ఇస్తే వస్తుంది అన్న సత్యానికి అనుగుణంగా పరమార్ధాన్ని తెలుసుకుందాం.
మీరు కాఫీ కప్పు పట్టుకుని ఉన్నప్పుడు, ఎవరో వచ్చి మిమ్మల్ని ఢీకొట్టడం లేదా మీ చేతిని ఊపడం వల్ల, మీ కాఫీ అంతా ఒలికిపోతుంది అనుకోండి. అప్పుడు మనల్ని ఎవరైనా “మీరు కాఫీని ఎందుకు ఒలికించారు?” అని ప్రశ్నిస్తే, “ఎందుకంటే ఎవరో నన్ను ఢీకొట్టారు." అని సమాధానం చెబుతాం. ఆ సమాధానం పైపైన ఆలోచిస్తే సరి అయిన సమాధానమేనని అనిపించవచ్చు. కానీ మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే అది తప్పు సమాధానం అని మనకు అర్ధమై పోతుంది.
మీ కప్పులో కాఫీ ఉంది కాబట్టే కాఫీ ఒలికిపోయింది. ఒకవేళ కప్పులో టీ ఉండి ఉంటే, మీరు టీని ఒలికించి ఉండేవారు. కప్పులో నీరు ఉండి ఉంటే, మీరు నీటిని ఒలికించి ఉండేవారు కప్పులో ఏది ఉందో, అదే బయటకు ఒలికిపోతుంది.
జీవితం కప్పులాంటిది.
అందువల్ల, జీవితం మిమ్మల్ని కుదిపేసినప్పుడు (ఇది తప్పకుండా జరుగుతుంది)మీలోపల ఏది ఉందో అదే బయటకు వస్తుంది. మీరు కుదుపులకు గురి కానంత వరకు నటన బయటకు రావచ్చు. కుదుపులకు గురి అయినప్పుడు నిజం బయటకు వస్తుంది.
కాబట్టి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి... “నా కప్పులో ఏముంది?” అని. జీవితం కఠినంగా మారినప్పుడు, ఏది ఒలికిపోతుంది? అని. ఆనందం, కృతజ్ఞత, శాంతి మరియు వినయమా? లేక కోపం, ఈర్ష్య, ద్వేషం మరియూ ప్రతీకారమా?
మల్లెపూవు మన వేళ్ళ మధ్య నలిగి వత్తిడికి గురి అయ్యినప్పుడు, తనలో ఉండే సుగంధ తైలాలు మరియు సువాసన విడుదల చేస్తుంది . కారణం తనలో సుగంధ తైలాలు మరియు సువాసనలను దాచుకుంది కాబట్టి. ఒక పండు, పండ్ల మధ్య నలపబడితే మంచి రుచిని ఉన్న రసాన్ని నాలుకకు అందిస్తుంది. కారణం మంచి రుచిని తనలో ఇముడ్చుకోబట్టే. దీపాన్ని కాలిస్తే తను బూడిదగా మారి,తనలో దాచుకున్న వెలుగును మన కనుపాపలకు అందిస్తుంది. ఒక వస్త్రాన్ని కత్తెర్త మధ్యలో ఉంచి చించి సూదితో పొడిస్తే అది చొక్కాగా మారి మన శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. మద్దెలను దెబ్బలతో హింసిస్తే మన చెవులకు లయబద్ధమయిన మ్యూజిక్ ని మనకందిస్తుంది. ఇవన్నీ కప్పులనుకుంటే అవి తమను తాము సువాసనలతో, సురుచులతో, సుశబ్దాలతో, వెలుగులతో, వెచ్చదనంతో నింపుకున్నాయి. అందువల్లనే వాటిని వత్తిడికి గురిచేసినప్పుడు అవి దాచుకున్న వాటినే ప్రపంచంతో పంచుకుంటాయి.
జీవితం కప్పును అందిస్తుంది,దాన్ని ఎలా నింపుకోవాలో మనమే ఎంచుకోవాలి. మనం మంచిని ఎంచుకుని దానితో జీవితాన్ని నింపుకునే నిరంతర సాధన ఉండాలి. ఆ తరువాత జీవితంలో వత్తిడిని ఆహ్వానించాలి. కష్టాలను ఎదుర్కోవాలి. ఆ సమయంలోనే మన నిజమయిన వ్యక్తితం వ్యక్తమవుతుంది.
మీ జీవితానికి మీరే సృష్టి కర్తలు. మీరే మీ భావి జీవిత నిర్మాతలు. మీలోపల ఏదుంటే మీ వెలుపలకు అదే వస్తుంది. మీరూ యేది విశ్వానికి ఇస్తారో అది పెరిగి, తిరిగి మీకు విశ్వంచే ఇవ్వబడుతుంది. అందుకే పత్రీజీ అంటారు “ఇస్తే వస్తుంది ” అని.
ఆచార్య డా అనిల్ ప్రసాద్.
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏
No comments:
Post a Comment