ప్రతిరోజూ…
శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…
నడిచే దేవుడు…
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
పరమాచార్య పావన గాధలు…
*ఎనిమిది సవర్లు - రెండు వరసలు*
➖➖➖✍️```
(పంచసంఖ్యోపచారిణి)
చాలా ఏళ్ళ క్రితం ఒకరోజు తెల్లవారుఝామున బయట చిన్నగా చినుకులు పడుతుండగా కంచి శంకర మఠంలో మహాస్వామి వారు ఏకాంతంగా కూర్చొని ఉన్నారు. భక్తులందరూ దర్శించుకుని వెళ్ళిపోయిన తరువాత మహాస్వామి వారు తమ గదిలోకి వెళ్ళడానికి లేవబోతుండగా, ఒక ముసలి మామ్మ, ఒక యువతి పరుగు పరుగున వచ్చి మహాస్వామి వారికి నేలపై పడి నమస్కారం చేసి నిలబడ్దారు. స్వామి వారు మరల కూర్చొని, వారిని తేరిపార చూసారు.
సంతోషంతో మొహం వెలుగగా, “అరెరె ఎవరు? మీనాక్షి పాట్టి(బామ్మ) నా? ఏమిటి ఆశ్చర్యం ఇంత ఉదయాన్నే వచ్చావు? నీతో ఉన్నది ఎవరు? నీ మనుమరాలా? ఏమిటి పేరు?” అని అడిగారు.
మీనాక్షి పాట్టి స్వామివారితో, “పెరియవా! నేను చాలా ఏళ్లుగా మీ దర్శనానికై వస్తున్నాను. కాని ఏరోజూ మీకు నాగురించి చెప్పుకోలేదు. ఆ అవకాశం ఎప్పుడూ రాలేదు. కాని ఇప్పుడు ఆ అవసరం వచ్చింది. ఈ అమ్మాయి నా మనుమరాలు, కూతురి కుమార్తె. ఇక్కడే పుట్టడం వల్ల కామాక్షి అని పేరు పెట్టాము. నాకు ఒక్కతే కూతురు. ఈ పిల్లను నా చేతుల్లో పెట్టి తను పోయి పన్నెండు ఏళ్ళు అవుతోంది. ఏదో జబ్బు తనకి. తన భర్త కూడా తనకంటే ముందే పోయాడు గుండెపోటు వల్ల.
ఈ పిల్లతో కలిసి జీవితం నెట్టుకొస్తున్నాను. పాఠశాలకు పంపిస్తే చదువు తలకెక్కలేదు. ఫిఫ్త్ గ్రేడ్ తో ఆపేసాను. ఇప్పుడు తనకు పదిహేను సంవత్సరాలు. దీన్ని ఒక అయ్య చేతిలో పెడితే నా బరువు తీరుతుంది”
స్వామివారు అంతా ఓపికగా విన్నారు. “ఇంత పొద్దున్నే నువ్వు రావటంతోనే నేను అనుకున్నాను. మామూలుగా పదిగంటలప్పుడు చంద్రమౌళీశ్వర పూజకి పారిజాత పూలు తెచ్చేదానివి కదా. ఇప్పుడు వచ్చావంటే ఏదో అవసరం ఉంది అని. ఏమిటి విషయం?” అని అన్నారు.
మొదట కొద్దిగా సంకోచిస్తూ, “ఏమిలేదు పెరియవా! అమ్మయికి మంచి సంబంధం వచ్చింది. అబ్బాయిది కూడా ఈ ఊరే. పాఠశాలలో ఉపాధ్యాయుడు. అరవైరూపాయల జీతం. మంచి కుటుంబం. ఇచ్చి పుచ్చుకొనే బాధలు లేవు. జాతకాలు కూడా బాగా కలిసాయి. మీరే ఎలాగో ఈ వివాహం జరిపించాలి పెరివయా” అని స్వామివారికి నమస్కరించింది.
స్వామివారు స్వరం పెంచుతూ, మృదువుగా మందలిస్తున్నట్టుగా “ఏమిటి? నేను పెళ్ళి చేయాలా? ఏమి మాట్లాడుతున్నావు?” అన్నారు. వెంటనే చల్లబడి “సరే. నన్ను ఏమి చెయ్యమంటావు?” అని అడిగారు.
