Wednesday, 23 April 2025

 *ఆలోచనలకు అక్షరరూపం* 

*నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా...* 

*ఒక తరంనుండి మరొక తరానికి జ్ఞాన ప్రసారం జరగడానికి పుస్తకాలు అతి ముఖ్యమైన సాధనాలు, సిసిరో అనే మహా పండితుడి అభిప్రాయంలో పుస్తకాలు లేని గది ఆత్మలేని శరీరం వంటిది .దీనిని బట్టి పుస్తకాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని పుస్తకాలు చదవటం ద్వారా కొంతమంది జీవితాలలో ఎన్నో మార్పులు సంభవించి ఉన్నత స్థానానికి చేరినవారున్నారు. వివిధ వ్యక్తుల ఆలోచనలను, భావాలను తెలుసుకొనుటకు పుస్తకాలు మనకు ఎంతగానో తోడ్పడతాయి. వివేకమును విజ్ఞానాన్ని పెంపొందించుకొనుటకు పుస్తకాలు ఉపయోగపడతాయి.*

*ఎక్కువ సంఖ్యలో చదువుకున్నవారు వున్న దేశాలు అభివృద్ధిపథంలో ముందున్నాయి. చాలామంది పుస్తకాలను చదవడం ద్వారా అనేక విషయాలు తెలుసుకొని జీవితంలో గౌరవప్రదంగా బతుకగలుగుతున్నారు. మనకు ఎదురవుతున్న అనేక సమస్యలు గతంలో అనేకమందికి కలిగిన అనుభవాలే. అలాంటి అనుభవాలతో అనేక పుస్తకాలు వచ్చాయి. అవి చదివితే ఎందరో జీవిత అనుభవాలను మనం కొన్ని గంటలోనే తెలుసుకొని మన జీవితాలను చక్కదిద్దుకోవచ్చు. స్నేహితుల సాంగత్యంవలన మంచి చెడులను గ్రహించి ఏ విధంగా ఆనందంగా ఉండగలుగుతామో మంచి పుస్తకాల సహవాసంవలన కూడా అంతే సంతోషంగా ఉండగలుగుతాము. అందుకే పుస్తకాలు మనకు మంచి నేస్తాలని చెప్పవచ్చు. ఒక మంచి పుస్తకం స్నేహితులలోకెల్లా ఉత్తమమైనది. అలాంటి పుస్తక నిలయాలైన గ్రంథాలయాలను అభినవ దేవాలయాలుగా పెద్దలు అభివర్ణించారు. అందుకని విద్యార్థులు మంచి పుస్తకాలు చదవడానికి గ్రంథాలయ మునకు వెళ్లడం అలవాటు చేసుకోవాలి. విద్యార్థులు తమ దగ్గర వున్న పొదుపు డబ్బుతో చిన్నప్పటినుండే మంచి పుస్తకాలు కొనుక్కొని చదివే అలవాటును పెద్దలు ప్రోత్సహించాలి.*

*శరీరానికి వ్యాయామం ఎలాగో మెదడుకు పుస్తక అధ్యయనం అలాంటిది. పుస్తక పఠనంతో మేధస్సు సక్రమంగా పనిచేస్తుంది. అనవసరమైన ఆలోచనలవైపు దృష్టి మరలకుండా, మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండవచ్చు. పుస్తకాన్ని ఆస్వాదిస్తూ చదివితే అది మన మనసుకు ఆనందాన్ని, తృప్తిని కలిగిస్తుంది. మంచి పుస్తకం మనం బాధలో ఉన్నపుడు అమ్మలా లాలిస్తుంది. కష్టాల్లో వున్నపుడు నాన్నలా ఆదరించి ధైర్యం చెపుతుంది. అవసరమైనపుడు గురువులా హితబోధ చేస్తుంది. ఆపదలో వున్నపుడు స్నేహితునిలా అక్కున చేర్చుకొని ఓదారుస్తుంది.*

*ప్రాచీన కాలంనుండి కూడా మన దేశంలో పుస్తకాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా భారతీయులే పుస్తక పఠనానికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారని సర్వేలు చెపుతున్నాయి. ఒక సర్వే ప్రకారం వారానికి భారతీయులు సుమారు 11 గంటల సమయాన్ని పుస్తక పఠనానికి వెచ్చిస్తున్నారు. వేదాలు, పురాణే తిహాసాలు, ఆధ్యాత్మికం, సాహిత్యం, శాస్త్రం, ఆరోగ్యం, రాజకీయం, చరిత్ర మొదలగు అంశాలతో పాటు కథలు, కవిత్వం, నాటకం, వ్యాసం, నవల, పద్యం, గద్యం మొదలగు భిన్న విషయాలతో పుస్తకాలు మనకు విజ్ఞాన భాండాగారంగా వెలుగొందుతున్నాయి. "భారత రాజ్యాంగ పిత అయిన అంబేడ్కర్" తన సమయాన్ని ఎక్కువగా పుస్తక పఠనానికే కేటాయించేవారు. తన సంపాదనలో ఎక్కువ భాగం పుస్తకాల కొనుగోలుకే ఖర్చుచేసే వారు. ప్రపంచంలోని చాలా మంది మేధావులు కూడా పుస్తక పఠనమే అభిరుచిగా కలిగివున్నారు.*

*ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారు. కానీ నేటి కాలంవారికి సెల్ ఫోన్ హస్తభూషణంగా మారింది. సాంకేతిక పరిజ్ఞానంవలన పుస్తకం కూడా తన రూపాన్ని మార్చు కొంటున్నది. ఇపుడు ఏ పుస్తకం కావాలన్నా ఇ-బుక్స్ రూపంలో ఇంటర్నెట్లో లభ్యం అవుతున్నాయి. కాక పోతే ఇందులో చదవడం కొంతమేరకు ఇబ్బందికరంగా ఉంటుంది. సినిమా, టెలివిజన్, మొబైల్, ఇంటర్నెట్ మొదలైన వాటివలన విద్యార్థులలో, యువతలో పుస్తక పఠనం రాను రాను తగ్గిపోతుంది. యువతరాన్ని చదువు వైపు ఆకర్షించే ఉద్దేశ్యంతో యునెస్కో ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవంగా పాటించాలని ప్రకటించింది. 1995 సంవత్సరంనుండి ప్రపంచ పుస్తక దినోత్సవంను జరుపుతున్నారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రపంచ పుస్తక రాజధానిగా కూడా ఒక నగరాన్ని యునెస్కో ప్రకటిస్తుంది. 2018 సంవత్సరానికిగాను ఏథెన్స్ నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటించింది. పుస్తకాలకు వున్న ప్రాధాన్యత దృష్ట్యా "కందుకూరి వీరేశలింగం పంతులుగారు చిరిగిన చొక్కా అయినా తొడుక్కోగానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో" ఆ మంచి పుస్తకం జీవితాన్ని మారుస్తుందని అన్నారు. ఆయన చెప్పిన మాటలు నేటికీ అక్షర సత్యాలే...*

*┈━❀꧁గురుభ్యోనమః꧂❀━┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🦚🌷🦚 🙏🕉️🙏 🦚🌷🦚
 *_పెద్దరికం అంటే ఏమిటి.?_*

*_పెద్దరికం అంటే కళ్ళతో భయపెట్టేది కాదండి... కళ్ళనిండా ప్రేమను కురిపించేది పెద్దరికం._*

