Tuesday, 22 April 2025

 🦚 *భగవాన్ శ్రీరమణ మహర్షి ప్రసాదం* 🦚
       
🌹🌷🙏🙏🌷🌹

ప్రశ్న: *గురువు యొక్క మార్గ దర్శకత్వం కావాలని అన్ని గ్రంథాలు చెప్తాయి.*

భగవాన్: *నేను ఇప్పుడు చెప్పిన దానినే గురువు చెప్తాడు. నీకు లేని దానిని ఏమీ అతడు ఇవ్వడు. తనకి లేనిదానిని సంపాదించటం ఎవ్వరికీ సాధ్యంకాదు. ఒక వేళ సంపాదించినా, అది వచ్చిన దారినే పోతుంది - వచ్చిందేదో వెళ్లాలి కదా! ఒక్కటే సదా సంస్థితమై ఉంటుంది. నీకు లేని దానిని కొత్తగా గురువు ఇవ్వలేడు. అవసరమైనదల్లా, ఆత్మ సాక్షాత్కారం కాలేదన్న భావాన్ని తొలగించుకోవటమే. మనమెప్పుడూ ఆత్మే. ఎటొచ్చీ, మనం ఆ విషయాన్ని గ్రహించం.*

*ఆత్మ ఎక్కడుంది అని వెతుక్కుంటూ తిరుగుతాం. జ్ఞానదృష్టి వచ్చే వరకూ అట్లాగే తిరుగుతాం. అప్పుడు, ఈ ఆత్మ నాలోనే ఉన్నదని అంటాం. మనమాదృష్టిని అందుకోవాలి. ఆ తరువాత ఏ బంధాలూ ఉండవు -  ప్రపంచంలో తిరుగుతూ, అందరిలోనూ కలిసిపోయినా సరే! కాళ్లకి చెప్పులు వేసుకున్న  తరువాత రాళ్లమీదా, ముళ్లమీదా నడిచినా ఏ బాధా ఉండదు. ఏ భయమూ, చింతా లేకుండా కొండలు అడ్దు వచ్చినా నడచిపోతావు. అట్లాగే, జ్ఞానదృష్టి కలిగిన వారికి అన్నీ సహజంగా కనబడుతాయి. ఆత్మకి భిన్నంగా ఏముంది అసలు?*

ప్రశ్న: *ప్రాపంచిక దృష్టి అణగిపోయిన తరువాతే ఆ సహజస్థితి రావచ్చు. ఇది అణగిపోయేదెట్లా?* 

భగవాన్: *మనస్సు అణగితే, ప్రపంచమూ అణగిపోతుంది. అంతటికీ మూలకారణం మనస్సే. అది అణగితే, సహజస్థితి ప్రకటితమవుతుంది. ఆత్మ ఎప్పుడూ "అహం, అహం" అంటూనే ఉంటుంది. అది స్వయంప్రకాశం. అది ఇక్కడే ఉంది. ఇదంతా అదే. మనం దానిలోనే ఉన్నాం. అందులోనే ఉంటూ దానికోసం వెతకటం దేనికీ? "దృష్టిని జ్ఞానంలో నిమగ్నం చేస్తే, ప్రపంచమంతా బ్రహ్మంగా గోచరిస్తుందని" మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు!*

సేకరణ : *"నీ సహజ స్థితిలో ఉండు"* నుండి (పు.31)

*అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా*🙏🏻

No comments:

Post a Comment