Sunday, 7 September 2025

 *_ఈ కలియుగంలో ఇంద్రియములను, మనసును అదుపులో పెట్టుకోవడం చాలా కష్టము! అర్జునుడు అంతటి వాడే  'చంచలం హి మనః కృష్ణా!' అన్నాడు._*

*_ఎలా అంటే ప్రాపంచిక విషయములు, కామవాంఛలు ఇంద్రియములను తమ వంకకు లాగుతాయి. మనసు ఇంద్రియముల వెంట వెళుతుంది. బుద్ధి నిస్సహాయంగా మిగిలిపోతుంది._*

*_దీనిని కట్టడి చేయాలంటే ఒకటే మార్గము... ధ్యానంలో కూర్చుంటే ఇంద్రియములను, మనసును నిగ్రహించవచ్చును. అప్పుడు బుద్ధి భగవంతుని యందు స్థిరంగా ఉంటుంది._*

*_సాధారణంగా బయట ప్రపంచములో తిరుగుతున్నపుడు ఎన్నో వస్తువులను, విషయాలను, మనుషులను చూస్తుంటాము. మనసు వాటి మీద లగ్నం అవుతుంది. వాటిపై ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి కోరికగా మారుతుంది. ఆ కోరికలు తీరకపోతే కోపం వస్తుంది. కోపంలో ఏమి చేస్తున్నామో తెలియని మోహం ఆవరిస్తుంది. అప్పుడు విచక్షణా జ్ఞానం కోల్పోతాం. బుద్ధి పనిచెయ్యడం మాని వేస్తుంది. జీవితం సర్వనాశనం అవుతుంది._*

*_అదే మనసును మన వశంలో ఉంచుకుంటే ఈ విపరీతపు పరిణామములు సంభవించవు._*

*_ధ్యానము వలన మనస్సు ప్రసన్నంగా ఉంటుంది. మనస్సు ప్రసన్నంగా ఉంటే దుఃఖములు నశిస్తాయి. అప్పుడు బుద్ధి పరమాత్మయందు లగ్నం అవుతుంది. తద్వారా ఆత్మ సాక్షాత్కారము కలుగుతుంది._*



*_సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏_*

No comments:

Post a Comment