*_అమ్మ భాష..గుండె ఘోష!_*
మాతృభాషంటే
గుండె ఘోష..
అమ్మ నీకు నేర్పిన
మొదటి మాట
పదిలంగా దాచుకో నాన్నా
అంటూ నీకిచ్చిన వరాలమూట
కాస్తకాస్తగా..ఎప్పటికప్పుడు
కొత్తకొత్తగా రుచిచూస్తూ..
ఆస్వాదించరా అని మురిపెంగా
కట్టి ఇచ్చిన చద్దిమూట..!
అంతేనా..
అడ్డాలనాడు వచ్చీరాని మాటలతో నువ్వు నుడివిన
మొదటి సాహిత్యం..
నీ తొలి తేనె పలుకులు విని
అమ్మ మురిసిపోయిన
నీ పసితనపు పాండిత్యం
ఆజన్మాంతం నీ ఉన్నతిలో
ముందుండి నిను నడిపించే
సాన్నిహిత్యం..
కలకాలం నీ నోటి నుంచి వెలువడే ఆణిముత్యం..
స్వాతిముత్యం..!
అమ్మ నేర్పిన భాష
అది మరచిన నీ వాలకం
మరీ కృతకం..
ఎలా ఉన్నావు..ఇది మాని
హౌ డూ యు డూ..
అలాగే ఇంగ్లీషోడికి
నువ్వైపోయావు డూ డూ..
తమిళ తంబికి..
కన్నడ కంఠీరవుడికి...
బెంగాలీ బాబుకు..
బీహారీ భయ్యాకి..
ఎవరికీ లేని అనుకరణ..
మర్చిపోయి నీ వ్యాకరణ..
అమ్మ భాషంటే
తెలియని తిరస్కరణ..
ఓయీ తెలుగోడా
నీకే ఎందుకీ తెగులు
నీ భాషకు మంగళం
పరభాషతో లేనిపొని
గందరగోళం..
ఎందుకొచ్చిన తంటా..
వినేవాడికి ఒళ్లుమంట..!?
పరభాషా జ్ఞానాన్ని సంపాదించు..
నీ భాషలోనే
నువ్వు సంభాషించు..
తమిళనాడు వెళ్తే నువ్వైనా
తమిళంలోనే మాటాడాలంటాడు
అక్కడి తంబి..
నువ్వు మటాడే ప్రయత్నం చేసేస్తావు తబ్బిబ్బై..
నీ సాటి తెలుగోడు ఎదురైతే
వాడితోనూ ఇంగిలిపీసు..
ఎందుకొచ్చిన తిరకాసు..
పరభాషపై పనికిరాని ఆకర్షా
ఇంగిలీషులో
నీ పాండితీప్రకర్షా..
అదంతా అఫీషియలా
ఆర్టిఫిషియలా..
నీ ఎంగిలిపీసును
అలా భరించాలా!!
ఇవన్నీ ఎందుగ్గాని..
ఎన్ని భాషలు నేర్చినా
నీ భాషలో
నువ్వు మాట్లాడు..
అదే నీకు గౌరవం..
నీ భావం..నీ పాటవం..!
అమ్మ భాషను ప్రేమించడం
అమ్మను ప్రేమించినంత
హాయి..అది మరువకోయి..!!
మాతృభాషాదినోత్సవం
సందర్భంగా అభినందనలతో..
*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
9948546286
7995666286
No comments:
Post a Comment