Sunday, 20 July 2025

 .   *శ్రీకృష్ణుని పరమోత్కృష్టమైన శక్తి*
*꧁❀❀━❀🙏🕉️🙏❀━❀❀꧂*
                *(7 వ భాగము)*

*భగవద్గీత చివరిలో చెప్పబడినట్లు శ్రీకృష్ణభగవానుడు యోగేశ్వరుడని తెలియబడ్డాడు. “యోగేశ్వరో హరిః - సమస్త యోగశక్తులు అతని ఆధీనములోనే ఉంటాయి. కొందరు మానవులు యోగసిద్ధులను కలిగినవారై పలు అద్భుతమైన కార్యాలను చేయడము ఒకప్పుడు కనిపిస్తుంది. కాని శ్రీకృష్ణుడు సకల యోగశక్తులకు ప్రభువు. అందుకే చీకటిలో ప్రవేశించడానికి తన గుఱ్ఱాలు సంశయించడాన్ని గమనించగానే అతడు సుదర్శనచక్రాన్ని ప్రయోగించాడు. అది సూర్యకాంతి వేయిరెట్ల వెలుగుతో ఆకాశాన్ని ప్రకాశవంతము చేసింది. విశ్వపు ఆచ్ఛాదన అంధకారము కూడ శ్రీకృష్ణుడు సృష్టించినదే. ఇక సుదర్శనచక్రము ఆ దేవదేవునితో సర్వత్ర వెంట ఉండునట్టిది. రామబాణము రావణుని సేనను భేదించినట్లుగా సుదర్శనచక్రము అంధకారాన్ని చీల్చుకొనిపోయిందని భాగవతములో చెప్పబడింది. ఆ విధముగా* *సుదర్శన చక్రాన్ని ముందుంచుకొని శ్రీకృష్ణుడు ముందుకు ప్రయాణించాడు. సుదర్శనమంటే చక్కని దర్శనమని భావము. శ్రీకృష్ణుని సుదర్శనచక్ర అనుగ్రహముచే సమస్తము చక్కగా గోచరమౌతుంది. ఏదీ అగోచరముగా మిగిలి ఉండదు. ఈ విధంగా కృష్ణార్జునులు భౌతిక విశ్వాలను ఆవరించియున్నట్టే అంధకారమయ ప్రాంతాన్ని దాటారు."*

*అపుడు అర్జునుడు బ్రహ్మజ్యోతి యని తెలియబడే తేజస్సును చూసాడు. బ్రహ్మజ్యోతి భౌతిక విశ్వాల అచ్ఛాదనకు ఆవల ఉంటుంది; అది ప్రస్తుతనేత్రాలతో చూడబడదు కనుక ఒకప్పుడు అవ్యక్తమని కూడ పిలువబడుతుంది. వేదాంతులని తెలియబడే నిరాకారవాదులకు ఆ ఆధ్యాత్మిక తేజమే చరమగమ్యము. అది "అనంతపారం" (అనంతమైనది, అపారమైనది) అని కూడా వర్ణించబడింది. కృష్ణార్జునులు ఆ బ్రహ్మజ్యోతి ప్రాంతాన్ని చేరుకోగానే అర్జునుడు ఆ వెలుగును భరించలేక కళ్ళు మూసికొన్నాడు. కృష్ణార్జునులు బ్రహ్మజ్యోతి ప్రాంతాన్ని చేరుకోవడము హరివంశములో వర్ణించబడింది. ఆ గ్రంథములో అక్కడ శ్రీకృష్ణుడు అర్జునునితో పలుకుతూ "అర్జునా! నీవు చూసే ఈ దివ్యమైన కాంతి నా దేహకాంతియే. ఓ భరతవంశీయుడా! ఈ బ్రహ్మజ్యోతి నేనే" అని అన్నాడు. సూర్యగోళము, సూర్యకాంతి వేరుపడనట్లు శ్రీకృష్ణుడు అతని దేహకాంతియైన బ్రహ్మజ్యోతి వేరు కాబోవు. "అహం సః" అని శ్రీకృష్ణుడు పలికినపుడు ఇది హరివంశములో స్పష్టముగా తెలుపబడింది. చిత్కణములని తెలియబడే సూక్ష్మాణువుల (జీవుల) సమూహమే బ్రహ్మజ్యోతి. "సోహం" (నేను బ్రహ్మ జ్యోతిని) అనే వేదవాక్కు జీవులకు కూడ అన్వయిస్తుంది. తాము బ్రహ్మ జ్యోతికి చెందినవారమని జీవులు కూడ చెప్పుకోగలరు. "ఈ బ్రహ్మజ్యోతి నా ఆధ్యాత్మికశక్తి విస్తారమే" అని హరివంశములో శ్రీకృష్ణుడు వివరించాడు.*

