Sunday, 20 July 2025

 *Changalava*Kameswari*

కోటేరులాంటి ముక్కు కోలకళ్లు
లేతకొబ్బరంటి చెక్కిళ్లు చిలిపినవ్వులు
ఆ నవ్వులకే వస్తాయి చిన్నినొక్కులు
ఆ నొక్కులే తెస్తాయి మనకెన్నో సిరులు
అమ్మాయే పుడుతుంది 
అచ్చం అమ్మలాగే ఉంటుంది
అబ్బాయే పుడతాడు
అచ్చం నాన్నలాగే ఉంటాడు.

శుభోదయం మిత్రులందరికీ కమ్మని కాఫీ త్రాగేస్తూ అంతకంటే చక్కని కబుర్లు చెప్పేసుకుందారేంటి ? 
అసలు అమ్మయే అమ్మాయికి, నాన్నకి, మొదటి సంతానం ఎవరు పుట్టినా, ఆనందమే కదా! 

కొత్త భావాలు ఆశలు భయాలు సందేహాల కలగలుపుగా ఉంటుంది.
తమ మధ్య రాబోయే బుజ్జాయి తెచ్చే ఆనందాల కోసం ఉవ్విళ్లూరుతూ ఉంటారు.

వార్ని కన్నవారు క్షేమంగా పురుడు వచ్చి, తల్లీ పిల్లలు క్షేమంగా ఉంటే చాలు అని దేముళ్లను మొక్కుతుంటారు.
రాబోయే వంశాంకురానికి స్వాగతం పలకడానికి సన్నిధ్దులవుతుంటారు

కానీ  కొన్నిళ్లల్లో ఇన్ని ఆనందపు క్షణాలలో పుట్టేది ఆడపిల్లా ? మగపిల్లాడా ? అన్న వివరం కోసం తపించిపోయే చాంధసం ఒకటి, ఎవరో ఒకరి మూఢత్వం వైరస్ లా వ్యాపిస్తుంది

అదొచ్చిందంటే ఆనందపు తాజా పరిమళాలు అన్నీ ఎగిరిపోయి  ఏదో ఆందోళన! బిడ్డను కనబోయే మాతృమూర్తి ఎదను కంగారు పెడుతుంది. నొప్పులు పడి జీవితాన్ని పణంగా పెట్డి కనే తనకు ఎవరు పుట్టినా
ఒకటే! అంతే ప్రేమ అంతే ఆనందం కదా! 
అయినా కూడా తనకు పుట్టే బిడ్డకు అందరు ఇచ్చే ఆనందంలో రవ్వంత కూడా తగ్గకూడదు కాబట్టి, అందరూ మెచ్చే బిడ్డ పుట్టాలనే కొత్త భావనతో తల్లడిల్లుతుంది.

తల్లివైపు వారు తల్లీ బిడ్డ క్షేమం ఆలోచిస్తారు. భర్త కుటుంబం వారికి మగపిల్లాడు పుట్టి వంశాన్ని నిలబెట్టాలి.
ఇలాంటి సంకట పరిస్థితుల మధ్య బిడ్డకు జన్మనివ్వడం ప్రాణసంకటమే ఏ మాతృమూర్తికయినా!

ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఈ లింగ వివక్షత ఉందీ అంటే సిగ్గుపడాలి.
ఆడపిల్లలు బంగారు తల్లులు ఇంటి మహాలక్ష్ములుగా భావించే మన హిందూ సంస్కృతిలో ఇటువంటి వివక్ష ఎందుకుందో అర్ధం కాదు.

ఈ 'ఆడపిల్ల,'మగపిల్లాడు" తేడా పూర్వపు తరాలలో కేవలం చదువు చెప్పించటం లోనే ఉండేది. పెళ్లి చేసి పంపే పిల్లకోసం ఖర్చు దేనికి ? అన్న భావన మాత్రమే ఉండేది.
ఒకో ఇంటిలో అయిదారుగురు అమ్మాయిలు కూడా ఉండేవారు. వంశోద్దారకుడి కోసం ఎదురు చూస్తూ బహు సంతానాన్ని కనేవారేమో! కాని బ్రూణ హత్యలు చేసేవారు కాదు.

రెండుమూడు దశాబ్దాల క్రితం ప్రారంభమయిన కుటుంబ నియంత్రణ వల్ల ఆ పుట్టే మిత సంతానంలో మగసంతానం లేకుంటే, వంశం అంతరించిపోతుందన్న భయంతో, తల్లితండ్రులు కలిసి పుట్టబోయే బిడ్డకి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని పుట్టబోయేది
'ఆడబిడ్డ' అని తెలియగానే
బ్రూణ హత్యలు (అబార్షన్స్) చేయించుకోవడం ఎప్పుడు మొదలు పెట్టారో! అప్పుడే మగపిల్లల విలువ తగ్గిపోయింది అంటే అబద్దం కాదు, అతిశయోక్తి కాదు.

ఇప్పటి కాలంలో ఆడపిల్లలు విద్యలో సంపాదనలో అన్నింటిలో మగపిల్లలను సైతం అధిగమించి, ఆకాశంలో సగంలా ఉన్నారు. ప్రభుత్వం ఇంకా ముఫ్పైమూడు శాతం అంటోంది. కానీ సగం కన్నా ఎక్కువ ఇచ్చేంత సమర్దత ఉన్న స్త్రీలున్నారు.

