Thursday, 26 March 2026

 *నీతికథలు-35* 

 *బాధ్యత* 

ఓయ్!గదిలోనుంచి వెళ్ళేటప్పుడు పంఖా ఆపాలని తెలీదా?ఖంగుమన్న నాన్నగారి గొంతువిని దాన్ని కట్టేసి వచ్చా. హాల్లో ఎవరూ లేకపోతే టి.వీ దేనికి? అన్నీ కట్టేయమని చెప్పాలా ప్రత్యేకంగా? మళ్ళీ అదే గొంతు.విసురుగా టి.వి ఆపేసి  బల్ల మీదున్న ఫైల్ తీసుకొని  విసురుగా బయటికి నడిచాను.

ఎందుకు నాన్న యిలా చేస్తున్నాడు?ప్రతిదానికీ కోప్పడడం, చిన్న విషయాలకు కోప్పడడం 
పెద్దగా అరవడం ఆ పంఖా,టి.వి ఆయనే కట్టెయ్యొచ్చు కదా! ప్రతీదీ నాకే చెప్పాలా?మరీ చాదస్త ఎక్కువైపోతుందీ మధ్య.ఇంకా నావల్లకాదు ఈ గోల భరించడం. ఇవ్వాళ నాకు ఇంటర్వ్యూ వుంది. ఆలస్యమవుతుందని ఇంగితజ్ఞానం కూడా లేకుండా తిట్టి పోస్తున్నాడు.

దేవుడా! ఎలాగైనా ఈ వుద్యోగం నాకు వచ్చేటట్టు చూడు ఉద్యోగమొస్తే ముందు ఈ కొంప నుంచి బయట పడాలి.అసహనం తన్నుకొచ్చేస్తూంది నాకు. అంతలా వేధిస్తున్నాడు నాన్న సంపాదన లేదు యిల్లు దాటి పోలేనని అలుసు. 

   ఏదడిగినా సరే ఇప్పుడొద్దు తర్వాత చూద్దాం.అని నాన్చడం తప్ప ఇంకేమీ తెలీదు ఈ పెద్దమనిషికి. ఏదో ఈ రోజు ఓ ఐదువందలిచ్చాడు ఇంటర్వ్యూ వుందని.అదే అదృష్టం కొడుకు మీద ప్రేమ ఉంటేగా అసలు నా బాధేమిటో అర్థం కావడానికి ప్చ్!!

  అదో  పెద్ద భవనం. గేటుదగ్గర ఎవరూ లేరు. అడ్డదిడ్డంగా వున్న ఆ గేటును పొందిగ్గామళ్ళీ చేర  వేశా. లోన భవనం వరకూ రహదారి.దారి చుట్టూ పూలమొక్కలు ఆహ్లాదకరంగా వుంది.

కానీ మొక్కలకు నీళ్ళుపోసి పైపు  దారిలో పడి నీళ్లన్నీ పోతున్నాయి.మాలి ఎక్కడికెళ్లాడో?
అనుకుంటూ పైపు తీసి మొక్కలవైపు పెట్టి ముందుకి నడిచా. 

    రిసెప్షన్లో కూడా ఎవరూ లేరు. ఓ బోర్డు తప్ప 'ఇంటర్వ్యూ మూడో అంతస్తులో ' అని రాసివుంది దానిమీద.తడిగా వున్న బూటుకాల్స్ అచ్చులు చూస్తూ మీదకు వెళ్ళబోతూ ఆగిపోయా.కాళ్ళు తుడుచుకుని పట్ట పక్కనే తిరగేసి పడుంది. అప్రయత్నంగా దాన్ని సరిచేసి బూట్లు తుడుచుకొని పైకి వెళ్ళా.

మూడో అంతస్తు లోని ఆ ఆవరణ౦తా హడావుడిగా వుంది.చాలామంది వచ్చారు. రెండు 
సెక్షన్లలో కూర్చున్నారు.కాసేపటికి ఒకటి ఖాళీ అయింది.కానీ ఫాన్లు మాత్త్రం అలాగే తిరుగుతున్నాయి.  చెవిలో జోరీగలా నాన్న కేకలు. చిరాగ్గా ఆ ఫాన్లు కట్టేసి వచ్చి కూర్చున్నా.

ఇంతలో నాపేరు పిలిచారు.లోపలి వాళ్లకు శుభోదయం చెబుతూ గది  లోకి అడుగు పెట్టాను. 

అక్కడ నలుగురు  గంభీరంగా కూర్చుని లాప్ టాప్ లో ఏదో చూస్తున్నారు. నన్ను కూర్చోమని కూడా అనలేదు.ఒకాయన పేరడీగారు అంతే. పేరు చెప్పాను. నీ ఇంటర్వ్యూ అయిపొయింది నీవు వెళ్లిపోవచ్చు.అన్నాడు రెండో వ్యక్తి.

నాకేమీ అర్థం కాలేదు.కోపం ముంచుకొస్తోంది.అది నషాళానికి అంటుతున్న వేళ
మూడో వ్యక్తి ఒక కవర్ అందిస్తూ చెప్పాడు. అభినందనలు మీరు ఎంపికయ్యారు.ఇది మీ నియామక పత్రం. నిశ్చేష్టుడనయ్యాను. 

అప్రయత్నగా కానీ మీరు నన్నేమీ అడగలేదు అనేశా.  నాలుగో వ్యక్తి ల్యాప్ టాప్ నావైపు తిప్పి చూడమన్నట్టు సైగ చేశాడు. అందులో వున్నది నేనే.గేటును పొందిగ్గా పెట్టడం దగ్గరనుంచీ పైపు, కాళ్ళు తుడుచుకుని పట్ట  సరిచేయడం, ఫాన్లు ఆపడంవరకూ అన్నీ సి.సి టీవీలో నమోదయ్యాయి.

మాకు నైపుణ్యం ఒక్కటే ముఖ్యం కాదు.మనిషిగా కనీస బాధ్యతతో వ్యవహరించే వ్యక్తి కావాలి ఈ పరీక్షలో మీరు నెగ్గారు.అన్నాడు మొదటి వ్యక్తి నెమ్మదిగా.

ఆనందంతో నోట మాట  రాలేదు.ధన్యవాదాలు చెప్పి బయటికి వచ్చాను.హఠాత్తుగా చెళ్లున  కొట్టినట్టు నాన్న ఆయన మాటలు గుర్తుకొచ్చాయి. అంటే నాకు బాధ్యత నేర్పడానికే నాన్న అలా అంటుండేవాడా?ఎంత అపార్థం చేసుకున్నాను ఆయన్ని?
కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి. నాన్న మాట కరుకు కావచ్చు కానీ మనసు మాత్రం వెన్న 

*సర్వే హిందూ జనాః సుఖినోభవంతు*

No comments:

Post a Comment