*జగన్మాత లీల.....*
*కామినీ కాంచనాసక్తమైన ఈ నా (పంచానన) జీవితంలో ఒక అలౌకిక సంఘటన చోటుచేసుకుంది. ఒకనాడు ఉదయం నుండి శరీరంలో నలతగా ఉంది. కనుక ఆ రోజు విశ్రాంతి తీసుకుంటున్నాను. మా షిల్లాంగులో, మా పేటలో 80 ఇళ్ళు; వీటి నడుమ మూడు, నాలుగు ఖాసీ తెగ గిరిజనుల ఇళ్ళు.*
*ఆ ఖాసీ వారి పిల్లలు మహా ధూర్తులు. తాళాలు వేసిన ఇళ్ళ తలుపులు, కిటికీల గాజురెక్కలు రాళ్ళతో విరగగొట్టి, లోనికి దూరి చేతికి అందినవి తీసుకొనిపోతారు. చివరకు వారు ఎంతగా తెగించేవారంటే, ఇళ్ళకు కూడా నిప్పుపెట్టేవారు.*
*ఒకరోజు దుండగులు మా ఇంటికి నిప్పుపెట్టారు. పై కప్పు కాలుతోంది. నేను నీళ్ళ బాల్చీ చేత పట్టుకొని ఇంటి పై కప్పు పైకి ఎక్కాను. నిప్పు చెలరేగి నన్ను చుట్టుముట్టింది. నా ముఖం కాలిపోయింది. ప్రాణాలు గతి తప్పుతున్నాయి. తప్పించుకోవాలనే ఆలోచన రాని స్థితి. అకస్మాత్తుగా 'అమ్మా, అమ్మా' అని అరిచాను.*
*అప్పుడు 'మా భైః మా భైః భయం వలదు. భయం వలదు. నేను వస్తున్నాను' అని ఓ మధుర స్వరం వినపడింది. నేను కళ్ళు తెరిచి చూశాను. ఆ దృశ్యంతో నా జన్మ ధన్యమైనది. అటువంటి రూపం ముందెన్నడూ చూడలేదు. మెరుపు లాంటి తేజోమూర్తి. ఆ తేజస్సు ముందు అగ్ని కాంతిహీనంగా తోచింది. అభయ హస్తములతో జగన్మాత ప్రత్యక్షమైంది. ఆ దివ్యతేజోమూర్తిని దర్శించగానే 'అమ్మా, అమ్మా' అంటూ స్పృహ కోల్పోయాను.*
*సూర్యాస్తమయ కాలానికి మెల్లగా స్పృహ వచ్చింది. అక్కడ గుమికూడిన ప్రజలు నాలో కదలికలు గమనించి 'అయ్యా! మీరు బ్రతికి బయటపడ్డారు. మిమ్మల్ని క్రిందకు దింపుతాం' అని అరిచారు. ఎలాగో పైకప్పు అంచు వరకు మెల్లమెల్లగా జరిగాను. చిన్న పిల్లవాడిని ఎత్తుకున్నట్లు, నన్ను ఎత్తుకున్నారు. 'అయ్యా! క్షేమంగా ఉన్నారండి. ముఖం మాత్రం కాలి, పెద్ద పెద్ద బొబ్బలు లేచాయి' అన్నారు.*
*ముందు వసారా దగ్గర ఉన్న పూల చెట్టు పూర్తిగా కాలిపోయింది. కానీ పైకప్పుపై పరచిన ఒక్క కొబ్బరాకు కూడా కాలలేదు! అది చూసి విహ్వలుడనయ్యాను. ఇంటికి తిరిగి వచ్చి తలుపులు మూసుకొని, రాత్రి అంతా 'అమ్మా, అమ్మా' అని విలపిస్తూ గడిపాను.*
*ముఖం నానాటికీ భయంకరంగా కనబడుతోంది. మొదట్లో కందగడ్డ లాగా ఎర్రగా ఉంది. ఆ పైన నల్లగా మారుతోంది. పది, పన్నెండేళ్ళుగా ఎవరితో పని చేస్తున్నానో, వాళ్ళు సైతం నన్ను గుర్తుపట్టలేని పరిస్థితి. ఒక డాక్టరు నన్ను చూడడం జరిగింది. చర్మం పై పొర పూర్తిగా రోగుల ముఖం లాగా కనపడుతుంది. బొబ్బలు లేచిన చోట్ల భయంకరమైన మచ్చలు మిగులుతాయి అన్నాడు. మొట్ట మొదటిసారిగా బాధపడ్డాను. చేసేదేముంది! కాలిపోయింది. అది మెల్లగా ఊడి వస్తుంది.*
*అప్పుడు, బొల్లి రాత్రి పడుకున్నాను. తెల్లవారి 3 గంటలకు మెలకువ వచ్చింది. లేచి కుర్చీపై కూర్చున్నాను. గది అంతా కనులు మిరుమిట్లు గొలిపే కాంతితో నిండిపోయింది. ఎదుట సరిగ్గా ఆనాటి ఆకారం. ఎర్రటి కళ్ళు, కానీ సౌమ్య రూపం. 'ఒక్కసారి నన్ను వేడుకో. ముఖం బాగవుతుంది' -వీణ మీటినట్లున్న అదే స్వరం. 'నా వల్ల కాదు తల్లీ! ఇది నీవు ప్రదానం చేసిన అలంకారం' అన్నాను. ఆమె గలగలా నవ్వింది. ఆ దరహాస సౌందర్యం వర్ణించలేను. 'సరే! ఉగాది నాడు స్నానం చేయగానే నీ ముఖం సహజరూపం సంతరించుకుంటుంది' అని పలికింది.*
*మా ఇంట్లో ఒక అతిథి. 'మీ ముఖం నానాటికీ భయంకరంగా తయారవుతోంది' అని ఆయన నాతో అన్నాడు. ఆయనకు, మరికొందరు సన్నిహితులకు జరిగింది చెప్పాను.*
*ఉగాది పర్వదినాన ఉదయం అలవాటు ప్రకారం ప్రక్కనున్న కొండపై నుంచి జారే జలపాతం వద్దకు వెళ్ళి, స్నానం చేసి ఇంటికి వస్తున్నాను. దారిలో నన్ను చూసిన సన్నిహితులంతా 'బాబూ! ఏమి ఆశ్చర్యం! నీ ముఖంపై చిన్న మచ్చ అయినా లేదు' అని అంటూ స్థాణువులై నిలబడ్డారు.*
*నా శరీరం కంపించింది. 'అమ్మా, అమ్మా' అంటూ విలపించాను. ఇంటికి వచ్చి, జగన్మాత లీలలను ధ్యానిస్తూ కూర్చున్నాను.*
*┈┉━❀꧁మాత్రేనమః꧂❀━┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🌺📿🌺🙏🕉️🙏🌺📿🌺
No comments:
Post a Comment