Tuesday, 22 April 2025

 *_మామూలు సంఘటన కాదు_*
*_మొబైల్ విధ్వంసక_*
*_పదఘట్టన!_*

_______________________

ఇది నువ్వు నేను మొదట బాధపడి..తర్వాత నాలుగు కామెంట్లు చేసి..వీలైతే రాసి..
ఫార్వర్డ్ చేసి ఆనక మర్చిపోయేంత చిన్న విషయం కాదు..ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్న పెద్దలు చాలా తీవ్రంగా ఆలోచించి
వ్యవస్థ ప్రక్షాళనకు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన
అతి తీవ్ర పరిణామం..

ఔను..లెక్చరర్ సెల్ ఫోన్ తీసుకుందనే అక్కసుతో
ఒక విద్యార్థిని కళాశాల ప్రాంగణంలోనే ఆమెను నానా దుర్భాషలూ ఆడి చివరకు ఉపాధ్యాయినిపై కాలి చెప్పుతో
దాడికి తెగబడిన సంఘటన
సభ్యసమాజంలో 
ప్రతి ఒక్కరూ సిగ్గుతో తలవంచుకోవాల్సిన
అత్యంత హేయమైన ఘటన.

మన యువత 
ఎటు పోతున్నట్టు..
మొబైల్ ఫోను
పిచ్చి యువతరాన్ని ఎక్కడికి లాక్కుపోతున్నట్టు..ఇప్పుడు ఇళ్లలో..బయట..ఆఫీసుల్లో..
కార్యాలయాల్లో ఇక్కడ అక్కడ అని కాదు..మొబైల్ సర్వాంతర్యామిగా మారిపోయి
మానవ సంబంధాల్ని అతి దారుణంగా దెబ్బతీస్తున్న విషయం అందరూ మాట్లాడుకుంటున్నది.. అయినా ఏ కొద్ది మందినో 
మినహాయిస్తే ఎవరూ కూడా సెల్ ఫోనుకు దూరంగా ఉండలేకపోతున్నారు.

సరే..ఆ విషయాన్ని పక్కన బెడితే విద్యాసంస్థల్లో మొబైల్ వినియోగం..ఏవో కొన్ని సంస్థల్లో తప్ప మొబైల్ వినియోగంపై ఆంక్షలు ఉన్న
దాఖలాలు లేవు.

ఈ పరిస్థితికి కొంతవరకు మొన్న కోవిడ్ ఎపిసోడ్ కారణం అనుకున్నా 
పరిస్థితులు చక్కబడిన తర్వాత కూడా విద్యా సంస్థల్లో
మొబైల్ వినియోగంపై
నియంత్రణకు సంస్థల యాజమాన్యాలు కాని..
ప్రభుత్వంలోని పెద్దలు కాని
ఎటువంటి చర్యలూ తీసుకోక పోవడం అత్యంత దురదృష్టకరం.

యువతపై మొబైల్ చూపుతున్న దుష్ప్రభావాలను గురించి ఇక్కడ ప్రస్తావించలేము..అది ఎంత రాసినా పూర్తి కాని 
మహా గ్రంథం..కనుక విద్యాసంస్థల్లో మొబైల్ వినియోగానికి మాత్రమే పరిమితం అవుదాం.

క్లాసులు జరుగుతున్నపుడు 
విద్యార్థులు మొబైల్ చూస్తూ
( అందులో ఏం చూస్తున్నారు..
ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా పక్కన  పెడదాం..ఇళ్లలో కూడా తల్లిదండ్రులు పిలిచినా పలక్కపోవడం..అడిగితే తిరగబడడం..ఒక్కోసారి దాడికి తెగబడడం వంటి ఉదంతాల గురించి మనం వినకపోలేదు)మాస్టర్లు చెప్పేది పట్టించుకోని ఉదంతాలు కోకొల్లలు.మొబైల్ వినియోగం యువత ప్రవర్తనపై 
తీవ్ర దుష్ప్రభావం చూపుతోందన్నది నిర్వివాదం.. ఇది మామూలు చర్యలు..మొక్కుబడి నిర్ణయాలు..కంటితుడుపు చర్యలు తీసుకునే పరిస్థితి
కాదు..రానున్న రోజులు 
ఇంకా ఇంకా భయంకరంగా ఉండబోతున్నాయనేది నిస్సందేహం.

నిన్నటి సంఘటననే తీసుకుందాం..ఉపాధ్యాయిని
పై దాడి చేసిన విద్యార్థినిలో
ఎంత తెగింపు ధోరణి కనిపించింది..ఒక మొబైల్ కోసం అంతటి దుస్సాహసానికి
ఆ విద్యార్థిని ఒడిగట్టిందంటే
ఆ సమయంలో తన మానసిక స్థితి ఎలా ఉందనేది కూడా అంచనా వెయ్యాలి..ఇలా చేస్తే
తన గురించి తోటి విద్యార్థులు
ఏమనుకుంటారు..తనను సస్పెండ్ చేస్తే భవిష్యత్ ఎలా ఉంటుంది..తల్లిదండ్రులను ఎలా ఎదుర్కోవాలి..వంటి
ఇంగితాలన్నీ పట్టించుకోని ఒక భయానక ఉన్మాద స్థితిలోకి విద్యార్థిని వెళ్లిపోయినట్టు కనిపించింది.

విద్యార్థిని ప్రవర్తన పట్ల
తీవ్ర మనస్తాపం చెందిన ఉపాధ్యాయురాలు
ఉద్యోగ రాజీనామాకు
సిద్దపడినట్టు సమాచారం.

ఇప్పుడు కిం కర్తవ్యం..
ఏం చేయబోతున్నాయి
ప్రభుత్వాలు..కఠినం
అనిపించినా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం..
 మొత్తం వ్యవస్థ ప్రక్షాళన
అవశ్యం..ఏం జరుగుతుందో
చూద్దాం.. 

సర్కార్లోని పెద్దలూ..
ఒకటి గ్రహించండి..
విచారం వ్యక్తం చేస్తున్నాం..పరిశీలిస్తాం..
ఆలోచిస్తాం..కమిటీ వేస్తాం..
ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి ఊరుకునేంత చిన్న విషయం అయితే కాదు సుమీ..!

*_సురేష్ కుమార్ ఎలిశెట్టి_*
         _జర్నలిస్ట్_

No comments:

Post a Comment