Thursday, 26 March 2026

 .
     

    జాతీయ రేడియో దినోత్సవం సందర్భంగా
   🟢🟢🟢🟢🟢🟢
  .*గుర్తుకొస్తున్నాయి*
   మా ఊసులపెట్టి
*****************
      నాచిన్నతనంలోనే మా ఇంటికి 'రేడియో'వచ్చింది.  అసలు రౌతులపూడిలోని మా ఇంటికి రేడియో ఎలావచ్చిందో మీకు తెలపాలంటే,మీకళ్ళముందు 'రింగురింగులు' చుట్టాల్సిందే పాతసినీమాల్లోలాగ.
     1955_56 సరిగ్గా జ్ఞాపకంలేదుకానీ,మా మేనత్త చల్లపల్లి చిట్టెమ్మగారు, అప్పటి కర్నూలు జిల్లా మార్కాపురంలో వుండేది .మా మావయ్యగారు చల్లపల్లి హనుమాన్లుగారు అక్కడ అసిస్టెంటు ఇంజనీరుగా పి.డబ్లుయు.డి లో పనిచెేసేవారు.నేనప్పుడు మా అత్తయ్యదగ్గర వుండేదాన్ని.
      ఆసమయంలో మానాన్న                మా రౌతులపూడినుండి  అంచలంచలుగా ప్రయాణంచేస్తూ,అత్తయ్యదగ్గరకు మార్కాపురం వచ్చారు.అత్తయ్యా-మావయ్యగారూ మా నాన్నరాకకు ఆశ్చర్యానందాలుపొందారు.నాన్న అత్తయ్యకు మా చిన్నాన్న కాంతారావు పెళ్ళిసందర్భంగా,మా పిన్ని పుట్టింటివారిచ్చిన ఆడపడచు లాంఛనాలుగావచ్చిన 'నూటపదహార్లు'పెట్టి ,అందమైన బుల్లి డైల్ గల రిష్టువాచీ కొనితెచ్చారు.అసలే అద్భుత సౌదర్యవతి అయిన మా చిట్టత్తయ్యకి
అదో ఆభరణంలాఎడమముంజేతికిఅమరింది.ఆవాచ్ అలంకరించుకొన్నప్పుడల్లా మా అత్తయ్య ఠీవిగా కనిపించేది నాకళ్ళకు.
      రెండుమూడు రోజులున్న తరువాత నాన్న తనమనసులోమాటను అత్తయ్యదగ్గర ప్రస్థావించారు.
     "చిట్టితల్లీ! నాన్నకు ఒక రేడియో కొందామనుకొంటున్నానమ్మా!ఆయనకి మంచి కాలక్షేపమౌతుంది.సంగీత,సాహిత్య కార్యక్రమాలెన్నో ప్రతీరోజూ వస్తాయిట.ఈ పండగకి నువ్వొచ్చినప్పుడు నాన్నకి చెప్పి,వప్పిస్తావని నిన్నడగడానికివచ్చాను."అన్నారు.
     ఆకాలానికీ, ఈకాలానికీగల తేడాచూడండి.నలుగురు పిల్లలతండ్రికి, తన తండ్రి ఎదురుగా మాట్లాడడానికి భయమో ,భక్తో అదేమిటో తెలియదు. తన తండ్రి సంతోషంకోసం, కొందామనుకొంటున్న రేడియో కొనడానికి  చెల్లెలిని తనతండ్రికి రికమండేషన్ చేయమంటున్నారు.
ఈనాటి చిన్నపిల్లలు తండ్రినడగకుండానే 'ఆన్ లైన్ 'లో ఆర్డర్ పెట్టి,కోరినవస్తువు చేరాకా, విడిపించడానికి డబ్బులడుగుతున్నారు తండ్రిని. 
      సరే విషయానికొస్తే,ఆ రేడియోకొనే మాటకాస్తా అత్తయ్య చెవినవేసి మానాన్న మాఊరికివెళ్ళిపోయారు.
    మానాన్నకోరినవిధంగానే మాచిట్టత్తయ్య సంక్రాంతిపండగకు మా రౌతులపూడి వచ్చింది.
    నిమ్మది ఒకరోజు సమయంచూసి తనతండ్రి, అంటే,మా తాతగారైన పూళ్ళసత్యనారాయణమూర్తిగారిదగ్గరచేరి,
"నాన్నా! అన్నయ్య నీకోసం రేడియోట అదేమిటో కొందామనుకొంటున్నాడు.నీకిష్టమైన సంగీతం,సాహిత్యకార్యక్రమాలెన్నోవస్తాయట.నీకు మంచికాలక్షేపం అవుతుందట.కొనమంటావా?" అత్తయ్య తన మృదువైన కఠంతో అడిగింది జంకుతోనే.
