిధ్వజుడు అతడ్ని రాజ్యం నుంచి తరిమేశాడు. ఖాండిక్యుడు మంత్రి సామంత ఆప్తవర్గాలతో అడవుల్లోకి పారిపోయి కొన్నాళ్లక్కడే తలదాచుకొని యజ్ఞయాగాదులు ప్రారంభించాడు. ఎన్నెన్నో యాగకర్మలు చేసి, మృత్యువును నివారించాలని ఆకాంక్షించాడు.
కొంతకాలం తరువాత -
యోగనిష్ఠాగరిష్టుడైన కేశిధ్వజుడు కూడ ఒక యాగాన్ని సంకల్పించగా, దీక్షలో ఉన్న సమయాన, ధర్మధేనువును ఒక పులి పొట్టన పెట్టుకుంది. అందుకు ప్రాయశ్చిత్తమేమిటని ఋత్విజుల్ని సంప్రదించాడా రాజు. వారు సూచించిన ప్రకారం రాజు ప్రాయశ్చిత్త కాండ తెలుసుకోవడానికి ఎందరెందరినో కలుసుకున్నాడు. చివరకు శునకుని సలహామీద, కేశిధ్వజుని ధర్మ సందేహం తీర్చగలవాడు ఖాండిక్యుడొక్కడే నని కేశిధ్వజునికి బోధపడింది. కాని అతడు శత్రుపక్షంలోనివాడు. పైగా తనచే పరాజితుడు. అయినప్పటికీ సందేహ నివృత్తి కోసం అతడు శత్రువునైనా సంప్రదించదలచి, సాత్త్వికమైన మౌని వేషధారణతో అరణ్యాన ఉన్న ఖాండిక్యుని సమీపించ బోయాడు.
శాంతస్వభావంతో తాను వచ్చిన పని వివరించాడు కేశిధ్వజుడు. అయితే ఖాండిక్యుని అంతరంగికులు మాత్రం నిరాయుధుడై వచ్చినవాడు - ఒకప్పుడు తమను పరాభవించిన వాడు ఆ కేశిధ్వజుడిని వధించడానికింత కంటే సదవకాశం దొరకదన్నారు. అయితే ఖాండిక్యుడు అందుకు అంగీకరించలేదు. ఈ అశాశ్వత సౌఖ్యం కోసం నేను అర్రులు చాచ దల్చుకోలేదు. ఇదేదో అతడికే వదలి, సందేహాన్ని తీరుస్తాను అని, తానూ సత్త్వంపూని సందేహ నివృత్తిచేసి పంపాడు. యాగం ముగిసినా, కేశిధ్వజుని మనస్సులో ఏదో వెలితి ఉండిపోయింది. తన సందేహం తీర్చినవాడు గురువుతో సమానుడు గనుక, గురుదక్షిణ చెల్లించాలనిపించి, మళ్లీ మరోసారి ఖాండిక్యుని వద్ద కొచ్చాడు కేశిధ్వజుడు.
గురుదక్షిణగా రక్తపాతరహిత రాజ్యాన్ని కోరుకోమని అంతరంగికులంతా ఖాండిక్యునికి సలహా చెప్పారు. కాని అందరూ నివ్వెరపోయేలా "కేశిధ్వజా! నేను కర్మాచరణలో సాధించినదానికంటే ముముక్షుమార్గంలో నీ సాధన గొప్పది. నీ వెరగని పరతత్త్వ రహస్యాలు లేవు. ఆ యోగ విద్యనాకు ప్రసాదించు" అన్నాడు ఖాండిక్యుడు.
"రాజ్యం కోరక ఇదడిగావేం" అన్నాడు కేశిధ్వజుడు. "నా స్వార్జితం కానిది నేను కోరను" అనడంతో, కేశిధ్వజుడు తన సోదరుని అంతరంగాన్ని గ్రహించి సంప్రీతుడై ఇలా అన్నాడు..
"అవిద్య అంటే మిథ్యాజ్ఞానం. పంచభూతాత్మకమైన ఈ దేహాన్ని ఆత్మగా భ్రమించి, మోహంచెందే అవివేకులు చిత్తవిభ్రాంతి పొందుతారు. ఇది శాశ్వత భోగమని, ఇదే తనదనీ భావిస్తారు. ఈ దేహ సంయోగజనిత పుత్రపౌత్రాదులమీద మమకారాన్ని పెంచుకుంటారు. మనుషులు చేసే కర్మలన్నీ దేహోపభోగ్యమైన సుఖాలకు ప్రేరణకలిగించేవి మాత్రమే! వీటివల్ల బంధమోచనం కలుగదు.