ఇంక ఇంటిపేరు సంగతికొస్తే వివాహితలైనా, ఉద్యోగాలలో వాడుకలో కేరళీయులలా తండ్రి ఇంటి పేరుతోనే ఉన్న సర్టిఫికెట్స్ ఆధారితంగా అవే ఇంటి పేరుతోనే చలామణీ అయే మహిళలున్నారు.

ఇంక ఏరకంగా మగపిల్లలు తవ్వి తలకు పోస్తారు ? 
తలకు కొరివి పెట్టడానికి పున్నామ నరకాలు పోగొట్టడానికంటారా ? మగపిల్లలు లేనివారికి అల్లుళ్లే తలకొరివి పెట్టవచ్చనే శాస్త్రం కూడా ఉంది. కొన్నిచోట్ల ఆడపిల్లలే తల్లితండ్రులకి అపరకర్మలు చేసిన దాఖలాలు ఉన్నాయి.

విదేశాలలో ఇరుక్కుని వృధ్దాశ్రమాల పాలు చేసే సంతానము ఉన్న వాళ్లకి తలకొరివి మాట దేముడెరుగు. పట్టెడు అన్నం పెట్టే దిక్కు లేదు. ఇంకా ఎందుకు ఇలాంటి వివక్ష ?
మా అబ్బాయికి ఇద్దరూ ఆడపిల్లలే అని తెలిసి కొందరంటారు 'అయ్యో ఒక మగపిల్లాడుంటే  బాగుండేది! అని 'బాగుండేది! ఇద్దరి సరదా తీరేది అంతవరకే! అంటాను నేను. ఇంటి పేరు నిలబెట్టే వారొకరుండాలి కదా! అంటారు.
ఏంటి గ్యారంటీ ? మంచి పేరే తెస్తారని ఉన్న పేరు చెడగొట్టరని అంటాను నేను' నో సౌండ్! అవతల నుండి.

ఇదంతా ఎందుకు రాస్తున్నానూ అంటే
నిన్న ఒక వివాహ పరిచయ వేదికకు వెళ్లాను.
అక్కడ ఎక్కువమంది వరులు వారిలో ఎక్కువ మంది వయసు మీరిన పెళ్లికొడుకులు. అది చూసాక ఇదంతా ఆ దశాబ్దాలలో మనం చేసుకున్న స్వయంకృతాలు అనిపించింది.

అనేక అర్హతలతో చిన్న వయసు పెళ్లి కూతుళ్లు కొన్ని వయసుపరంగా మాత్రమే సరితూగేవి ఉన్నా ఆ వధువుల అర్హతలకు కోరికలకు సరిపోనివి .ఇలా అర్హతలో కోరికలో సరిపోలక ఇలా లేటు వయసులో  పెళ్లికాని పిల్లలను వెంటపెట్టుకుని వచ్చిన తల్లితండ్రులు 

వారందరికి సహాయ ధృక్పధంతో సహకరించి పెళ్లిళ్లు కుదిర్చే కుల సంఘాలు వారు సంవత్సరానికి నాలుగైదు వేదికలు ఏర్పర్చి సహకరిస్తున్నారు.
ఇలా కూడా లేకుంటే అసలు యువతకి  వివాహం లేటు అయిన వధూవరులకి  కల్యాణాలు ఎప్పుడవుతాయి అనిపించింది!

ఇలా ఆన్ లైన్ లోను ప్రతి పట్టణంలోను కాలనీకి ఒకటున్నాయి ప్రతి కులం లోను ఇటువంటి సేవా. కార్యక్రమాలు చేపట్టే సేవా సంస్థలున్నాయి. ఇటువంటి సేవలు చేసేవారందరూ పదవీ విరమణ చేసిన ఉన్బతాధికారులు తమ పిల్లల బాధ్యతలు పూర్తిగా నిర్వర్తించుకుని తమకులాగే బాద్యతలు నిర్వర్తించుకోవాలనుకున్న
వారికి
సహకరించాలనుకోవడం ఎంతో ముదావహం!

ఇటువంటి వేదికలలో పొందుపర్చిన వధూవరుల వివరాలలో 
విడాకులు పొందిన వారు ఆలస్యపు పెళ్లికి
ఎదరు చూసే వధూవరుల వివరాలుండకూడదని ఎదురు చూద్దాము.

ఎక్కడో అక్కడ అర్హతలకో, కోరికలకో, రాజీపడేలా పిల్లలను తీర్చిదిద్ది, నచ్చ చెప్పి, వారికి జరిగే కల్యాణాలు సకాలంలో అయేలా పెద్దాళ్లు కూడ తమ పంధా మార్చుకోవాలి.
ఈ విషయాలలో మనందరం బాగా ఆలోచించాలసిన అగత్యముంది.
అప్పుడే తమకి పుట్టినది ఆడపిల్లయినా, మగపిల్లాడయినా,  తల్లితండ్రులు సంతోషపడేది ఏమంటారు ?
ఇవండీ ఇవాళ్టి మన కాఫీ విత్ కామేశ్వరి కబుర్లు

No comments:

Post a Comment