బామ్మ సంతోషంతో “అది ఇలా పెరియవా! నేను ఎలాగో కష్టపడి తన పెళ్ళికి ఒక ఐదువేలు రూపాయలు దాయగలిగాను. అ డబ్బుతో పెళ్ళి జరిపించగలను. కాని ఆ అబ్బాయి తల్లి ఖండితంగా ‘పాట్టి ఎలా చేస్తావో, ఏమి చేస్తావో మాకు తెలియదు నీ మనవరాలి మెళ్ళో ఎనిమిది సవర్ల బంగారు గొలుసు రెండు వరసలది వేసి పంపు’ అని చెప్పింది. నా ఆదాయంతో తనకి నగలు నట్రా నేను చేయించలేను. ఒక సవరం బంగారంతో రెండు గాజులు మాత్రం చేయించగలిగాను. నాకు అంతే సాధ్యపడింది. ఆ గొలుసు నేను ఎక్కడి నుండి తేగలను. మీరు మాత్రమే...”
ఆవిడ ముగించక ముందే పరమాచార్య స్వామి వారు కోపంగా “చెప్పు, ఎనిమిది సవర్ల బంగారంతో రెండు వరసల గొలుసు నన్ను చేయించమంటావా?” అని అడిగారు.
మీనాక్షి పాట్టి సాష్టాంగం చేసి నిలబడి గట్టిగా లెంపలేసుకుంటూ “అపచారం అపచారం, పెరియవా నేను చెప్పదలచుకున్నదేమంటే రోజూ మీ దర్శనానికి ధనవంతులు, పెద్దవారు వస్తుంటారు. మీరు ఎవరికైనా ఈ గొలుసు కావాలని చెప్పొచ్చు కదా” అని దీర్ఘం తీస్తూ అడిగింది.
”ఏమిటీ? దర్శనానికి వచ్చిన వారిని గొలుసు ఇవ్వమని అడగనా? ఇక్కడ అటువంటి అలవాటు లేదు. నీకు కావాలంటే బంగారం అడగని ఏదైనా వేరే సంబంధం చూసుకో. అదే నీకు మంచిది” అని స్వామి వారు లేచారు.
మీనాక్షి పాట్టి ఆత్రుతగా “మహాస్వామి వారు ఇలాంటి సలహా ఇవ్వరాదని ప్రార్థిస్తున్నాను. ఇది మంచి సంబంధం, పెరియవా. పిల్లవాని స్వభావం మంచిది. వారి అమ్మాయికి పెళ్ళిచేసి ఎనిమిది సవర్ల బంగారం గొలుసు రెండు వరసలది పెట్టి పంపారట. కావున తమ ఇంటికి వచ్చే అమ్మాయి కూడా అలాగే రావాలని వారి కోరిక. మరింకేంలేదు పెరియవ! ఈ విషయంలో మీరే నాకు దారి చూపగలరు” అని ఏడుస్తూ అర్థించింది.
వెళ్ళడానికి లేచిన మహాస్వామి వారు మరలా కూర్చున్నారు. కొద్దిసేపు ఆలోచనలో మునిగిపోయారు. తరువాత కరుణా పూరితమైన మాటలతో “నేను ఇప్పుడు చెప్పేది మీరు చేస్తారా?” అని అడిగారు.
”ఖచ్చితంగా చేస్తాను పెరియవా. ఏమిటో చెప్పండి” పాట్టి ఉత్సుకతతో అడిగింది.
“రేపు నీ మనవరాలితో కలిసి కామాక్షి అమ్మవారి దేవస్థాననికి వెళ్ళు. ఇద్దరూ అమ్మవారిని ప్రార్థించండి, ‘అమ్మా! ఎనిమిది సవర్ల బంగారు గొలుసుతో ఈ పెళ్ళి బాగా జరిగేట్టు దీవించమ్మ. నీవే దాన్ని కరుణించగలవు అమ్మా’ అని సన్నిధి చుట్టూ అయిదు సార్లు ప్రదక్షిణ చెయ్యండి. ఐదు సార్లు అమ్మవారికి నేలపై పడి నమస్కారం చేసి ఇంటికి వెళ్ళండి. ఇలా ఐదురోజుల పాటు చెయ్యండి. మీరు సంకల్పించినట్టుగా మీకు కావాల్సింది కామాక్షియే ఇస్తుంది” అని ఆశీర్వదించి పంపారు.