మట్టి, ఇతర అణుసముదాయాలు చేర్చి కట్టినట్లుగా, పార్థివమైన ఈ దేహాన్ని అన్నం మొదలైన వాటితో పోషిస్తున్నాం! పాంచభౌతికమైన దేహాన్ని పాంచభౌతిక భోగాలతో సుఖపెట్టాలనుకోవడం సహజంగా జరిగే ప్రక్రియ. కాని, వేనవేల జన్మల పాటు సంసారచక్రంలో పరిభ్రమిస్తూ ఇలా ఎంతకాలం? ఎన్ని జన్మలు? వీటినుంచి విడివడి అతీతంగా చరించడానికి ఎన్నడు ఉద్యుక్తులు కావడం?..
ఈ ప్రశ్న ఎవరికి వారే వేసుకోవాలి. జ్ఞానోత్పత్తికి అంకురం ఇది. దీనికి మనస్సు క్షేత్రం. అంటే ఈ ప్రశ్న మనస్సులోనే మొలకెత్తాలి. ఈ మనో (స్థితి) భావనకు కారణం పురుషార్థం.
అవిద్యా జనకమైన వికారాలన్నీ తొలగింపజేసుకోవడానికి, యోగజ్ఞానమే సర్వోత్తమమైనది - అని కేశిధ్వజుడనగా, "మహాత్మా! యోగవిద్యాబోధనలో నీకు మించినవారెవరు? దయతో నా కీ యోగశాస్త్రాన్ని ఉపదేశించి నన్ను ధన్యుడిని చెయ్యి"! అని కోరగా, కేశిధ్వజుడు ప్రహృష్టాంతరంగుడై ఖాండిక్యునికి యోగశాస్త్రాన్ని బోధించ నుద్యమించాడు.
యోగవిద్యోపదేశం
"ఇంతకు ముందు చెప్పినట్లుగానే బంధమోక్షాలు రెండింటికీ మనస్సే కారణం. విషయాసక్తులకు బంధం, నిర్వికల్పులకు మోక్షం మనస్సు వల్లనే సంప్రాప్తిస్తాయి. విజ్ఞాన స్వరూపుడైన వాడు, బ్రహ్మతత్పరుడు ఈ విషయాసక్తత నుంచి మనస్సును వెనుకకు మరలించి ముక్తికోసం బ్రహ్మమైన పరమేశ్వరుని ధ్యానించాలి. అటువంటివానిని ఈ మనస్సులోని భావం అయస్కాతం లోహాన్ని ఆకర్షించినట్లు పరమాత్మవైపు ఆకర్షించుకుంటూ పోతుంది. 'ఆత్మ ప్రయత్నంతో సాపేక్షమై, అత్యంత విశిష్టమైన మనోభావ సంచారానికి బ్రహ్మముతో కలిగే సంయోగమే యోగ శబ్ద నిర్వచనం'. యోగ విదులు ఈ అనుసంధానం కోసమే దీనినే లక్ష్యంగా కృషిచేయవలసి ఉంటుంది. దీనిలో సాధకులు విజయం పొందితే, వీరు ముముక్షువులైనట్లే!
యమ - నియమ సాధన విశిష్ట ఫలితాలను అందిస్తుంది.
యోగ విదులు, భద్రాసనాసీనులై యమ నియమాలను పాటిస్తూ యోగ ధ్యానం చేయాలి. తదితర ఆసనాలను అభ్యసించాలి. పూరక, రేచక, కుంభకాది సంజ్ఞితమైన ప్రాణాయామాన్ని అభ్యాసంచేసి ప్రాణవాయువును ఇచ్ఛాక్రియగా నియంత్రించడం (పట్టుసాధించడం) సాధన చేయాలి.
ఇది బ్రహ్మతత్త్వ సిద్ధికి 'బీజం' అని యోగశాస్త్ర సంకేతం.
ఊర్థ్వముఖ సంచారం గల ప్రాణవాయువు, అథోముఖ సంచారం గల అపానవాయువు వాటి గతులప్రకారం చరించడంగాక, స్వేచ్చాగతిన ఈ వాయుసంచారం బయల్వెడలేలా సాధన చేయాలి. ఇది 'ఆలంబన యోగం'. చిత్తచాంచల్యం ఉన్న వారికిది అసాధ్యం. కనుక దీన్ని ముందు నిరోధించాలి. అపుడు ఇంద్రియాలు వశమవుతాయి. స్థిరచిత్తునికి శుభ (విష్ణు) ఆశ్రయం ఒనగూడుతుంది.
భావనాత్రయం:
బ్రహ్మభావన, కర్మభావన, బ్రహ్మకర్మభావన అని ఇది 3 విధాలు. మొదటిది సాధ్యం చేసుకున్నవారు సనకసనందనాదులు. దేవతలు రెందవది సాధ్యం చేసుకున్నారు. బ్రహ్మ నిత్యత్వభావన గలిగి శ్రీమహావిష్ణువుతో ఐక్యానుసంధాన్ని పొందిన హిరణ్యగర్భుడు మొదలగువారికి మూడోది సాధ్యమైంది. యోగ సాధకులకు ప్రారంభదశలో శ్రీహరి సూక్ష్మరూపం ధ్యానంలో గోచరం కాదు. కనుక - వారు స్థూలరూపంలో వాసుదేవుని ధ్యానించాలి. మూర్తి రూపం అంటే ఇదే!
