*భగవంతుణ్ణి మెప్పించిన భక్తి*
*శ్రీపురుషోత్తంపురిలో కర్మాబాయి అనే భక్తురాలు ఉండేది. బాలకృష్ణుడిని ఎప్పుడూ పూజిస్తూ ఉండేది. ఆమె వాత్సల్య భక్తికి భగవంతుడు ప్రసన్నుడై, చిన్నికృష్ణుని రూపంలో వచ్చి ఆమె పెట్టిన పులగం (కిచిడీ) ఆరగించేవాడు. ప్రతిదినం ఆమె తన బాలకృష్ణుడు ఎక్కడ ఆకలితో బాధపడతాడో అని భావించి స్నానాదికార్యాలు చేయకుండా ముందు ఉదయమే పులగం వండి బాలకృష్ణుడికి నివేదించేది. ఆమె భక్తికి వశుడైన కృష్ణుడు నిత్యం చక్కని బాలుని రూపంలో వచ్చి ఆమె ఒడిలో కూర్చొని, పెట్టిన పులగం తినేవాడు. భగవంతుడి నైవేద్యం ఆలస్యం అవకూడదన్న భావంతో ఆమె ఇంటి పనులు, పద్దతులు ఏవీ పట్టించుకోకుండా ఉదయమే భక్తితో పులగం వండి ఉంచేది.*
*ఒక రోజు కర్మాబాయి ఇంటికి ఒక సాధువు వచ్చాడు. కర్మాబాయి స్నానం చేయకుండానే పులగం వండి బాలగోపాలునికి పెట్టడం ఆయన చూశాడు. వెంటనే ఆమెను పిలిచి 'ఇల్లు శుభ్రం చేసి,* *స్నానం చేసి, శుచిగా వంటచేసి భగవంతుడికి నైవేద్యం పెట్టాలి. లేదంటే భగవంతుడికి కోపం వస్తుంది' అని చెప్పాడు. మర్నాడు కర్మాబాయి ఆ విధంగానే చేసింది. అందువలన వంట చెయ్యడం ఆలస్యం అయింది. చిన్ని కృష్ణుడు ఆకలితో బాధపడుతున్నాడని ఆమె హృదయం తల్లడిల్లింది. బాధ పడుతూనే కృష్ణుడికి పులగం తినిపించింది.*
*అదే సమయంలో ఆలయంలోని పూజారి మంచి రుచికరమైన పిండి వంటలు తీసుకొచ్చి నివేదన చేసి, ప్రభువును ఆహ్వానించాడు. అప్పుడు ప్రభువు నోటి నిండా పులగంతో పూజారికి దర్శనమిచ్చాడు. భగవంతుని ముఖం మీద అంటుకుని ఉన్న పులగం చూసి పూజారి ఆశ్చర్యపోయాడు. పూజారి కూడా పరమ భక్తుడు. అసలు విషయం చెప్పమని పూజారి అత్యంత భక్తి పూర్వకంగా భగవంతుణ్ణి ప్రార్ధించాడు. అప్పుడు భగవంతుడు "నేను ప్రతినిత్యం ఉదయమే వెళ్ళి కర్మాబాయి వండి పెట్టిన పులగం తింటాను. ఆ పులగం నాకు చాలా ఇష్టం. నిన్న ఒక సాధువు ఆమె ఇంటికి వెళ్ళి 'ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని స్నానం చేసి శుచిగా వంట చేసి భగవంతుడికి నివేదించాలి' అని చెప్పాడు. అందుకని ఇవాళ ఆమె తన పనులు పూర్తి చేసుకుని పులగం వండి నాకు పెట్టేసరికి ఆలస్యం అయింది. ఆకలి భరించలేక నేను బాధపడ్డాను. ఇక్కడ మీరు పిలిచేసరికి తొందరలో ముఖం శుభ్రం చేసుకోకుండా వచ్చేశాను" అని చెప్పాడు.*
*భగవంతుడు చెప్పినదంతా పూజారి, ఆ సాధువుకి చెప్పాడు. సాధువు గాబరా పడుతూ కర్మాబాయి ఇంటికి వెళ్ళి "అమ్మా! మీరు ఎప్పటిలానే ఉదయమే పులగం వండి కృష్ణుడికి నివేదన చెయ్యండి. మీరు ఏ విధమైన నియమాలూ పాటించనక్కర లేదు" అన్నాడు. కర్మాబాయి పూర్వం లాగానే ఉదయమే పులగం వండి, బాలకృష్ణుడికి పెట్టేది.*
*ఆమె జీవితాంతం బాలకృష్ణుడిని సేవించి, చివరిలో భగవత్సాయుజ్యం పొందింది. ఇప్పటికీ భక్తులు ఆమె కృష్ణభక్తిని కీర్తిస్తూ పాటలుగా పాడుకుంటారు. ఇప్పటికీ జగన్నాథస్వామి ఆలయంలో ప్రతి నిత్యం ఉదయమే పులగం వండి భగవంతునికి నివేదన చేసే సంప్రదాయం కొనసాగుతోంది.*
*┈┉┅━❀꧁హరే కృష్ణ꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🌼🌺🌼 🙏🕉️🙏 🌼🌺🌼
No comments:
Post a Comment