మీనాక్షి పాట్టి సాష్టాంగం చేసి నిలబడి, “అదేమిటి పెరియవా మీరు అన్నీ అయిదుగా చెయ్యమంటారు!” అని పాట్టి ఆత్రుతతో “అలా చేస్తే కామాక్షి అమ్మ నా మనవరాలు కామాక్షి పెళ్ళి చేస్తుంది కదా?” అని అడిగింది.
“ఐదు సార్లు చెయ్యమని నాకోసం చెప్పడం లేదు. అమ్మవారి నామాలలో “పంచసంఖ్యోపచారిణి” అని ఉంది. ఐదు, ఐదు గుణిజాలుగా ఏమైనా చేస్తే ఆవిడ మన కోరికలు తీరుస్తుంది” అని చెప్పి, “నేను అదే చెప్పాను. మరింకేం లేదు” అని అన్నారు.
”ఎప్పుడు మొదలు పెట్టాలి పెరియవా?”
స్వామివారు నవ్వుతూ, “శుభశ్య శీఘ్రం” అని ఒక నానుడి. ఈరోజు శుక్రవారం. ఇంకేం ఈరోజునుండే మొదలుపెట్టండి” అని చెప్పి వారిని పంపించారు.
తన మనవరాలితో కలిసి బామ్మ కామాక్షి అమ్మవారి దేవస్థానానికి దారితీసారు. ఆరోజు శుక్రవారం అవడం వల్ల చాలా రద్దీగా ఉంది. అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తోంది. స్వామి వారి ఆనతి ప్రకారం ఇద్దరూ కళ్ళుమూసుకుని ప్రార్థించారు. పాట్టి తన మనవరాలి పేరు నక్షత్రం చెప్పి అర్చన చేయించి ప్రసాదం తీసుకుంది.
తరువాత ఇద్దరూ ఆ ఎనిమిది సవర్ల రెండు వరసల బంగారు గొలుసు గురించి ప్రార్థించి లోపలికెళ్ళి గర్భాలయం చుట్టూ ఐదుమార్లు ప్రదక్షిణ చేసారు. స్వామివారు చెప్పినట్టు ఐదుసార్లు నేలపై పడి నమస్కరించి అమ్మవారిపై విశ్వాసంతో ఇంటికి వెళ్ళారు.
శనివారం ఉదయం మీనాక్షి పాట్టి మనవరాలితో కలిసి పారిజాత పూలు తీసుకుని శ్రీమఠానికి వెళ్ళింది. ఆరోజు చాలా రద్దీగా ఉంది. ఒక ఇరవై ముప్పై మంది భక్తుల వెనకాతల పాట్టి నిలబడింది. తన ముందున్న వ్యక్తి మరొక వ్యక్తితో చెప్పగా విన్నది. “ఈరోజు అనుశం(అనూరాధ) నక్షత్రం. పరమాచార్య స్వామి వారి జన్మనక్షత్రం. కాబట్టి స్వామివారు ఈరోజు కాష్టమౌనంలో ఉంటారు. ఎవరితోను మాట్లాడరు. కేవలం ముఖదర్శనం మాత్రమే”
మీనాక్షి పాట్టి ఆత్రుత నీరుగారిపోయింది. “ఈ రోజు మహాస్వామి వారికి ఆ ఎనిమిది సవర్ల బంగారు గొలుసు గురించి గుర్తు చేద్దామనుకున్నాను కాని కుదిరేలా లేదు” అని అనుకుంది. వారు మహాస్వామి వారి దగ్గరకు చేరగానే సాష్టాంగం చేసి నిలబడ్డారు. అసలు జీవం లేదు అన్నట్టుగా ఆ పరబ్రహ్మం కూర్చొని ఉంది. పాట్టి అక్కడే నిలబడింది ఎలాగైనా గుర్తు చేద్దామని.
స్వామి వారి సేవకుడొకరు గట్టిగా “పాట్టి ముందుకు వెళ్ళు ఈరోజు స్వామి వారు మౌనంలో ఉన్నారు. వారు మాట్లాడరు. చూడు ఎంతమంది వేచియున్నారు నీ వెనకాతల” అని కసిరి పంపించాడు.