     "ఎందుకమ్మా అవన్నీ?అనవసర డబ్బుఖర్చు."అన్నారు తాతగారు.
"అబ్బే! పెద్దఖర్చుకాదట నాన్నా! రెండొందలో,మూడొందలో అంతేట.అన్నయ్య ముచ్చటపడుతున్నాడు నాన్నా!కొనమందాము." అంది. అత్తయ్య మాటకాదనలేక తాతగారు "సరేనమ్మా!
అతని ముచ్చటనెందుకుకాదనాలి!అలాగేకొనమను.పెద్ద ఖరీదుండదంటున్నావుకదా!" అన్నారు.      అలామా చిట్టత్తయ్య రికమండీషన్తో,మా తాతయ్యగారి అనుమతితో,  మా ఇంటికి 'ఫిలిప్స్ ' సంకురాత్రి పండగకు రేడియోవచ్చి,మామెట్లగది తలుపువెనకాల,మా పిల్లలెవరికీ అందనంత ఎత్తులో బల్లనెక్కి కూర్చుంది.రేడియోతోపాటుగా, పిల్లి తొమ్మిదిలో దూరుతున్నట్లు బొమ్మున్న,పెద్ద బ్యాటరిదిమ్మొకటికూడా రేడియోపక్కనెక్కి కూర్చుంది.రెడియో ఊసులాడాలంటే,కరెంటు అప్పటికి మాఊరికి రాలేదుకనుక ఆబ్యాటరీ రేడియోకి తోడుంల్సిందేమరి.అది రెండుమూడునెలలతరువాత  అయిపోయినప్పుడు రేడియో మూగనోముపట్టేది.అప్పుడాబ్యాటరీ దిమ్మను కాకినాడపట్టికెళ్ళి,షాపువాడికిచ్చేసి డబ్బుకడితే ,మళ్ళా కొత్తదిచ్చేవాడు.
    అదిసరే తనసంతానమంతటిలోకీపెద్దవాడైన,ఊర్లోవారిచే ప్రయోజకుడనిపించుకొంటున్న కొడుకుకంటే, కూతురుమాటవినడమేమిటా అని మీ కనిపించవచ్చు సహజంగా.  మా చిట్టత్తయ్య మా తాతగారికి ముద్దులగారాలపట్టి. పైగా,ఇంజనీరుగారి భార్య.భర్త ఉద్యోగనిమిత్తము ఎన్నో పట్టణాలను చూసింది. ఆమెకు మంచీ-చెడ్డా ,లోకజ్ఞానం అన్నీ బాగాతెలుసునని ఆయనకు ఒకనమ్మకం .అలా అత్తయ్య మాటపై వలన మాఇంటికిచేరిందా బుల్లిపెట్టి.
     ఎప్పుడూ వీధరుగుపైన బాసింపటం వేసుకు క్రిందకూర్చునే మాతాతయ్యగారి మకాం మెట్లగదిలోకి మారింది.ఆకాశవాణివారి ముద్రించబడే 'వాణి' మాసపత్రికకి నాన్న చందాకట్టడంవలన పోష్ట్ లో వచ్చేదది.ఆనెలలో రేడియోలో వచ్చే కార్యక్రమాల జాబితా అంతా అదులో ముద్రించబడేది.
    అప్పటికి బాలాంత్రపు రజనీకాంతరావుగారు విజయవాడ ఆలిడియారేడియోలో ఉదయమే భక్తిరంజని కార్యక్రమం అప్పటికి మొదలుపెట్టారోలేదో నాకు గుర్తులేదు. అందుకని మాతాతగారు ఉదయంలేచి,నోట్లో లేని దంతాలకు దావనంచెేసి,పొలానికివెళ్ళి,పొలంమట్టితో తెల్లగాతోమిన ఇత్తడి చెంబులో,చారులో వేయడానికో,పచ్చిడికో  ఇంత బలుసుసాకులు కోసితెచ్చుకొనేవారు. తద్దినంరోజు బలుసాకు తీపిపచ్చడో,పెరుగుపచ్చడో తప్పనిసరి . 'బ్రతికంటూవుటే,బలుసాకు తినిబ్రతకవచ్చు'అన్న నానుడి బహుశా మా తాతగారివల్లవంచ్చిందేమో అనిపిస్తుందినాకు.అప్పుడు తెలియదుకానీ, బలుసాకులో అన్నిరకాలపోషకాలున్నాయని యిప్పుడు తెలిసింది.కానీఇప్పుడు బలుసాకు ఎక్కడ దొరుకుతుందో,అసలుదొరుకుతోందోలేదో కూడా తెలియదు మా రౌతులపూడిలోతప్ప. 
     సరే మళ్ళీ మన ఫిలిప్స్ రేడియో విషయంలోకొద్దాం!

