[4/23, 13:10] +91 98497 72509: ♠️ ’జిలిబిలి పలుకుల మైనా’ గాయని జానకమ్మ.
ఎస్. జానకి ఆమె స్వరం ఉరికే జలపాతం. ఆమె గానం మృధు మధురం. తన పాటలతో ప్రేక్షకుల మనసులను ‘నీలి మేఘాలలో’ తేలిపోయేలా చేస్తుంది. తన సుస్వరాలతో ‘పగలే వెన్నెలను’ పూయిస్తుంది. పాటల పూదోటలో తన గానామృతంతో మధురిమలు పంచిన మైనా. ‘గున్న మామిడి కొమ్మ’ మీదీ పలుకులతో వెండితెరకు వసంతాన్ని తీసుకొచ్చిన గాన కోకిల. ఇలా నవరసాలు ఆమె గొంతులో అలవోకగా జాలువారుతాయి. ఇలా తన గాన మధురామృతంతో దక్షిణాది శ్రోతలను ఆకట్టుకున్న లెజెండరీ గాయకురాలు ఎస్. జానకి.
పక్షుల కిలకిల రావాలైనా...పసిపాపల స్వరాలైనా...అమ్మ పలికే లాలిపాటలైనా... ఆమె గొంతులో సరాగాలై విరుబూస్తాయి. తన గానంతో దుర్యోధన దుశ్శాసన దుర్వినీతిని ఎండగట్టినా... సిరిమల్లే పువ్వా..అంటూ హస్కి వాయిస్‌తో ప్రేక్షకులకు తీపి గాయాలను చేసినా ఆమెకే చెల్లింది. ఈ విధంగా స్వరాలతో చేయగలిగినన్ని ప్రయోగాలు చేయడంలో ఎస్.జానకి ఎప్పుడూ ముందుంటారు.
తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఒరియా, సింహళ,తుళు, సౌరాష్ట్ర, జపనీస్, జర్మనీ, ఇంగ్లీషు భాషల్లో వేలాది పాటలు పాడిన జానకమ్మ ....1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లెలోని పాలపట్ల గ్రామంలో జన్మించింది. పుడుతునే మాటల కంటే పాటలను నేర్చిందీ జానకమ్మ .
ఆమె తండ్రి శ్రీరామమూర్తి ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు. చిన్నతనంలో కూతురు సంగీతాభిలాష గమనించి ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ పైడిస్వామి దగ్గర సంగీతంలో శిక్షణ ఇప్పించాడు. అప్పటి నుంచి తన పదోయేట వరకూ వివిధ సంగీత కచేరీల్లో పాడి పేరు తెచ్చుకున్నారు జానకిగారు.
18వ యేట వచ్చే సరికి.. జాతీయ స్థాయిలో సంగీత పోటీలో పాల్గొనే అవకాశం వచ్చింది. 1957లో ఆల్ ఇండియా రేడియో నిర్వహించిన జాతీయ స్థాయి సంగీత పోటీలో ఉత్తమ గాయనిగా, అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
దీంతో ఆమె ప్రతిభ అందరికి తెలియాలని జానకి మామయ్య చెన్నై తీసుకెళ్లారు. అక్కడ ఎ.వి.ఎం. ఆస్థాన సంగీత దర్శకుడు గోవర్థనం సంగీతంలో పరీక్ష పెట్టగా అందులో నెగ్గి అక్కడి స్టాఫ్ సింగర్ గా సెలెక్ట్ అయ్యింది జానకి. ఇక అప్పటి నుంచి ఆమె సినీ కెరీర్ మొదలైంది.
జానకి గాయనిగా అడుగుపెట్టిన తొలి ఏడాదిలోనే దాదాపు ఆరు భాషల్లో 100కు పైగా పాటలు పాడడం విశేషం. గాయనిగా తొలిపాట 1957 ఏప్రిల్ 4న రికార్డ్ అయ్యింది. పదహారాణాల తెలుగు అమ్మాయి అయిన జానకి తన తొలి పాట తమిళంలో పాడడం విశేషం. అవకాశం వచ్చినపుడు మొదట పాడాల్సింది విషాదగీతం అయితే సాధారణంగా ఎవరూ అంగీకరించరు. కానీ జానకి ఇలాంటి సెంటిమెంటు ఏది పట్టించుకోలేదు. గాయినిగా ఆమె ఏ భాషలో పాడిన తొలి గీతం విషాద గీతమే కావడం ఓ అద్భుతం.