చేసేదేమి లేక మనవరాలితో కలిసి కామాక్షి అమ్మవారి దేవస్థానానికి దారితీసింది. మహాస్వామి వారి ఆజ్ఞ ప్రకారం అమ్మవారికి పంచసంఖ్యోపచార పూజ చేసి ఇంటికి వెళ్ళిపోయారు. తరువాతి రెండు రోజులు స్వామి వారు మౌనంలో ఉన్నారు. పాట్టి ఆమె మనవరాలు కేవలం మహాస్వామి వారిని మఠంలో దర్శించుకుంటున్నారు. ఆమెకు ఆందోళన ప్రారంభమయ్యింది. “ఐదు రోజులలో నాలుగు రోజులు గడిచిపోయాయి. కాని ఏమి జరగలేదు. తల్లి కామాక్షి కళ్ళు తెరిచి నన్ను కరుణిస్తుందో లేదో?” అని తనలో తనే బాధపడుతోంది...
మంగళవారం తెల్లవారింది. కంచి మఠం చాలా కోలాహలంగా ఉంది. అరణి నుండి ఒక భజన బృందం వచ్చింది. వారి భజనామృతంతో మఠాన్ని భక్తిలో ముంచేస్తున్నారు. మహాస్వామి వారు వచ్చి వారి స్థానంలో కూర్చున్నారు. వారి మొహంలో తేజస్సు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. మౌనవ్రతం అయిపోయింది. స్వామి వారు దర్శనం కోసం చాలామంది వేచియున్నారు.
మధ్య వయస్కురాలైన ఒక మామి (పెద్దావిడ) తనవంతు రాగానే సంతోషంగా నేలపై పడి స్వామి వారికి నమస్కరించింది. తను తెచ్చిన వాటిని స్వామివారి ముందు పెట్టింది. ఒక పెద్ద రస్తళి అరటిపళ్ళ గొన, టెంకాయలు, చీనీ కాయలు, కమలాపళ్ళు, గుమ్మడికాయలు, లావుపాటి పచ్చి అరటిపళ్ళు మొదలైనవి పెట్టి మళ్ళా నమస్కరించింది.
స్వామివారు వాటిని చూసి తమలో తామే నవ్వుకున్నారు. వాటిని అక్కడ పెట్టిన ఆ పెద్దావిడ వైపు చూసారు. “నువ్వు నీదమంగళం భూస్వామి గణేశ అయ్యర్ భార్య అంబుజంవి కదూ? రెండు నెలల కింద ఇక్కడికి వచ్చావు. ఏదో విషయం గురించి బాధపడుతున్నానని చెప్పావు. ఇప్పుడు ఇలా పెద్ద అరటి పళ్ళతో వచ్చావంటే కామాక్షి అమ్మవారి దయ వల్ల నీ బాధలు తీరిపోయాయి కదా!” అని అన్నారు.
అంబుజం మామి మరలా నమస్కరించి, “అవును నిజం పెరియవా! నా ఒక్కగానొక్క కూతురు మైథిలి మూడేళ్ళుగా భర్తకు దూరంగా ఉంటోంది. రెండు నెలల క్రితం మీ వద్దకు వచ్చి నా బాధను చెప్పుకున్నాను. మీరు కంచి కామాక్షి అమ్మవారికి ఐదు ప్రదక్షిణలు, ఐదు నమస్కారాలు ఐదు రోజుల పాటు పంచసంఖ్యోపచార పూజ చెయ్యమన్నారు. నేను అది చాలా శ్రద్ధతో పూర్తిచేసాను. ఏమి నా అదృష్టం పదిహేను రోజుల క్రితం, జంషెడ్పూర్ టాటా స్టీల్ ప్లాంట్ లో పని చేసే నా అల్లుడు ఇక్కడకు వచ్చి తన భార్యను తీసుకుని వెళ్ళాడు. ఇదంతా కామాక్షి కరుణ మీ అనుగ్రహం పెరియవా!” అని ఆనందబాష్పాలు కారుస్తూ చెప్పింది.
అదంతా విని మహాస్వామి వారు “భేష్! భేష్! సంతోషం, చాలా మంచిది. ఆ దంపతులిద్దరూ సుఖంగా జీవించు గాక! సరేకాని ఇంత పెద్ద అరటిపళ్ళ గొన ఎక్కడిది? చాలా ఫలవంతంగా ఉంది” స్వామివారి నవ్వు ఉరుము ఉరిమినట్టు ఉంది.