*"బ్రహ్మజ్యోతి నా మాయాశక్తికి అతీతమైనది" అని శ్రీకృష్ణుడు అర్జునునితో చెప్పాడు. జీవుడు భౌతికజగత్తులో ఉన్నప్పుడు బ్రహ్మజ్యోతి అనుభూతి అసాధ్యము. ఇంకొకరకంగా చెప్పాలంటే భౌతికజగత్తులో ఈ వెలుగు ప్రకటము కాదు, కాగా అది ఆధ్యాత్మికజగత్తులో ప్రకటమై ఉంటుంది. హరివంశములో తెలుప బడిన "వ్యక్త - అవ్యక్త" అనే పదాలకు అర్థమిదే. భగవద్గీతలో "అవ్యక్తో"వ్య క్తాత్ సనాతనః చెప్పబడింది. ఈ రెండు శక్తులు శాశ్వతముగా ప్రకటమై ఉంటాయి" అని తరువాత కృష్ణార్జునులు సువిశాలమైన ఆధ్యాత్మిక జలరాశిలో ప్రవేశించారు. అదే కారణసముద్రము, ఆ సముద్రమే భౌతికజగత్తు సృష్టికి మూలమని దాని అర్ధము. ఆ ప్రదేశము త్రిగుణప్రభావానికి దూరమై ఉంటుంది కనుక "విరజ" అని కూడ తెలియబడుతుంది. "మృత్యుంజయ తంత్రము" అనే గ్రంథములో ఈ కారణ సముద్రము (విరజ) గురించిన విపులమైన వర్ణనము ఉన్నది. భౌతికజగత్తులోని అత్యున్నత లోకము సత్యలోకము లేదా బ్రహ్మలోకమని, దానికి ఆవల రుద్రలోకము, మహావిష్ణు లోకము ఉన్నాయని దానిలో చెప్పబడింది. ఇక ఈ మహావిష్ణులోకము గురించి బ్రహ్మసంహితలో "యః కారణార్లవణలే భజతి స్మ యోగనిద్రామనన్త జగదండసరోమకూపః" అని చెప్పబడింది.*

*అంటే మహావిష్ణువు కారణసముద్రములో శయనించి ఉంటాడు. ఆతడు విశ్వువసించినపుడు అసంఖ్యాకమైన లోకాలు ఉద్భవిస్తాయి, ఉచ్ఛ్వసించినపుడు ఆ లోకాలు తిరిగి అతనిలో ప్రవేశిస్తాయి. ఈ ప్రకారంగా భౌతికసృష్టి రచింపబడి తిరిగి అయిస్తుంది. కృష్ణార్జునులు వీటిలో ప్రవేశించినపుడు దివ్యమైన ప్రచండవాయువు అక్కడ వీచింది, దానితో కారణోదకజలములో ఉత్తుంగ తరంగాలు కలుగసాగాయి. కృష్ణానుగ్రహముచే అర్జునుడు సుందరమైన కారణసముద్రాన్ని చూసే అద్వితీయమైన అనుభవాన్ని పొందగలిగాడు. కృష్ణునితో పాటు అర్జునుడు ఆ జలములో ఒక విశాలమైన భవనాన్ని చూసాడు. ఆ భవనములో మణిఖచితమైన వేలకొలది స్తంభాలు ఉన్నాయి. ఆ ప్రకాశమాన స్తంభాల శోభకు అర్జునుడు ఆకర్షితుడయ్యాడు. ఆ దివ్యభవనములో కృష్ణార్జునులు శేషుడని తెలియబడే అనంతదేవుని చూసారు. అనంతదేవుడు వేలకొలది పడగలను కూడిన మహాసర్పరూపంలో ఉన్నాడు. ఆ పడగలలో ప్రతీదీ అమూల్యమైన మణులతో అందముగా వెలుగుతోంది. అనంతదేవుని ప్రతీ పడగకు రెండు భీకరమైన నేత్రాలు ఉన్నాయి. ఆతని దేహము సదా మంచుతో కప్పబడి ఉండే కైలాసపర్వతము వలె ఉన్నది. అతని కంఠములు, నాలుకలు నీలివర్ణములో ఉన్నాయి. ఆ విధంగా అర్జునుడు శేషనాగును దర్శించాడు. ఆ తెల్లని శేషనాగు శయ్యపై మహావిష్ణువు సుఖంగా పవ్వళించి ఉండడము కూడ అతడు చూసాడు. మహావిష్ణువు సర్వవ్యాపిగను, సర్వశక్తిమంతునిగను గోచరించాడు. అతడు పురుషోత్తముడని తెలియబడే దేవదేవుడని అర్జునుడు అర్థము చేసికోగలిగాడు. భౌతికజగత్తునందు ఈ రూపము నుండే వేరొక విష్ణురూపము, అంటే గర్భోదకశాయి. విష్ణురూపము ఉద్భవిస్తుంది కనుక అతడు పురుషోత్తమునిగా తెలియబడ్డాడు. భౌతికజగత్తుకు పరమైనవాడు అయినందునను మహావిష్ణువు పురుషోత్తముడని పిలువబడతాడు. "తమ" అంటే చీకటి, "ఉర్" అంటే ఆవల, దివ్యమని అర్ధము. కనుక "ఉత్తమ" అంటే భౌతికజగత్తనే చీకటి ప్రాంతానికి ఆవల యని భావము. పురుషోత్తముని దేహఛాయను వానాకాలపు క్రొత్త మేఘము వలె ఘననీలముగా ఉన్నట్లు అర్జునుడు చూసాడు. అతడు పట్టుపీతాంబరాన్ని కట్టుకున్నాడు, అతడు. సుందర దరహాసవదనుడై ఉన్నాడు, అతని కలువరేకుల వంటి కన్నులు పరమ ఆకర్షణీయంగా ఉన్నాయి. మహావిష్ణువు కిరీటము అమూల్యమైన మణిఖచితమై ఉన్నది, ఆతని సుందరమైన కుండలాలు అతని శిరోజాల శోభను ఇనుమడింప జేసాయి. ఆతని అష్టభుజాలు అతిదీర్ఘములై మోకాళ్ళను తాకుతున్నాయి. అతని మెడలో కౌస్తుభమణి ఉన్నది, వక్షస్థలముపై శ్రీవత్సచిహ్నము (లక్ష్మీదేవి నివాస స్థానము) ఉన్నది. ఆ దేవదేవుడు మోకాళ్ళ వరకు వ్రేలాడే కమల పూమాలను ధరించియున్నాడు. అది వైజయంతీమాలగా ప్రసిద్ధి చెందినట్టిది.*

💦🌸🌸 🌸🏵️🌸 🌸🌸💦
*"శ్రీకృష్ణుని పరమోత్కృష్టమైన శక్తి" అను దశమస్కంధములోని భక్తివేదాంతభాష్యము ఇంకా వుంది*
💦🌸🌸 🌸🏵️🌸 🌸🌸💦 
*☘️\!/సర్వం శ్రీకృష్ణార్పణమస్తు\!/☘️*

*┈┉┅━❀꧁ హరే కృష్ణ ꧂❀━┅┉┈*
         *SPIRITUAL SEEKERS*
🍁🪷🍁 🙏🕉️🙏 🍁🪷🍁

No comments:

Post a Comment