తెలుగులో జానకి పాడిన తొలిపాట ‘నీ ఆశ...అడయాస..’ పెండ్యాల సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘ఎం.ఎల్.ఏ’ చిత్రంలో ఘంటసాలతో కలిసి ఈ పాటను జానకి ఆలపించారు. ఈ చిత్రంలో ‘ఇదేనండీ భాగ్య నగరము’ అనే పాట కూడా పాడారు. ఇలా ఏడుపు పాటలతో మొదలైన ఆమె పాటల ప్రయాణం.. ఆ తర్వాత మంచి హుషారైన గీతాలతో మేలిమలిపు తిరిగింది.
తొలినాళ్లలో.. తమిళంలో వచ్చినంత పేరు తెలుగులో రాలేదు. గాయనిగా జానికికీ మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం ‘కొంజుం సలంగై’ అనే తమిళ చిత్రం. సుబ్బయ్యనాయుడు సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సన్నాయి తో పోటీ పడి జానకి పాడిన పాట ఆమెకెంతో పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘మురిపించే మువ్వలు’ గా డబ్బింగ్ చేశారు. ఈ మూవీలో వచ్చే ‘నీ లీల పాడెద దేవా’ అంటూ జానకి ఆలపించిన ఈ పాటకు ఆమెకు తెలుగులో ఎనలేని క్రేజ్ తీసుకొచ్చింది.
ఈ చిత్రం తర్వాత జానకి తెలుగులో అవకాశాలు చాలానే వచ్చాయి. అయినా తెలుగులో గాయనిగా స్థిర పడటానికి ఆమెకు చాలా సమయం పట్టింది. అప్పటికే పి.సుశీల తెలుగులో టాప్ సింగర్ గా ఒక వెలుగు వెలుగుతోంది. అప్పటికే తమ తమ చిత్రాల్లోని ఫస్ట్ గ్రేడ్ హీరోయిన్లకు పి.సుశీలతోనే పాటలు పాడించేవారు అప్పటి మ్యూజిక్ డైరెక్టర్స్. టాలెంట్ ఉన్నా సెకండ్ గ్రేడ్ హీరోయిన్ల పాటలకు మాత్రమే జానకి పరిమితమయ్యేవారు.
1961లో విడుదలైన బావామరదళ్లు చిత్రంలోని ‘నీలి మేఘాలలో.. గాలికెరటాలలో’ పాటతో తెలుగు ప్రేక్షకలకు వీనులవిందు చేసింది జానకీ. 1964లో విడుదలైన పూజఫలం చిత్రంలో వచ్చే ‘పగలే వెన్నెల’ పాటతో ఆమెకు గాయనిగా ప్రత్యేక స్థానం దక్కింది.
జానకమ్మకు సుశీలమ్మ తో సమానంగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. 70వ దశకం మధ్యలో ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి, వ్యాంపు పాటలకు, క్లబ్ పాటలతో జానకి గాత్రంతో అనేక ప్రయోగాలు చేసాడు. బాలూ, జానకిల సూపర్ హిట్ కాంబినేషన్ కు బీజం పడేలా చేసాడు. ఒక రకంగా జానకి కెరీర్ కు ఉపయోగపడే సోలో గీతాలు, డ్యూయట్లు ప్రేక్షకులను మైమరిపించేలా చేసాయి.
[4/23, 13:10] +91 98497 72509: కె.విశ్వనాథ్ డైరెక్షన్లో..కె వి మహదేవన్ స్వరకల్పనలో వచ్చిన సప్తపది చిత్రం జానకి సినీ జీవితంలో మైలురాయిగా నిలిచిపోయింది. చిన్నపిల్లాడిలా, గోవులుకాసే గోపాలుడిగా.. రెండు వైవిధ్య గాత్రాలతో పాడిన ‘గోవులు తెల్లన, గోపయ్య నల్లనా’ పాట ఆమెకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చాయి. ఇలా తన గొంతుతో అన్ని వయసుల వారిని అనుకరించి మెప్పించిన ఘనత జానకికే దక్కుతుంది.
తన గాత్రం దేవుడిచ్చిన వరంగా చెబుతుంది జానకి. 80 దశకంలో ఇళయరాజా ఆమె స్వరంతో అనేక విన్యాసాలు చేసాడు. ప్రేమ, విషాదం, హాస్యం, సోలో, విరహ గీతాలతో 80వ దశకం మొత్తం సుశీల కన్నా జానకమ్మ పాటలే ఎక్కువగా వినిపించాయి.కానీ సాహిత్య పరంగాఁ , సంగీత పరంగాఁ వున్న పాటలు , అమ్మ పాడే లాలి జోల పాటలు ఎక్కువ పాటలు సుశీల కి దక్కాయి , తమిళ్ లో ఇళయరాజా సుశీల తో కంపోజ్ చేసిన ప్రతి పాట అద్భుతమే అని చెప్పాలి . సరదా పాటలు, హుషారు పాటలతో ఆ నాటి యువతకు దగ్గరయ్యారు జానకిగారు.
దివంగత బాలు, జానకి, ఇళయరాజా కలయికలో వచ్చిన ఎన్నో పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. జానకి సినీ కెరీర్ లో సంగీత దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం ఉషా కిరణ్ మూవీస్ వారి ‘మౌనపోరాటం’. తెలుగులో భానుమతి, పి.లీల తర్వాత సంగీతం దర్శకత్వం వహించిన మహిళ ఎస్.జానకి కావడం విశేషం.
నవరసాలను కంఠంలో ఇముడ్చుకుని.. సందర్భానుసారంగా ఆరోహణ, అవరోహణలను క్షణాల్లో మారుస్తూ పాడడం జానకి ప్రత్యేకత. అలనాటి సావిత్రి, అంజలీదేవి హీరోయిన్ల నుంచీ నిన్నమెన్నటి విజయశాంతి, సౌందర్య, రంభ వరకూ.. దాదాపు ఐదు తరాల హీరోయిన్లకు పాడిన ఘనత జానకి సొంతం. వ్యాంపు పాటలకు, క్లబ్ పాటలకు ఎల్.ఆర్.ఈశ్వరీ తర్వాత అంతగా ఖ్యాతి గడించిన గాయని ఎస్.జానకి.
ఇళయరాజా , రాజన్ నాగేంద్ర లాంటి సంగీత దర్శకులు ఆమెతో క్రమం తప్పకుండా పాటలు పాడించేవారు. అప్పటి నటీమణులకు వారి హావభావాలకు తగ్గట్టు పాడటంలో జానకి నిష్ణాతురాలు. సంగీత వాద్య పరికరాల అనుగుణంగా పాటలు పాడడంలో జానకి దిట్ట. ఒక కన్నడ చిత్రంలో ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ షెహనాయ్ కి అనుగుణంగా పాడి మెప్పించారు.
అలాగే మరోకన్నడ మూవీలో ఎం.ఎస్.గోపాలకృష్ణన్ వయోలిన్ వాద్య సమ్మేళనాన్ని తన గాత్రంతో డామినేట్ చేసింది. ఒక విధంగా దక్షిణాది చిత్ర పరిశ్రమను తన గానామృతంతో జానకి ఓలలాడించింది.
దాదాపు అనేక భాషల్లో 27వేలకు పైగా పాటలు పాడిన జానకిని వరించిన అవార్డులకు లెక్కే లేదు. నాలుగు జాతీయ అవార్డులతో పాటు, వివిధ రాష్ట్రాలకు చెందిన 25 కు పైగా స్టేట్ అవార్డులు ఆమె వశం అయ్యాయి. తెలుగులో గాయనిగా 10 నంది అవార్డులు దక్కడం విశేషం. తెలుగులో వచ్చిన సితార చిత్రానికిగానూ ఆమె పలికిన ‘జిలిబిలి పలుకులకు’ జాతీయ అవార్డు వెతుక్కుంటూ వచ్చింది.
తమిళనాడు ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక కలైమామణి, కర్ణాటక ప్రభుత్వం చే బసవభూషణ అవార్డు.. మైసూరు యూనివర్సిటీ వారి నుంచి గౌరవ డాక్టరేట్ లు జానకి కీర్తి కీరిటంలో వచ్చి చేరాయి. కేంద్ర ప్రభుత్వం తనకు ఆలస్యంగా పద్మభూషణ్ అవార్డు ప్రకటించడంపై ఆగ్రహించిన జానకి.. తనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయడం ఆమె అభిమానులను నివ్వెరపోయేలా చేసింది. అంతేకాదు కేంద్రం ఇచ్చిన పద్మభూషణ్ అవార్డును తిరస్కరించింది .
🌹సేకరణ 🌹
No comments:
Post a Comment