*🧘♂️6-వేమన-తత్వం 🧘♀️*
*చావు వచ్చినపుడు సన్యసించేదెట్లు!*
*కడకు మొదటి కులము చెడినయట్లు!*
*పాపమొకటి గలదు ఫలమేమి లేదయా!*
*విశ్వదాభిరామ వినురవేమ!!*
*అవసాన దశకు చేరుకున్నప్పుడు సన్యాసం స్వీకరిస్తున్నావా? అంటే పూర్వాశ్రమంలో చేసినవన్నీ తప్పులన్నట్టేగా. గతంలో జరిగిన పాపం ఎటూ పోదు. దాని ఫలితం అనుభవించక తప్పదు. సన్యసిస్తే మంచి ఫలితం వస్తుందను కుంటున్నావా? అదంతా వొట్టిది అంటున్నాడు వేమన.*
*‘సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఙ్ కరణే’ అన్నాడు శ్రీ శంకరాచార్యులు ‘భజ గోవిందం’ స్తోత్రంలో.*
*మృత్యువు నిన్ను సమీపించినప్పుడు లౌకికమైన వ్యాకరణ సూత్రాలు వల్లించి లాభం లేదు. దైవ ధ్యానం చేసుకో! అంటే గోవిందుణ్ని భజించు అని సూచిస్తున్నాడు. ధాతు పాఠంలో డుకృఙ్ కరణే అంటే చేయుట అని.*
*ఈ సూత్రాన్ని పదే పదే అనటం కాదు ఆధ్యాత్మిక జ్ఞానం ముఖ్యం అని సారాంశం. ‘భజ గోవిందం’ స్తోత్రాన్ని గానకోకిల సుబ్బలక్ష్మి గారు ఆలపిస్తుంటే కలిగే వైరాగ్య స్ఫూర్తి అంతా ఇంతా కాదు.*
*ఇక్కడ వేమన్న చెప్తున్న సన్నివేశం దాదాపు ఇట్లాంటిదే. ‘‘సన్యసించేదెట్లు?’’ అంటున్నాడు. ఇంతకూ సన్యాసమంటే ఏమిటి? సన్యాసమంటే త్యాగపూర్వకమైన జ్ఞాన యోగాన్ని అవలంబించడం.*
*కోరికలకు సంబంధించిన పనులను వదిలి వెయ్యటం. ఏవో కారణాల వల్ల సన్యసించడం కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానం కోసం స్వీకరిస్తే అది నిజమైన సన్యాసమవుతుంది.*
*చావు భయంతో చేసే సన్యాసం వల్ల ప్రయోజనం లేదు. దానివల్ల గత పాపాలు పోవు. పాపమంటే ఏమిటి? పాపమంటే అధర్మ కృతం.*
*దీని నుంచి తాత్కాలికంగా తప్పించుకోవచ్చునేమో గాని చివరకది శిక్షించక మానదంటున్నాడు వేమన. కాబట్టి పాపం చేసేముందు కాస్త జాగ్రత్తగా ఉండటం మేలు అనేది వేమన సందేశం.*
No comments:
Post a Comment