అంబుజం నవ్వుతూ, “ఈ అరటి గొన మా అరటి తోటలోనిదే పెరియవా! అందుకే అంత పెద్దగా ఉంది” అని వినయంగా చెప్పింది.
స్వామివారు సంతోషంతో, “సరే! మీ అల్లుణ్ణి కూతురిని కలిపింది ఆ కామాక్షియే కాబట్టి ఈ అరటి గొనని ఆవిడకే సమర్పించి ఆ పళ్ళని ఆక్కడ దర్శనానికి వచ్చిన భక్తులకు పంచు” అని ఆజ్ఞాపించారు.
“లేదు లేదు పెరియవా! ఇది ఇక్కడే ఉండనివ్వండి. అమ్మవారికి సమర్పించడానికి సరిగ్గా ఇలాంటిదే ఇంకొకటి తెచ్చాను. మీరు అనుమతిస్తే అమ్మవారిని దర్శించుకొని నా కృతజ్ఞతలను తెలుపుకొని వస్తాను” అని చెప్పి స్వామికి నమస్కరించింది.
”భేష్! అమ్మవారి దర్శనం తరువాత మఠంలో భోజనం చేసి మీ ఊరికి వెళ్ళాలి సరేనా గుర్తుంచుకో. మరచిపోకు” అని వెళ్ళడానికి అనుమతిచ్చారు.
ఆరోజు కామాక్షి అమ్మవారి ఆలయంలో అంతగా భక్తుల తాకిడి లేదు. ఉదయం పదకొండు గంటలు. కొద్దిగా ఆలస్యం అవ్వడం వల్ల మీనాక్షి పాట్టి మనవరాలితో త్వరత్వరగా ఆలయంలోకి వెళ్ళింది. ఆరోజు చివరి రోజు కావడంతో పూజకు కావాల్సిన సామాన్లు తెమ్మని మనవరాలికి డబ్బులిచ్చి వెనక రమ్మని తను వెళ్ళిపోయింది.
ఆ అమ్మాయి, బామ్మ చెప్పినవన్నీ తీసుకుని లోపలికి వెళ్ళింది. పాట్టి అమ్మవారికి అర్చన చేయించి కళ్ళ నీరు కారుతుండగా ప్రార్థించింది. “అమ్మా కామాక్షి తాయి, నేను నీ పైనే ఆధారపడి నిన్నే నమ్ముకున్నాను. నువ్వు, స్వామి వారు తప్ప నన్ను కాపాడగలవారు లేరు. ఎనిమిది సవర్ల రెండు వరసల బంగారు గొలుసుతో నా మనవరాలి పెళ్ళి చేయవలసింది నువ్వే. నీ వల్లే నా మనవరాలి పెళ్ళి జరగగలదు. కాపాడు తల్లీ కాపాడు”. బామ్మ ఏడుస్తుండడంతో మనవరాలు కూడా ఏడ్చేసింది. తరువాత అమ్మవారి గర్భగృహానికి ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టారు. నాలుగో ప్రదక్షిణం చేస్తున్నారు.
“పాట్టి... పాట్టీ... పాట్టీఈఈఈ” మనవరాలు ఇలా గట్టిగా అరుస్తున్నందుకు మీనాక్షి పాట్టి వెనక్కు తిరిగి కోపంతో “ఎందుకు అలా అరుస్తున్నావు? ఏమి పోయిందని అలా మొత్తుకుంటున్నావు?” అని కోపంగా అంది.
“ఏమి పోలేదు పాట్టి కాని ఇది దొరికింది. ఇక్కడకు రా చూపిస్తాను” అని చిన్నగా చెప్పి, పాట్టిని ఒక మూలకు తీసుకుని వెళ్ళి, మూసి ఉన్న అరచేతిని తెరిచింది. అది తెగిపోయిన పథకమున్న రెండు వరసల బంగారు గొలుసు.
“ఎక్కడ దొరికింది నీకు?” పాట్టి ఆశ్చర్యంతో అడిగింది. “నేను నీ వెనక తలదించుకొని వస్తున్నాను, నా కళ్ళు కింద ఉన్న ఈ గొలుసుపై పడ్డాయి. నేను వెంటనే ఎవరూ చూడకుండా దీన్ని గభాలున తీసుకున్నాను. ముందు ఇది నిజమైనదా లేక నకిలీదా చూడు“ అని చెప్పింది ఆ అమ్మాయి.
