Tuesday, 22 April 2025

 *_ఓ మనిషీ..తిరిగిచూడు..!_* 

🌸🌸🌸🌸🌸🌸🌸

*_ఏవి తల్లీ నిరుడు కురిసిన_*
*_హిమసమూహములు.._*
*_పసిడి రెక్కలు విసిరి కాలం_*
*_పారిపోయిన జాడలేవీ..?_*

పచ్చని పైరులు..
అందమైన పరిసరాలు..
ఆహ్లాదం నింపే పూలు..
చుట్టూరా సొగసులు..
ఉప్పొంగే మనసులు..

ఇవన్నీ కాలుష్యం చిందే
విషానికి హరించుకుపోయి..
ఎటు చూసినా 
ఈసురోమనే పరిసరాలు..
తెగిపోయిన సరాలు...
కుళ్ళిపోయిన నరాలు..
ఎండిపోతున్న నదీనదాలు!

*_చెట్టుకు చేతబడి చేసి మొక్కను మొక్కుబడిగ మార్చేసి.._*
ప్రకృతి మొత్తాన్ని పరిమార్చేసి
వనాలను మోడులుగా
పొలాలను బీడులుగా 
మిగిల్చేసి
*ఇప్పుడేడిస్తే ఏం లాభం?*
విపత్తు ముంచుకొచ్చాక  
మొలిచేనా విత్తనం..
హరించేసినాక 
*_చిగురించేనా హరితం..!?_*

*నిన్ను మోస్తూ..అన్నీ ఇస్తూ*
*నీ పాపాలను భరిస్తూ..*
నువ్వు పెట్టే 
హింసలను సహిస్తూ
ఇన్నాళ్లూ.. ఇన్నేళ్ళూ
రోదించింది తల్లి భూమి..
నీకు వినిపించ లేదా ఏమి..?
కట్ట తెగింది.గుండె పగిలింది..
ఇది నువ్వు,నేను మనందరం 
చేసిన తప్పు..
కొనితెచ్చుకున్న ముప్పు..
*_పాపం పండినట్టే.._*
*_ఆయువు మూడినట్టే..!_*

*మండుతోంది భూగోళం..*
*ఎండుతోంది పాతాళం..*
చినుకు రాలదు
చిగురు మొలవదు..
ఆరుగాలాలు పోయె
ఎండాకాలమె మిగిలె..
*_క్రతువులు చేస్తే_* 
*_రుతువులు మారేనా.._*
చెరువులు నిండేనా?
అంతా వృధా..వ్యధా..
*_చేతులు కాలినాక_* 
_*పట్టేందుకు ఆకులు*_ 
*_సైతం మిగలని కాలం..._*
*_కలికాలం..ఆకలికాలం.._*
తరుముకొస్తున్న ప్రళయం..
ముంచుకొస్తోంది విలయం..
ఎగసిపడుతున్న 
వెచ్చటి ద్రవం
ఇదే కదా విధ్వంసక ఉపద్రవం..
అంతానికి ఇదే సంకేతం
పిశాచాల విజయకేతనం..
విరక్తిగా భూదేవి హాసం..
*_కసిగా మృత్యుదేవత_* 
*_వికటాట్టహాసం..!!_*

కాలుష్య భూతం కోరల్లో
నువ్వూ నేనూ..
ప్రకృతే వికృతై
పిశాచి ఆకృతి దాలిస్తే
ఆ తప్పు ఎవరిది..
నిస్సందేహంగా నీదే..
ఆ ప్రకృతిని కబళిస్తున్నది
నీ నీడే..!

నువ్వు చేస్తున్న తప్పు 
నీకు తెలియడం లేదు..
అది నిన్ను కాల్చేస్తున్న 
విషయం ఎరుక 
కావడం లేదెందుకో...
క్షణానికో మొక్క..
పూటకో చెట్టు..
నీ కాంక్షకు బలైపోతుంటే..
నీ చుట్టూ కాలుష్యం కమ్మేస్తుంటే..
ముంచుకొస్తున్న విపత్తును
తెలుసుకోక నువ్వే నిర్మించుకుంటున్న
ఆకాశ హర్మ్యాలపై కూర్చుని
నువ్వు చేస్తున్నది
విజయదరహాసం కాదోయి..
కాలుష్యభూతం వికటాట్టహాసం..
ఇప్పటికిప్పుడు 
నువ్వు కళ్ళు తెరవవులే..
తెరిచేపాటికి నీచుట్టూ
రోగాల పుట్టలు..
శవాల గుట్టలే..!

🌱🌱🌱🌱🌱🌱🌱
  
*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*

No comments:

Post a Comment