హిరణ్యగర్భుడు, దేవేంద్రుడు, ప్రజాపతులు, మరుత్తులు, వసువులు, రుద్ర, ఆదిత్య - తారక - గ్రహ - నక్షత్ర - రూపాలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, దైత్యులు, సకలదేవతలు, సాటి మనుషులు, స్థావర జంగమాత్మక మయిన సకల ప్రాణులలోను విష్ణువును దర్శించి తాదాత్మ్య భావన పొందాలి.
ఆమూర్తమైనట్టిది నిర్గుణం. అది యోగిహృద్యాద్గమ్యం. దీన్ని బుధవరేణ్యులు 'సత్' అనే సంజ్ఞతో చెప్తారు. సమస్త శక్తులూ ఈ నిర్గుణుని యందే ప్రతిష్ఠితం.
ఈ సమస్త శక్తులు ఎందులో ప్రతిష్ఠితమై ఉన్నాయో, అది విశ్వ వైరూప్యమైన శ్రీహరి యొక్క ఇంకొక మహారూపం. అది తన లీలచేత దేవ తిర్యజ్ననుష్యాది చేష్టలుగల సమస్తశక్తి రూపాలను చేస్తుంటుంది. అది జగత్తుకు ఉపకారకం. ఆ శక్తి కర్మ నిమిత్తం పుట్టినది కాదు.
ఆ అప్రమేయమైన బ్రహ్మం యొక్క అవ్యాహతమైన, సర్వవ్యాపిని అయిన చేష్ట అది. విశ్వరూపుడైన పరబ్రహ్మ యొక్క ఆ శక్తి రూపం సర్వపాపహరం. అది యోగసంధానపరుడైన వానిచేత ఆత్మశుద్ధికోసం ధ్యానింపదగినది. వాయువుతో కూడిన అగ్ని, గడ్డినో - అడవినో దహించినట్లు విష్ణువు యోగుల మనస్సులోని సర్వపాపాలను దహిస్తాడు.
ఆ వాసుదేవుడు ప్రసన్న వదనుడు. ఆయన రూపాన్ని మనసులో నిల్పి ఏకాగ్రచిత్తంతో ధారణను అభ్యసించాలి. కూర్చున్నా - నిలబడినా ఏ పని చేస్తూ వున్నా ఏకాగ్రతతో కూడిన ధారణయోగాన్ని అభ్యసించి యోగసిద్ధిని పొందాలి. అదే శుద్ధాధారణ అనబడుతుంది. ఈ విధంగా కేశిధ్వజుడు యోగశాస్త్రాన్ని సంక్షిప్తీకరించి ఖాండిక్యునికి వినిపించి "ఇంకా ఏమి వినాలనుకుంటున్నావు?" అని అడిగాడు.
ఖాండిక్యుడు కృతజ్ఞుడై "మహాత్మా! యోగసద్భావాన్ని విన్నాక, నా హృదయం ఇంకా నిర్మలమైంది. మనో మాలిన్యమంతా ప్రక్షాళితమైంది. నేను, నాది అనే అహాంకారమే 'అవిద్య' అని తేటతెల్లమైంది. శబ్దప్రమాణాలచేత తెలుసుకోదగిన బ్రహ్మస్వరూపాం వాగతీతమే! నాకు మోక్షప్రదమైన యోగవిద్య నందించి మహోపకారం చేసినందున, వైరభావమెన్నడో సమాప్తమైంది. తాము పూజార్హులు" అని కేశిధ్వజుని సత్కరించి పంపాడు ఖాండిక్యుడు.
ఆ ప్రకారం ఖాండిక్యుని చేత యధార్హంగా పూజింపబడిన కేశిధ్వజుడు నిజపురానికి వెళ్ళాడు. ఖాండిక్యుడు కూడా కుమారుని రాజును చేసి, హృదయమందు గోవిందుని నిలిపి, వనమాధ్యానికి వెళ్లి ఏకాంత మతియై యమనియమాది గుణాలతో విష్ణునారాధించి, నిర్మల బ్రహ్మమునందు లయం పొందాడు.
కేశిధ్వజుడు కూడ ప్రారబ్ధకర్మ ప్రకారం విషయోప భోగాలనుభవించి, తదుపరి కర్మక్షయానికి ఉద్యమించి పరిపూర్ణంగా దాన్ని నెరవేర్చి, అకల్యాణములైన కర్మాచరణచేత పాపం నశించగా, ఆత్యంతిక సిద్ధిని పొందాడు.
No comments:
Post a Comment