     మాతాతగారి మిత్రుడూ,మా రౌతులపూడి గ్రామ పురోహితులూఐన, సంగీతజ్ఞానంకల మా చిట్టెం సోమసుందరం తాతయ్యగారు కూడా మా ఇంటికివచ్చి,మాతాతయ్యగారితోకలసి కూర్చొని
సంగీత కార్యక్రమాలూ,రాత్రి సమయంలో రేడియోలో వచ్చే హరికథలూ,నాటకాలూ వింటూ పరవశించిపోయేవారు.
 అలా పరవశిస్తూ ఆయన బుర్రఊపుతుంటే, ఆయనకు మూరెడుకు తక్కువగావుండేపిలక  తెగఊగిపోతుంటే,పిలకతోపాటు మనిషంతా ఊగిపోతుంటే, మా పిల్లలకి బలే నవ్వొచ్చేది.అయితే మా తాతగారికీ వుండేది చిన్నపిలక,కానీ ఆయన సోమసుందరంతాతగారిలా బుర్రూపకుండా తొడలపై తాళం మాత్రమే వేయడంవలనకాబోసు ఆ చిన్నపిలక అసలూగేదేకాదు. అయినా, మా తాతయ్యగారి పిలకూగితేమాత్రం మేమునవ్వుతామాఏంటి?
    ఇక రేడియో అన్నది మాఊరు రౌతులపూడిలో మా ఇంట్లోకే మొదటగావచ్చింది. "ఓలే!మన కరణంగారింటికాడికిఊసులాడే పెట్టొచ్చిందంటే!సూద్దారి రండి."అంటూ ఆపెట్టెను చూడడానికి  ఆడా-మగా,పిల్లా- పీచూ లగెత్తుకొచ్చేవారు.  అంతచిన్నపెట్టిలో, తిండీ-తిప్పలూ లేకుండా,ఆడా మగా కలసి,ఎలాకూకున్నాన్నరన్నదీ?ఎలా ఊసులాడుతున్నారన్నదీ? ఎలా పాటపాడుతున్నారన్నదీ?  వాళ్ళందరికీ పెద్దసందేహంగా వుండేది. రేడియో వింటున్నంతసేపూ,ఒకరోజు కాదు ప్రతీరోజూ వారికది అర్థంకాని వింతే. అంత అమాయకమైన జనాలుండే రోజులవి.
   మిగిలినరోజులసంగతలావుంచితే,  చైత్రశుధ్ధనవమినాడు రేడియోలో ప్రసారమయ్యే 'సీతారామకళ్యాణం 'కార్యక్రమాన్ని మన కళ్ళకుకట్టినట్లు వాచకంద్వారా వినిపించే కార్యక్రమంవినడానికి
మాఇంటికి, ఎప్పుడోతప్ప ఇల్లుదాటి  బయటఅడుగుపెట్టని ,అచ్చిరాజుబామ్మగారూ,శేషంబామ్మ,గంగరాజుదొడ్డా మొదలైన పూర్వసువాసినుందరువచ్చెేవారు. వారంతా మా పెద్దమామ్మయ్య మోగంటి సుబ్బమ్మగారి దోస్తానాలు.అలాగే చిట్రాప్రగడ చిన సుబ్బారావు తాతగారూ, గోటేటి వెంకట్రత్నం చిన్నాగారూ,ఆయన తమ్ముడు వెంకట్రాజు చిన్నాన్నగారూ,బుచ్చిరాజుతాతగారూ, వీర్రాజుమావయ్య, లక్షింపతి తాతగారూ,సీతారామయ్య తాతగారూ మొదలైన ఊర్లోనిపెద్దవారంతా వచ్చికూర్చొని, భధ్రాచలంవెళ్ళి,సీతారామకళ్యాణం ప్రత్యక్షంగా చూస్తున్నంత ఆనందం అనుభవించేవారు. భక్తితోపారవశ్యంతో పులకించిపోయేవారు ..ఆసమయంలో పొలంనుంచి ఇంటికివచ్చిన మానాన్న, ఇంటినిడుగాకూర్చొని,ఆనందసాగరంలోమమునిగి ఓలలాడుతున్న ఆత్మీయబంధువులనుచూసి,"రేడియో కొని ఎంతమంచిపని చేసా 
 ను" అనుకొనేవారనుకొంటా,ఆయన పెదవులపై చిన్ననవ్వుకదలాడేది.   
మాతాతగారి కళ్ళుకూడా రేడియో కొన్నందుకు నాన్నను ప్రశంస్తున్నట్లు ఆనందంతో మెరిసిపోయేవి.
    ఆవిధంగా మా ఇంటి ఫిలిప్స్ రేడియో,
మా ఇంటివారికేకాక, ఊరివారందరికీ కూడా ఆత్మీయురాలైయ్యింది.
      సత్యవాణి కుంటముక్కుల
8639660566

No comments:

Post a Comment