పాట్టి దాన్ని చేతుల్లోకి తీసుకుంది. అటు ఇటు పరీక్షగా చూసి, “చూస్తే మంచి బంగారం లాగే ఉంది. ఒక ఎనిమిది ఎనిమిదిన్నర సవర్లు ఉండొచ్చు. ఇది మహాస్వామి వారి మహిమవల్ల కామాక్షి మనకు అనుగ్రహించింది. సరే ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పద” అని చీరకొంగున ఆ గొలుసును దాచి ముడివేసి ఆత్రంగా బయటకు వచ్చింది.
అప్పుడు మధ్యాహ్నం ఒంటిగంట సమయం. స్వామి వారి సందర్శనార్థమై ఒక నలుగురైదుగురు వేచి ఉన్నారు. మీనాక్షి పాట్టి, ఆ అమ్మాయి నేలపై పడి నమస్కారం చేసి నిలబడ్డారు. స్వామివారు వారిని చూసి నవ్వారు. స్వామి వారికి గొలుసు విషయం చెప్పాలా వద్దా అని పాట్టీ తటపటాయిస్తోంది.
స్వామివారే ముందుగా “ఈరోజుతో ఐదురోజుల మీ పంచసంఖ్యోపచార పూజ పూర్తికావలసింది. కాని ఒక వస్తువు నీ మనవరాలి చేతుల్లోకి రావడం వల్ల, మీకు కలిగిన ఆశ్చర్యానందంవల్ల ఐదవ ప్రదక్షిణ పూర్తికాలేదు. కామాక్షి దేవి పూర్ణ అనుగ్రహం లభించింది అని పరుగుపరుగున బయటకు వచ్చేసావు. అవునా?” అని గట్టిగా నవ్వారు.
పాట్టి నిచ్చేష్టురాలైంది. భయంతో మాటలను మింగుతూ గుటకలు వేస్తూ, “స్వామివారు నన్ను తప్పుగా భావించరాదు. ఆ వస్తువు నా మనవరాలి చేతుల్లోకి రాగానే అమ్మవారే తను తీసుకోవాలని అక్కడ పడేసింది అని భావించి, సంతోషంతో మరొక్క ప్రదక్షిణ చెయ్యాలని మర్చిపోయాను” అని చెప్పింది.
స్వామివారు అసహనంగా, “అదొక్కటే మర్చిపోయావా! ఇక్కడికి వస్తూ దార్లో రంగు పథ్థర్ గారి దుకాణంలో ఆ వస్తువును తూచి, తెగిపోయినదాన్ని కొలిమిలో అతికించడం మరచిపోలేదా?” అని అడిగారు. “అది వదిలెయ్. తూచినప్పుడు అది సరిగ్గా ఎనిమిది సవర్లు ఉందా?” అని అడిగారు.
పాట్టి మరియు మనవరాలు నిర్ఘాంతపోయారు. “మీరు ఇప్పుడు చెప్పినదంతా నిజం పెరియవా!” అని పాట్టి అన్నది.
స్వామివారు నిదానించి, “చెప్పు. న్యాయంగా ఆ పదార్థం ఎవరికి చెందినది?” అని అడిగారు.
”కామాక్షి అమ్మకి”
“మరి దాన్ని నువ్వు రహస్యంగా తీసుకుని చీరకొంగులో దాచుకోవడం సబబేనా? నువ్వే చెప్పు”
“అపరాధం... కేవలం నా అపరాధం అంతే. నన్ను మన్నించండి. అనుకోకుండా చేసాను” అని పాట్టి పశ్చాత్తాప్పడుతూ, చేతులు వణుకుతుండగా స్వామి వారి ముందు ఉన్న పళ్ళెంలో ఆ గొలుసును ఉంచింది. స్వామివారు నవ్వారు.
అప్పటికి మద్యాహ్నం రెండు గంటలు అయ్యింది. మీనాక్షి పాట్టిని మనవరాలిని తన ముందు కూర్చోమన్నారు. పొద్దున్న స్వామివారి అనుమతితో కామాక్షి దర్శనానికి వెళ్ళిన అంబుజం విచార వదనంతో వచ్చి స్వామి వారికి నమస్కరించింది. ఆవిడ తీవ్రమైన బాధతో కళ్లల్లో నీరు కారుస్తోంది. స్వామివారు చూసి, వాత్సల్యంతో “అడడా! ఎందుకమ్మా ఏడుస్తున్నావు?” అని అడిగారు.