*_పిల్లలు తప్పు చేసేటప్పుడు దండించేది కాదండి... పెద్దరికం ఆ తప్పు వెనకున్నటువంటి కారణాన్ని తెలుసుకొని ఆ కారణాన్ని తుంచి వేసి, ఆ తప్పు మరెప్పుడు చేయకుండా సరైన మార్గం సూచిస్తుంది చూశారు అదండీ అసలైన పెద్దరికం._*

*_భయపెట్టి మాట వినేలా చేసుకోవడం కాదండి... పెద్దరికం అంటే ప్రేమతో చెప్పే ప్రతి మాటను తూ.చా తప్పకుండా పాటించేలా చేసేదండి అసలైన పెద్దరికం._*

*_పెద్దరికం అంటే భయపడి మన వెంట నలుగురు తిరగడం కాదండి... ప్రేమతో మనకోసం, మనల్ని మెచ్చి , మనం నచ్చి మన వెంట ఒక్కడు తిరిగినా అదండీ పెద్దరికం అంటే._*

*_అయినా పెద్దరికం అనేది వయసుతోనో, అనుభవంతోనో, మనం కోరుకుంటేనే వచ్చేది కాదండి... పదిమంది మెచ్చి, మనకు అప్పజెప్పేది పెద్దరికం._*

*_అలాంటి పెద్దరికం మనకు వచ్చినప్పుడు పెద్ద మనసుతో ఆలోచించి అందర్నీ అక్కని చేర్చుకోవాలి. అప్పుడే ఆ పెద్దరికానికి అసలైన అర్థం చేకూరుతుంది._*

    *_- సదా మీ శ్రేయోభిలాషి...✍️_*
🙏🙏🙏 🪷🙇🪷 🙏🙏🙏
 *'నేను' ను వదిలించుకుంటే... ఆత్మ స్వేచ్ఛావిహంగమే* 

*ఆత్మ నిత్యమైనది, సత్యమైనది, పవిత్రమైనది. నిత్యంగా, సత్యంగా, సమర్చనంగా ప్రకాశించే పరమాత్మ స్వరూపం. జీవితంలో ప్రతి అడుగునూ నియమానుసారంగా దైవంవైపు చేరే విధంగా వేయడమే గొప్ప ఆత్మసాధన. కానీ... నేను అనే పంజరంలో మనని మనం బంధించుకుని, కుదించుకుని, నియంత్రించుకుని ఆ ఇరుకు గది అస్థిపంజరమే ప్రపంచంగా బతికేస్తున్నాం. ఆ 'నేను’ అనే అహాన్ని వదిలించుకుంటే, మనని మనం ఆ పంజరం నుంచి విడుదల చేసుకుంటే ఆత్మ స్వేచ్ఛా విహంగమై అనుభవ ఆకాశంలో హాయిగా విహరించగలదు. అలా కాకుండా... 'నేను'పై మమకారంతో ప్రాపంచిక విషయాల మీద ఆసక్తిని, అనురక్తిని కనబరుస్తూ దైహిక సుఖాలు తీర్చుకోవడంలోనే తన్మయం చెందడం అల్పత్వం. అరిషడ్వర్గాలను జయించగలిగితేనే సామాన్యుడు మాన్యుడవుతాడు.*

*తనలో కలిగే కామం తాత్కాలిక సుఖాన్నిచ్చేదేగానీ... శాశ్వత సుఖాలను మార్గదర్శనం చేయించేది కాదని మానవుడు గ్రహించాలి. ప్రతివారి జీవితంలో ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సమయంలో విషాదం తప్పదు. మన బాధను భగవంతుడికి మొరపెట్టుకుని కష్టాల నుంచి రక్షించమని కోరడం ఆత్మఘోష. లోపలి కల్మషాలను కడిగివేసేది ఆత్మధ్యానం. అది మనిషిలోని అహంకారాన్ని ఆవిరైపోయేట్టు చేస్తుంది. ఆనంద జగత్తులోకి తీసుకెళ్లి ఓలలాడిస్తుంది. ఎన్నికష్టాలు వచ్చినా ఆత్మహత్య భావన కలగకుండటమే ఆత్మస్థైర్యం. జీవితంలో కష్టసుఖాలు వాననీటిలో బుడగలవంటివి. కష్టం వచ్చినప్పుడు బాధ... సుఖం వచ్చినప్పుడు సంతోషం కలగడం సహజం. ఆ కష్టసుఖాలు రెండూ దైవం ఏర్పరచినవే. దీన్ని గ్రహించి... కష్టాల్లో సైతం ఆత్మస్థైర్యాన్ని కోల్పోనివారే ఆత్మనిగ్రహం కలిగినవారు.*

*తను ఒక్కడే బాగుండాలి అనే ఆలోచన నుండి అందరూ బాగుండాలి అనే కోరికవైపునకు మన మనసును మళ్లించి అందుకు తగ్గ కృషి చేయడమే ఆత్మపరిశీలనం. ఈ లోకంలో గమనం కూడా గమ్యమంత ఆనందాన్నిచ్చే పయనం ఒకటుంది. అదే ఆధ్యాత్మిక ప్రయాణం. ముక్తిమార్గం... సాధనాపథం. ఆత్మ సూర్యుడైతే... మన స్వభావాలు ఆ సూర్యుణ్ని కప్పివేసే మేఘాలవంటివి. వాటికి అతీతంగా చూడగలిగితే ప్రకాశించే అందరి ఆత్మలూ ఒక్కటేనన్న అవగాహన కలుగుతుంది. ఆత్మకు అంటుకున్న మలినాలను తొలగిస్తే భగవత్ స్వరూపం స్వయంప్రకాశంతో సాక్షాత్కరిస్తుంది.*

*┈┉┅━❀꧁ జై శ్రీరామ్ ꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🌷🦚🌷 🙏🕉️🙏 🌷🦚🌷
 కథ పేరు...

*ఒక్కసారి*ఆలోచించండి* !

*******************
"నమస్కారం సార్!"
తలెత్తి చూసాను. ఎదురుగా ఓ యువజంట.
"సార్! విడాకులుకు అప్ప్లై చేయాలని వచ్చాం. మీరు లాయర్ రావుగారే కదా!" 
నాకేసి చూస్తూ అడిగాడతను. 
చూస్తే చూడముచ్చటగా ఉన్నారనిపించింది.
"యస్! లాయర్ రావును నేనే. బై ది బై ఫ్యామిలీ కౌన్సిలర్ ని కూడా "

అంటూ 
వచ్చిన ఆ ఇద్దరినీ తేరిపారా చూశాను. 
ఇద్దరి వయసూ దాదాపు  ఇరవై ఐదు ఇరవై ఎనిమిది మధ్య ఉండవచ్చేమో ?
ఆమె  ఎదురుగా కనిపిస్తున్న    గదిలోని గోడలను చూస్తోంది. అతను నాకేసి చూస్తున్నాడు.
నేను ఇద్దరినీ పరిశీలిస్తూ "ముందు కూర్చోండి !"అంటూ నా టేబుల్ కు ఎదురుగా ఉన్న కుర్చీలను చూపించాను.
"తన పక్కన కూర్చోను!" అంటూ అతను కుర్చీని కొంచెం దూరంగా జరిపి కూర్చున్నాడు.
"నాకు మాత్రం ఇష్టమా!" అంటూ ఆమె కూడా కుర్చీని దూరంగా జరుపుకుని కూర్చుంది.
ఇద్దరూ కోపంగానే ఉన్నారు.
సమానంగానే తగవు లాడుకుంటున్నారని అర్ధమైంది.
"అబ్బాయ్ !నీ పేరు?" అన్నాను.
"సుధీర్ సార్!" అన్నాడు.
"అమ్మాయి! మరి నీ పేరు ?"
"సరళ !సార్."
"పేర్లు కలిశాయి. చూస్తుంటే వయసు దగ్గరగానే కుదిరినట్లుంది. ఇంక దేనికి విడాకులు ?" ఇద్దరికేసి ఆశ్చర్యంగా చూస్తూ అడిగాను.
"మనసులు కలవలేదు సార్!" సరళ సుధీర్ కేసి కోపంగా చూస్తూ అంది.
"మీది పెద్దలు కుదిర్చిన వివాహమా ?"
"కాదు ...లవ్ మ్యారేజ్ సార్!" సుధీర్ అన్నాడు.
"ప్రేమికులు దంపతులయ్యారు. కానీ దంపతులయ్యాకా ప్రేమ కొరవడిందా ?"
నా ప్రశ్నతో ఇద్దరూ నాకేసి విచిత్రంగా చూశారు.
"పెళ్లి చేసుకోవడానికి ఇద్దరి మనసులు కలిస్తే చాలు. ఇక వేరే కారణంతో పని లేదు. కానీ విడిపోవడానికి బలమైన కారణం ఉండాలి. ప్రేమించుకున్నప్పుడు కలిసిన మనసులు పెళ్లయ్యాక ఏమయ్యాయి ? సరే..ఇప్పుడు చెప్పండి. విడాకులు ఎందుకు కావాలంటున్నారు ?"
నేను సూటిగా అడగడంతో వాళ్లిద్దరూ ఒకేసారి...ఒకరి నొకరు వేలెత్తి చూపించు కుంటూ..."తనకు ఇగో, సార్ !"అన్నారు.
నాకు నవ్వొచ్చింది.
"ఎందుకు సార్ నవ్వారు ?" ఒక్కసారిగా ఇద్దరూ  నన్నడిగారు.
"ఏం లేదు. కలిసి ఉండలేమంటున్నారు. కానీ కలసి  సమాధానం ఒకటే చెప్పే సరికి నవ్వకుండా ఉండలేకపోయాను.
లేడీస్ ఫస్ట్ అంటారు. సరళ ముందు చెబుతుంది. సుధీర్ నువ్వు మాత్రం మధ్యలో అడ్డు రాకూడదు !" అంటూ సరళ వైపు  చెప్పమన్నట్టుగా చూశాను.
"ఆఫీసునుండి రాగానే హాల్లో సోఫాలో ఒరుగుతూ తను టి.వి.ముందు దర్జాగా కూర్చుంటాడు. నేను మాత్రం కిచెన్ రూమ్ లోకి వెళ్లి చెమటలు కార్చుకుంటూ వండి పెట్టాలి..
నేను కాఫీ కలిపిస్తే అతను హ్యాపీ గా సిప్ చేస్తాడు. ఖాళీ కప్పు కూడా సింక్ లో పడేయడు.
అటు ఆఫీసులో....ఇటు ఇంట్లో పని తప్పడం లేదు.
సుధీర్ తో కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను. కనీసం నాతో సమానంగా అతను పని చేయడా ?
ఈ కంజెస్టెడ్ జీవితం నాకు వద్దు. నాకూ చదువుంది. ఉద్యోగం ఉంది. అందం ఉంది. హోదా ఉంది. అన్నీ ఉండి కూడా పాతకాలపు ఇల్లాలుకు మల్లె ఉండాల్సిన ఖర్మ నాకేంటి ? నా పేరెంట్స్ 'నీ వెనుక  మేమున్నాం' అన్నారు. నో వే సార్.. ఐ వాంట్ డైవర్స్"
గుక్క తిప్పుకోకుండా మనసులో మాటలన్నీ ఏకరువు పెట్టింది.
"ఓకే! సరళ..సుధీర్! ఇప్పుడు నువ్వేమంటావ్?" అంటూ సుధీర్ వైపు చూశాను.
"సార్! తను నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నాను అని అహంకారం. అందుకే నన్ను ఇంటి చాకిరీ పంచుకో మంటుంది. నేను మగాన్ని ...సింహంలా బతికాను. దర్జాగా సోఫాలో కూర్చుని టీవీ చూస్తే  తప్పేంటి ? నాకంటే ఎక్కువ సంపాదిస్తోందని పనిలో ఇంటిపనిలో వాటా వేస్తే ఎలా?ఇలా అయితే రేపు కన్సీవ్ అయ్యాకా పదిలో సగం ఐదు నెలలు నన్ను మోయమంటుంది కూడా. ఎవరు చేసేపని వాళ్ళు చెయ్యాలి.
సమ విభజన కోసం సైన్స్ కే విరుద్ధంగా మాట్లాడుతుంది. అన్ని పనులూ చేస్తే ఆడంగి వాడంటారు..ఎప్పుడైనా పొరపాటున కాఫీ కలిపితే ఊరుకుంటారా ?బావుందంటారు. కిచెన్ రూమ్ లో వాటా పెడతారు. నువ్వు కూరలు తరుగు. నేను వంట చేస్తానంటారు. నువ్వు బియ్యం కడుగు. నేను కుక్కర్ పెడతానంటారు.
"మగాడివి, మహారాజులా ఉండు. భార్యకు బానిస కాకు" అని నా పేరెంట్స్ పెళ్లికి ముందే  చెప్పారు.
నాకు సరళకు సరిపడలేదు సార్! ఐ టూ వాంట్ డైవర్స్. సుధీర్ కూడా అంతే గట్టిగా చెప్పాడు.
ఇద్దరూ ఒకరికేసి ఒకరు కోపంగా చూసుకున్నారు.
"బిడ్డను కనడానికి  సర్రోగసి సిస్టం ఉంది తెలుసుకో" సరళ సుధీర్ కేసి కోపంగా చూస్తూ అంది.
"చూసారా సార్! అంటే తను కనలేనని ముందే షరతుగా చెప్పేస్తోంది. అమ్మ కావడం కన్నా, అందంపై మోజే మిన్న సార్ తనకూ. నాకు వద్దు సార్!"
సుధీర్ అన్నాడు ఆవేశంగా.
"ఏయ్! మిస్టర్! నేను మార్గం చెప్పాను. కానీ ఆ మార్గంలో వెడతానని అనలేదే.
మాటలను సరిగ్గా అర్ధం చేసుకోని మొండివానితో నేను వేగలేను సార్! నాకు అతనితో 
విడాకులు ఇప్పించండి. ప్లీజ్" సరళ బతిమాలే ధోరణిలో నా వైపు చూస్తూ చేతులెత్తింది.
"ఉష్ ...గొడవలు పెట్టుకునే వచ్చారు. మళ్లీ ఇక్కడ కూడా గొడవలా ?..మీరు సైలెంటుగా ఉంటేనే మాట్లాడుతా. నాకు టైం లేదు. మరో కేసు బయట సిద్ధంగా ఉంది. నా మాట వింటారా ? లేక వెళ్లిపోతారా ?" నేను గట్టిగా అడగడంతో ఇద్దరూ ఒక్కసారిగా ఆగారు.
తుఫాను ముందు ప్రశాంతతలా ఉంది.
ఆ ప్రశాంతతను భగ్నం చేస్తూ నేను అందుకున్నాను.
"చూడండీ! మీరిద్దరూ మాట్లాడారు. 
నేను విన్నాను. ఫ్యామిలీ కౌన్సిలర్ ని కదా. ముందు నా మాట కూడా మీరు వినాలి. 
ఆ పై మీ అభిప్రాయం. సరేనా!" అంటూ ఇద్దరికేసి చూశాను.
వాళ్ళు మళ్లీ ఒక్కటిగా "ఒకే సార్!" అన్నారు.
ఈసారి పైకి నవ్వు కనబడకుండా ...లోపల నవ్వుకున్నాను.
"అమ్మానాన్నా, తోబుట్టువులూ గాడ్స్ గిఫ్ట్...ఎలా ఉన్నా ఒప్పుకుంటాం. జీవితాంతం వారితో బావుంటాం. బాగానే చూస్తాం. కానీ భార్యాభర్తల విషయానికి వచ్చేటప్పటికి
చిన్న కారణానికే...అంటే  కుక్కర్ పొయ్యిమీద పెట్టలేదని, అడిగిన డిష్ చేయ లేదని, కూల్ డ్రింక్ తేలేదని, నేనంటే ప్రేమే లేదని, ఇలా సిల్లీ పాయింట్స్ నే సీరియస్ గా తీసుకుంటున్నారు. నచ్చలేదని జీవిత భాగస్వామిని వదులు కోవడానికి సిద్ధపడి పోతున్నారు..."
"సార్, అదీ..."సుధీర్ ఏదో చెప్పబోయాడు.
"ప్లీజ్...లెట్ మి టెల్ యూ" అనగానే చెప్పమన్నట్టుగా  మౌనం వహించాడు.
"అటుగాని, ఇటుగానీ, ఒకప్పుడు నచ్చచెప్పి కాపురానికి పంపించే పేరెంట్స్ ఇప్పుడు రెచ్చగొడుతున్నారు.
అగ్ని కి ఆజ్యం పోస్తున్నట్లుగా 'విడిపోయినా నీకేం పర్వాలేదంటూ' భరోసా ఇస్తున్నారు.
అయినా వస్తువును సృష్టించ డానికి కష్టపడాలి గానీ, నాశనం చేయడం ఎంతసేపు ?నేలకేసి గట్టిగా కొట్టినంతసేపు పట్టదు.
అవునా ? కాదా ?" ఇద్దరినీ అడిగాను.
వాళ్లిద్దరూ బదులు ఇవ్వలేదు. నా మాటలు వింటున్నారని పించింది. ఆలోచనలో పడుతున్నారని అర్థమయ్యింది.
ఇదే సరైన సమయం అని భావించాను.
"ఆమెకు ఒంట్లో బాగో లేకపోతే కూర చేయాలా ? కర్రీ పాయింట్ నించి తెప్పించడానికి వర్రీ ఎందుకు ? అతనికి ఒంట్లో నలతగా ఉన్ననాడు ఈరోజు శనివారం...షికారుకు రా' అని పిలవడం దేనికి ? ఒక శనివారం పోతే, మరో  శనివారం రాదా? ఆరోగ్యమే  మహాభాగ్యం అని గుర్తించాలి కదా!..గొడవలు తవ్వుకుంటే ఇద్దరి మధ్య  పూడ్చలేని గొయ్యి మిగులుతుంది. కానీ సర్దుబాటు మొదలైతే సమాధానం దొరుకుతుంది. సఖ్యత పెరుగుతుంది. పరిష్కారం లభిస్తుంది. ఆవేశం తగ్గించుకుంటే ఆలోచన మొదలవుతుంది." అని ఆగి ఇద్దరికేసి చూసాను. మౌనంగా వింటున్నారు.
"కృష్ణ అని నా  ప్రాణ స్నేహితుడు, పెళ్ళైన కొత్తలో భార్యను బాగా చూసుకునే వాడు. భార్య ఎదురురానిదే బయటకు వెళ్లేవాడు కాదు. అయితే అతని వృత్తిపరమైన బాధ్యత, బాగా సంపాదించాలనే ఆత్రుతతో భార్యకు సమయం కేటాయించలేక పోయాడు. పోనుపోనూ డబ్బును ప్రధాన లక్ష్యం చేశాడు. కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేశాడు. భార్య 'నన్ను భార్యగా చూడండి' అంటూ అభ్యర్ధించింది. కానీ కృష్ణ అందుకు సమయం లేదన్నాడు. మీరు నాకు సరి పడరంటూ, ఆమె కృష్ణనుండి విడాకులు తీసుకుంది.
కోల్పోయకా మనిషిని గుర్తుకు తెచ్చుకున్నట్లుగా, వెళ్ళిపోయాక కృష్ణకు భార్య విలువ తెలిసొచ్చింది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆమె రెండో  జీవితం మొదలు పెట్టింది.
'సమయాన్ని సర్దుబాటు చేస్తే ఎంత బాగుండేదో ?' అని కృష్ణ బాధపడ్డాడు. కానీ ఆ బాధకు  ప్రయోజనం లేదు.
ఇతరుల పట్ల ఆకర్షణ, జీవిత భాగస్వామివద్ద నిరాదరణ, కారణాలు మొదట్లో చిన్నవిగా అనిపిస్తాయి, కనిపిస్తాయి. గతంలోనూ ఇవి ఉన్నాయి.కానీ కుటుంబంలో పెద్దలు సర్ది చెప్పేవారు. విడాకుల వరకూ వెళ్లకుండా తిరిగి కలిపేవారు. ఇప్పుడు వాళ్ళూ వెనకేసు కొస్తున్నారు. గుమ్మానికి వాడిపోయిన మామిడాకులను తీసేసినంత సింపుల్ గా విడాకులను తీసుకోమంటున్నారు. పేరెంట్స్ సర్దిచెబితే.. కౌన్సిలర్ అవసరం దేనికి ?
ప్రేమ, పరస్పర అవగాహన, ఒకరంటే మరొకరికి గౌరవం, సహకార భావన ఈ నాలుగూ దాంపత్యానికి పునాదులు. బీటలు వారితే వారిమధ్య సంబంధం సమాధి అవుతుంది. ఏ కాలంలోనైనా దాంపత్యానికి ప్రధాన సూత్రాలు రెండే రెండు. ఒకటి అర్ధం చేసుకోవడం. రెండు సర్దుకు పోవడం. సంపాదన కంటే సమయం గొప్పది. ఆ సమయాన్ని భార్యాభర్తలు కలసి సర్దుబాటు చేసుకుంటే అది  ర"సమయం" అవుతుంది. లేకపోతే విషమయానికి దారి తీస్తుంది.
విడిపోదాం, విడాకులు తీసుకుందాం అని వచ్చారు.అప్పుడు  ఆవేశం తప్ప ఆలోచన ఉండదు.
ఒక్కరోజు "కలిసుందాం" అని అనుకోండి. సర్దుబాటు మొదలవుతుంది. ఆలోచన ఆచరణ అవుతుంది.
అడవిలో పుట్టిన కవ్వం మనింటికి వస్తుంది. పాలతో బంధం ఏర్పర్చుకుంటుంది. సున్నితమైన వెన్నను ఇస్తుంది.ప్రాణం లేని వస్తువులే  ప్రేమను కనబరుస్తున్నాయి. ప్రేమనే ప్రాణంగా చేసుకుని ఒక్కటయ్యారు.
ఒక్కసారి ఆలోచించండి ! 
విడిపోవడానికి కాదు, కలిసుండటానికి.
అప్పుడు రండి. మీరు కాదూ,  కూడదంటే  విడాకులు  ఇప్పించడం పెద్ద పని కాదు. నిర్ణయం మీదే. ఇప్పుడు దయజేయండి" అన్నాను.
నా మాట విన్నట్టుగా వాళ్ళు లేచారు.
"వస్తాం సార్!" అంటూ లేచారు.
"ఆవేశంతోనా ? 
ఆలోచనతోనా ? " అన్నాను నవ్వుతూ.
"ఆచరణతో సర్!" ఇద్దరూ ఒకేసారి అన్నారు.
నాకు మళ్ళీ నవ్వొచ్చింది.
ఈసారి "వెళ్లండి, కానీ రావద్దు" పైకి నవ్వుతూ అనేసాను.

ముందుకు వెడుతున్న సుధీర్ ఒక్కసారిగా ఆగి నా వైపు చూశాడు. 'ఎందుకు ?' అన్నట్లుగా చూసాను ?
"మాలో మార్పుకోసం ఎన్నో చెప్పారు. ఆలోచించుకోమంటూ సలహా ఇచ్చారు. మరి ప్రాణ స్నేహితుడు కృష్ణ విషయంలో మీరు ప్రయత్నం ఎందుకు చేయలేక పోయారు సార్ ?" అన్నాడు.
అప్పుడు నేను నవ్వుతూ 
"నా అసలు పేరు కృష్ణా రావు. కానీ నన్ను అందరూ "రావు" అనే పిలుస్తారు!" అన్నాను.

"సారీ, సార్!" అంటూ సుధీర్ ముందుకు కదిలాడు. సరళ అతన్ని అనుసరించింది.
****************
అయిపోయింది
********
తెలుగుతల్లి ...కెనడా, అంతర్జాల మాస పత్రిక వారు, 2024 లో నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందిన కథ. ఏప్రిల్ 2025, తెలుగుతల్లి కెనడా, మాస పత్రికలో ప్రచురితమైన కథ.
********
రచయిత.. కె.వి.లక్ష్మణరావు
మానేపల్లి
 *జానకీకారుణ్యం..🏕️ఇంటింటిరామాయణం* 
🕉️🌻🦚💎🌹💜🌈

 *🍁జానకీ..నీకు ఎన్నిసార్లు చెప్పనూ ఇంత నెయ్యి వెయ్యద్దు ఇడ్లీలమీద అని..నీకు మంచిది అనిపిస్తే చాలా నాకు తినాలనిపించద్దా..ఆ..అని భార్య మీద విసుక్కుంటున్నాడు కారుణ్య..* 

 *నెయ్యి బలమూ, తిన్న తిండి వంటబట్టేలా చేస్తుందని నేనూ చెప్తూనే ఉంటా రోజూ మీకూ..* 
 *మీకు తిన్నది అరగాలని ఇలా నన్ను సాధిస్తుంటారు నాకు తెలుసులెండీ* *మీ ఉపాయం అంది జానకి మూతి మూడువంకర్లు తిప్పుతూ..హబ్బా పల్లెటూరి పెళ్ళామా అని విసుక్కుంటూ ఆఫీసుకి వెళ్ళిపోయాడు కారుణ్య* ..

 *అబ్బబ్బా మొద్దులా ఏంటీ ఈ అవతారం..ఎప్పుడు చూడు ఇంత పెద్ద అంచున్న చీరలేనా..కాస్త స్టయిలుగా షిఫాన్ చీర కట్టుకోవచ్చుగా, రెండుమూరల పూలొకటి అదనంగా..ఓ గులాబీ పువ్వు సింపులుగా పెట్టుకుంటే సరిపోతుంది, కళ్ళకు కాటుక, అమ్మోరులా ఇంతపెద్ద బొట్టూ..అని ఇంకా కారుణ్య జానకిని ఓ సాయంత్రం సాధించబోతే..* 

 *నాన్నా అమ్మకి ఇష్టమైనట్టు తయారయ్యింది..ఆ మాత్రం స్వాతంత్రం లేదా అమ్మకి ..ఊ..అని నేటితరం మహిళ సరయు తండ్రిని మృదువుగా అడ్డుకుంది..* 

 *బాస్ ఇంట్లో షష్టిపూర్తి ఫంక్షను..సరదా సరదా పోటీలు జరుగుతున్నాయి...అచ్చతెలుగు సాంప్రదాయంగా ఎవరొచ్చారో వారికి బహుమతి అన్నారు...జానకి నెగ్గింది...అయిదుగ్రాముల బంగారు నాణెం, బాసు దంపతులు, జానకికి బహుకరించారు..* 

 *ఏంటిప్పుడు మరి అని నవ్వుతూ కూతురు కళ్ళెగరేసింది కారుణ్యని చూసి..సరే ఒప్పుకుంటాలే అని కూతురి తల మీద చిన్నగా చేత్తో తట్టాడు కారుణ్య...వచ్చేముందు జానకి బాసు భార్యకి ఒక బాక్సు ఇచ్చింది..ఆవిడ బాక్సు తీసి చూసి అబ్బో పూతరేకులు మీరే చేసారా అంది..అవునని తలూపింది జానకి..అరే నాకూ ఇష్టమే అంటూ బాసు ఒక పూతరేకు తిని ఆహా ఏమి రుచి బాగా చేసారు థాంక్యూ అన్నాడు..ఏనుగు అంబారీ ఎక్కినంత గొప్పగా అనిపించింది కారుణ్యకి..ప్రేమగా జానకి చెయ్యిపట్టుకుని థాంక్స్ అన్నాడు నిజాయితీగా భార్యను మనసారా మెచ్చుకుంటూ..* 

 *కూతురుకి పెళ్ళయ్యింది...కొడుకుకీ పెళ్ళయ్యి కోడలొచ్చింది..కోడలు ఉద్యోగం, జానకి ఉండీలేని ఆరోగ్యం..ఇంట్లో కోపాలు, చిరాకులు షరా మామూలుగా..* 

 *జానకి నోరు ఎంత పెద్దదో కోడలొచ్చాకే అర్ధమయ్యింది కారుణ్యకి...కోడలుకి కూడా ఆఫీసు బాధ్యతలు, పైగా ఇంటిపనులు సరిగ్గా రావు..నిత్యం ఏదో ఒక గొడవే జానకికి, రూపిణికి..* 

 *ఉద్యోగం చేసేటప్పుడు ఆఫీసులో కొలీగ్స్ లాగా, భార్య నైసుగా లేదని పోల్చుకుని చిరాకుగా ఉండేవాడు కారుణ్య...రిటైరయ్యి ఇంట్లో ఉండేటప్పుడు భార్య ఇల్లు దిద్దుతున్న తీరు చూసి, కోడలి పనిరాని తనం చూసి..జానకి ప్రత్యేకత కారుణ్యకి అర్ధం అయ్యింది..* 

 *రూపిణికి పెళ్ళయ్యి నాలుగేళ్ళయినా పిల్లల ఊసు ఎత్తట్లేదు అని జానకికి కోపం వస్తోంది..ఒకరోజు కొడుకు వంశీని, రూపిణిని నిలదీసింది..చూడండర్రా మాకు ఓపికలున్నప్పుడే పిల్లల్ని కంటే నేను చేసుకోగలను, ఓపిక పొయ్యాక ఉద్యోగం చేసే తల్లితో పిల్లల ఆలనపాలన కష్టం అవుతుందిగా మరి..అని..* 

 *రూపిణికి ఇప్పుడే పిల్లలు ఇష్టం లేదు..ప్రమోషన్ వచ్చేలా ఉంది..ఇప్పుడు కష్టపడి పనిచేస్తేనే ప్రమోషన్ వచ్చే చాన్సు ఎక్కువ, లేదంటే ఇన్నాళ్ళు పడ్డ కష్టం వేస్టు అయిపోతుందని రూపిణికి బాధ..* 

 *ఇంకో రెండేళ్ళకు రూపిణి శుభవార్త వినిపించింది...అంతే జానకి రూపిణికి సర్వ సపర్యలూ చేస్తోంది..అంతేలెండి నా కడుపులో ఉన్న మీ వారసత్వానికి ఈ జాగ్రత్తలన్నీనూ, నేను మోసే యంత్రాన్ని కదా మరి అందుకే ఇన్నిరోజులూ లేని శ్రద్ధ నా మీద మీకిప్పుడూ అని అంది రూపిణి బాధగా...అది కాదమ్మా కడుపులో బిడ్డ ఉన్నప్పుడు తల్లి ప్రశాంతంగా ఉంటే బిడ్డ కూడా మానసికంగా ఆరోగ్యంగా ఉంటాడు..నువ్వు కూడా ఇప్పుడిలా అప్పుడలా అనిబేరీజు వేసుకుని మనసు చిన్నబుచ్చుకోకు, బిడ్డకు మంచిది కాదు అని కోడలికి స్నేహంగా నచ్చచెబుతున్న భార్యను చూసిన కారుణ్యకు జానకి ముచ్చటగా కనిపించింది...పొద్దున్నే రూపిణికి దానిమ్మపండు గింజలు వలిచి ఇచ్చేది...లంచ్ బాక్సులోకి యాపిల్ ముక్కలొకరోజు జామకాయ ముక్కలొకరోజు ఇచ్చేది..సాయంత్రం రోజూ మొక్కజొన్నె తినిపించేది..రాత్రిపూట పెద్దగ్లాసు పాలు ఇచ్చేది ఓ నేతిచుక్క వేసి మరీ...* 

 *రూపిణి నిండుగా తయారయ్యింది..ఈ మధ్య రోజూ కోడలికి ఉప్పుతో దిష్టి తీస్తోంది జానకి...* 

 *ఆ రోజు సాయంత్రం జానకీ అంటూ ఇంకా టీ తేలేదేంటీ అనుకుంటూ కారుణ్య వంటింట్లోకి వెళ్ళాడు...జానకి స్టవ్ ఉన్న గట్టు ముందు నేల మీద పడిపోయి ఉంది...జానకీ అని నీళ్ళు మొహం మీద చల్లాడు..స్పృహలో లేదు జానకి..అయ్యో అనుకుని అంబులెన్సు పిలిచి హాస్పిటలుకి తీసుకెళ్ళారు జానకిని..* 

 *హార్ట్ అటాక్ మొదటిసారి కాస్త బలంగానే పలకరించింది జానకిని...ఇహ జాగ్రత్తలు మొదలయ్యాయి జానకికి..తిండిలో కట్టుబాట్లు పనిచెయ్యటంలో ఆంక్షలు..ఇది చెయ్యొద్దు అది తినొద్దు అని రూల్స్ పాటించాల్సి వస్తోంది జానకికి..* 

 *కారుణ్య నిద్రపోతున్న భార్య పక్కన కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు...నిద్రలో జానకి చెయ్యి కారుణ్య చెయ్యి మీద పడింది..ఆ చేతిస్పర్శకి కారుణ్యకి అనిపించింది..మొన్నేమన్నా జరిగుంటే నా పక్కన ఈ నా సగభాగం ఉండేదా...తను నా పక్కన లేకపోతే నా రోజులు గడిచేదెలా..పెళ్ళయ్యి ముప్ఫయేళ్ళు నాకు అంతగా నచ్చని నా భార్య ఈ రోజు ఇంత ముఖ్యం అనిపిస్తోందేంటీ...కాలంతో పాటూ బంధాల విలువ, బంధం తాలూకు అవసరం* *తెలిసొస్తాయన్నమాట...అనుకున్నాడు కారుణ్య...* 

 *సంవత్సరం తరువాత మనవరాలు ప్రియతో జానకి ఆడుకుంటోంది ..చేతుల్లో మొహం దాచి మళ్ళీ చేతులు తీసి ప్రియని చూస్తే ప్రియ కిలాకిలా నవ్వుతోంది...* 

 *కొన్నిరోజులకి జానకికి మళ్ళీ ఇంకోసారి హార్ట్ అటాక్ వచ్చింది..మూడోసారి రాకుండా చూసుకోమని డాక్టర్లు జాగ్రత్త చెప్పారు..రూపిణి ప్రియని వాళ్ళ అమ్మదగ్గరికి పంపించెయ్యాలని అనుకుంటోంది..* 

 *జానకికి బెంగగా అనిపిస్తోంది..ఎలా మనవరాలు దగ్గర లేకుండా అని..రూపిణీ మనకి ఉన్నది సరిపోతుందిలేమ్మా..నువ్వు ఉద్యోగం మానెయ్యగలవా..ప్రియని చూడకుండా ఉండలేను నేను అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది జానకి రూపిణి దగ్గర...చాలా టెన్షన్ అనిపించింది రూపిణికి..జాబ్ వదలటం ఇష్టం లేదు అలా అని అత్తగారి ఆరోగ్యం, అత్తగారికి ప్రియతో ఉన్న అనుబంధాన్ని నిర్లక్ష్యం చెయ్యాలనీ లేదు...ఇన్నేళ్ళు ఈ అత్తగారి ఆధారం వల్లే ప్రశాంతంగా జాబ్ చేస్తోంది..మరి ఈ రోజు ఆవిడకి తన అవసరం ఉంది కానీ జాబ్ వదలాలని అస్సలు లేదు..ఆర్ధికభద్రత, తనకంటూ ఒక హోదా ఇవి వదలాలంటే బాధగా ఉంది రూపిణికి...* 

 *సాటి ఆడదాని బాధ అర్ధం చేసుకునే తత్వం సరయుది అని వదినకి ఫోన్ చేసి ఇదీ విషయం అని చెప్పి సలహా అడిగింది రూపిణి..తల్లి ఆరోగ్యం గురించి తనకీ తెలుసు సరయూకి...* 

 *పెళ్ళయ్యి వేరే ఇంటికి వెళ్ళినా అప్పుడప్పుడైనా అందుకునే అమ్మప్రేమ దూరమైతే తట్టుకోలేను ..సమయం ఉన్నప్పుడే అమ్మను కాపాడుకోవాలి అని ఆలోచించింది...భర్తతో మాట్లాడింది...తండ్రితో ఆలోచన చేసింది...* 

 *వారి ఊరిలో త్రీ స్టార్ రెస్టారెంట్ నడుపుతున్నారు సరయు వాళ్ళు..భర్తను ఒప్పించుకుని తల్లి ఉన్న ఊరికి తరలి వచ్చేసారు సరయూ వాళ్ళు,* 
 *ఈ ఊరిలో రెస్టారెంట్ ఓపెన్ చేసారు..* 

 *అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు...ఇంటిపైన ఒక అంతస్తు కట్టించి ఇచ్చాడు కారుణ్య సరయూ వాళ్ళకి...సరయు ఇంట్లో ఉండి జానకిని ప్రియని తన కొడుకు ఆదిత్యని చూసుకుంటోంది...సరయు అత్తామామా తమ ఇద్దరి కొడుకుల దగ్గరా చెరో ఆరునెలలు ఉంటూ అటూ ఇటూ తిరుగుతున్నారు...సరయూ వాళ్ళ దగ్గర ఉండే ఆరునెలలు జానకికి, తన అత్తగారికి వచ్చే మాట పట్టింపులు నెగ్గుకురావటం ఒక్కోసారి సరయుకి కత్తి మీద సామే అయ్యేది అలాంటప్పుడు జానకికి చెప్పేది అమ్మా ప్రియ నీ దగ్గర ఉండాలంటే నీ నోరు తగ్గించుకోవే తల్లీ అని..దానితో కొన్నిరోజులు జానకి కుదురుగా ఉండేది...కారుణ్యకి చుట్టూ ఉండే బంధాల రూపంలోని ఇన్ని రకరకాల మనస్తత్వాలను గమనించడం సరదాగా అనిపించేది... ఓ పుస్తకంలో తనకు తోచిన రీతిలో ఆ అనుభవాలను విశ్లేషించి రాసుకోవడం ఓ అలవాటుగా మారింది...ఇంకో పదేళ్ళకు కూడా జానకితో ఆయన ప్రయాణం ఇంకా నడుస్తోంది చెయ్యిచెయ్యీ కలుపుకుని....*

 *_🌹సేకరణ 🌹_* 

🕉️🌻🦚🌹💜💎🌈
 [4/23, 13:10] +91 98497 72509: ♠️ ’జిలిబిలి పలుకుల మైనా’ గాయని  జానకమ్మ. 

ఎస్. జానకి ఆమె స్వరం ఉరికే జలపాతం. ఆమె గానం మృధు మధురం. తన పాటలతో ప్రేక్షకుల మనసులను ‘నీలి మేఘాలలో’ తేలిపోయేలా చేస్తుంది. తన సుస్వరాలతో ‘పగలే వెన్నెలను’ పూయిస్తుంది. పాటల పూదోటలో తన గానామృతంతో మధురిమలు పంచిన మైనా. ‘గున్న మామిడి కొమ్మ’ మీదీ పలుకులతో వెండితెరకు వసంతాన్ని తీసుకొచ్చిన గాన కోకిల. ఇలా నవరసాలు ఆమె గొంతులో అలవోకగా జాలువారుతాయి. ఇలా తన గాన మధురామృతంతో దక్షిణాది శ్రోతలను ఆకట్టుకున్న లెజెండరీ గాయకురాలు ఎస్. జానకి.

పక్షుల కిలకిల రావాలైనా...పసిపాపల స్వరాలైనా...అమ్మ పలికే లాలిపాటలైనా... ఆమె గొంతులో సరాగాలై విరుబూస్తాయి. తన గానంతో దుర్యోధన దుశ్శాసన దుర్వినీతిని ఎండగట్టినా... సిరిమల్లే పువ్వా..అంటూ హస్కి వాయిస్‌తో ప్రేక్షకులకు తీపి గాయాలను చేసినా ఆమెకే చెల్లింది. ఈ విధంగా స్వరాలతో చేయగలిగినన్ని ప్రయోగాలు చేయడంలో ఎస్.జానకి ఎప్పుడూ ముందుంటారు. 

తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఒరియా, సింహళ,తుళు, సౌరాష్ట్ర, జపనీస్, జర్మనీ, ఇంగ్లీషు భాషల్లో వేలాది పాటలు పాడిన జానకమ్మ ....1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లెలోని పాలపట్ల గ్రామంలో జన్మించింది. పుడుతునే మాటల కంటే పాటలను నేర్చిందీ జానకమ్మ .

ఆమె తండ్రి శ్రీరామమూర్తి ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు. చిన్నతనంలో కూతురు సంగీతాభిలాష గమనించి ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ పైడిస్వామి దగ్గర సంగీతంలో శిక్షణ ఇప్పించాడు. అప్పటి నుంచి తన పదోయేట వరకూ వివిధ సంగీత కచేరీల్లో పాడి పేరు తెచ్చుకున్నారు జానకిగారు.

18వ యేట వచ్చే సరికి.. జాతీయ స్థాయిలో సంగీత పోటీలో పాల్గొనే అవకాశం వచ్చింది. 1957లో ఆల్ ఇండియా రేడియో నిర్వహించిన జాతీయ స్థాయి సంగీత పోటీలో ఉత్తమ గాయనిగా, అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

దీంతో ఆమె ప్రతిభ అందరికి తెలియాలని జానకి మామయ్య చెన్నై తీసుకెళ్లారు. అక్కడ ఎ.వి.ఎం. ఆస్థాన సంగీత దర్శకుడు గోవర్థనం సంగీతంలో పరీక్ష పెట్టగా అందులో నెగ్గి అక్కడి స్టాఫ్ సింగర్ గా సెలెక్ట్ అయ్యింది జానకి. ఇక అప్పటి నుంచి ఆమె సినీ కెరీర్ మొదలైంది.

జానకి గాయనిగా అడుగుపెట్టిన తొలి ఏడాదిలోనే దాదాపు ఆరు భాషల్లో 100కు పైగా పాటలు పాడడం విశేషం. గాయనిగా తొలిపాట 1957 ఏప్రిల్ 4న రికార్డ్ అయ్యింది. పదహారాణాల తెలుగు అమ్మాయి అయిన జానకి తన తొలి పాట తమిళంలో పాడడం విశేషం. అవకాశం వచ్చినపుడు మొదట పాడాల్సింది విషాదగీతం అయితే సాధారణంగా ఎవరూ అంగీకరించరు. కానీ జానకి ఇలాంటి సెంటిమెంటు ఏది పట్టించుకోలేదు. గాయినిగా ఆమె ఏ భాషలో పాడిన తొలి గీతం విషాద గీతమే కావడం ఓ అద్భుతం. 

తెలుగులో జానకి పాడిన తొలిపాట ‘నీ ఆశ...అడయాస..’ పెండ్యాల సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘ఎం.ఎల్.ఏ’ చిత్రంలో ఘంటసాలతో కలిసి ఈ పాటను జానకి ఆలపించారు. ఈ చిత్రంలో ‘ఇదేనండీ భాగ్య నగరము’ అనే పాట కూడా పాడారు. ఇలా ఏడుపు పాటలతో మొదలైన ఆమె పాటల ప్రయాణం.. ఆ తర్వాత మంచి హుషారైన గీతాలతో మేలిమలిపు తిరిగింది.

తొలినాళ్లలో.. తమిళంలో వచ్చినంత పేరు తెలుగులో రాలేదు. గాయనిగా జానికికీ మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం ‘కొంజుం సలంగై’ అనే తమిళ చిత్రం. సుబ్బయ్యనాయుడు సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సన్నాయి తో పోటీ పడి జానకి పాడిన పాట ఆమెకెంతో పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘మురిపించే మువ్వలు’ గా డబ్బింగ్ చేశారు. ఈ మూవీలో వచ్చే ‘నీ లీల పాడెద దేవా’ అంటూ జానకి ఆలపించిన ఈ పాటకు ఆమెకు తెలుగులో ఎనలేని క్రేజ్ తీసుకొచ్చింది.

ఈ చిత్రం తర్వాత జానకి తెలుగులో అవకాశాలు చాలానే వచ్చాయి. అయినా తెలుగులో గాయనిగా స్థిర పడటానికి ఆమెకు చాలా సమయం పట్టింది. అప్పటికే పి.సుశీల తెలుగులో టాప్ సింగర్ గా ఒక వెలుగు వెలుగుతోంది. అప్పటికే తమ తమ చిత్రాల్లోని ఫస్ట్ గ్రేడ్ హీరోయిన్లకు పి.సుశీలతోనే పాటలు పాడించేవారు అప్పటి మ్యూజిక్ డైరెక్టర్స్. టాలెంట్ ఉన్నా సెకండ్ గ్రేడ్ హీరోయిన్ల పాటలకు మాత్రమే జానకి పరిమితమయ్యేవారు.

1961లో విడుదలైన బావామరదళ్లు చిత్రంలోని ‘నీలి మేఘాలలో.. గాలికెరటాలలో’ పాటతో తెలుగు ప్రేక్షకలకు వీనులవిందు చేసింది జానకీ. 1964లో విడుదలైన పూజఫలం చిత్రంలో వచ్చే ‘పగలే వెన్నెల’ పాటతో ఆమెకు గాయనిగా ప్రత్యేక స్థానం దక్కింది.

జానకమ్మకు సుశీలమ్మ తో సమానంగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. 70వ దశకం మధ్యలో  ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి, వ్యాంపు పాటలకు, క్లబ్ పాటలతో జానకి గాత్రంతో అనేక ప్రయోగాలు చేసాడు. బాలూ, జానకిల సూపర్ హిట్ కాంబినేషన్ కు బీజం పడేలా చేసాడు. ఒక రకంగా జానకి కెరీర్ కు ఉపయోగపడే సోలో గీతాలు, డ్యూయట్లు ప్రేక్షకులను మైమరిపించేలా చేసాయి.
[4/23, 13:10] +91 98497 72509: కె.విశ్వనాథ్ డైరెక్షన్లో..కె వి మహదేవన్  స్వరకల్పనలో వచ్చిన సప్తపది చిత్రం జానకి సినీ జీవితంలో మైలురాయిగా నిలిచిపోయింది. చిన్నపిల్లాడిలా, గోవులుకాసే గోపాలుడిగా.. రెండు వైవిధ్య గాత్రాలతో పాడిన ‘గోవులు తెల్లన, గోపయ్య నల్లనా’ పాట ఆమెకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చాయి. ఇలా తన గొంతుతో అన్ని వయసుల వారిని అనుకరించి మెప్పించిన ఘనత జానకికే దక్కుతుంది.

తన గాత్రం దేవుడిచ్చిన వరంగా చెబుతుంది జానకి. 80 దశకంలో ఇళయరాజా ఆమె స్వరంతో అనేక విన్యాసాలు చేసాడు. ప్రేమ, విషాదం, హాస్యం, సోలో, విరహ గీతాలతో 80వ దశకం మొత్తం సుశీల కన్నా జానకమ్మ పాటలే ఎక్కువగా వినిపించాయి.కానీ సాహిత్య పరంగాఁ , సంగీత పరంగాఁ  వున్న పాటలు , అమ్మ పాడే లాలి జోల పాటలు ఎక్కువ పాటలు సుశీల కి దక్కాయి , తమిళ్ లో ఇళయరాజా సుశీల తో కంపోజ్  చేసిన ప్రతి పాట  అద్భుతమే అని చెప్పాలి .  సరదా పాటలు, హుషారు పాటలతో ఆ నాటి యువతకు దగ్గరయ్యారు జానకిగారు. 

దివంగత బాలు, జానకి, ఇళయరాజా కలయికలో వచ్చిన ఎన్నో పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. జానకి సినీ కెరీర్ లో సంగీత దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం ఉషా కిరణ్ మూవీస్ వారి ‘మౌనపోరాటం’. తెలుగులో భానుమతి, పి.లీల తర్వాత సంగీతం దర్శకత్వం వహించిన మహిళ ఎస్.జానకి కావడం విశేషం.

నవరసాలను కంఠంలో ఇముడ్చుకుని.. సందర్భానుసారంగా ఆరోహణ, అవరోహణలను క్షణాల్లో మారుస్తూ పాడడం జానకి ప్రత్యేకత. అలనాటి సావిత్రి, అంజలీదేవి హీరోయిన్ల నుంచీ నిన్నమెన్నటి విజయశాంతి, సౌందర్య, రంభ వరకూ.. దాదాపు ఐదు తరాల హీరోయిన్లకు పాడిన ఘనత జానకి సొంతం. వ్యాంపు పాటలకు, క్లబ్ పాటలకు ఎల్.ఆర్.ఈశ్వరీ తర్వాత అంతగా ఖ్యాతి గడించిన గాయని ఎస్.జానకి.

ఇళయరాజా , రాజన్ నాగేంద్ర లాంటి సంగీత దర్శకులు ఆమెతో క్రమం తప్పకుండా పాటలు పాడించేవారు. అప్పటి నటీమణులకు వారి హావభావాలకు తగ్గట్టు పాడటంలో జానకి నిష్ణాతురాలు. సంగీత వాద్య పరికరాల అనుగుణంగా పాటలు పాడడంలో జానకి దిట్ట. ఒక కన్నడ చిత్రంలో ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ షెహనాయ్ కి అనుగుణంగా పాడి మెప్పించారు. 

అలాగే మరోకన్నడ మూవీలో ఎం.ఎస్.గోపాలకృష్ణన్ వయోలిన్ వాద్య సమ్మేళనాన్ని తన గాత్రంతో డామినేట్ చేసింది. ఒక విధంగా దక్షిణాది చిత్ర పరిశ్రమను తన గానామృతంతో జానకి ఓలలాడించింది.

దాదాపు అనేక భాషల్లో 27వేలకు పైగా పాటలు పాడిన జానకిని వరించిన అవార్డులకు లెక్కే లేదు. నాలుగు జాతీయ అవార్డులతో పాటు, వివిధ రాష్ట్రాలకు చెందిన 25 కు పైగా స్టేట్ అవార్డులు ఆమె వశం అయ్యాయి. తెలుగులో గాయనిగా 10 నంది అవార్డులు దక్కడం విశేషం. తెలుగులో వచ్చిన సితార చిత్రానికిగానూ ఆమె పలికిన ‘జిలిబిలి పలుకులకు’ జాతీయ అవార్డు వెతుక్కుంటూ వచ్చింది.

తమిళనాడు ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక కలైమామణి, కర్ణాటక ప్రభుత్వం చే బసవభూషణ అవార్డు.. మైసూరు యూనివర్సిటీ వారి నుంచి గౌరవ డాక్టరేట్ లు జానకి కీర్తి కీరిటంలో వచ్చి చేరాయి. కేంద్ర ప్రభుత్వం తనకు ఆలస్యంగా పద్మభూషణ్ అవార్డు ప్రకటించడంపై ఆగ్రహించిన జానకి.. తనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయడం ఆమె అభిమానులను నివ్వెరపోయేలా చేసింది. అంతేకాదు కేంద్రం ఇచ్చిన పద్మభూషణ్ అవార్డును తిరస్కరించింది .

🌹సేకరణ 🌹

Tuesday, 22 April 2025

 *కర్మ అంటే సాధారణంగా మనం చేసే పని అని అనుకుంటాం.కానీ నిజానికి మన ఆలోచనలే మన అసలైన కర్మలు...ఎందుకంటే మన ఆలోచనలు ఎలా ఉంటే వాటి ప్రకారమే కర్మ చేస్తుంటాం.కర్మ ప్రకారం ఫలితం.కనుక ముందు ఆలోచనలను మంచివిగా ఉండేలా చూసుకోవాలి.మనం ఇతరుల మంచిని కోరుకున్నపుడు మన మంచి ఆలోచనల వలన ఏదో ఒక విధముగా మనకు మేలే జరుగుతుంది.అలాకాకుండా ఇతరులకు చెడు జరగాలని కోరుకుంటే ఆ దుష్పలితాన్ని ఇతరుల కంటే ముందు మనమే అనుభవింపక తప్పదు.మనం అనుభవించేదంతా మన ఆలోచనల ఫలితమే కనుక మనసులో మంచి ఆలోచనలు కలిగిఉండాలి.తద్వారా మంచి కర్మలు జరిగి మంచి ఫలితాలు వస్తాయి...సదా సర్వదా మీ శ్రేయోభిలాషి వి ఎస్ బి సురేష్...*