అంబుజం మామి కళ్ళుతుడుచుకుని ఇలా చెప్పింది, “అది ఇలా పెరియవా! రెండునెలల క్రితం కామాక్షికి ఐదురోజుల సేవ చేసినప్పుడు నా అల్లుడు కూతురు ఒక్కటైతే, నా ఎనిమిది సవర్ల రెండు వరసల బంగారు గొలుసుని ఇస్తానని మొక్కుకున్నాను. అమ్మవారు వాళ్ళిద్దర్నీ ఒక్కటిచేసింది. ఈరోజు నా గొలుసు ఇద్దామని వెళ్ళాను. కాని అది నా గొంతులో నుండి జారిపడి ఎక్కడో పడిపోయింది. ఆత్రంగా అంతా వెతికాను కాని నాకు ఎక్కడా దొరకలేదు. అది అమ్మవారికి ఇస్తానన్న గొలుసు. ఇప్పుడు నన్నేం చెయ్యమంటారు పెరియవా?” అని మళ్ళా కన్నీరు పెట్టుకుంది.
స్వామివారు మీనాక్షి పాట్టి వైపు అర్థమైందా అన్నట్టు చూసారు. పాట్టి స్వామివారికి నమస్కరించి లేచి నిలబడింది. పళ్ళెంలో పెట్టిన ఆ బంగారు గొలుసును చేతుల్లోకి తీసుకుని అంబుజం వైపు తిరిగి దాన్ని చూపిస్తూ, “అమ్మా అంబుజం చూడు ఇది నువ్వు పోగొట్టుకున్న గొలుసేనేమో?” అని అన్నది.
అంబుజం దాన్ని చేతులలోకి తీసుకుని పరీక్షించి, “ఇదే ఇదే గొలుసు. పాట్టి ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? చాలా ఆశ్చర్యంగా ఉంది” అని అన్నది. పాట్టి అంబుజానికి జరిగిన విషయమంతా గుక్కతిప్పుకోకుండా చెప్పింది.
అంబుజం మామి మీనాక్షి పాట్టిని కౌగిలించుకుంది. సంతోషంతో “పాట్టి, నువ్వు ఏమి దిగులుపడకు. నేను స్వామివారి సమక్షంలో చెప్తున్నాను. నీ మనవరాలి పెళ్ళికి రెండు వరసల బంగారు గొలుసు ఎనిమిది సవర్లది కొత్తది నేను చేయిస్తాను. తన పెళ్ళి వైభవంగా జరుగుతుంది. ఈ గొలుసు నేను అమ్మవారికి సమర్పించాలనుకున్నది. ఈ సాయింత్రమే నిన్ను మీ అమ్మాయిని నాతో నగల షాపుకు తీసుకువెళ్ళి, ఎనిమి సవర్ల రెండు వరసల బంగారు గొలుసు ఇప్పిస్తాను. అంతేకాదు తన పెళ్ళి ఖర్చు నిమిత్తం ఐదువేల రూపాయలు ఇస్తాను” అని చెప్పింది.
స్వామివారు ప్రత్యక్ష కామాక్షిలా కూర్చుని అంతా చూస్తున్నారు సాక్షిగా. అందరూ మహాస్వామి వారికి నమస్కరించారు. స్వామి వారు మీనాక్షి పాట్టి వైపు చూస్తూ “ఈరోజు నీవు, నీ మనవరాలు ఐదు ప్రదక్షిణలు చెయ్యలేదు. సాయింత్రం వెళ్ళి అయిదు ప్రదక్షిణలు చేసి అమ్మవారిని ప్రార్థించండి” అని చెప్పి పంపించారు.
ఆ సమయంలో మీనాక్షి పాట్టికి తన మనవరాలికి కలిగిన ఉద్వేగం, ఆ సంఘటన వలన కలిగిన భావనలు సామాన్య పదాలతో వర్ణించడం అసాధ్యం.✍️```
*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*
*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥*
```
“కంచిపరమాచార్యవైభవం”🙏
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment